సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో వచ్చే జూన్‌లో పాఠశాలలు ప్రారంభించడం అసాధ్యమని, అలాగని విద్యార్థులను ఖాళీగా ఉంచడం సరికాదని రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజ మాన్యాలు పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్ విద్యే ఉత్తమమైన ప్రత్యామ్నాయ మార్గమని అంటున్నాయి. అందుకే కొత్త విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆన్‌లైన్ విద్యను తప్పనిసరి చేయాలని, తద్వారా జూన్‌లో అకడమిక్ ఇయర్‌ను ప్రారంభించవచ్చని వెల్లడించాయి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు ఓ నివేదికను అందజేశాయి. మరోవైపు లాక్‌డౌన్ తర్వాత భౌతిక దూరం పాటించేలా షిఫ్ట్ పద్ధతిలో పాఠశాలలను నిర్వహించడం మేలని కేంద్ర మంత్రి వివరించినట్లు ఓ ప్రైవేటు విద్యా సంస్థ చైర్మన్ వెల్లడించారు. ఆ నివేదికలోని ప్రధానాంశాలు..
(చదవండి: వైరస్పై యుద్ధం.. ఇలా చేద్దాం)
ఆన్‌లైన్ విద్యా బోధనతో ప్రయోజనాలు..
సాంకేతిక పరిజ్ఞానంపై కొంత అవగాహన కలిగిన వారు దీనిని అనుసరించడం సులభం. వినే అలవాటు ఎక్కువగా ఉన్న వారికి దీంతో ఉపయోగకరమే. టెక్నాలజీ ఫీచర్స్, యూట్యూబ్, పీపీటీ, ఆన్‌లైన్ బోధన, డిజిటల్ పాఠాలు, రికార్డ్ చేసిన టెలివిజన్, రేడియో పాఠాలను అందించవచ్చు. ఆన్‌లైన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు అడగటం, సందేహాలను నివృత్తి చేయడం, పాఠ్యాంశాన్ని వివరించవచ్చు. అభ్యాసం, వర్క్‌షీట్లు, ప్రాజెక్ట్స్, హోంవర్క్ ఇవ్వొచ్చు. టెక్నాలజీ ద్వారా మొత్తం ప్రక్రియను వర్చువల్ క్లాస్‌రూమ్‌గా మార్చవచ్చు.
ప్రతికూలతలేంటంటే..
టీచర్, విద్యార్థి మధ్య భావోద్వేగ, వ్యక్తిగత అనుసంధానం పోతుంది. అభ్యసన ఇంట్రెస్టింగ్‌గా ఉండకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ సమస్యలు, ఇంటర్నెట్ సమస్యలు ఇబ్బందికరంగా మారవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించినా ఇంటరాక్షన్ కొంత ఇబ్బందికరం కావచ్చు.
అయినా అనుమతించాలి.
ఆన్‌లైన్ విద్యలో కొన్ని ప్రతికూలతలున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్ బోధనకు సిద్ధంగా ఉన్న పాఠశాలలను జూన్ నుంచి తరగతులను నిర్వహించేందుకు అనుమతించాలి. ఇప్పటికే జాతీయ ఉపాధ్యాయ విద్యా శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ), రాష్ట్ర ఉపాధ్యాయ విద్యా శిక్షణ మండలి (ఎస్‌జీఈఆర్‌టీ) ఆన్‌లైన్ కంటెంట్‌ను, డిజిటల్ పాఠాలను రూపొందించాయి. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు స్కూళ్లు వీటిని ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఇందుకు ప్రభుత్వం రంగంలో డీడీ జ్ఞాన్, డీడీ నేషనల్, డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి, టీ–శాట్ వంటి టెలివిజన్ చానెళ్లు ఉన్నాయి.
అయితే టీచర్లు ఎక్కువగా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాదు స్వచ్ఛందంగానే బోధించడం, నేర్చుకోవడం ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే టీవీ చానెల్స్, లోకల్ కేబుల్ టీవీ చానెల్స్, మొబైల్స్, టాబ్స్ ద్వారా బోధన అందించవచ్చు. అలాగే పట్టణ ప్రాంతాల్లో మొబైల్స్, ట్యాబ్స్‌తోపాటు వర్చువల్ క్లాస్‌రూమ్స్, గూగుల్ మీట్, క్లాస్‌రూమ్, మైక్రోసాఫ్ట్ టీం, స్కైప్ వంటి యాప్‌ల ద్వారా, కంప్యూటర్, డెస్క్‌టాప్ ద్వారా కూడా బోధన నిర్వహించవచ్చు.
ఆన్‌లైన్ బోధన కోసం ప్రత్యేక కార్యాచరణ అవసరం..
సాంకేతిక వినియోగం, ఆన్‌లైన్లో పాఠాల బోధనపై టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. ఆన్‌లైన్‌లో బోధనకు అవసరమైన పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేయాలి. డెమో సెషన్స్ నిర్వహించాలి. ఆన్‌లైన్ పాఠాలు, డిజిటల్ పాఠాలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. వర్క్‌షీట్స్, అసెస్‌మెంట్ టూల్స్ సిద్ధం చేయాలి. ఆన్‌లైన్‌లో హోంవర్క్ ఇవ్వడం, వాటిని ఆన్‌లైన్‌లో పరిశీలించాలి. టీచర్లు, పిల్లలు, తల్లిదండ్రుల నుంచి రోజువారీగా అభిప్రాయాన్ని తీసుకోవాలి. వీటిన్నింటిపై కనీసంగా జూలై 31వ వరకు సిద్ధం కావాలి.
లాక్‌డౌన్ ఎత్తేశాక 50 శాతం పిల్లలతోనే..
లాక్‌డౌన్ ఎత్తేశాక భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. 50 శాతం పిల్లలతోనే పాఠశాలలను కొనసాగించాలి. అధ్యాపకులను కూడా అలాగే విభజించాలి.
కరోనా విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌లు ధరించడం, శానిటైజర్‌తో తరచూ చేతులు శుభ్రం చేసుకునేలా చర్యలు చేపట్టాలి. 50 ఎస్‌ఎఫ్టీ కలిగిన ప్రతి తరగతి గదిలో 20 మందికి మించకుండా చూడాలి. విద్యార్థులను రెండు సెక్షన్లుగా విభజించాలి. తరగతుల విభజన చేసి రెండు షిప్ట్‌లలో పాఠశాలను కొనసాగించాలి. ఈ క్రమంలో కొన్ని సమస్యలున్నా క్రమంగా వాటిని అధిగమించవచ్చు. లేదంటే మూడ్రోజులు తరగతి గదిలో బోధన, మూడ్రోజులు ఆన్‌లైన్ బోధన చేపట్టేలా చర్యలు తీసుకోవాలి.
చేపట్టాల్సిన భద్రతా చర్యలు..
పాఠశాలల్లో, రవాణా సమయంలో భౌతిక దూరం పాటించేలా చూడాలి. ప్రతి రెండు గంటలకోసారి పాఠశాల తరగతి గదులు, వాష్‌రూమ్‌లు, కారిడార్లు, ల్యాబ్‌లు, లైబ్రరీ, తలుపులు, కిటికీలను కెమికల్స్‌తో శానిటైజ్ చేయాలి. మాస్క్‌లు ధరించడం, చేతులకు గ్లౌజులు వేసుకోవడం, హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. మొబైల్ వైద్య సేవలను అందించాలి. తీవ్రమైన దగ్గు, తుమ్ములు లేదా జ్వరం వచ్చినప్పుడు తక్షణ పరీక్షల కోసం ఏర్పాట్లు చేయాలి. విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం అందించాలి. పాఠశాలల్లో కోవిడ్ సూపర్‌వైజర్‌ను నియమించాలి. సర్టిఫైడ్ కౌన్సెలర్లను నియమించాలి.
(చదవండి: స్వల్ప లక్షణాలుంటే హోం ఐసోలేషన్)
Comments
Please login to add a commentAdd a comment