ఖమ్మం, న్యూస్‌లైన్: ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్ష(ఎంసెట్) గురువారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు, పరిసర జిల్లాలైన వరంగల్, నల్గొండ, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులతో పాటు వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు, బంధువులతో ఖమ్మం నగరంలోని ప్రదాన రహదారులు, కశాళాలల ఆవరణలు జనసందోహంగా మారాయి. ఉదయం జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 92.13 శాతం, మధ్యాహ్నం జరిగిన అగ్రికల్చర్, మెడి సిన్ ప్రవేశానికి 91.60 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఎంసెట్ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ కనకాచారి తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదనే నిబంధనతో ఆలస్యంగా వచ్చిన పలువురు విద్యార్థులు పరీక్షలు రాయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
14,453 మంది విద్యార్థులు హాజరు...
ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాలకు చెందిన 14,453 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు కనకాచారి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు మొత్తం 11,959 మంది విద్యార్థులకు గాను 11,018 మంది హాజరయ్యారని, 941 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరిగిన మెడిసిన్ ప్రవేశ పరీక్షకు మొత్తం 3,750 మంది విద్యార్థులకు గాను 3,435 హాజరయ్యారని, 315 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో 92.13 శాతం, మెడిసిన్‌లో 91.60 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని వివరించారు.
నిమిషం నిబంధనతో వెనుదిరిగిన విద్యార్థులు...
ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష సమయానికంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదనే నిబంధనలతో పలువురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. ఆలస్యంగా వచ్చిన వారిని అధికారులు అనుమంతించలేదు. ఆలస్యంగా వచ్చిన పలువురు విద్యార్థులు అధికారులను ఎంత ప్రాథేయపడినా.. ప్రభుత్వం ఈ నిబంధనను కఠినతరం చేయడంతో వారు అంగీకరించలేదు. ఇలా పలువురు విద్యార్థులు వెనుదిరగాల్సి వచ్చింది.
మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ ఇద్దరి పట్టివేత..
ఎంసెట్‌లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను అధికారులు గుర్తించి మాల్ ప్రాక్టిస్ కింద కేసు బుక్ చేశారు. ఉదయం జరిగిన ఇంజనీరింగ్ పరీక్షలో ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల సెంటర్‌లో ఇద్దరు విద్యార్థులు చిట్టీలు తీసుకొని పరీక్ష హాల్‌లోకి వెళ్లి అనుమానాస్పదంగా కనిపించారు. ఇది గమనించిన ఇన్విజిలేటర్లు తనిఖీ చేయగా, వారివద్ద నకళ్లు దొకరడంతో మాల్ ప్రాక్టిస్ కేసు బుక్‌చేసి పరీక్ష సమయం అయ్యేవరకు ఆఫీసు రూంలో ఉంచి ఆ తర్వాత బయటకు పంపించారు.
మండుటెండలో నిరీక్షణ...
పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు మండుటెండలో నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం జరిగిన ఇంజనీరింగ్ పరీక్షకు వెళ్లిన విద్యార్థుల కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు వేచి చూడాల్సి వచ్చింది. అలాగే నిమిషం నిబంధన ఉండడంతో మధ్యాహ్నం మెడిసిన్ ప్రవేశపరీక్ష రాసే విద్యార్థులు ఆయా కేంద్రాల వద్దకు ముందుగానే వచ్చారు. అయితే పరీక్ష రాస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తే తప్ప వీరిని హాల్‌లోకి పంపించే అవకాశం లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎండలోనే నిరీక్షించాల్సి వచ్చింది.
ఎంసెట్ ప్రశాంతం
Published Fri, May 23 2014 2:15 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM
Advertisement
Advertisement