Engineering Entrance Exam
-
జేఈఈ–మెయిన్ నాలుగో ఎడిషన్ వాయిదా
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)–మెయిన్ ఫోర్త్ ఎడిషన్‌ను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం ప్రకటించారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం రెండు సెషన్ల మధ్య 4 వారాల విరామం ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫోర్త్ ఎడిషన్ జేఈఈ–మెయిన్ పరీక్షను ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 2 వరకూ నిర్వహిస్తామన్నారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకూ జరగాల్సి ఉంది. జేఈఈ–మెయిన్ నాలుగో సెషన్ కోసం ఇప్పటికే 7.32 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రిజిస్ట్రేషన్ గడువును జూలై 20 దాకా పొడిగించినట్లు పేర్కొన్నారు. జేఈఈ–మెయిన్ నాలుగో సెషన్ ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో జరుగనుంది. ఈ పరీక్షను 334 దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ డైరెక్టర్ సాధన పరాశర్ చెప్పారు. పరీక్ష కేంద్రాల సంఖ్యను 828కి పెంచినట్లు తెలిపారు. -
ఎంసెట్ ‘ఇంజనీరింగ్’కు 84.38% మంది హాజరు
సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్–2020కి సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 17 నుంచి ప్రారంభమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,85,946 మంది దరఖాస్తు చేసుకోగా 1,56,899 మంది(84.38 శాతం) మంది హాజరయ్యారని ఉన్నత విద్యామండలి ప్రత్యేకాధికారి(ఏపీ సెట్స్) డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఏపీలోని 47 పట్టణాల్లోని 118 పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు చొప్పున మొత్తం 14 సెషన్లలో కంప్యూటరాధారితంగా ఈ పరీక్ష నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో ఈసారి పరీక్ష కేంద్రాల పెంపుతో పాటు సెషన్ల సంఖ్యనూ పెంచారు. ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ముగియడంతో.. అగ్రి, ఫార్మా, మెడికల్ విభాగం పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ విభాగంలో 87,637 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 25తో ఈ పరీక్షలు పూర్తవుతాయి. అగ్రి, మెడికల్ విభాగం తొలిరోజు పరీక్షకు 86.89 శాతం మంది హాజరయ్యారు. కాగా, ఎంసెట్–2020 ప్రాథమిక ‘కీ’ని ఈనెల 26న విడుదల చేయనున్నారు. ‘కీ’పై అభ్యంతరాలను ఈనెల 28 వరకు స్వీకరిస్తారు. -
ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎంసెట్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉద యం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగే ఎంసెట్ పరీక్షకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49,024 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఇందులో 29,608 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు హాజరుకానుండగా.. 19,416 మంది విద్యార్థు లు మెడిసిన్ పరీక్ష రాయనున్నారు. ఇందుకు యంత్రాంగం జిల్లా వ్యాప్తం గా 82 పరీక్షా కేంద్రాలను గుర్తించి ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం వికారాబాద్‌లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో 80 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 48 పరీక్షా కేంద్రాల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష, 34 కేంద్రాల్లో మెడిసిన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు మెడిసిన్ పరీక్ష జరుగుతుందని, విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ రఘునందన్‌రావు సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం వికారాబాద్‌లోని జిల్లా శిక్షణ కేంద్రంలో (డీటీసీ) వసతి ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బందు లు కలగకుండా జిల్లా స్థాయిలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశామని, 1800 425 0817 నంబర్‌కు ఫోన్‌చేయాలని సూచించారు. వికారాబాద్‌లో రెండు సెంటర్లు వికారాబాద్ రూరల్: వికారాబాద్‌లోని అనంతపద్మనాభ స్వామి కళాశాల, న్యూ నాగార్జున్ హై స్కూల్లలో గురువారం ఎంసెట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయా కేంద్రాల్లో మొత్తం 2,197 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,266 మంది, అగ్రికల్చరల్, మెడికల్ విభాగాల్లో 931 మంది హాజరు కానున్నారన్నారు. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. మెడికల్, అగ్రికల్చరల్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ఉంటాయి. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు గంట ముందే చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. విద్యార్థులు వచ్చేటప్పుడు హాల్ టికెట్, అప్లికేషన్ ఫారం, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కులం సర్టిఫికేట్ తీసుకురావాలని ఎస్ఏపీ కళాశాల ప్రిన్సిపాల్, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ దత్తాత్రేయరెడ్డి సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రెండు సెంటర్లలో అన్ని ఏర్పాటు పూర్తి చేశామని ఆయన తెలిపారు. సెల్ఫోన్లు, చేతి గడియారాలు, ఇతర ఎలాంటి వస్తువులు పెట్టుకురావద్దన్నారు. పరీక్ష కేంద్రంలో గడియారం ఏర్పాటు చేసినట్లు దత్తాత్రేయరెడ్డి చెప్పారు. -
ఇంజనీరింగ్ విద్యకు వివిధ మార్గాలు..
ఏటా దాదాపు 10 నుంచి 15 లక్షల మంది విద్యార్థులు.. వివిధ రకాల ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు హాజరవుతుంటారు.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి దోహదం చేస్తున్న ఎంట్రెన్స్ టెస్టులు, వాటి వివరాలు... మన ఇంటర్మీడియెట్ సిలబస్ అన్ని జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు సరిపోతుంది. ప్రశ్నించే విధానం, ప్రశ్నల క్లిష్టత, మార్కులు వంటి అంశాల్లో మాత్రమే తేడా ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ పరంగా కొంత సమన్వయం చేసుకోగలిగితే అన్ని ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు ఇంటర్‌తో సమాంతరంగా సిద్ధం కావచ్చు. అంతేకాకుండా ఒక పరీక్షకు మరొ పరీక్షకు మధ్య కొంత వ్యవధి ఉంటుంది. ఈ సమయం కూడా సంబంధిత పరీక్షకు చక్కగా సన్నద్ధమవ్వడానికి దోహద పడుతుంది. ఇంటర్మీడియెట్ తర్వాత: ఇంటర్మీడియెట్ పరీక్షల తర్వాత తక్కువ వ్యవధిలోనే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలుంటాయి కాబట్టి మొత్తం సిలబస్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ఏ అంశాలకు ఎక్కువ వెయిటేజీ ఇస్తున్నారో పరిశీలించి, వాటిపై శ్రద్ధపెట్టాలి. రెండో సంవత్సరం విద్యార్థులు ఇంటర్ ప్రిపరేషన్‌తో పాటు ఆబ్జెక్టివ్ ప్రశ్నల సాధన పూర్తయ్యేటట్లు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇలాచేస్తే ఇంటర్ పరీక్షల తర్వాత అందుబాటులో ఉన్న స్వల్ప వ్యవధిలో మెరుగైన పునశ్చరణకు అవకాశముంటుంది. భిన్నంగా: కొన్ని ఇన్స్టిట్యూట్లు ప్రవేశపరీక్షలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతోపాటు ఇంగ్లిష్, ఇతర విభాగాల్లో కూడా ప్రశ్నలు ఇస్తున్నాయి. బిట్‌శాట్‌లో లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ ప్రొఫీషియన్సీపై ప్రశ్నలు ఉంటాయి. లాజికల్ రీజనింగ్ కోసం బొమ్మల చిత్రీకరణ, అనాలజీ, లాజికల్ డిడక్షన్, నంబర్, ఆల్ఫాబెటికల్ సిరీస్‌లపై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ ప్రొఫీషియన్సీ కోసం సినానిమ్స్, యాంటానిమ్స్, సెంటెన్స్ కంప్లీషన్/ఫార్మేషన్, టెన్సెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, జంబుల్డ్ వర్డ్స్‌పై దృష్టిసారించాలి. గ్రామర్‌లోని ప్రాథమిక అంశాలన్నింటిపైనా పట్టు సాధించాలి. ఎంసెట్ ఇతర ఎంట్రెన్స్‌లతో పోలిస్తే ఎంసెట్‌కు సబ్జెక్టు పరిజ్ఞానంతోపాటు వేగం కూడా ముఖ్యం. ఎందుకంటే జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్లతో పోలిస్తే ఎంసెట్‌లో దాదాపు రెట్టింపు ప్రశ్నలుంటాయి. అందువల్ల వీలైనన్ని ఎక్కువ వారాంతపు పరీక్షలు, గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి. కాలేజీ మెటీరియల్‌తో పాటు తెలుగు అకాడమీ పుస్తకాలను బాగా చదివితే 160 మార్కులకుగాను 110మార్కులకు పైగా సాధించవచ్చు. ఎంసెట్ 160 ప్రశ్నల్లో 70శాతం ప్రశ్నలు సులభంగా లేదా మధ్యస్థంగా ఉంటాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సిలబస్‌కు సమ ప్రాధాన్యం లభిస్తుంది పరీక్ష ప్రశ్నించే విభాగాలు, ప్రశ్నలు రాత పరీక్ష తేదీ ఎంసెట్ ఫిజిక్స్ (40 ప్రశ్నలు), మ్యాథ్స్ (80 ప్రశ్నలు), కెమిస్ట్రీ (40 ప్రశ్నలు) మే లో బిట్‌శాట్ ఫిజిక్స్ (40 ప్రశ్నలు), మ్యాథ్స్ (45 ప్రశ్నలు), కెమిస్ట్రీ (40 ప్రశ్నలు), లాజికల్ రీజనింగ్ (10 ప్రశ్నలు), ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ(15 ప్రశ్నలు) మే 3-4వ వారం, 2015 ఎస్ఆర్ఎం ఫిజిక్స్ (35 ప్రశ్నలు), మ్యాథ్స్ (35 ప్రశ్నలు), కెమిస్ట్రీ (35 ప్రశ్నలు) ఆఫ్‌లైన్ ఏప్రిల్ 26, ఆన్లైన్ ఏప్రిల్ 19-22, 2015 విట్ ఫిజిక్స్ (40 ప్రశ్నలు), మ్యాథ్స్ (40 ప్రశ్నలు), కెమిస్ట్రీ (40 ప్రశ్నలు) ఏప్రిల్ 8-19, 2015 జేఈఈ మెయిన్ బీఈ/బీటెక్ కోర్సు కోసం పేపర్ -1కు హాజరు కావాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నల సంఖ్య ప్రతి ఏడాది మారుతూంటుంది.గత పరీక్షలో ఒక్కో సబ్జెక్టు నుంచి 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇచ్చారు. బీఆర్క్/బీప్లానింగ్ కోర్సులో చేరాలనుకునే వారు పేపర్-2 రాయాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 18, 2014. పరీక్ష తేదీ (ఆఫ్‌లైన్): ఏప్రిల్ 4, 2015. (ఆన్లైన్): 2015, ఏప్రిల్ 10, 11. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు ఆబ్జెక్టివ్ పేపర్లు.. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. ప్రతి పేపర్‌కు 180 మార్కుల చొప్పున మొత్తం కేటాయించిన మార్కులు 360. ప్రతి పేపర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 2, 2015. ముగింపు: మే 7, 2015. పరీక్ష తేదీ: మే 24, 2015. కేఎల్‌యూ, గీతం, విజ్ఞాన్ యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తున్నాయి. సబ్జెక్ట్‌ల వారీగా.. మ్యాథమెటిక్స్ బిట్‌శాట్‌లో కాలిక్యులస్, ఆల్జీబ్రా నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో హయ్యర్ ఆర్డర్, నంబర్ సిస్టమ్ వంటి అంశాలపై కూడా దృష్టి సారించాలి. మిగతా పరీక్షలకు సంబంధించి సంకీర్ణ సంఖ్యలు; మాత్రికలు; ప్రస్తారాలు, సంయోగాలు, సంభావ్యత; అవకలనం- వాటి అనువర్తనాలు; నిశ్చిత సమాకలనం; వైశాల్యాలు; అవకలన సమీకరణాలు; వృత్తాలు, శాంకవాలు; సదిశలు, సరళరేఖలు, త్రికోణమితి సమీకరణాలు, విలోమ త్రికోణమితి ప్రమేయాలు, త్రిభుజ ధర్మాలు నుంచి కచ్చితంగా ప్రశ్నలు వస్తాయి కాబట్టి వీటిని పూర్తిగా చదవాలి. -ఎం.ఎన్.రావు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు. ఫిజిక్స్ భౌతికశాస్త్రంలోని ప్రశ్నలు ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా ఉంటాయి. కాబట్టి ఇంటర్మీడియెట్ పాఠ్యాంశాలను కాన్సెప్ట్‌ల వారీగా ప్రిపేర్ కావడం ప్రయోజనకరం. {పతి చాప్టర్ వెనుక ఇచ్చే అదనపు ప్రశ్నలతోసహా ప్రిపేరవ్వడం లాభిస్తుంది. ఈ సబ్జెక్ట్‌లో 60 శాతం మార్కులు స్కోర్ చేస్తే మెరుగైన ర్యాంక్‌ను సాధించవచ్చు. {పథమ సంవత్సరం సిలబస్‌ను మూడు భాగాలుగా విభజించుకోవాలి. అవి.. 1) గతిశాస్త్రం, 2) ద్రవ్య ధర్మాలు, 3) ఉష్ణం-ఉష్ణ గతికశాస్త్రం. {దవ్య ధర్మాలు, ఉష్ణం-ఉష్ణ గతికశాస్త్రాల్లో ప్రాథమిక అంశాలపై పట్టు సాధించటం చాలా ప్రధానం. ఉష్ణగతికశాస్త్రంలో గ్రాఫ్‌లకు సంబంధించిన ప్రశ్నలను సాధన చేయాలి. ద్వితీయ సంవత్సరంలో కాంతి, విద్యుదయస్కాంతత్వం, కేంద్రక, పరమాణు భౌతిక శాస్త్రాలను క్షుణ్నంగా చదవాలి. {పతి పాఠ్యాంశంలోని సిద్ధాంతపరమైన ప్రశ్నలతోపాటు ప్రథమ, ద్వితీయ స్థాయి ప్రశ్నలను తప్పకుండా సాధన చేయాలి. పాఠ్యాంశాలను చదివేటప్పుడు ముఖ్యాంశాలు, ఫార్ములాలతో కూడిన నోట్స్‌ను రూపొందించుకోవాలి. దీనివల్ల పునశ్చరణ తేలికవుతుంది. {పతి చాప్టర్లో గ్రాఫ్‌లకు సంబంధించిన ప్రశ్నలను ఒక చోట చేర్చి చదివితే వాటి మధ్య పోలికలు తేలికగా తెలుస్తాయి. ప్రిపరేషన్ ప్రయోజనకరంగా సాగుతుంది. -పి.కె.సుందర్ రావు, సీనియర్ ఫ్యాకల్టీ. కెమిస్ట్రీ కెమిస్ట్రీలో అడిగే ప్రశ్నలు జ్ఞాపక శక్తి ఆధారంగా ఉంటున్నాయి. కాబట్టి పీరియూడిక్ టేబుల్, ఎస్-బ్లాక్, పి-బ్లాక్ వంటి సులువైన అంశాలను నిర్లక్ష్యం చేయొద్దు. కెమికల్ ఈక్విలిబ్రియుంలో రిలేషన్‌షిప్స్‌ను బాగా నేర్చుకోవాలి. అయానిక్ ఈక్విలిబ్రియుంలో ప్రాబ్లమ్స్, బఫర్ సొల్యూషన్స్, సాల్ట్ హైడ్రాలిసిస్, సొల్యుబిలిటీ ప్రొడక్ట్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. ఎలక్ట్రో కెమిస్ట్రీలో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఎలక్ట్రోలైటిక్ కండెక్టెన్స్, ఎలక్ట్రాలిసిస్ వంటి అంశా లపై దృష్టి సారించాలి. థర్మోడైనమిక్స్‌లో ఫస్ట్ లా అప్లికేషన్స్, స్పాంటెనిటీకి సంబంధించిన ప్రశ్నలను ఎక్కువగా అడుగుతున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. అకాడమీ పుస్తకంలోని రీజెంట్స్ను తప్పకుండా చదవాలి. కైనటిక్స్లో ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ కైనటిక్స్ అప్లికేషన్స్ మీద ఎక్కువ ప్రశ్నలను సాధన చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో స్ట్రక్చర్స్, బాండింగ్స్, ఆక్సియాసిడ్స్, ఆక్సైడ్ తదితరాలను విధిగా నేర్చుకోవాలి. కాంప్లెక్స్ కంపౌండ్స్లో ఐసోమార్సిజం, బాండింగ్‌పై దృష్టి సారించాలి. ఎంసెట్‌తో పోల్చితే బిట్‌శాట్‌లో ప్రశ్నల క్లిష్టత కొంచెం ఎక్కువ. మెటలర్జీ, పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ డే లైఫ్, బయోమాలిక్యుల్స్ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. విట్ పరీక్ష కోసం కార్బోహైడ్రేట్స్, అమినో యాసిడ్స్, లిపిడ్స్ వంటి అంశాలలోని వర్గీకరణలు, ఉదాహరణలను బాగా నేర్చుకోవాలి. అటామిక్ స్ట్రక్చర్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సీనియర్ ఇంటర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పి-బ్లాక్ ఎలిమెంట్స్‌కు సంబంధించి అకాడమీ పుస్తకాల్లోని అంశాలను బాగా చదవాలి. -టి. కృష్ణ, డాక్టర్ ఆర్కే క్లాసెస్, హైదరాబాద్. -
ఎంసెట్ ప్రశాంతం
ఖమ్మం, న్యూస్‌లైన్: ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్ష(ఎంసెట్) గురువారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు, పరిసర జిల్లాలైన వరంగల్, నల్గొండ, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులతో పాటు వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు, బంధువులతో ఖమ్మం నగరంలోని ప్రదాన రహదారులు, కశాళాలల ఆవరణలు జనసందోహంగా మారాయి. ఉదయం జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 92.13 శాతం, మధ్యాహ్నం జరిగిన అగ్రికల్చర్, మెడి సిన్ ప్రవేశానికి 91.60 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఎంసెట్ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ కనకాచారి తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదనే నిబంధనతో ఆలస్యంగా వచ్చిన పలువురు విద్యార్థులు పరీక్షలు రాయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. 14,453 మంది విద్యార్థులు హాజరు... ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాలకు చెందిన 14,453 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు కనకాచారి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు మొత్తం 11,959 మంది విద్యార్థులకు గాను 11,018 మంది హాజరయ్యారని, 941 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరిగిన మెడిసిన్ ప్రవేశ పరీక్షకు మొత్తం 3,750 మంది విద్యార్థులకు గాను 3,435 హాజరయ్యారని, 315 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో 92.13 శాతం, మెడిసిన్‌లో 91.60 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. నిమిషం నిబంధనతో వెనుదిరిగిన విద్యార్థులు... ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష సమయానికంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదనే నిబంధనలతో పలువురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. ఆలస్యంగా వచ్చిన వారిని అధికారులు అనుమంతించలేదు. ఆలస్యంగా వచ్చిన పలువురు విద్యార్థులు అధికారులను ఎంత ప్రాథేయపడినా.. ప్రభుత్వం ఈ నిబంధనను కఠినతరం చేయడంతో వారు అంగీకరించలేదు. ఇలా పలువురు విద్యార్థులు వెనుదిరగాల్సి వచ్చింది. మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ ఇద్దరి పట్టివేత.. ఎంసెట్‌లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను అధికారులు గుర్తించి మాల్ ప్రాక్టిస్ కింద కేసు బుక్ చేశారు. ఉదయం జరిగిన ఇంజనీరింగ్ పరీక్షలో ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల సెంటర్లో ఇద్దరు విద్యార్థులు చిట్టీలు తీసుకొని పరీక్ష హాల్లోకి వెళ్లి అనుమానాస్పదంగా కనిపించారు. ఇది గమనించిన ఇన్విజిలేటర్లు తనిఖీ చేయగా, వారివద్ద నకళ్లు దొకరడంతో మాల్ ప్రాక్టిస్ కేసు బుక్‌చేసి పరీక్ష సమయం అయ్యేవరకు ఆఫీసు రూంలో ఉంచి ఆ తర్వాత బయటకు పంపించారు. మండుటెండలో నిరీక్షణ... పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు మండుటెండలో నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం జరిగిన ఇంజనీరింగ్ పరీక్షకు వెళ్లిన విద్యార్థుల కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు వేచి చూడాల్సి వచ్చింది. అలాగే నిమిషం నిబంధన ఉండడంతో మధ్యాహ్నం మెడిసిన్ ప్రవేశపరీక్ష రాసే విద్యార్థులు ఆయా కేంద్రాల వద్దకు ముందుగానే వచ్చారు. అయితే పరీక్ష రాస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తే తప్ప వీరిని హాల్లోకి పంపించే అవకాశం లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎండలోనే నిరీక్షించాల్సి వచ్చింది. -
ప్రశాంతంగా ఎంసెట్
విజయవాడ సిటీ/పెనమలూరు, న్యూస్‌లైన్ : మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (ఎంసెట్) గురువారం ప్రశాంతంగా జరిగింది. విజయవాడలో 70 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 36,845 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా 35,772 మంది పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు 42 కేంద్రాల్లో జరి గిన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 21,970 మందికి 21,162 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటలకు 28 కేంద్రాల్లో జరిగిన మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్షకు 14,875మందికి 14,610 మంది హాజరయ్యారు. ఎక్కువ మంది విద్యార్థులు నిర్ణీత వ్యవధి కంటే అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. కొందరు మాత్రం చివరి క్షణాల్లో ఉరుకులు పరుగులతో వచ్చి పరీక్ష రాశారు. సిద్ధార్థ కళాశాల వద్ద ఇద్దరు విద్యార్థులు నిర్ణీత వ్యవధిలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోవడంతో వారిని పరీక్షకు అనుమతించలేదు. 70 కేంద్రాల్లో ఏడెనిమిది మంది మాత్రమే నిర్ణీత వ్యవధిలోగా కేంద్రాలకు చేరుకోలేదు. పరీక్షలు ప్రశాంతంగా జరి గాయని ఎంసెట్ రీజనల్ కోఆర్డినేటర్ మోహన్‌రావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే పోలీసు సిబ్బందిలోనికి అనుమతిం చారు. ఎండవేడిమికి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు అల్లాడారు. తమ బిడ్డలు పరీక్ష రాసినంతసేపు సమీపంలోని చెట్ల నీడన సేదతీరారు. మెడికల్ పరీక్ష రాసేందుకు జగ్గయ్యపేట నుంచి మొగల్రాజపురంలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ కేంద్రానికి వచ్చిన విద్యార్థిని పరీక్ష ఒత్తిడి, ఎండతో నీరసించి అస్వస్థతకు గురైయింది. పరీక్ష కేంద్రంలో వైద్యసిబ్బంది చికిత్సతో తేరుకుని యథావిధిగా పరీక్ష రాసింది. ప్రాధేయ పడినా పరీక్షకు అనుమతించలేదు కానూరు రవీంద్రభారతి పాఠశాల పరీక్ష కేంద్రం వద్దకు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన విద్యార్థిని శివసాయి నిమిషం ఆలస్యంగా రావడంతో అధికారులు ఆమెను అనుమతించలేదు. తొలుత పరీక్ష కేంద్రం వద్దకు ముందుగానే వచ్చినా హాల్‌టికెట్ మరచి పోవటంతో మళ్లీ గూడవల్లి వెళ్లి రావడం, మధ్యలో ట్రాఫిక్ సమస్య కారణంగా నిమిషం ఆలస్యమైంది. ఆ విద్యార్థి, తండ్రి పరీక్షకు అనుమతించాలని అధికారులను చేతులు పట్టుకుని ప్రాథేయపడ్డారు. నిబంధనల మేరకు అధికారులు అనుమతిం చకపోవడంతో తండ్రీకొడుకులు కంటతడి పెట్టారు. అక్కడే ఉన్న పలువురు తల్లిదండ్రులు అధికారులు వైఖరిని తప్పుపట్టారు. మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా అధికారుల వైఖ రిలో మార్పురాలేదని ఆరోపిం చారు. ఈ ఘటనతో