
న్యూఢిల్లీ: భారతదేశం తన యువతకు కావాల్సిన సదుపాయాలను (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అందిస్తుందని, అనుభవం, నైపుణ్యం, నవీన ఆవిష్కరణల ద్వారా వారు దేశంలోని పేదలకు సులభతర జీవనాన్ని(ఈజ్ ఆఫ్ లివింగ్) అందించాలని ప్రధాని మోదీ కోరారు. ఆయన శనివారం ఢిల్లీ ఐఐటీ 51వ వార్షిక స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానంగా నిరుపేదల కోసం కొత్త ఆవిష్కరణలు చేయాలని యువతకు సూచించారు. కోవిడ్ అనంతరం భిన్నమైన ప్రపంచాన్ని మనం చూడబోతున్నామని, ఇందులో సాంకేతిక పరిజ్ఞానం అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని తెలిపారు.
నాణ్యతపై కచ్చితంగా దృష్టి పెట్టాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని ఐఐటీ విద్యార్థులకు ఉద్బోధించారు. మీ శ్రమ ద్వారా భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని అన్నారు.బ్రాండ్ ఇండియాకు విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. టెక్నాలజీ ద్వారా మంచి పాలన అందించవచ్చనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఈ టెక్నాలజీ పేదల వరకూ చేరుతోందన్నారు. సాంకేతికత ద్వారా సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తూ అవినీతికి అడ్డుకట్ట వేశామని మోదీ పేర్కొన్నారు.
ఎన్‌ఈపీ అతిపెద్ద సంస్కరణ: రమేశ్
ఐఐటీకి చెందిన 2,019 మంది గ్రాడ్యుయేట్లకు శనివారం డిగ్రీలు అందజేశారు. విద్యార్థులను ఉద్దేశించి విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రసంగించారు. స్నాతకోత్సవం అంటే విద్యాభ్యాసం పూర్తయినట్లు కాదని, ఉద్యోగ రంగంలోకి అడుగపెట్టేందుకు ఇదొక గట్టి పునాది లాంటిదన్నారు. నూతన జాతీయ విద్యా విధానం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద సంస్కరణ అని అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment