మెదక్/ సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: మెడిసిన్, ఇంజనీరింగ్ ప్రవేశపరీక్ష (ఎంసెట్-2014) పరీక్ష గురువారం జిల్లాలోని సిద్దిపేట, మెదక్ పట్టణాల్లో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 5,107 మంది విద్యార్థులకు గాను వివిధ కారణాలతో 336 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ‘ఒక్క నిమిషం’ నిబంధనతో మెదక్‌లో ఇద్దరు, సిద్దిపేటలో ఓ విద్యార్థి పరీక్ష రాయలేకపోయారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించగా, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసిన్, అగ్రికల్చర్ విభాగం ప్రవేశపరీక్ష నిర్వహించారు.
ఆశనిపాతంగా మారిన నిబంధనలు
అప్లికేషన్ దరఖాస్తులు మరిచి వచ్చిన అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారాన్ని, గెజిటెడ్ అధికారితో సం తకం చేసిన కుల ధ్రువీకరణ పత్రం(ఎస్సీ, ఎస్టీలకు) తప్పకుండా తీసుకురావాలన్న నిబంధనతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఒక్క నిమిషం నిబంధనతో విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ఆలస్యమవుతుందన్న ఆందోళనతో ఉరుకులు పరుగులు పెట్టడం కనిపించింది.
‘ఒక్క నిమిషానికి’ ముగ్గురు ఔట్
ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమన్న నిబంధనతో జిల్లాలో ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్ కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన అందోల్‌కు చెందిన మమత, పటాన్‌చెరుకు చెందిన అనిల్‌లు పరీక్ష రాయకుండనే వెనుదిరిగారు. ఇక సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రానికి కొన్ని నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఓ విద్యార్థిని పరీక్ష రాయలేకపోయారు.
పకడ్బందీ ఏర్పాట్లు
ఎంసెట్ పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలూ తీసుకున్నారు. తాగునీటి సౌకర్యంతో పాటు విద్యార్థులతో కలిసి పరీక్ష కేంద్రాలకు వచ్చిన తల్లిదండ్రుల కోసం షామియానాలు ఏర్పాటు చేశారు. దూరప్రాంతాల విద్యార్థులంతా గురువారం రాత్రికే మెదక్, సిద్దిపేట పట్టణాలకు చోరుకోగా, మరికొందరు విద్యార్థులు గురువారం ఉదయమే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.
ఎంసెట్ ప్రశాంతం
Published Thu, May 22 2014 11:51 PM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM
Advertisement
Advertisement