కొద్ది సమయం పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయమై ఎంసెట్ రీజినల్ కోఆర్డినేటర్ మోహనరావును వివరణ కోరగా తాము చాలా రోజుల నుంచి ఆలస్యంగా రావద్దని ప్రకటన చేస్తున్నామని తెలి పారు. కావాలని తాము ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, నిబంధనల ప్రకారమే వ్యవహరించామని స్పష్టంచేశారు. అడుగడుగునా ట్రాఫిక్ జామ్ ఎంసెట్ సందర్భంగా నగరంలోకి వేలాదిగా కార్లు ఇతర వాహనాల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తరలి వచ్చారు. దీంతో నగరంలో అడుగడుగునా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నానాతంటాలు పడ్డారు. ఏలూరు, బందరు రోడ్డు, ఐదో నంబర్ రోడ్డు, సిద్ధార్థ కాలేజీ రోడ్డు, పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు, బెంజిసర్కిల్, వన్‌టౌన్, భవానీపురం తదితర ప్రాంతాల్లో పలుమార్లు ట్రాఫిక్ స్తంభించింది. రామవరప్పాడు నుంచి బెంజిసర్కిల్ వరకు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. బందర్లో 2,751మంది హాజరు ఈడేపల్లి (మచిలీపట్నం) : మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ఐదు ఎంసెట్ పరీక్ష కేంద్రాల్లో మొత్తం 2,751 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం హిందూ, వరలక్ష్మి, నోబుల్, డీఎంఎస్ఎస్వీహెచ్, శ్రీ వరలక్ష్మి పాలిటెక్నికల్ కళాశాలలో ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష జరిగింది. ఇంజినీరింగ్ విభాగానికి మొత్తం 2,519 మంది దరఖాస్తు చేసుకోగా, 2,408 మంది హాజరయ్యారు. నోబుల్, హిందూ కళాశాలల్లో మధ్యాహ్నం మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌కు 363 మందికి 343 మంది పరీక్షరాశారు. రాష్ట్ర పరిశీలకులు జనార్దన్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ రవికృష్ణ, రీజనల్ కో-ఆర్డినేటర్ వి.ఉషారాణి, చీఫ్ సూపరింటెండెంట్ జి.శ్రీనివాసబాబు పరీక్ష కేంద్రాల్ని పర్యవేక్షించారు. -
ఎంసెట్ ప్రశాంతం
మెదక్/ సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: మెడిసిన్, ఇంజనీరింగ్ ప్రవేశపరీక్ష (ఎంసెట్-2014) పరీక్ష గురువారం జిల్లాలోని సిద్దిపేట, మెదక్ పట్టణాల్లో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 5,107 మంది విద్యార్థులకు గాను వివిధ కారణాలతో 336 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ‘ఒక్క నిమిషం’ నిబంధనతో మెదక్‌లో ఇద్దరు, సిద్దిపేటలో ఓ విద్యార్థి పరీక్ష రాయలేకపోయారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించగా, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసిన్, అగ్రికల్చర్ విభాగం ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఆశనిపాతంగా మారిన నిబంధనలు అప్లికేషన్ దరఖాస్తులు మరిచి వచ్చిన అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ ఫారాన్ని, గెజిటెడ్ అధికారితో సం తకం చేసిన కుల ధ్రువీకరణ పత్రం(ఎస్సీ, ఎస్టీలకు) తప్పకుండా తీసుకురావాలన్న నిబంధనతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఒక్క నిమిషం నిబంధనతో విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ఆలస్యమవుతుందన్న ఆందోళనతో ఉరుకులు పరుగులు పెట్టడం కనిపించింది. ‘ఒక్క నిమిషానికి’ ముగ్గురు ఔట్ ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమన్న నిబంధనతో జిల్లాలో ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్ కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన అందోల్‌కు చెందిన మమత, పటాన్‌చెరుకు చెందిన అనిల్‌లు పరీక్ష రాయకుండనే వెనుదిరిగారు. ఇక సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రానికి కొన్ని నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఓ విద్యార్థిని పరీక్ష రాయలేకపోయారు. పకడ్బందీ ఏర్పాట్లు ఎంసెట్ పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలూ తీసుకున్నారు. తాగునీటి సౌకర్యంతో పాటు విద్యార్థులతో కలిసి పరీక్ష కేంద్రాలకు వచ్చిన తల్లిదండ్రుల కోసం షామియానాలు ఏర్పాటు చేశారు. దూరప్రాంతాల విద్యార్థులంతా గురువారం రాత్రికే మెదక్, సిద్దిపేట పట్టణాలకు చోరుకోగా, మరికొందరు విద్యార్థులు గురువారం ఉదయమే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. -
నేడే ఎంసెట్
మెదక్ టౌన్/ మెదక్ మున్సిపాలిటీ/ సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్ : ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్ష (ఎంసెట్-2014) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని మెదక్, సిద్దిపేట పట్టణాల్లోని 8 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్లకు కలిపి మొత్తం 5,107 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 3016 కాగా, మెడిసిన్, అగ్రికల్చర్ విభాగంలో 2091 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్ష సమయం ఇంజనీరింగ్ విభాగం పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెడిసిన్, అగ్రికల్చర్ విభాగం పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోని అనుమతి ఉంటుందని, అందువల్ల విద్యార్థులంతా నిర్దిష్ట సమయం కన్నా ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు చెబుతున్నారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తోపాటు బాల్‌పాయింట్ పెన్ మాత్రమే వెంట తెచ్చుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పూర్తిచేసిన ఆన్లైన్ ఫారంతోపాటు గెజిటెడ్ అధికారి సంతకం చేసిన కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీ వెంట తెచ్చుకోవాలన్నారు. పకడ్బందీ ఏర్పాట్లు ఎంసెట్-2014 ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎంసెట్ మెదక్ కో ఆర్డినేటర్ సుబ్బారాయుడు, సిద్దిపేట కోఆర్డినేటర్ నాగేశ్వర్రావు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా..పరీక్ష కేంద్రంలోని అనుమతించబోమన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. అభ్యర్థుల సంఖ్యకనుగుణంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటికనుగుణంగా ఇన్విజిలేటర్లను నియమించినట్లు చెప్పారు.