మెడికల్ అభ్యర్థులకు 'నీట్' వేదన | CBSE syllabus for NEET, AP,Telangana students suffers | Sakshi
Sakshi News home page

మెడికల్ అభ్యర్థులకు 'నీట్' వేదన

Published Sat, May 14 2016 4:12 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM

మెడికల్ అభ్యర్థులకు 'నీట్' వేదన - Sakshi

మెడికల్ అభ్యర్థులకు 'నీట్' వేదన

- ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ లేకపోవడంతో ఆందోళన
- సీబీఎస్‌ఈ సిలబస్, ఇంగ్లిష్‌లో పరీక్షతో అయోమయం
- వేల రూపాయలు వెచ్చించి తీసుకున్న కోచింగ్ వృథా
- మళ్లీ ‘నీట్’ శిక్షణ కోసం వేల రూపాయల భారం!
- స్థానిక భాషలో పరీక్ష నిర్వహణపై అస్పష్టతతో గందరగోళం

 
సాక్షి, హైదరాబాద్:
ఇంటర్ చదివి ఎంసెట్‌కు సిద్ధమవుతున్న నీలిమకు బైపీసీ ఆప్షనల్స్‌లో 600కు 596 మార్కులు వచ్చాయి.. ఎంసెట్‌లో కొంచెం మార్కులు తగ్గినా ఇంటర్‌లో తనకు వచ్చిన గరిష్ట మార్కులతో మంచి ర్యాంకు సాధించవచ్చని ఆశపడింది. కానీ ఆశలపై ‘నీట్’ పిడుగు పడింది. ఇంటర్‌లో ఎంతో కష్టపడి చదివినా ఆ మార్కులకు ప్రయోజనం లేకుండా పోతుందేమోనని ఆవేదనలో పడిపోయింది. ‘నీట్’ను సీబీఎస్‌ఈ సిలబస్‌లో, ఇంగ్లిష్ భాషలో నిర్వహించే అవకాశం ఉండడమే దీనికి కారణం. ఇలా నీలిమ ఒక్కరే కాదు వేలాది మంది విద్యార్థులు ఆందోళనలో కూరుకుపోయారు. రెండేళ్లుగా ఇంటర్మీడియెట్ సబ్జెక్టులపై పెంచుకున్న పట్టు, వేల రూపాయలు ఖర్చుపెట్టి తీసుకున్న కోచింగ్ ‘నీట్’తో వృథా అవుతోందని బాధపడుతున్నారు. మళ్లీ ‘నీట్’కు కోచింగ్ తీసుకోవడానికి వేల రూపాయలు ఖర్చవుతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

రెండేళ్లు చదివాక ఇదా ఫలితం
ఎంసెట్‌కు తగ్గట్టుగా రెండేళ్ల పాటు ఇంటర్ పాఠ్యాంశాల ఆధారంగా సిద్ధమైన విద్యార్థులకు సరిగ్గా ఎంసెట్‌కు వారం ముందు ‘నీట్’ మాత్రమే రాయాలనడం ఏ మాత్రం మింగుడుపడటం లేదు. నీట్ సిలబస్ సీబీఎస్‌ఈ పాఠ్యాంశాల ఆధారంగా ఉంటుంది. ఇది రాష్ట్ర విద్యార్థులకు  నష్టం కలిగించనుంది. ఇక నీట్ ర్యాంకుల ద్వారానే ప్రభుత్వ, ప్రైవేటు నాన్-మైనారిటీ, మైనారిటీ మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లను భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ, ఎన్నారై సీట్లను కూడా నీట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు. ఎన్నారై కేటగిరీకి సుప్రీంకోర్టు తీర్పులో ఎక్కడా మినహాయింపేమీ ఇవ్వలేదని వివరించారు.

వెయిటేజీపై అధికారుల అసహనం
ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ, ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకులను ఇప్పటివరకు ఖరారు చేసేవారు. కానీ ఇక నుంచి ఇంటర్ మార్కులకు ఎటువంటి వెయిటేజీ ఉండదు. అయితే దేశవ్యాప్తంగా నీట్ అనేది అత్యున్నతమైన ప్రవేశపరీక్ష. అందులో రాష్ట్ర విద్యార్థులు పొందిన ర్యాంకులను ప్రకటించాక... వాటికి ఇంటర్ వెయిటేజీ ఇచ్చి ఇక్కడ సీట్లు భర్తీ చేసే విషయాన్ని రాష్ట్ర అధికారులు గమనంలోకి తీసుకోవడం లేదు. అలా చేస్తే నీట్ స్ఫూర్తిని దెబ్బతీసినట్లేనని, అవకతవకలకు దారి తీస్తుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

స్థానిక భాషపై అస్పష్టత!
స్థానిక భాషలో నీట్ పరీక్ష ఉండాలన్న విషయంపై ఇంకా అస్పష్టత నెలకొంది. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాజ్యాంగంలో పేర్కొన్న అధికార భాషలన్నింటిలో నీట్ పరీక్ష నిర్వహించాల్సి వస్తే... ప్రశ్నపత్నం చేతులు మారి లీక్ కావచ్చొనే ఆందోళన నీట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందుకే స్థానిక భాషలో ప్రశ్నపత్రం అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఎంబీబీఎస్, డెంటల్ కోర్సులను ఇంగ్లిషులోనే చదవాల్సి ఉన్నందున ప్రశ్నపత్రం ఇంగ్లిషులో ఉంటే తప్పేంటన్న వాదనలు కూడా ఉన్నాయి. పైగా స్థానిక భాషలో రాసేవారు 10 శాతానికి మించి ఉండరని వైద్య వర్గాల అంచనా. ఇక స్థానిక భాషలో రాసే విద్యార్థులకు ఇబ్బందులు ఉంటాయన్న అభిప్రాయాలున్నాయి. ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇంగ్లిషులో ఉంటాయని, వాటిని సరిగా అర్థం చేసుకుని నాలుగు ఆప్షన్లలో ఒకదాన్ని గుర్తించడం కష్టమన్న చర్చ జరుగుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement