అక్షరాలై వెలిగారు | Sakshi Special Story About Women writers In India | Sakshi
Sakshi News home page

Women writers: అక్షరాలై వెలిగారు

Published Sat, Dec 28 2024 4:45 AM | Last Updated on Sat, Dec 28 2024 2:40 PM

Sakshi Special Story About Women writers In India

ఉమెన్‌ పవర్‌ 2024

కాలక్షేప సాహిత్యానికి కాలం చెల్లిన కాలం ఇది. ఈ ఉరుకు పరుగుల కాలంలో పుస్తకం నిలబడాలంటే సత్తా ఉండాలి. సామాజిక అంశాలు ఉండాలి. అలాంటి సత్తా ఉన్న పుస్తకాలతో ఈ సంవత్సరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు మన మహిళా రచయిత్రులు. లింగవివక్ష నుంచి స్త్రీ సాధికారత వరకు... అట్టడుగు శ్రామిక జీవితాలను నుంచి లౌకికవాదం వరకు... ఎన్నో అంశాలపై ప్రామాణికమైన పుస్తకాలు రాశారు...

రెజ్లర్‌ టు రైటర్‌
సాక్షి మాలిక్‌ (Sakshi Malik) పేరు వినబడగానే ‘స్టార్‌ రెజ్లర్‌’ అనే శబ్దం ప్రతిధ్వనిస్తుంది. రెజ్లర్‌ సాక్షి కాస్తా ‘విట్‌నెస్‌’తో (Witness) రైటర్‌గా మారింది. సాక్షి మాలిక్‌ది నల్లేరు మీద నడక కాదు. ఘర్షణ లేకుండా ఆమె నడక లేదు. ఆ ఘర్షణలో పితృస్వామ్య వ్యవస్థను సవాలు చేయడం కూడా ఒకటి. పేదరికాన్ని, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉన్నతస్థాయికి చేరడానికి తాను పడిన కష్టాలకు జోనాథన్‌ సెల్వరాజ్‌తో (Jonathan Selvaraj) కలిసి ఈ పుస్తకం ద్వారా అక్షర రూపం ఇచ్చింది సాక్షి మాలిక్‌. ఆటలో పడి లేవడం సాధారణం. అయితే పడిన ప్రతిసారీ మరింత బలంగా పైకి లేవడం సాక్షి శైలి. ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది. ‘నేను తల్లి అయిన తరువాత భవిష్యత్తులో ఏదో ఒకరోజు గోడకు వేలాడుతున్న ఒలింపిక్‌ మెడల్‌ను చూస్తూ అది ఏమిటి? అని నా బిడ్డ నన్ను అడగవచ్చు. నేను ఆ మెడల్‌ను బిడ్డ చేతిలో పెట్టి అది ఏమిటో, అది గెలవడానికి ఎంతదూరం ప్రయాణించాల్సి వచ్చిందో వివరంగా చెబుతాను’ అంటుంది సాక్షి మాలిక్‌.
విట్‌నెస్‌  
–  సాక్షి మాలిక్‌

జ్ఞాపకాల జ్ఞాన సముద్రం
ఇది పుస్తకం అనడం కంటే నాలుగు తరాల జ్ఞాపకాల సంపుటి అనడం సబబుగా ఉంటుంది. ఎంతో పరిశోధిస్తే కాని ఇలాంటి పుస్తకం రాయలేము. పరిశోధనకు తోడు నుస్రత్‌ ఎఫ్‌ జాఫ్రీలోని (Nusrat Fatima Jafri) అద్భుత సృజనాత్మకత పుస్తకానికి మంచి పేరు వచ్చేలా చేసింది. తన పూర్వీకుల మతమార్పిడి అనేది ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో ఈ పుస్తకంలో వివరిస్తుంది జాఫ్రీ. ‘నా బంధువులు వారి జీవితంలో వివిధ సందర్భాలలో కొత్త మతాలను స్వీకరించాలని నిర్ణయించుకోవడం వెనుక ఉన్న కారణాలను అన్వేషించడానికి కష్టపడాల్సి వచ్చింది. ఆ కారణాలలో రాజకీయం(Politics) నుంచి సామాజికం వరకు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరి మత మార్పిడి ప్రయాణం ప్రత్యేకమైనది’ అంటుంది జాఫ్రీ. అయితే వారి కుటుంబ చరిత్ర అంతా దేశ విస్తృత చరిత్రతో లోతుగా ముడిపడినందు వల్లే పుస్తకం ప్రత్యేకంగా నిలిచింది, వలస పాలన, స్వాతంత్య్రపోరాటం, వలసానంతర రాజకీయాలు... మొదలైనవి ‘దిస్‌ ల్యాండ్‌ ఉయ్‌ కాల్‌ హోమ్‌’లో కనిపిస్తాయి.
దిస్‌ ల్యాండ్‌ ఉయ్‌ కాల్‌ హోమ్‌: ది స్టోరీ ఆఫ్‌ ఏ ఫ్యామిలి, క్యాస్ట్, కన్వర్జేషన్స్‌ అండ్‌ మోడర్న్‌ ఇండియా 
– నుస్రత్‌ ఎఫ్‌.జాఫ్రీ

