బాహ్య ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక మార్గంలోకి మరలిన బాలిక
19న జునా అఖాడాలో సభ్యత్వం తీసుకోనున్న టీనేజీ బాలిక
మహాకుంభమేళాలో క్రతువు
ఇద్దరు ఆడపిల్లలున్న కుటుంబం అది. నిక్కీ అని ముద్దుగా పిలుచుకునే చెల్లెలు ప్రాచీతో కలిసి ఆడుకోవడమంటే 13 ఏళ్ల అక్క రాఖీ సింగ్‌కు మహా ఇష్టం. పాఠశాలలోనూ చక్కని చదువరి. పెద్దయ్యాక ప్రజాసేవ చేయాలనేది ఆమె కల. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది ఆమె ఆశయం. స్ప్రింగ్ ఫీల్డ్ ఇంటర్‌కాలేజీలో 9వ తరగతి చదువుతూ స్కూళ్లో పాఠ్యాంశాలతోపాటు రామయణ, భాగవతాది ఇతిహాసాలపైనా అనర్గళంగా మాట్లాడేది. హిందూ మతంపై అచంచల విశ్వాసం ఉన్న రాఖీసింగ్ దుర్గాదేవిని బాగా పూజించేది.
దేవీ శరన్నవరాత్రుల కాలంలో చెప్పుల్లేకుండానే నడిచిందని స్కూల్ యాజమాన్యంలోని అధికారి పీసీ శర్మ చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలోని దౌలీ పట్టణం ఈమె స్వస్థలం. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి చూపే రాఖీ హఠాత్తుగా తాను సన్యాసినిగా మారతానని చెప్పినా తల్లిదండ్రుల్లో ఎలాంటి కలవరపాటు లేదు. ఆధ్యాత్మిక భావాలున్న తమ పెద్దకూతురు నిర్ణయాన్ని వాళ్లు స్వాగతించారు. దీంతో జనవరి 19వ తేదీన జునా అఖాడాలో చేరి సాధ్వీగా మారేందుకు రాఖీ సిద్ధమైంది. ఆమెను పిండదాన్ క్రతువు తర్వాత గౌరీ గిరిగా పేరు మార్చి అఖాడాలో చేర్చుకుంటామని అఖాడా పెద్ద మహంత్ కౌషాల్ గిరి చెప్పారు.
మలుపు తిప్పిన మహాకుంభమేళా
తండ్రి సందీప్ సింగ్ ధాకరా, తల్లి రీమా సింగ్‌లతో కలిసి గత ఏడాది డిసెంబర్‌లో ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ప్రాంతానికి వెళ్లింది. అక్కడి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంది. ప్రాపంచిక సుఖాలకు దూరంగా నిరాడంబరంగా గడుపుతున్న సాధువుల జీవనశైలిని చూసి ఆకర్షితురాలైంది. ఐఏఎస్ అధికారిగా ప్రజల కష్టాలను తీర్చే బదులు ఆధ్యాత్మిక బోధనల ద్వారా ప్రజల మానసిక సమస్యలు తీర్చడం ముఖ్యమని భావించింది. బాహ్య ప్రపంచ కష్టాల కడలిని ఈదలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను తన ఆధ్యాత్మిక బోధనలతో సాంత్వన చేకూరుస్తానని, సాధ్విగా తన వంతు సాయం చేస్తానని రాఖీసింగ్ చెప్పింది. డిసెంబర్ 26వ తేదీన తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వాళ్లు అందుకు అంగీకరించి సెక్టార్20 ప్రాంతంలోని మహంత్ కౌషాల్ గిరి ఆశ్రమంలో చేరి్పంచారు.
కన్యాదానం నుంచి సాధ్వి దాకా
13 ఏళ్ల రాఖీ నడవడికను స్వయంగా గమనించిన అఖాడా పెద్దలు ఆమెను సన్యాసినిగా స్వీకరించేందుకు అంగీకరించారు. గురుగ్రామ్ నుంచి మహంత్ రాగా ఆయన సమక్షంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ జనవరి ఆరో తేదీన తల్లిదండ్రులు ఆశ్రమానికి రాఖీని కన్యాదానం చేశారు. ఆరోజున అఖాడాలు ఆమెకు గౌరి అని నామకరణం చేశారు. కూతురు సన్యాసినిగా మారుతుండటంపై తల్లి రీమా స్పందించారు. ‘‘మా కుటుంబం గత నాలుగేళ్లుగా ఆధ్యాత్మిక మార్గంలోనే పయనిస్తోంది. మహంత్ మేముండే ప్రాంతంలో భాగవతం విశేషాలను అందరికీ విడమరిచి చెప్పేవారు. ప్రయాగ్‌రాజ్ వెళ్లినప్పుడు రాఖీ తన మనసులోని మాట చెప్పింది. అది ఆమె నిర్ణయం కాకపోవచ్చు. భగవత్ సంకల్పం అనుకుంటా. ఆశ్రమంలో ఎందుకు చేర్పించారని బంధువుల నుంచి ఎన్నో ప్రశ్నలు. అయినా తల్లిగా నా బిడ్డ అక్కడ ఎలా ఉండగలదు? ఏం తింటుంది? అనే భయం నాకూ ఉంది. కానీ ఆమె నిర్ణయం దైవేచ్ఛ కాబట్టి మేం కూడా అడ్డుచెప్పలేదు’’అని తల్లి రీమా అన్నారు.
సుదీర్ఘంగా క్రతువు
సనాతన ధర్మ ప్రకారం సాధ్విగా మారితే ఆ అమ్మాయి కేశసంరక్షణపై ధ్యాస పెట్టకూడదు. జుట్టంతా ఉండలు కట్టినా పట్టించుకోవద్దు. కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు ధరించాలి. సాధ్వి గా మారే రోజున ఐదుగురు సాధువులు ఇచ్చిన ఐదు పవిత్ర పత్తిదారాలను స్వీకరించాలి. సన్యాసుల అన్నపానాలు, దీక్షా నియమాలను పాటించాలి. ప్రేమ, రాగద్వేషాలు, కామామోహాలను త్యజించాలి. మహాకుంభమేళాలో నాలుగో పవిత్ర పుణ్యస్నానాల రోజున అంటే జనవరి 19వ తేదీన పిండదాన్ క్రతువులో భాగంగా గౌరీని వేదమంత్రోచ్ఛారణల మధ్య గంగానదిలో 108 సార్లు ఓం నమఃశివాయ అని చదివిస్తూ ముంచుతారు. తర్వాత గంగాదేవికి హారతి ఇచ్చాక గౌరీ గిరిగా కొత్త పేరుతో పిలుస్తారు.
ఇటీవల మరికొందరూ..
ఇటీవలికాలంలో భారత్‌లో ఎంతోమంది సాధారణ జీవితానికి స్వస్తిపలికి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించారు. ఇందులో టీనేజర్లూ ఉన్నారు. సూరత్‌లో వందల కోట్ల ఆస్తులున్న వజ్రాల వ్యాపారి గారాలపట్టి, 8 ఏళ్ల దేవాన్షీ సంఘ్వీ సైతం సన్యాసినిగా మారింది. జైన్ సాధ్విగా కొత్త జీవితాన్ని ప్రారంభించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలాంటి ఘటన ఇంకోటి గుజరాత్‌లోనే జరిగింది. హిమ్మత్‌నగర్‌లో నిర్మాణరంగంలో వ్యాపారం చేస్తూ రూ.200 కోట్ల ఆస్తులు కూడబెట్టిన భవేశ్ భాయ్ భండారీ దంపతులు సన్యాసులుగా మారారు. అంతకుముందే అంటే 2022లోనే వీళ్ల టీనేజీ కుమారుడు, కుమార్తె సన్యాసులుగా మారడంతో వీళ్ల బాటలనే తల్లిదండ్రులు పయనించడం విశేషం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment