హృదయ నివేదన | special story to mm srilekha | Sakshi
Sakshi News home page

హృదయ నివేదన

Published Wed, Mar 14 2018 12:36 AM | Last Updated on Wed, Mar 14 2018 12:36 AM

special story to  mm srilekha - Sakshi

ఎం.ఎం.శ్రీలేఖ, సంగీత దర్శకురాలు

దేవుడికి నివేదించడానికి భౌతికమైన మార్గాలు చాలా ఉన్నాయి. కాని ఆత్మికమైన మార్గం హృదయ సంభాషణే అంటారు శ్రీలేఖ. మన మనసుతో మౌనంగా దేవునితో చేసే ప్రతి సంభాషణ ఆయన వరకూ చేరుతుందని నమ్ముతారు ఆమె.లౌకిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం సమంగా గడపడమే  తన మార్గం అంటారు శ్రీలేఖ.

ప్రసవం సమయంలో నాకు ఆపరేషన్‌ తప్పనిసరి అయ్యింది.  డాక్టర్లు ఆపరేషన్‌ చేస్తూ ఉంటే నేను సౌందర్యలహరి పాడుతూ ఉన్నాను.  అలా మా అబ్బాయి ఆ సౌందర్యలహరి వింటూ పుట్టాడు. డాక్టర్లు చాలా ఆశ్చర్యపోయారు.  ఇది ఫస్ట్‌ టైమ్‌ తల్లి పాట పాడుతూ బిడ్డకు జన్మనివ్వడం అన్నారు. 

నేటి తెలుగు సినీపరిశ్రమలో ఒకే ఒక్క మహిళా సంగీత దర్శకురాలు ఎమ్‌.ఎమ్‌.శ్రీలేఖ. మధురమైన∙సంగీతం, పాటలతో తెలుగువారికి ఆమె సుపరిచితురాలు అయ్యారు. పన్నెండేళ్ల వయసులోనే ‘తాజ్‌మహల్‌’ సినిమాకు సంగీత దర్శకత్వం అందించి ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు పొందారు. బాలీవుడ్‌లోనూ తన బాణీలతో అలరించారు

సాయంసంధ్య వేళ హైదరాబాద్‌ మణికొండలోని ఎమ్‌.ఎమ్‌.శ్రీలేఖ ఇంటి ముందున్నాం. లోపలి నుంచి ‘మహీం మూలాధారే కమపి మణిపూరే..’ కమ్మని స్వరంలో అమ్మవారి సౌందర్యలహరి వినిపిస్తోంది.
అడుగుపెడితే హాల్లో ఏడాది వయసున్న పిల్లవాడిని ఒళ్లోకూర్చోబెట్టుకొని పాడుతున్నారు ఎమ్‌.ఎమ్‌.శ్రీలేఖ. ‘మా అబ్బాయి మహిమాన్‌..  ఆదిశంకరాచార్యుల వారి సౌందర్యలహరి శ్లోకాలు పాడితే చాలు అల్లరి మానేసి కామ్‌గా వింటూ వుంటాడు’ అంటూ నవ్వారు. ఆ సంగీత దర్శకురాలితో భక్తి సంగీతం మీదుగా ‘నేను– నా దైవం’ ఫీచర్‌కు ఇంటర్వ్యూ మొదలైంది.

మీకు సినిమా పాటలే అనుకున్నాం. భక్తి గీతాలు కూడా కంఠతా వచ్చన్నమాట..
అదేమిటి అలా అంటారు. సినిమా వాళ్లకు భక్తి పాటలు కూడా వస్తాయి. నేనైతే చిన్నప్పటినుంచీ వీటిని వింటూ పెరిగాను. చాలా భక్తి గీతాలు అలవోకగా వంటపట్టేశాయి. నాకు ఒకప్పటి జోలపాట ఇప్పుడు మా అబ్బాయికి లాలిపాట.

మీ హాల్లో చాలా దేవతా పటాలు కనిపిస్తున్నాయి....
మా ఇంట్లో ఈ పటాలకు ఎప్పుడూ అలంకరణ ఉంటుంది. పూమాలలను చూశారుగా. మా వారు (పుట్టా వీరవరప్రసాద్‌) పూజలు చేస్తుంటారు. నేను ఆయనతో పాటు పాల్గొంటుంటాను. అందరి దేవుళ్లకు నేను అభిమానినే. ఎవ్వరినీ తక్కువ చేయను. కానీ, మూకాంబికా అమ్మవారిని మా ఇంట్లో అందరూ భక్తిగా కొలుస్తుంటారు. 

మూకాంబిక ఆలయం ఉన్నది కర్ణాటకలో.. మీరెలా ఆ అమ్మవారి భక్తులయ్యారు?
నేను పుట్టి పెరిగింది కర్ణాటకలోని రాయచూర్‌కి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న పల్లెటూరులో. అప్పట్లో కరెంట్, వైద్య సదుపాయం లేని ఊరు అది. మా కుటుంబం అక్కడే వ్యవసాయం చేస్తుండేది. అర్థరాత్రి నేను పుట్టిందే పూజ గదిలోనట. ఇప్పుడు ఈ హాల్‌కి రెండింతలు ఉంటుంది ఊళ్లో ఆ పూజగది. అంత పెద్ద పూజగదిలో మా పెదనాన్న శివశక్తిదత్త (ఎమ్‌.ఎమ్‌.కీరవాణి తండ్రి) వేసిన దేవతామూర్తుల చిత్రపటాలు ఎన్నో ఉండేవి. పుట్టాక గంటవరకు నేను ఏడ్వలేదట. పెద్దవాళ్లు భయపడి మూకాంబికా అమ్మవారికి నమస్కరించుకొని ఆమె కుంకుమ నా నుదుటన పెట్టాక నాలో కదలిక వచ్చి, ఏడ్చానట. అలా నా పుట్టుక గురించి తెలుసుకున్నప్పుడు ఒక అలౌకికమైన శక్తి ఏదో నా చుట్టూ ఉందని అర్థమైంది. అమ్మా నాన్నలకు ఒక్కత్తే కూతుర్నని మా నాన్నగారు (బోసు), అమ్మ (విజయలక్ష్మి భరణి)  నన్ను భక్తికి దగ్గరగా ఉండేలా పెంచారు. మంగళ, శుక్రవారాలు మౌనవ్రతంలో ఉండేదాన్ని. పౌర్ణమి, అమావాస్యలైతే నాచేత నిష్టగా, కఠిన నియమాలు పాటింపజేసేవారు నాన్నగారు. నేను వేసుకునే డ్రెస్‌ కలర్‌ని బట్టి ఆ రోజు ఏ వారమో తెలిసిపోయేది. పన్నెండేళ్ల వయసు వచ్చే వరకు ఉప్పుకారాలు లేకుండా తులసి ఆకులతో పెంచారంటే నమ్ముతారా! ఒక సన్యాసిని ఎలా ఉంటుందో అలా ఉండేదాన్ని.

ఇంతటి కఠిన నియమాలా! .. ఉల్లంఘించాలనిపించలేదా? 
నాన్నగారు ఏదో కారణం లేకుండా ఇలా చేయరు అనుకునేదాన్ని. కాకపోతే లోపల ఓ సంఘర్షణ ఉండేది. ఎందుకుచేయాలి ఇవన్నీ అని. కానీ ఎప్పుడూ అడగలేదు. కీరవాణి అన్నయ్య, మా పెదనాన్న, చిన్నాన్న... మా ఇంట్లో ఆయనకు ఎవరూ ఎదురుచెప్పేవారు కాదు. ఆయన ఎంత చెబితే అంత. ఆయన ద్వారానే ధ్యానం, ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ అలవడ్డాయి. స్ప్రిచ్యువల్‌ పవర్‌ గురించి కూడా ఆయన ద్వారానే నాకు తెలిసింది. పాజిటివ్‌గా ఉంటే అంతా మంచే వస్తుందనే నమ్మకం ఏర్పడింది. 

దేవుడు ఉన్నాడని మీరెలా నమ్ముతారు?
దైవం మానుష రూపేణా అనేది నేను నూరు శాతం నమ్ముతాను. ఏదైనా చిన్న అవకాశం వచ్చినా అది మనిషి ద్వారానే రావాలి. మనం దారి తప్పినప్పుడు ఒక మనిషి దారి చూపిస్తాడు. దేవుడే ఆ మనిషిని పంపుతాడు. మనకు ఆకలిగా ఉన్నప్పుడు ఎవరో అన్నం పెడతాడు. దైవమే ఆ మనిషిని ఏర్పాటు చేసి ఉంటాడు. నాకు దాసరి నారాయణరావుగారి ద్వారా మొదటి అవకాశం వచ్చింది. ఆ అవకాశమే దేవుడు. పన్నెండేళ్ల వయసులో నేనేంటి... ఆ పాటలేంటి? ఆ ప్రేమ పాటలకు బాణీలేంటి? దేవుణ్ణి మనిషిలా చూడాలి... మనిషిని దేవుడిలా చూడాలి. అప్పుడు అందరూ మనకు ఆప్తులై జీవితం ప్రశాంతంగా సాగుతుంది. 

