kanakachari
-
ఎంసెట్ ప్రశాంతం
ఖమ్మం, న్యూస్‌లైన్: ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్ష(ఎంసెట్) గురువారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు, పరిసర జిల్లాలైన వరంగల్, నల్గొండ, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులతో పాటు వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు, బంధువులతో ఖమ్మం నగరంలోని ప్రదాన రహదారులు, కశాళాలల ఆవరణలు జనసందోహంగా మారాయి. ఉదయం జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 92.13 శాతం, మధ్యాహ్నం జరిగిన అగ్రికల్చర్, మెడి సిన్ ప్రవేశానికి 91.60 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఎంసెట్ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ కనకాచారి తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదనే నిబంధనతో ఆలస్యంగా వచ్చిన పలువురు విద్యార్థులు పరీక్షలు రాయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. 14,453 మంది విద్యార్థులు హాజరు... ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాలకు చెందిన 14,453 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు కనకాచారి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు మొత్తం 11,959 మంది విద్యార్థులకు గాను 11,018 మంది హాజరయ్యారని, 941 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరిగిన మెడిసిన్ ప్రవేశ పరీక్షకు మొత్తం 3,750 మంది విద్యార్థులకు గాను 3,435 హాజరయ్యారని, 315 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో 92.13 శాతం, మెడిసిన్‌లో 91.60 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. నిమిషం నిబంధనతో వెనుదిరిగిన విద్యార్థులు... ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష సమయానికంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదనే నిబంధనలతో పలువురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. ఆలస్యంగా వచ్చిన వారిని అధికారులు అనుమంతించలేదు. ఆలస్యంగా వచ్చిన పలువురు విద్యార్థులు అధికారులను ఎంత ప్రాథేయపడినా.. ప్రభుత్వం ఈ నిబంధనను కఠినతరం చేయడంతో వారు అంగీకరించలేదు. ఇలా పలువురు విద్యార్థులు వెనుదిరగాల్సి వచ్చింది. మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ ఇద్దరి పట్టివేత.. ఎంసెట్‌లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను అధికారులు గుర్తించి మాల్ ప్రాక్టిస్ కింద కేసు బుక్ చేశారు. ఉదయం జరిగిన ఇంజనీరింగ్ పరీక్షలో ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల సెంటర్లో ఇద్దరు విద్యార్థులు చిట్టీలు తీసుకొని పరీక్ష హాల్లోకి వెళ్లి అనుమానాస్పదంగా కనిపించారు. ఇది గమనించిన ఇన్విజిలేటర్లు తనిఖీ చేయగా, వారివద్ద నకళ్లు దొకరడంతో మాల్ ప్రాక్టిస్ కేసు బుక్‌చేసి పరీక్ష సమయం అయ్యేవరకు ఆఫీసు రూంలో ఉంచి ఆ తర్వాత బయటకు పంపించారు. మండుటెండలో నిరీక్షణ... పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు మండుటెండలో నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం జరిగిన ఇంజనీరింగ్ పరీక్షకు వెళ్లిన విద్యార్థుల కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు వేచి చూడాల్సి వచ్చింది. అలాగే నిమిషం నిబంధన ఉండడంతో మధ్యాహ్నం మెడిసిన్ ప్రవేశపరీక్ష రాసే విద్యార్థులు ఆయా కేంద్రాల వద్దకు ముందుగానే వచ్చారు. అయితే పరీక్ష రాస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తే తప్ప వీరిని హాల్లోకి పంపించే అవకాశం లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎండలోనే నిరీక్షించాల్సి వచ్చింది. -
నేడే ఎంసెట్
ఖమ్మం, న్యూస్‌లైన్:జిల్లా కేంద్రంలో గురువారం జరగనున్న ఎంసెట్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విద్యార్థులకు, వారి వెంట వచ్చే వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎంసెట్ రీజనల్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ కనకాచారి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. పరీక్ష కేంద్రాలను ఆయన బుధవారం పరిశీలించి, ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పరీక్షలను ప్రశాం తంగా నిర్వహించేందుకు సహకరించాలని పో లీస్, ట్రాన్స్‌కో, వైద్యారోగ్య శాఖ అధికారులను కోరినట్టు చెప్పారు. ఈ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు, మాస్ కాపీయింగ్ నివారించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇన్విజిలేటర్ల పేర్లను గోప్యంగా ఉంచుతున్నామని అన్నారు. ఏ ఇన్విజిలేటర్ ఏ గదికి వెళ్లే విషయం చివరి నిముషం వరకు తెలీదని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సెల్ ఫోన్లు పనిచేయకుండా జామర్లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇంజనీరింగ్ విభాగం పరీక్ష ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది. దీనికి 11,959 మంది హాజరుకానున్నారు. ఖమ్మం నగరం, పరిసర ప్రాంతాల్లోని 23 కేంద్రాలో ఈ పరీక్ష ఉంటుంది. మెడికల్ విభాగం పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ఉంటుంది. దీనికి 3,750 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఎనిమిది కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు, వారి సహాయకులను ఖమ్మం బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి ఆయా కేంద్రాల వద్దకు తీసుకెళ్లి, తిరిగి తీసుకొచ్చేందుకు నగరంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఉచితంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నాయి. ఖమ్మం, సత్తుపల్లి, మధిర, భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం డిపోల పరిధిలో 50 బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. పరీక్ష సమయానికి అనుగుణంగా వీటిని నడపనున్నట్టు ఆర్టీసీ ఆర్ఎం చావా విజయ్‌బాబు తెలిపారు. విద్యార్థులకు సూచనలు పరీక్ష సమయానికి గంట ముందుగా కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష సమయానికి ఒక్క నిముషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రాన్ని తెచ్చుకోవాలి. హాల్ టికెట్‌తోపాటు ఆన్లైన్ అప్లికేషన్ ఫారంపై ఫొటో అతికించి, దానిపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి. విద్యార్థులు తమ వెంట సెల్‌ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకూడదు. నిబంధనలు అతిక్రమించిన వారిని పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపిస్తారు. తగిన చర్యలు కూడా తీసుకుంటారు. -
బ్లాక్ డే.. నిరసన వెల్లువ
ఖమ్మం, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా సీమాంధ్రుల చేతిలో దోపిడీకి గురయ్యారని టీజేఏసీ నేతలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వారు నిరసన దినంగా పాటించారు. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, జేఏసీ నాయకులు నల్లజెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. పలువురు తెలంగాణ వాదులు అర్ధనగ్న ప్రదర్శనలు, మోటార్‌సైకిల్ ర్యాలీలు, ప్రధాన రహదారులపై మానవహారాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సమావేశాలలో జేఏసీ, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాకే తెలంగాణ అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైందని అన్నారు. ఈ ప్రాంత ప్రజల బతుకులను దుర్భరంగా మార్చిన రాష్ట్ర అవతరణ దినోత్సవం తెలంగాణ వాసులకు చీకటి రోజుగా అభివర్ణించారు. ఖమ్మంలో తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కనకాచారి నల్లజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1956కు ముందు తెలంగాణా సస్యశ్యామలంగా ఉందన్నారు. టీజేఏసీ జిల్లా కన్వీనర్ కూరపాటి రంగరాజు మాట్లాడుతూ 60 ఏళ్ల సీమాంధ్రుల పాలనలో తెలంగాణ పూర్తిగా వెనబడిందన్నారు. తెలంగాణ విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ లోనికి చోచ్చుకపోయేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. జిల్లా పరిషత్‌లో మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలిపారు. సమావేశ మందిరం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. కొత్తగూడెంలో బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఆర్డీవో కార్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలపై జెండా ఎగురవేశారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని 5 షాఫ్టు గని వద్ద టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడంతో పాటు నల్లజెండా ఎగురవేశారు. పాల్వంచలోని కేటీపీఎస్ ఓఅండ్ఎం, 5, 6 దశల కర్మాగారాల ఎదుట ఉద్యోగులు తెల్లవారుజామున నల్లజెండాలు ఎగురవేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 5, 6 దశల సీఈ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయంపై నల్లజెండా ఎగురవేశారు. తెలంగాణవాదులు మున్సిపల్ కార్యాలయంపై నల్లజెండా ఆవిష్కరించారు. భద్రాచలంలో టీఎన్జీవోస్ కార్యాలయంలో టీజేఏసీ ఉద్యోగులు, నాయకులు నల్లజెండా ఎగురవేసి, నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన దినంగా పాటించారు. టీఆర్ఎస్ నాయకులు బ్యాంక్ రోడ్డులో నల్లజెండాను ఎగురవేసి తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. వాజేడులో టీఎన్జీవోస్ ఉద్యోగులు, టీఆర్ఎస్ నాయకులు నల్లజెండాను ఎగురవేశారు. అనంతరం అర్ధనగ్నంగా మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇల్లెందులో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత మున్సిపల్, తహశీల్దార్ కార్యాలయాలపై నల్లజెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, టీజేఏసీ డివిజన్ చైర్మన్ పి.అప్పారావు మాట్లాడుతూ.. అధిష్టానం మాటను ఖాతరు చేయని సీఎంను ఆ పదవిలో కొనసాగించటం కాంగ్రెస్‌కు ఎంతమాత్రం భావ్యం కాదన్నారు. అశ్వారావుపేటలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ నాయకులు ముబారక్ బాబా నల్లజెండా ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. నల్లరిబ్బన్లు ధరించారు. వ్యవసాయ కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన సభ నిర్వహించారు. దమ్మపేట, చండ్రుగొండలో టీఆర్ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో నల్లజెండా ఎగురవేశారు. మణుగూరులో తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో నల్లజెండాలు ఆవిష్కరించి నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు దుస్సా సమ్మయ్య, నాగుల్‌మీరా, చంద్రమౌళి, రమేష్, ఎడ్ల శ్రీనివాస్, వనమా లక్ష్మీనారాయణ, ఉదయరాఘవేందర్, నాగేశ్వరరావు, రఫీక్‌పాషా పాల్గొన్నారు. మధిరలో జెఏసీ ఆధ్వర్యంలో ఆర్వీ కాంప్లెక్స్ వద్ద నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. ఎర్రుపాలెంలోని రింగ్సెంటర్లో జెఏసీ ఆధ్వర్యంలో నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొన్నారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కోట రవికుమార్ పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలపై నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. నేలకొండపల్లి తహశీల్దార్ కార్యాలయంపై తెలంగాణవాదులు నల్లజెండా ఎగురవేశారు. వెంటనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలంలో రా్రష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నల్లజెండాలు ఎగరవేశారు. కారేపల్లి సెంటర్లో మానవహారం నిర్మించారు.