ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎంసెట్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉద యం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగే ఎంసెట్ పరీక్షకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49,024 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఇందులో 29,608 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు హాజరుకానుండగా.. 19,416 మంది విద్యార్థు లు మెడిసిన్ పరీక్ష రాయనున్నారు. ఇందుకు యంత్రాంగం జిల్లా వ్యాప్తం గా 82 పరీక్షా కేంద్రాలను గుర్తించి ఏర్పాట్లు పూర్తిచేసింది.
ఇందులో గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం వికారాబాద్‌లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో 80 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 48 పరీక్షా కేంద్రాల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష, 34 కేంద్రాల్లో మెడిసిన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు మెడిసిన్ పరీక్ష జరుగుతుందని, విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ రఘునందన్‌రావు సూచించారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం వికారాబాద్‌లోని జిల్లా శిక్షణ కేంద్రంలో (డీటీసీ) వసతి ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బందు లు కలగకుండా జిల్లా స్థాయిలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశామని, 1800 425 0817 నంబర్‌కు ఫోన్‌చేయాలని సూచించారు.
వికారాబాద్‌లో రెండు సెంటర్లు
వికారాబాద్ రూరల్: వికారాబాద్‌లోని అనంతపద్మనాభ స్వామి కళాశాల, న్యూ నాగార్జున్ హై స్కూల్‌లలో గురువారం ఎంసెట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయా కేంద్రాల్లో మొత్తం 2,197 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,266 మంది, అగ్రికల్చరల్, మెడికల్ విభాగాల్లో 931 మంది హాజరు కానున్నారన్నారు. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. మెడికల్, అగ్రికల్చరల్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ఉంటాయి.
పరీక్ష కేంద్రానికి విద్యార్థులు గంట ముందే చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. విద్యార్థులు వచ్చేటప్పుడు హాల్ టికెట్, అప్లికేషన్ ఫారం, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కులం సర్టిఫికేట్ తీసుకురావాలని ఎస్‌ఏపీ కళాశాల ప్రిన్సిపాల్, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ దత్తాత్రేయరెడ్డి సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రెండు సెంటర్లలో అన్ని ఏర్పాటు పూర్తి చేశామని ఆయన తెలిపారు. సెల్‌ఫోన్లు, చేతి గడియారాలు, ఇతర ఎలాంటి వస్తువులు పెట్టుకురావద్దన్నారు. పరీక్ష కేంద్రంలో గడియారం ఏర్పాటు చేసినట్లు దత్తాత్రేయరెడ్డి చెప్పారు.