కళ కూడా దైవమే అంటారా?
దేవుని ఉనికే కళ. నాకు ఆ కళ ఇచ్చి తన ఉనికిని తెలియచేశాడు దేవుడు. దాన్ని పట్టుకొని ఈ జీవితాన్ని నెగ్గుకొస్తున్నాను. ఇప్పటికీ కీ బోర్డు దగ్గర కూర్చున్నానంటే ఏదో అలౌకికమైన శక్తి నన్ను ఆవరిస్తున్నట్టుగా ఉంది. అలవోకగా బాణీలు వచ్చేస్తుంటాయి.

ఇప్పుడు దైవానికి సంబంధించి ఎలాంటి నియమాల పాటిస్తున్నారు?
ఏదైనా చిన్న సమస్య వచ్చినా చాలు క్షణం క్షణం సినిమాలో శ్రీదేవిలా ‘దేవుడా దేవుడా దేవుడా..’ అని మొక్కేసుకుంట. కాని ఫలానా దేవుడికే మొక్కాలి అనే నియమం కూడా లేదు. నేను జీసస్‌నూ నమ్ముతాను. మా నాన్నగారు 300 వరకు జీసస్‌ పాటలు రాశారు. కొన్నింటికి నేనూ బాణీలు కట్టాను. తిరుమలకు వెళతాను. అలాగే కడప దర్గాకు వెళతాను. దైవాన్ని నమ్మడానికి కులం, మతం తేడాలే లేవు. దైవం అనేది ఒక సుప్రీం పవర్‌. అన్నింటికీ అతీతమైనది.

మీ నాన్నగారిలాగ మీరూ మీ అబ్బాయికి ఆధ్యాత్మికతను చేరువ చేస్తున్నారా? 
కొన్ని లక్షణాలు జన్మతః వచ్చేస్తుంటాయి. అందులో ఆధ్యాత్మిక శక్తి కూడా ఒకటి. మా అబ్బాయిని ‘అమ్మ ఏది’ అంటే చాలు మూకాంబికా అమ్మవారి ఫోటో చూపిస్తాడు. ప్రసవం సమయంలో నాకు ఆపరేషన్‌ తప్పనిసరి అయ్యింది. డాక్టర్లు ఆపరేషన్‌ చేస్తూ ఉంటే నేను సౌందర్యలహరి పాడుతూ ఉన్నాను. అలా వాడు ఆ సౌందర్యలహరి వింటూ పుట్టాడు. డాక్టర్లు చాలా ఆశ్చర్యపోయారు. ఇది  ఫస్ట్‌ టైమ్‌ తల్లి పాట పాడుతూ బిడ్డకు జన్మనివ్వడం అన్నారు. 

దేవుడిని ఎలా ఫీల్‌ అవుతుంటారు?
మనం తెలిసో, తప్పకనో.. తప్పులు చేస్తూనే ఉంటాం. అది అవసరమో, అనవసరమో, అహంకారమో కూడా తెలియదు. జీవనశైలిలో ఇవన్నీ భాగమే.  పడుకునే ముందు చేసే ధ్యానంలో  నా వల్ల ఈ రోజు ఎవరైనా హర్ట్‌ అయి ఉంటే వారికి సారీ అని చెప్పుకుంటాను. టెలీపతి ద్వారా మన మనసులోని భావం వారికి చేరుతుందని నా నమ్మకం. అలాగే దేవుడికి కూడా నా మనసులోని భావం చేరుతుందని నా నమ్మకం. అందుకే చాలా విషయాలు ఆయనకు చెప్పుకుంటూ ఉంటాను. జీవితంలో అన్నీ ఉండాలి. బంధువులు, మిత్రులు, పని. అయితే, దేని కోసం దేన్నీ వదులుకోకూడదు. బ్యాలెన్స్‌ చేసుకోవాలి. వచ్చిన పని గొప్పగా చేయాలి. మంచి మంచి పాటలకు సంగీతం అందించాలి. ఇదే దైవాన్ని కోరుకునేది. 
– నిర్మలారెడ్డి చిల్కమర్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement