ఖమ్మం, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా సీమాంధ్రుల చేతిలో దోపిడీకి గురయ్యారని టీజేఏసీ నేతలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వారు నిరసన దినంగా పాటించారు. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, జేఏసీ నాయకులు నల్లజెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. పలువురు తెలంగాణ వాదులు అర్ధనగ్న ప్రదర్శనలు, మోటార్‌సైకిల్ ర్యాలీలు, ప్రధాన రహదారులపై మానవహారాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సమావేశాలలో జేఏసీ, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాకే తెలంగాణ అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైందని అన్నారు. ఈ ప్రాంత ప్రజల బతుకులను దుర్భరంగా మార్చిన రాష్ట్ర అవతరణ దినోత్సవం తెలంగాణ వాసులకు చీకటి రోజుగా అభివర్ణించారు.
ఖమ్మంలో తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కనకాచారి నల్లజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1956కు ముందు తెలంగాణా సస్యశ్యామలంగా ఉందన్నారు. టీజేఏసీ జిల్లా కన్వీనర్ కూరపాటి రంగరాజు మాట్లాడుతూ 60 ఏళ్ల సీమాంధ్రుల పాలనలో తెలంగాణ పూర్తిగా వెనబడిందన్నారు. తెలంగాణ విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ లోనికి చోచ్చుకపోయేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. జిల్లా పరిషత్‌లో మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలిపారు. సమావేశ మందిరం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు.
కొత్తగూడెంలో బస్టాండ్ సెంటర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఆర్డీవో కార్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలపై జెండా ఎగురవేశారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని 5 షాఫ్టు గని వద్ద టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడంతో పాటు నల్లజెండా ఎగురవేశారు. పాల్వంచలోని కేటీపీఎస్ ఓఅండ్‌ఎం, 5, 6 దశల కర్మాగారాల ఎదుట ఉద్యోగులు తెల్లవారుజామున నల్లజెండాలు ఎగురవేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 5, 6 దశల సీఈ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయంపై నల్లజెండా ఎగురవేశారు. తెలంగాణవాదులు మున్సిపల్ కార్యాలయంపై నల్లజెండా ఆవిష్కరించారు.
భద్రాచలంలో టీఎన్‌జీవోస్ కార్యాలయంలో టీజేఏసీ ఉద్యోగులు, నాయకులు నల్లజెండా ఎగురవేసి, నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన దినంగా పాటించారు. టీఆర్‌ఎస్ నాయకులు బ్యాంక్ రోడ్డులో నల్లజెండాను ఎగురవేసి తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. వాజేడులో టీఎన్‌జీవోస్ ఉద్యోగులు, టీఆర్‌ఎస్ నాయకులు నల్లజెండాను ఎగురవేశారు. అనంతరం అర్ధనగ్నంగా మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఇల్లెందులో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత మున్సిపల్, తహశీల్దార్ కార్యాలయాలపై నల్లజెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, టీజేఏసీ డివిజన్ చైర్మన్ పి.అప్పారావు మాట్లాడుతూ.. అధిష్టానం మాటను ఖాతరు చేయని సీఎంను ఆ పదవిలో కొనసాగించటం కాంగ్రెస్‌కు ఎంతమాత్రం భావ్యం కాదన్నారు.
అశ్వారావుపేటలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్‌ఎస్ నాయకులు ముబారక్ బాబా నల్లజెండా ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. నల్లరిబ్బన్‌లు ధరించారు. వ్యవసాయ కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన సభ నిర్వహించారు. దమ్మపేట, చండ్రుగొండలో టీఆర్‌ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో నల్లజెండా ఎగురవేశారు.
మణుగూరులో తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో నల్లజెండాలు ఆవిష్కరించి నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు దుస్సా సమ్మయ్య, నాగుల్‌మీరా, చంద్రమౌళి, రమేష్, ఎడ్ల శ్రీనివాస్, వనమా లక్ష్మీనారాయణ, ఉదయరాఘవేందర్, నాగేశ్వరరావు, రఫీక్‌పాషా పాల్గొన్నారు.
మధిరలో జెఏసీ ఆధ్వర్యంలో ఆర్‌వీ కాంప్లెక్స్ వద్ద నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. ఎర్రుపాలెంలోని రింగ్‌సెంటర్‌లో జెఏసీ ఆధ్వర్యంలో నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొన్నారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కోట రవికుమార్ పాల్గొన్నారు.
పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలపై నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. నేలకొండపల్లి తహశీల్దార్ కార్యాలయంపై తెలంగాణవాదులు నల్లజెండా ఎగురవేశారు. వెంటనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలంలో రా్రష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు నల్లజెండాలు ఎగరవేశారు. కారేపల్లి సెంటర్‌లో మానవహారం నిర్మించారు.
బ్లాక్ డే.. నిరసన వెల్లువ
Published Sat, Nov 2 2013 3:12 AM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM
Advertisement
Advertisement