న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)–మెయిన్ ఫోర్త్ ఎడిషన్‌ను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం ప్రకటించారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం రెండు సెషన్ల మధ్య 4 వారాల విరామం ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫోర్త్ ఎడిషన్ జేఈఈ–మెయిన్ పరీక్షను ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 2 వరకూ నిర్వహిస్తామన్నారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకూ జరగాల్సి ఉంది.
జేఈఈ–మెయిన్ నాలుగో సెషన్ కోసం ఇప్పటికే 7.32 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రిజిస్ట్రేషన్ గడువును జూలై 20 దాకా పొడిగించినట్లు పేర్కొన్నారు. జేఈఈ–మెయిన్ నాలుగో సెషన్ ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో జరుగనుంది. ఈ పరీక్షను 334 దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ డైరెక్టర్ సాధన పరాశర్ చెప్పారు. పరీక్ష కేంద్రాల సంఖ్యను 828కి పెంచినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment