ఇక ఒత్తిడి లేని చదువులు | 5 Big Changes In CBSE Board Exam From 2020 | Sakshi
Sakshi News home page

ఇక ఒత్తిడి లేని చదువులు

Published Fri, Nov 29 2019 1:29 AM | Last Updated on Fri, Nov 29 2019 1:29 AM

5 Big Changes In CBSE Board Exam From 2020 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సిలబస్‌ అనగానే నోటి నుంచి వచ్చే పదం ‘వేరీ టఫ్‌’. ఎక్కువ సబ్జెక్టు, లోతైన విషయ పరిజ్ఞానం లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ పాఠ్య పుస్తకాలను రూపొందించడంతో ఈ సిలబస్‌ ఎంచుకునే వారిపై సహజంగా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమిస్తూ విద్యార్థులకు అహ్లాదకరమైన వాతావరణంలో బోధన, అభ్యసన కార్యక్రమాలు సాగేలా సీబీఎస్‌ఈ అకడమిక్‌ ప్లాన్‌లో భారీ మార్పులు చేసింది.

ముఖ్యంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని సంకల్పించిన బోర్డు.. పాఠ్యాంశంలో అనవసర భాగాన్ని తొలగిస్తూ చదవాల్సిన భాగానికి ప్రాధాన్యత ఇచ్చింది. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధితో పాటు విశ్లేషణా సామర్థ్యం, తార్కిక సామర్థ్యాల పెంపునకు ఆస్కారం కల్పించింది. పరీక్షల నిర్వహణలోనూ విద్యార్థులకు ‘చాయిస్‌–ఆప్షన్‌’ఇచ్చింది. 2019–20 విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ ప్రక్రియ.. వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేలా కార్యాచరణ రూపొందించింది.

మార్పులు.. చేర్పులు.. 
సీబీఎస్‌ఈ పాఠశాలల్లో నిర్వహించే బోధన కార్యక్రమాల్లో ఆర్ట్‌ (కళ) అంశాన్ని జోడిస్తున్నారు. టీచర్లు బోధించే అంశాలతో పరిమితం కాకుండా విద్యార్థుల అనుభవాత్మకమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వా లని బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన పాఠ్య పుస్తకాల్లో అనవసర భాగాన్ని తొలగించింది. దీంతో విద్యార్థుల అభ్యనస సమయం తగ్గడంతో.. ఈ సమయాన్ని ఇతర కార్యక్రమాలకు వినియోగించేలా కార్యాచరణ రూపొందించింది.

ప్రతి సబ్జెక్టులో ఆర్ట్‌ ఎడ్యుకేషన్‌ అంశాన్ని తెరపైకి తెచ్చిన బోర్డు.. సబ్జెక్టు ద్వారా విద్యార్థి నేర్చుకున్న అంశానికి ఈ ఆర్ట్‌ను జోడించింది. దీంతో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత పెరగడం తోపాటు లోతుగా విషయం తెలుసుకునే వీలుంటుంది. విద్యార్థికి విశ్లేషణా సామర్థ్యం తో పాటు తార్కిక సామర్థ్యం పెరుగుతుంది. జీవన విధానంలో ప్రధాన అంశాలపైనా దృష్టి పెట్టింది. హెల్త్‌ అండ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌కు  ప్రాధాన్యత ఇచ్చింది. యోగా అభ్యాసంతో పాటు క్రీడలు నిర్వహించాలని సూచించింది.

పరీక్షల్లో ‘చాయిస్‌–ఆప్షన్‌’ విధానం 
పరీక్షల విధానంలో సీబీఎస్‌ఈ ప్రత్యేక విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు పరీక్షల్లో చాయిస్‌ లేకుండా ప్రతి ప్రశ్నకు జవాబు రాయాల్సి ఉండేది. తాజాగా మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలను ప్రవేశపెడుతోంది. దీంతో జవాబులు రాయడం సులభతరం కావడంతో విద్యార్థికి ఎక్కువ మార్కులు స్కోర్‌ చేసే వీలుంది. ఇందులో ఇంటర్నల్‌ అసిస్‌మెంట్‌కు ప్రాధాన్యత కలగనుంది. ఆప్షన్‌ విధానంలో భాగంగా మరిన్ని అవకాశాలు కల్పించింది. గతంలో 20 శాతం ఆప్షన్‌ కింద ఉండగా.. ఇప్పుడు 33 శాతానికి పెంచింది. ప్రస్తుతం ఐదింటా మూడింటికి సమాధానాలు రాసేలా ఆప్షన్లు పెరగనున్నాయి.

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ కీలకం.. 
సీబీఎస్‌ఈ సిలబస్‌లో తాజాగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీని జోడించింది. ఎనిమిదో తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించే అంశంగా దీన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ అంశాన్ని అవగాహన వరకే పరిమితం చేసిన బోర్డు.. త్వరలో సబ్జెక్టుగా ప్రవేశపెట్టడంతోపాటు పరీక్షలు సైతం నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీకి ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో పాఠశాల విద్య నుంచే ఈ అంశాన్ని ప్రవేశపెట్టడంతో విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాల సాధన సులభతరమవుతుందని ఎల్బీ నగర్‌ సమీపంలోని ఓ సీబీఎస్‌ఈ పాఠశాల ప్రిన్స్‌పాల్‌ గోపాల కృష్ణ ‘సాక్షి’తో అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement