న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10, 12 తరగతులకు సంబంధించిన పరీక్షల వివరాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ బుధవారం వెల్లడించారు. ఆయా తరగతుల్లో అతి ముఖ్యమైన 29 సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు పెట్టేలా సీబీఎస్‌ఈకి మంత్రి రమేశ్ సూచించారు. పరీక్షలు పెట్టదగ్గ సమయం వచ్చినప్పుడు పరీక్షలు ఉంటాయని అయితే అది కేవలం ఆ 29 సబ్జెక్టులకు మాత్రమే ఉంటాయన్నారు. మిగిలిన సబ్జెక్టులకు పరీక్షలుగానీ, మార్కులుగానీ ఉండవని తెలిపారు.
1–8 క్లాసుల విద్యార్థులు ప్రమోట్!
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో 1–8 తరగతులు చదువుతున్న విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ)కి సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా బుధవారం వెల్లడించారు.
ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు
కొత్త తేదీలు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ).. వివిధ ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును పొడిగించింది. కొన్నింటిని ఈనెల 30 వరకు, కొన్ని పరీక్షలకు వచ్చే నెల 15, 16, 31 తేదీల వరకు గడువును పెంచింది.
- మార్చి 31తో ముగిసిన నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జేఈఈ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 30 వరకు పొడిగించారు.
- ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ పీహెచ్‌డీ, ఎంబీఏ ప్రవేవేశాలకు నిర్వహించాల్సిన అడ్మిషన్ టెస్టు దరఖాస్తుల స్వీకరణ గడువు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, జేఎన్‌యూ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు కూడా ఈనెల 30 వరకు పొడిగించారు.
- యూజీసీ నెట్ (జూన్) దరఖాస్తుల గడువును మే 16కి పొడిగించారు.
- సీఎస్‌ఐఆర్ నెట్ దరఖాస్తుల గడువు మే 15కి, ఆల్‌ఇండియా ఆయుష్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్టు (ఏఐఏపీజీఈటీ) దరఖాస్తు గడువును మే 31కి పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment