వనిత ప్రగతి పరుగు?! | International Womens day 2024 gender equality empowement special story by sharma | Sakshi
Sakshi News home page

వనిత ప్రగతి పరుగు?!

Published Fri, Mar 8 2024 10:26 AM | Last Updated on Fri, Mar 8 2024 11:19 AM

International Womens day 2024 gender equality empowement special story by sharma - Sakshi

"ఆడాళ్ళు మీకు జోహార్లు .. ఓపిక,ఒద్దిక మీ పేర్లు-
మీరు ఒకరి కంటే ఒకరు గొప్పోళ్ళు.." - 
ఆచార్య ఆత్రేయ.

అది అక్షరాలా నిజం. 'క్షమయా  ధరిత్రి' అన్న ఆర్యోక్తికి మరోరూపం ఇచ్చారు ఆచార్యులవారు. ప్రతి రంగంలోనూ ఒకరిని మించి మరొకరు దూసుకెళ్తునే ఉన్నారు.

ముళ్ళపూడి వెంకటరమణ ఇలా చమత్కరించారు.
"ఆడవాళ్లు - మగవాళ్లు ఇద్దరూ సమానమే,కాకపోతే మగవాళ్ళు కాస్త ఎక్కువ సమానం". ముళ్ళపూడివారి మాటలు కూడా నిజాన్ని ప్రతిబింబించేవే.

'ఆకాశంలో సగం' అనే మాట వినడానికి అందంగానే ఉంటుంది కానీ, ఆచరణలో అన్నింటా ఆడవాళ్లకు సగభాగం దొరుకుతోందన్నది అర్ధసత్యం.

ఇప్పటికీ ప్రపంచంలో స్త్రీ ఎక్కువ గౌరవాలు పొందుతున్నది మన భరతభూమిలో అన్నది కాదనలేని నిజం. కొంత ఛాందసాలు, చాదస్తాలు రాజ్యమేలుతున్నా, మన వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలు మనల్ని మిగిలినవారి కంటే భిన్నంగా నిలుపుతున్నాయి. బంధాలు, బాంధవ్యాల వీచికలు ఇంకా వీస్తూనే ఉన్నాయి. ప్రతి మార్చి 8వ తేదీ 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకోవడంతోనే సరిపోదు. నిజమైన పండుగ వారి గుండె గుడిలో నిండుగ ఉదయించాలి. ఈ వేడుకను ఒకొక్క దేశంలో ఒకొక్క రకంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఈ ఉత్సవాలు ప్రారంభం కాకమునుపే అమ్మను అమ్మవారుగా నిత్యం కొలిచే ఆచారం మనకు వేళ్లూనుకొని వుంది.అదే సమయంలో కష్టాలు,కన్నీళ్లు,బానిసత్వం, అణగదొక్కే విధానం,ఆచారాల పేరిట అసమానతలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆధునిక సమాజంలోనూ ఆటవిక పోకళ్ళు వదలడం లేదు.'నిర్భయ' చట్టాల వంటివి ఎన్ని వచ్చినా,ఆడపిల్లలు నిర్భయంగా తిరిగే రోజులు ఇంకా రాలేదు. అక్షరాస్యత పెరుగుతున్నా,అరాచకాలు ఆగడంలేదు.ఉద్యోగిత పెరుగుతున్నా సమానత ఇంకా సాధ్యమవ్వలేదు.

ఓటు హక్కు వచ్చినా,చట్ట సభల్లో మహిళలు ఇంకా ఆమడ దూరంగానే ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించినా, ఆచరణకు ఏళ్ళుపూళ్ళు పట్టేలా వుంది. శాసనాలు చేసే అధికారం రావాలంటే ఇంకా చాన్నాళ్ళు ఆగాల్సిందే.అప్పటిదాకా శాసించే శక్తి మగవాళ్ల దగ్గరే వుంటుంది. ప్రజాస్వామ్యం,రాజ్యాంగం అందించిన అవకాశాలతో మహిళామణులు రాష్ట్రపతి , స్పీకర్ వంటి అత్యున్నత పదవులను అందుకున్నా, అది సరిపోదు.సమత, సమతుల్యత ఇంకా సాధించాల్సి వుంది. ఇంకొక వైపు వరకట్నపు చావులు, అత్తారింటి వేదింపులు ఆగకుండా సాగుతూనే ఉన్నాయి. 'స్త్రీలకు స్త్రీలే శత్రువులు' అన్నది ఇంకా వీడడం లేదు.