ఇదేం భాష?!
న్యూయార్క్‌లోని హంటర్‌ కాలేజిలో ‘ఉమెన్‌ అండ్‌ జెండర్‌ స్టడీస్‌’లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రూపాల్‌ ఓజా రాసిన పుస్తకం ఎమియోటిక్స్‌ ఆఫ్‌ రేప్‌. బాధితురాలు, సర్వైవర్‌లాంటి పదాలకు అతీతంగా లైంగిక హింస కేసులకు సంబంధించిన భాషలో మూసధోరణులు, పితృస్వామిక భావజాలాన్ని ఈ పుస్తకంలో విశ్లేషిస్తుంది రూపా ఓజా. ప్రభుత్వ అధికారుల నుంచి గ్రామ వార్డు మెంబర్‌లు, కుల సంఘాల వరకు అత్యాచార కేసులను  లైంగిక విషయాలపై చర్చించే వేదికలుగా ఎలా చూస్తారో ఈ పుస్తకంలో వివరిస్తుంది రుపాల్‌ ఓజా.
ఎమియోటిక్స్‌ ఆఫ్‌ రేప్‌: సెక్సువల్‌ సబ్జెక్టివిటీ అండ్‌ వయొలేషన్‌ ఇన్‌ రూరల్‌ ఇండియా
– రూపాల్‌ ఓజా

ఉద్యమమే జీవితమై..
ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అరుణ దిల్లీ సబ్‌–డివిజనల్‌ మెజిస్ట్రేట్, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆఫ్‌ దిల్లీకి సెక్రటరీగా ఉన్నతోద్యోగాలు చేసినా ‘ఉద్యమ నాయకురాలు’గానే ఆమె సుపరిచితురాలు. సోషల్‌ వర్క్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బేర్‌ఫుట్‌ కాలేజీ)తో మొదలైన ఆమె ప్రయాణం ఎంతోదూరం వెళ్లింది. ఎన్నో మలుపులు తిరిగింది. తన ఉద్యమజీవితాన్ని, ఉద్యమాల బాటలో తాను కలిసి పనిచేసిన వ్యక్తుల గురించి ‘ది పర్సనల్‌ ఈజ్‌ పొలిటికల్‌’లో రాసింది అరుణా రాయ్‌. ఉద్యమం అనే మహా పాఠశాలలో తాను నేర్చుకున్న పాఠాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.
ది పర్సనల్‌ ఈజ్‌ పొలిటికల్‌: యాన్‌ యాక్టివిస్ట్‌ మెమోయిర్‌   
– అరుణా రాయ్‌

అట్టడుగు కోణం నుంచి...
దేశంలోని అత్యంత మారుమూల, అణగారిన వర్గాల గురించి బేలా భాటియా రాసిన పుస్తకం ఇది. మన దేశంలోని నిరుపేద ప్రజలపై జరిగే హింసాకాండపై వెలుగును ప్రసరిస్తుంది. వర్గ, లింగ, భౌగోళిక అంశాలను మేళవించి రాసిన పుస్తకం ఇది.
ఇండియాస్‌ ఫర్గాటెన్‌ కంట్రీ: ఏ వ్యూ ఫ్రమ్‌ ది మార్జిన్స్‌
– బేలా భాటియా

హింస ధ్వని
మన దేశంలోని తాజా రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పుస్తకం ఇది. భీమా– కోరేగావ్‌ ఘటనలో కొందరిని కేసులో ఎలా ఇరికించారో, సాక్ష్యాధారాలు ఎలా సృష్టించారో, కేసు లేకపోయినా రాజకీయ కారణాలతో ఎలా హింసించారో ఈ పుస్తకంలో అల్పా షా రాసింది.
భీమా–కోరేగావ్‌ అండ్‌ ది సెర్చ్‌ ఫర్‌ డెమోక్రసీ ఇన్‌ ఇండియా:  అల్పా షా

ఎర్రజెండ నీడలో... 
1920 దశకంలో భారత రాజకీయాల్లో కమ్యూనిజం స్పష్టమైన అస్తిత్వంగా మారడం నుంచి కమ్యూనిస్ట్‌ మహిళల జీవితాలను సాంస్కృతిక, రాజకీయ నేపథ్యంలో విశ్లేషించడం వరకు ఎంతో సమాచారం ‘రెవల్యూషనరీ డిజైర్స్‌’లో కనిపిస్తుంది.
ఎన్నో జీవితాల గురించిరెవల్యూషనరీ డిజైర్స్‌: ఉమెన్‌ కమ్యూనిజం అండ్‌ ఫెమినిజం ఇన్‌ ఇండియా      
– అనియా లూంబా

శ్రామిక జనజీవన చిత్రం
సాధారణ శ్రామిక వర్గ భారతీయురాలి జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపే ఈ పుస్తకాన్ని జర్నలిస్ట్‌ నేహా దీక్షిత్‌ రాసింది. బాబ్రీ మసీదు కూల్చివేతతో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి సైదా ఎక్స్‌ బెనారస్‌ నుంచి దిల్లీకి వెళుతుంది. దిల్లీలో బతకడానికి రోజుకు ఎన్నో ఉద్యోగాలు చేస్తుంది. ఒక రోజు సెలవు తీసుకుంటే కూడా ‘రేపు బతకడం ఎలా’ అనే భయం నుంచి రాత్రి, పగలు కష్టపడిన సైదా కథ ఈ పుస్తకంలో కనిపిస్తుంది, దిల్లీలోని చాందిని చౌక్‌లో రిక్షా తొక్కే కార్మికుడు ఉగ్రవాదుల బాంబు పేళుళ్లలో మరణిస్తాడు. ‘ది మెనీ లివ్స్‌ ఆఫ్‌...’లో సయిదా, బాంబు పేలుళ్లలో చనిపోయిన అమాయక రిక్షాకార్మికుడిలాంటి ఎంతోమంది సామాన్యుల, శ్రామికుల జీవితాలు కనిపిస్తాయి.
ది మెనీ లైవ్స్‌ ఆఫ్‌ సైదా ఎక్స్‌  
– నేహా దీక్షిత్‌

స్వతంత్రభారత స్వరం
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పుస్తకం స్వతంత్ర భారత దేశ సంక్షిప్త చరిత్ర. జాతీయవాదంలోని అనేక అంశాల గురించి తన భావాలను వెల్లడి చేస్తుంది నందిత హక్సర్‌. మన దేశం ఎలా ముందుకు సాగాలనే దాని గురించి కౌమార దశలో తన అమాయక ఆలోచనలు ఈ పుస్తకంలో గుర్తు తెచ్చుకుంది నందిత. అమాయక ఆలోచనల నుంచి వాస్తవికదృష్టితో ఆలోచించడం వరకు తన ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పును గురించి కూడా ‘ది కలర్స్‌ ఆఫ్‌ నేషనలిజం’లో రాసింది నందితా హక్సర్‌ది కలర్స్‌ ఆఫ్‌ నేషనలిజం
– నందితా హక్సర్‌

‘తమాషా’ వెనుకఎంత విషాదమో!
మహారాష్ట్రలోని తమాషా డ్యాన్సర్‌ల గురించి రాసిన పుస్తకం ది వల్గారిటీ ఆఫ్‌ క్యాస్ట్‌. ఒక విధంగా చెప్పాలంటే తమాషా కళాకారుల సామాజిక, మేధోచరిత్రను రికార్డ్‌ చేసిన మొదటి పుసక్తంగా చెప్పుకోవచ్చు. హిస్టరీప్రొఫెసర్‌ అయిన డా. శైలజ పైక్‌ తొలి పుస్తకం... దళిత్‌ ఉమెన్స్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ మోడ్రన్‌ ఇండియా: డబుల్‌ డిస్క్రిమినేషన్‌. నలుగురు ఆడపిల్లల్లో ఒకరిగా యెరవాడ మురికి వాడలోని ఒకేగది ఇంట్లో పెరిగిన శైలజకు పేదల కష్టాలు తెలియనివేమీ కాదు. ఆ అనుభవ జ్ఞానంతోనే మహారాష్ట్రలోని తమాషా కళాకారుల జీవితానికి అద్దం పట్టేలా ‘ది వల్గారిటీ ఆఫ్‌ క్యాస్ట్‌’ పుస్తకం రాసింది.
ది వల్గారిటీ ఆఫ్‌ క్యాస్ట్‌  
–  శైలజ పైక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement