మెదక్ టౌన్/ మెదక్ మున్సిపాలిటీ/ సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్ : ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్ష (ఎంసెట్-2014) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని మెదక్, సిద్దిపేట పట్టణాల్లోని 8 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్‌లకు కలిపి మొత్తం 5,107 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 3016 కాగా, మెడిసిన్, అగ్రికల్చర్ విభాగంలో 2091 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
పరీక్ష సమయం
ఇంజనీరింగ్ విభాగం పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెడిసిన్, అగ్రికల్చర్ విభాగం పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోని అనుమతి ఉంటుందని, అందువల్ల విద్యార్థులంతా నిర్దిష్ట సమయం కన్నా ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు చెబుతున్నారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తోపాటు బాల్‌పాయింట్ పెన్ మాత్రమే వెంట తెచ్చుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పూర్తిచేసిన ఆన్‌లైన్ ఫారంతోపాటు గెజిటెడ్ అధికారి సంతకం చేసిన కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీ వెంట తెచ్చుకోవాలన్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు
ఎంసెట్-2014 ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎంసెట్ మెదక్ కో ఆర్డినేటర్ సుబ్బారాయుడు, సిద్దిపేట కోఆర్డినేటర్ నాగేశ్వర్‌రావు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా..పరీక్ష కేంద్రంలోని అనుమతించబోమన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. అభ్యర్థుల సంఖ్యకనుగుణంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటికనుగుణంగా ఇన్విజిలేటర్లను నియమించినట్లు చెప్పారు.
నేడే ఎంసెట్
Published Wed, May 21 2014 11:59 PM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM
Advertisement
Advertisement