ఖమ్మం, న్యూస్‌లైన్:జిల్లా కేంద్రంలో గురువారం జరగనున్న ఎంసెట్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విద్యార్థులకు, వారి వెంట వచ్చే వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎంసెట్ రీజనల్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ కనకాచారి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. పరీక్ష కేంద్రాలను ఆయన బుధవారం పరిశీలించి, ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పరీక్షలను ప్రశాం తంగా నిర్వహించేందుకు సహకరించాలని పో లీస్, ట్రాన్స్‌కో, వైద్యారోగ్య శాఖ అధికారులను కోరినట్టు చెప్పారు.
ఈ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు, మాస్ కాపీయింగ్ నివారించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇన్విజిలేటర్ల పేర్లను గోప్యంగా ఉంచుతున్నామని అన్నారు. ఏ ఇన్విజిలేటర్ ఏ గదికి వెళ్లే విషయం చివరి నిముషం వరకు తెలీదని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సెల్ ఫోన్లు పనిచేయకుండా జామర్లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
ఇంజనీరింగ్ విభాగం పరీక్ష ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది. దీనికి 11,959 మంది హాజరుకానున్నారు. ఖమ్మం నగరం, పరిసర ప్రాంతాల్లోని 23 కేంద్రాలో ఈ పరీక్ష ఉంటుంది.
మెడికల్ విభాగం పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ఉంటుంది. దీనికి 3,750 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఎనిమిది కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుంది.
విద్యార్థులు, వారి సహాయకులను ఖమ్మం బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి ఆయా కేంద్రాల వద్దకు తీసుకెళ్లి, తిరిగి తీసుకొచ్చేందుకు నగరంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఉచితంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నాయి. ఖమ్మం, సత్తుపల్లి, మధిర, భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం డిపోల పరిధిలో 50 బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. పరీక్ష సమయానికి అనుగుణంగా వీటిని నడపనున్నట్టు ఆర్టీసీ ఆర్‌ఎం చావా విజయ్‌బాబు తెలిపారు.
విద్యార్థులకు సూచనలు
పరీక్ష సమయానికి గంట ముందుగా కేంద్రంలోకి అనుమతిస్తారు.
పరీక్ష సమయానికి ఒక్క నిముషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రాన్ని తెచ్చుకోవాలి.
హాల్ టికెట్‌తోపాటు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారంపై ఫొటో అతికించి, దానిపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి.
విద్యార్థులు తమ వెంట సెల్‌ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకూడదు.
నిబంధనలు అతిక్రమించిన వారిని పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపిస్తారు. తగిన చర్యలు కూడా తీసుకుంటారు.
నేడే ఎంసెట్
Published Thu, May 22 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement
Advertisement