లింగవివక్ష నుంచి పూర్తిగా బయటపడే తరుణం కోసం తరుణులంతా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆర్ధిక స్వేచ్ఛ,సమానత్వం కోసం ఎదురుతెన్నులు కాస్తూనే ఉన్నారు.కార్మిక సంఘాలు ఏర్పడినా,చట్టాలు వచ్చినా మహిళా కార్మికులు,కర్షకుల వేతనాల చెల్లింపుల్లో అన్యాయం జరుగుతూనే ఉంది.1991లో భారతదేశం సరళీకరణ ఆర్ధిక విధానాల వల్ల ప్రైవేట్ రంగం ఎంతో బలపడింది.ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి కానీ, ఎంపిక ప్రక్రియలో అసమానత అలాగే ఉంది.సాఫ్ట్ వేర్ రంగం మాత్రం కాస్త  నయం.అమ్మాయిలను తరలించే (విమెన్ ట్రాఫికింగ్) విషవ్యాపారం,బాలికలపై అత్యాచారాలు యదేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి.

గ్రామీణ మహిళా సాధికారత ఎంతో పెరగాల్సి ఉంది.
పేదరిక విముక్తి, ఆకలి నిర్మూలనకు ముగింపు వాక్యాలు పలకాల్సి ఉంది. 'పని సంస్కృతి' (వర్క్ కల్చర్ ) మారుతున్న క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులకు తగినట్లుగా సౌకర్యాలు పెరగాలి. 100 సంవత్సరాల పై నుంచీ 100 దేశాలకు పైగా 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకుంటున్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదాన్ని వినిపిస్తున్నారు. అవి నినాదాల దశ దాటి ఆచరణ దశకు చేరుకోవడం లేదు. కొంత అభివృద్ధి, ప్రగతి చోటుచేసుకున్నప్పటికీ సమగ్రత,సంపూర్ణత సాధించాల్సి ఉంది. 'లింగ సమానత్వం సాధించడం' 2022 సంవత్సరంలో ఎజెండాగా  పెట్టుకున్నారు. ఈ డిజిటల్ యుగంలో, 'నవీనత్వం - సాంకేతికతలో లింగ వివక్షలేని సమానత్వం' 2023 ఎజెండాగా కల్పన చేసుకున్నారు. ' ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ - యాక్సలరేట్ ప్రోగ్రెస్ '- 2024 ఎజెండాగా పెట్టుకున్నారు.

మహిళా సాధికారితను సాధించడానికి ఇంకెన్నాళ్లు పోరాడాలి? అనుకున్నది జరగాలి, ఈ పోరాటం ఆగాలి అన్నది మహిళాలోకం కోరుకుంటున్నది. మహిళా ప్రగతి వేగం పెరగాలని ఈ ఏటి ప్రధాన ఎజెండా. వినడానికి ఎజెండాలు ఎప్పుడూ బాగానే వుంటాయి. ఆచరణలో ఎక్కడ? అనే ప్రశ్నలు ఉదయించడం మానడంలేదు. మరోపక్క...స్త్రీలు అబల దశ నుంచి సబల దశకు చేరుకుంటూనే ఉన్నారు.అనేక రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. కొన్ని రంగాల్లో మించి పోతున్నారు. ఇది పూర్తిగా మహిళామణుల స్వయంకృషి,పట్టుదల, దీక్షాదక్షతలు మాత్రమే. అందివచ్చిన ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఎదుగుతున్నారు. సవాళ్లు, దాడులు ఎదుర్కొని నిలుస్తున్నారు.కాకపోతే, సమానత్వంలో సమగ్రత సాధించాలి. మహిళాలోకం వెలగాలి, వెలుగులు పంచాలి

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం   సందర్భంగా    సీనియర్‌ జర్నలిస్టు మా శర్మ స్పెషల్‌ స్టోరీ..)


మాశర్మ, సీనియర్‌ జర్నలిస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement