సింగపూర్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు
► హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి పరిరక్షణలో విదేశాల్లో స్థిరపడిన తెలంగాణవాసులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్‌ఎస్) ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సింగపూర్‌లోని డోవర్ పాలిటెక్నిక్ కన్వెన్షన్ సెంటర్‌లో టీసీఎస్‌ఎస్ అధ్యక్షుడు బండ మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రవాస తెలంగాణవాసుల సూచనలు, సలహాలు, సహకారం తీసుకుంటామన్నారు.
సింగపూర్‌లో స్థిరపడిన తెలంగాణవాసులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ వేడుకలను నిర్వహించడంపై టీసీఎస్‌ఎస్ కార్యవర్గాన్ని అభినందించారు. సుమారు వేయి మందికి పైగా హాజరైన వేడుకల్లో గాయకులు వందేమాతరం శ్రీనివాస్, స్వర్ణక్క, నటులు వేణు, ధనరాజ్ తమ ఆటపాటలతో అలరించారు.
వేడుకల్లో ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, వేముల వీరేశం, నల్గొండ జడ్పీ ఛైర్మన్ బాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు. సొసైటీ ఉపాధ్యక్షులు బూర్ల శ్రీనివాస్, పెద్ది చంద్రశేఖర్‌రెడ్డి, నీలం మహేందర్, ముద్దం అశోక్, గౌరవ కార్యదర్శి బసిక ప్రశాంత్‌రెడ్డి, కోశాధికారి గడప రమేశ్, ప్రాంతీయ కార్యదర్శులు ఎల్లారెడ్డి, దుర్గా ప్రసాద్, అలసాని కృష్ణారెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.