ACET 2021: Notification, Registration, Exam Date, Syllabus, Admit Card, Preparation Tips - Sakshi
Sakshi News home page

ACET 2021: నిత్యనూతనం.. యాక్చూరియల్‌ సైన్స్‌!

Published Thu, May 13 2021 3:31 PM | Last Updated on Thu, May 13 2021 6:12 PM

ACET 2021: Notification, Registration, Exam Date, Syllabus, Admit Card, Preparation Tips - Sakshi

ఇంటర్మీడియెట్‌ పూర్తి చేయబోతున్నారా.. ఆర్థిక గణాంకాలంటే మక్కువ ఉందా.. ఉజ్వల కెరీర్‌ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా..! అయితే మీకు సరైన మార్గం.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చుయరీస్‌ ఆఫ్‌ ఇండియా(ఐఏఐ) నిర్వహించే.. యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏసెట్‌)! ఈ పరీక్షలో.. విజయం సాధిస్తే.. భవిష్యత్తులో బీమా రంగంలో చక్కటి కొలువులు దక్కించుకోవచ్చు. బీమా సంస్థల్లో ఎంతో కీలకంగా నిలిచే.. యాక్చూరియల్‌ విభాగంలో ఉన్నత ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. తాజాగా ఐఏఐ.. ఏసెట్‌–2021 జూన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఏసెట్‌ పరీక్ష విధానం, యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సులు, కెరీర్‌ స్కోప్‌పై ప్రత్యేక కథనం...  

బీమా రంగంలో యాక్చుయరీ అత్యంత కీలకమైన విభాగం. ఏదైనా ఒక పాలసీని ప్రవేశ పెట్టే క్రమంలో ప్రీమియాన్ని నిర్ణయించడం, వయో వర్గాల వారీగా పాలసీ గడువు, మెచ్యూరిటీ సమయంలో చెల్లించాల్సిన మొత్తాలు వంటి అంశాలను నిర్ణయించే విభాగమే..యాక్చుయరీ. ఈ విభాగం లో కొలువులు సొంతం చేసుకోవాలంటే.. బ్యాచిలర్, పీజీ స్థాయిలో యాక్చూరియల్‌ సైన్స్‌ స్పెషలైజేషన్‌ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చుయరీస్‌ ఆఫ్‌ ఇండియా(ఐఏఐ)లో రిజిస్ట్రేషన్‌ ద్వారా ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే ఇందుకు మార్గం వేసుకునే అవకాశం ఉంది.

ఐఏఐ అంటే
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చుయరీస్‌ ఆఫ్‌ ఇండియా(ఐఏఐ).. యాక్చుయరీ విభాగంలో నిపుణులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థ ఇది. ఐఏఐ స్వయం ప్రతిపత్తి సంస్థ. ఈ సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది. ఐఏఐ యాక్చుయరీ నిపుణలను తీర్చిదిద్దే క్రమంలో మొత్తం మూడు దశల్లో కోర్సును అందిస్తుంది. అవి.. స్టూడెంట్‌ మెంబర్‌షిప్‌ ప్రోగ్రామ్‌, అసోసియేట్‌ మెంబర్‌షిప్‌ ప్రోగ్రామ్‌, ఫెలో మెంబర్‌షిప్‌ ప్రోగ్రా మ్‌. ఈ మూడు దశల ప్రోగ్రామ్‌లను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అంతర్జాతీయ స్థాయిలో బీమా రంగంలో ఉజ్వల అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు. 


తొలి దశ.. స్టూడెంట్‌ మెంబర్‌షిప్‌
యాక్చుయరీస్‌ ఆఫ్‌ ఇండియా అందించే మూ డు మెంబర్‌షిప్‌ హోదాల్లో.. ముందుగా స్టూడెంట్‌ మెంబర్‌గా గుర్తింపు పొందాలి. ఇందుకోసం ఈ సంస్థ ఏటా రెండుసార్లు నిర్వహించే యాక్చురియల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏసెట్‌)లో ఉత్తీర్ణత సాధించాలి. 70 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు–వంద మార్కులకు రెండు విభాగాలుగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విభాగంలో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌; రెండో విభాగంలో ఇంగ్లిష్, లాజికల్‌ రీజనింగ్‌ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. కనీసం 50 శాతం మార్కులు వస్తే ఏసెట్‌లో అర్హత సాధించినట్టు భావిస్తారు. 

ఏసెట్‌ తర్వాత దశలు
► ఏసీఈటీ(ఏసెట్‌) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు.. ఐఏఐ నాలుగు దశల్లో ఆయా సబ్జెక్ట్‌లలో నిర్వహించే పరీక్షలకు హాజరుకావచ్చు. 

► స్టేజ్‌–1: కోర్‌ టెక్నికల్‌: ఇందులో యాక్చురియల్‌ స్టాటిస్టిక్స్, యాక్చురియల్‌ మ్యాథమెటిక్స్, యాక్చురియల్‌ బిజినెస్‌ విభాగాల నుంచి తొమ్మిది పేపర్లు ఉంటాయి.

► స్టేజ్‌–2: కోర్‌ అప్లికేషన్‌: ఈ దశలో యాక్చురియల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌; మోడల్‌ డాక్యుమెంటేషన్‌ అనాలిసిస్‌ అండ్‌ రిపోర్టింగ్‌; కమ్యూనికేషన్‌ ప్రాక్టీస్‌ పేపర్లలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.

► స్టేజ్‌–3: స్పెషలిస్ట్‌ టెక్నిషియన్‌: ఈ దశలో ఎనిమిది పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు ఎనిమిది పేపర్లలో ఏవైనా రెండు పేపర్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది. 

► స్టేజ్‌–4: స్పెషలిస్ట్‌ అప్లికేషన్‌: యాక్చురియల్‌ సైన్స్‌కు సంబంధించి నిర్వహించే చివరి దశ ఇది. ఇందులో ఆరు పేపర్లు ఉంటాయి. వీటిల్లో ఉత్తీర్ణత సా«ధిస్తే.. ఐఏఐ యాక్చురియల్‌ సైన్స్‌ కోర్సు పూర్తి చేసినట్లే. 
స్టేజ్‌–1, 2లు పూర్తి చేసుకుంటే.. 

అసోసియేట్‌ మెంబర్‌
► ఏసెట్‌లో అర్హత సాధించి.. స్టూడెంట్‌ మెంబర్‌ హోదా సొంతం చేసుకొని.. ఆ తర్వాత నిర్వహించే స్టేజ్‌–1, స్టేజ్‌–2 పరీక్షలు ఉత్తీర్ణులైతే అసోసియేట్‌ మెంబర్‌గా గుర్తింపు లభిస్తుంది. 

► స్టేజ్‌–3, స్టేజ్‌–4లకు సంబంధించిన పేపర్లలోనూ ఉత్తీర్ణత సాధించి.. మొత్తం నాలుగు దశలూ పూర్తి చేసుకొని.. మూడేళ్ల పని అనుభవం గడిస్తే ఫెలో మెంబర్‌ హోదా దక్కుతుంది.


కామర్స్, మ్యాథ్స్‌–అనుకూలం
యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సులోని పేపర్లు, టాపిక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది కామర్స్, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌లు చదివిన వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ విభాగంలో నిర్వహించాల్సిన విధులన్నీ గణాంకాలు, నిధుల విశ్లేషణకు సంబంధించి ఉండటమే ఇందుకు కారణం. డిగ్రీ స్థాయిలో బీకాం, బీఎస్సీ, బీటెక్‌ చదివిన అభ్యర్థులు; పీజీ స్థాయిలో ఎంబీఏ, ఎంటెక్‌ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ విభాగంలో ప్రవేశించే అవకాశం ఉంది.

విస్తృత అవకాశాలు
ప్రస్తుతం యాక్చూరియల్‌ విభాగంలో దేశంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. దాంతో అసోసియేట్‌ మెంబర్‌షిప్‌ సర్టిఫికెట్‌తోనే చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. అసోసియేట్‌ మెంబర్‌ హోదా పొందిన వారికి బీమా రంగ సంస్థలు ప్రారంభంలోనే సగటున రూ.8లక్షల వార్షిక వేతనంతో కొలువులు అందిస్తున్నాయి. అన్ని దశలు పూర్తి చేసుకున్న వారికి బీమా రంగంలో యాక్చుయరీ విభాగంలో విస్తృత కొలువులు అందుబాటులో ఉన్నాయి. యాక్చూరియల్‌ సైన్స్‌లో సర్టిఫికెట్‌తో బీమారంగ సంస్థల్లో యాక్చుయరీ స్పెషలిస్ట్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్, అండర్‌ రైటర్స్, అనలిస్ట్‌ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరికి ప్రారంభంలోనే దాదాపు రూ.పది లక్షల వరకూ వార్షిక వేతనం అందుతోంది. 

యాక్చుయరీస్‌ విధులు
బీమా సంస్థల్లో యాక్చురియల్‌ విభాగంలో చేరిన వారు.. నూతన పాలసీలను రూపొందించడం, వినియోగదారులకు ఇవ్వాల్సిన వడ్డీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్, బీమా కంపెనీల ఆర్థిక ప్రణాళికకు సంబంధించి రిస్క్‌ను ముందుగానే అంచనా వేయడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఒక పాలసీని ప్రవేశ పెట్టే ముందు సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని.. సదరు పాలసీ సరైందా.. దాన్ని ప్రవేశ పెట్టొచ్చా.. అనే అంశాలను కూడా గుర్తించి.. సంస్థ యాజమాన్యానికి తగిన సలహాలు, సూచనలు అందించాలి.

ప్రధాన ఉపాధి వేదికలు
యాక్చుయరీ విభాగంలో ఐఏఐ సర్టిఫికేషన్‌ సొంతం చేసుకున్న వారికి లైఫ్‌ ఇన్సూరెన్స్, హెల్త్‌ ఇన్సూరెన్స్, జనరల్‌ ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఎంటర్‌ప్రైజ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, రెగ్యులేటరీ, రీ–ఇన్సూరెన్స్‌ కంపెనీలు, కన్సల్టింగ్‌ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. అదే విధంగా అకౌంటింగ్‌ సంస్థలు, ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్స్, క్రెడిట్‌ రిస్క్‌ అండ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, స్టాక్‌ మార్కెట్లు, సోషల్‌ సెక్యూరిటీ స్కీంల్లోనూ వీరు కన్సల్టెంట్లుగా పనిచేయొచ్చు. ప్రొడక్ట్‌ అనలిస్ట్, యాక్చూరియల్‌ అనలిస్ట్, రిస్క్‌ అనలిస్ట్‌ హోదాలతో బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థలు, బిజినెస్‌ కన్సల్టెన్సీలు, ప్రభుత్వ విభాగాల్లోనూ ఉద్యోగా లుంటాయి. 

నాన్‌–ఏసీఈటీ విధానం
ఐఏఐ ఇంటర్మీడియెట్‌ అర్హతగా నిర్వహించే ఏసెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా ఈ కోర్సులోని దశలకు నమోదు చేసుకునే అవకాశంతోపాటు.. నాన్‌–ఏసీఈటీ విధానం కూడా అమలవుతోంది. సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ కోర్సుల ఉత్తీర్ణులు, ఎంబీఏ (ఫైనాన్స్‌ స్పెషలైజేషన్‌) ఉత్తీర్ణులు, గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి బీఏ/ ఎమ్మెస్సీలో యాక్చురియల్‌ సైన్స్‌ ఉత్తీర్ణులు, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులు నేరుగా స్టూడెంట్‌ మెంబర్‌షిప్‌ హోదాకు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించే బ్యాచిలర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ లేదా మ్యాథమెటిక్స్‌; అదే విధంగా పీజీ స్థాయిలోని ఎంస్టాట్, మ్యాథమెటిక్స్‌ స్పెషలైజేషన్‌ ఉత్తీర్ణులు కూడా నేరుగా స్టూడెంట్‌ మెంబర్‌షిప్‌ హోదాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.

జూన్‌ 2021కు నోటిఫికేషన్‌
► యాక్చూరియల్‌ సైన్స్‌ విభాగంలో అడుగు పెట్టడానికి తొలి దశగా పేర్కొంటున్న ఏసెట్‌ పరీక్ష– 2021 జూన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షను జూన్‌ 26న నిర్వహించనున్నారు. ఈ ఏడాది అభ్యర్థులు ఇంటి నుంచే ఆన్‌లైన్‌ విధానంలో ఏసెట్‌కు హాజరయ్యే అవకాశం కల్పించారు. 

► అర్హత: ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
► ఏసెట్‌ దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 2, 2021
► పరీక్ష తేదీ: జూన్‌ 26, 2021
► ఫలితాల వెల్లడి: జూలై 3, 2021
► పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:  http://www.actuariesindia.org/index.aspx

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement