
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన వారిలో చాలా మంది ఆసుపత్రులలో చేరుతున్నారు. అయితే, కరోనా సోకిన తర్వాత ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం, రుచి తెలియక పోవడం, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురవ్వడం మొదలైన లక్షణాలు ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే.
అయితే, ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకొన్న కూడా కోవిడ్ నెగెటివ్ అనంతరం కూడా అనేక శారీరక సమస్యలు కొత్తగా ఉత్పన్న మవుతున్నాయి. వీటిని పోస్ట్ కోవిడ్ సమస్యలుగా పేర్కొంటారు. తాజాగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ నిశాంక్ కోవిడ్ అనంతరం సమస్యలతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రిలో చేరారు.
కాగా, 61 ఏళ్ల వయస్సున్న పోఖ్రియల్ నిశాంక్ గత ఏప్రిల్ 21 న కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మందులు, డైట్ పాటించడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఆయన కోవిడ్ నుంచి కోలుకున్నారు. అప్పటి నుంచి ఆన్లైన్లో విద్యా శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కొత్తగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే డాక్టర్ల సూచన మేరకు ఆయన ఎయిమ్స్లో చేరారు. అయితే, ఇప్పటికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదిలా వుండగా కేంద్ర విద్యాశాఖ గత కొన్ని రోజులుగా సిబిఎస్ఇ పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకొలేదు. ఈ క్రమంలో సుప్రీం కోర్ట్ వెంటనే సిబిఎస్ఇ పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే, ప్రస్తుతం కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియల్ ఆసుపత్రిలో ఉన్న తరుణంలో, సిబిఎస్ఇ పరీక్షలపై సరైన నిర్ణయం తీసుకోవడానికి మరో రెండు రోజుల సమయం కావాలని కేంద్ర విద్యాశాఖ సుప్రీం కోర్టును కోరింది.
Comments
Please login to add a commentAdd a comment