సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్, నీట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్చార్డీ) మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటించారు. ఈ నెలలో జేఈఈ మెయిన్, నీట్, వచ్చే నెలలో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు జరగాల్సి ఉండగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్, నిపుణులతో గురువారం ఓ కమిటీ ఏర్పాటు చేశారు.
శుక్రవారం ఈ కమిటీ తన నివేదిక సమర్పించింది. కమిటీ నివేదిక ప్రకారం విద్యార్థుల భద్రతను పరిగణనలోకి తీసుకొని పరీక్షలను వాయిదా వేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 23 వరకు జరగాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈనెల 26న జరగాల్సిన నీట్‌ను సెప్టెంబర్ 13న నిర్వహిస్తామని తెలిపారు. అలాగే వచ్చే నెల 23న నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను సెప్టెంబర్ 27న నిర్వహిస్తామని వివరించారు.
రద్దుకు అవకాశం లేనందునే..
వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశ పరీక్ష ద్వారా మాత్రమే ప్రవేశాలు చేపట్టాలని 2005లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కేంద్రం పరీక్షలను వాయిదా వేసింది. కానీ రద్దు చేయలేదు. పోటీ అధికంగా ఉన్నప్పుడు ప్రవేశ పరీక్ష లేకుండా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మార్కుల ఆధారంగా వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదని, ప్రవేశ పరీక్ష మార్కుల ఆధారంగానే ప్రవేశాలు చేపట్టాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆ ప్రకారమే కేంద్రం పరీక్షల నిర్వహణ వైపే మొగ్గు చూపింది.
జాతీయ ప్రవేశాలు ఆలస్యమే..
ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ప్రవేశాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర జాతీయ స్థాయి సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ ఏటా నిర్వహిస్తుంటుంది. ఈసారి కూడా అలాగే నిర్వహించనుంది. అయితే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష సెప్టెంబర్ 27న జరిగితే ఫలితాలను ఆ తర్వాతి నాలుగైదు రోజులకు వెల్లడించే అవకాశం ఉంటుంది. అంటే అక్టోబర్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ చేపట్టే అవకాశం ఉంటుంది.
ఏడెనిమిది దశల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను అక్టోబర్‌లో పూర్తి చేసినా నవంబర్‌లో తరగతులు ప్రారంభం అవుతాయి. అయితే అప్పటికీ కరోనా అదుపులోకి రాకపోతే రెగ్యులర్ తరగతులు నిర్వహించే పరిస్థితి ఉండదు. అందుకే ఐదు ఐఐటీల డైరెక్టర్లతో కూడిన కమిటీ ఐఐటీల స్టాండింగ్ కౌన్సిల్‌కు ఇటీవల ఓ నివేదిక అందజేసింది. అందులో డిసెంబర్ నుంచి తరగతులు ప్రారంభించేలా సిఫారసు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ఆదుపులోకి వస్తే నవంబర్‌లో తరగతులు ప్రారంభం అవుతాయి. లేదంటే డిసెంబర్‌లోనే తరగతులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది.
రాష్ట్రంలోనూ ఆగస్టులో సెట్స్!
ఈ నెలలో జరగాల్సిన ఎంసెట్ సహా ఇతర సెట్స్‌ను ఇటీవల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ పరీక్షలను నిర్వహించేందుకు సెట్ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. కోర్టులో పిల్ పడటంతో ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై వెనక్కి తగ్గి వాయిదా వేసింది. మళ్లీ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది చెప్పలేదు. దీంతో రాష్ట్రంలో ఇక ప్రవేశ పరీక్షలు ఉండవని, ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు చేపడతారని కొంత మంది విద్యార్థులు భావించారు. అయితే తాజాగా కేంద్రం జాతీయ స్థాయి పరీ„క్షలను రద్దు చేయకుండా వాయిదా మాత్రమే వేసింది.
దీంతో దీంతో రాష్ట్రంలోనూ ప్రవేశ పరీక్షలు ఉంటాయన్న విషయం అర్థం అవుతోంది. ఆగస్టు రెండో వారంలో రాష్ట్ర సెట్స్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఏపీలో ఈనెల 27 నుంచి ఎంసెట్ ఉన్నందునా ఏపీ ప్రభుత్వం వాటిని చేపట్టి నిర్వహిస్తే అదే పద్ధతిలో రాష్ట్రంలో ఎంసెట్ సహా ఇతర సెట్స్ నిర్వహణ సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే ఆగస్టు రెండో వారంలో రాష్ట్ర ఎంసెట్ జరగనుంది.
సెప్టెంబర్‌లో ప్రవేశాలు..
రాష్ట్రంలో ఆగస్టులో ఎంసెట్, ఇతర సెట్స్ చేపట్టి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అవసరమైతే కోర్టులో పిటిషన్ వేసి పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడతామని, ఏర్పాట్లపై అనుమానాలు ఉంటే కోర్టు అబ్జర్వర్‌ను కూడా నియమించి చూసుకునేలా కోర్టుకు విన్నవిస్తామని పేర్కొంటున్నారు. తద్వారా ఆగస్టులో పరీక్షలు నిర్వహించి ఆగస్టు చివరికల్లా ఫలితాలను వెల్లడించాలని భావిస్తున్నారు. ఇక సెప్టెంబర్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించి, అప్పటి పరిస్థితులను బట్టి ప్రత్యక్ష బోధన లేదా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
సర్టిఫికెట్లు ఆపకుండా ప్రత్యేక చర్యలు
ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ వంటి జాతీయ స్థాయి సంస్థల్లో రాష్ట్రం నుంచి సీట్లు లభించే విద్యార్థులు 5 నుంచి 8 వేలలోపు ఉంటారు. వారి కోసం రాష్ట్ర స్థాయిలో మొత్తం 80 వేల ప్రవేశాల ప్రక్రియను ఆపే పరిస్థితి వద్దని ఈసారి ఉన్నత విద్యా శాఖ ఆలోచనలు చేస్తోంది. అందుకే ఆగస్టులో పరీక్షలు నిర్వహించి సెప్టెంబర్‌లో ప్రవేశాలు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఒకవేళ రాష్ట్ర కాలేజీల్లో సీట్లు లభించి చేరిన విద్యార్థుల్లో ఎవరికైనా జాతీయ స్థాయి కాలేజీల్లో జోసా కౌన్సెలింగ్ ద్వారా వారు వెళ్లిపోయేలా తగిన చర్యలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర కాలేజీల్లో చేరిన విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపకుండా, జాతీయ స్థాయి కాలేజీలకు వెళ్లేలా తగిన ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment