
నేను ఏ బ్రాంచిలో చేరాలి?
ఎంసెట్ ర్యాంకులు రానే వచ్చాయి! ఇక భావి కెరీర్‌కు దారిచూపే ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్‌లోసెట్ కావాలి? స్నేహితుల మాటలు.. తల్లిదండ్రులు, బంధువుల సూచనలు.. వీటన్నింటినీ శోధించి, చివరిగా తీసుకునే నిర్ణయంపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. భవితను బంగారుమయం చేసే ఓ మంచి నిర్ణయం తీసుకునేందుకు ఉపయోగపడే మార్గదర్శకాలపై
ఫోకస్..
ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునేందుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు:
ఉన్నత విద్య: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్య ఉన్నతంగా ఉంటేనే అత్యున్నత అవకాశాలు చేజిక్కుతాయి. పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాకే, కెరీర్‌లోకి అడుగుపెట్టాలనుకుంటే దానికోసం ఉన్న అవకాశాల గురించి ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని సబ్జెక్టుల్లో పీజీ పూర్తిచేసేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు బ్యాచిలర్ స్థాయిలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేరితే మ్యానుఫ్యాక్చరింగ్ వంటి కోర్ స్పెషలైజేషన్‌ల్లోనే కాకుండా రోబోటిక్స్, ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ వంటి ఇతర స్పెషలైజేషన్లలోనూ పీజీ చేసేందుకు అవకాశముంటుంది. అదే బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో చేరితే తర్వాత పీజీ చేసేందుకు అవకాశాలు పరిమితంగా ఉంటాయి.
ఉద్యోగావకాశాలు: ఏ బ్రాంచ్‌లో చేరినా, చివరికి మంచి ఉద్యోగం లభించడమే లక్ష్యం. అందువల్ల బ్రాంచ్ ఎంపికలో ఉద్యోగావకాశాలు అనేది కీలక అంశమని చెప్పొచ్చు. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ వంటి బ్రాంచ్‌లు అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు కల్పించేవిగా ఉన్నాయి. చాలామంది వీటికి తొలి ప్రాధాన్యం ఇస్తుండటానికి ఇదే కారణం. దీనర్థం ఉద్యోగావకాశాల పరంగా చూస్తే మిగిలిన బ్రాంచ్‌లు తక్కువని కాదు. ప్రస్తుతం ఏ బ్రాంచ్ తీసుకున్నా ఉద్యోగావకాశాలకు కొదవలేదు. కాకపోతే విద్యార్థి ఆయా నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. ప్రతిభ, సరైన నైపుణ్యాలు లేకుంటే.. ఆయా బ్రాంచ్‌కు సంబంధించి జాబ్ మార్కెట్‌లో ఎన్ని అవకాశాలు ఉన్నా లాభం లేదు!
వేతనాలు: సాధారణంగా వేతనం అనేది వ్యక్తిగత ప్రతిభపై తప్ప ఇంజనీరింగ్ బ్రాంచ్‌పై ఆధారపడదని చెప్పొచ్చు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు మాత్రమే అత్యధిక వేతనాలు అందుతున్నాయనే భావన ఉంది. ఇది వాస్తవం కాదు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అందరికీ అత్యధిక వేతనాలు అందవు, కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ప్రొడక్షన్ తదితర ఇంజనీర్లకు కూడా ఆకర్షణీయ పే ప్యాకేజీలు అందుతున్నాయి. ఏ బ్రాంచ్ వారైనప్పటికీ వ్యక్తిగత ప్రతిభ, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే మంచి వేతనాలు అందుతాయని కచ్చితంగా చెప్పొచ్చు. తల్లిదండ్రుల ఒత్తిడి: తల్లిదండ్రులు ఉద్యోగావకాశాలు, వేతనాలు బాగుండే బ్రాంచ్‌ల్లో చేరాలంటూ తమ పిల్లలపై ఒత్తిడి తేకూడదు. పిల్లల ఇష్టాయిష్టాలతో పనిలేకుండా ఫలానా బ్రాంచ్‌లోనే చేరాలంటూ పట్టుపట్టకూడదు.
అభిరుచి: బ్రాంచ్ ఎంపికలో అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశం విద్యార్థి అభిరుచి. కానీ, దీన్ని చాలా మంది తల్లిదండ్రులు, విద్యార్థులు విస్మరిస్తుంటారు. ఇప్పుడు ఎంపిక చేసుకున్న బ్రాంచ్‌లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ పూర్తిచేశాక, జీవితాంతం సంబంధిత రంగంతో అనుబంధం ఉంటుంది. ఇంతటి కీలకమైన బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు విద్యార్థులు తమ అభిరుచికి ప్రాధాన్యం ఇవ్వాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆసక్తిని గౌరవించి, ప్రోత్సహించాలి. ఆసక్తి లేని రంగంలో ఎవరూ రాణించలేరన్న వాస్తవాన్ని గుర్తించాలి. ఇష్టమైన రంగంలో నిర్దేశించుకున్న లక్ష్యాల్ని తేలిగ్గా చేరుకోగలరు.
శోధించి, నిర్ణయించు
ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునే ముందు.. సంబంధిత బ్రాంచ్ తాలూకు ప్రస్తుత ధోరణి ఎలా ఉందో ఇంటర్నెట్ సహాయంతో తెలుసుకోవాలి. బ్రాంచ్‌ల సబ్జెక్టులు; దేశ, విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు వంటి వాటిపై అవగాహన పెంపొందించుకొని తుది నిర్ణయం తీసుకోవాలి. అభిరుచికి, వ్యక్తిగత సామర్థ్యానికి దగ్గరగా ఉన్న బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలి.
మీరు ఏ బ్రాంచ్‌కు సరైనవారు?
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్:
మీరు కంప్యూటర్‌పై (సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్) ఆసక్తి కనబరుస్తున్నారా?
పజిల్స్‌ను వీలైనంత త్వరగా సాధించడం మీకిష్టమా?
మీకు మ్యాథమెటికల్, అనలిటికల్/ లాజిక్ నైపుణ్యాలున్నాయా?
మీకు మంచి ప్రజ్ఞా సూచి (ఐక్యూ) ఉందా?
పై ప్రశ్నల్లో ఎక్కువ వాటికి మీ సమాధానం అవును అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌కు మీరు సరిపోతారు. ఈ బ్రాంచ్‌లో రాణించేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో అవే నైపుణ్యాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచి విద్యార్థులకూ అవసరం. సిలబస్‌లో రెండు బ్రాంచ్‌ల మధ్య స్వల్ప తేడా ఉంటుంది. ప్లేస్‌మెంట్స్, ఉద్యోగావకాశాలు, వేతనాల విషయంలో రెండింటికీ మధ్య పెద్ద తేడా ఉండదు.
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
మీరెప్పుడైనా కాలిక్యులేటర్‌ను తెరిచి, దాని పనితీరు గురించి తెలుసుకోవాలనుకున్నారా?
కెపాసిటర్లు, ట్రాన్సిస్టర్లు, ఐసీలపై ఆసక్తి కనబరుస్తున్నారా?
విడి పరికరాలు కొని, సొంతంగా పర్సనల్ కంప్యూటర్‌ను తయారు చేయాలనుందా?
మీ ఇంట్లోని ఎలక్ట్రికల్ ఉపకరణాల పనితీరును తెలుసుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా?
ఎలక్ట్రికల్ మోటార్/టర్బైన్/జనరేటర్ వాస్తవంగా ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా?
పర్సనల్ రోబోట్ గురించి తెలుసుకోవాలనుందా?
పై ప్రశ్నలకు మీ సమాధానం ‘‘అవును’’ అయితే.. ఈఈఈ బ్రాంచ్‌లో మీరు చేరొచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్‌లో పట్టున్న వారు ఈ కోర్సులో వెంటనే చేరిపోవచ్చు.
మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్
మీ బైకును రిపేర్ చేయడానికి ఎప్పుడైనా సిద్ధపడ్డారా?
బైకులు, కార్లను డిజైన్ చేయడంపట్ల మీకు ఆసక్తి ఉందా?
మీకు ఫిజిక్స్ అంటే ఇష్టమా?
మీకు డ్రాయింగ్ నైపుణ్యాలున్నాయా?
మీ ఇంజనీరింగ్ నైపుణ్యాలను సామాన్య మానవుడి బాగు కోసం ఉపయోగించాలనుకుంటున్నారా?
పై ప్రశ్నలకు మీ సమాధానం ‘అవును’ అయితే.. ఇక ఈ బ్రాంచ్ మీకు సరిపోతుంది. శ్రమించే తత్వం ఉన్నవారికి ఈ బ్రాంచ్ అనుకూలం. చాలా కళాశాలల్లో మెకానికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు రెండూ వేర్వేరుగా ఉంటాయి. వీటి సిలబస్ మాత్రం దాదాపు ఒకటే.
సివిల్ ఇంజనీరింగ్
భవన నిర్మాణాలపట్ల మీకు ఆసక్తి ఉందా?
మీ ప్రతిభతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నారా?
ఒక భారీ భవనాన్ని చూసిన తర్వాత అసలు ఈ నిర్మాణాన్ని ఎలా పూర్తిచేశారని ఎప్పుడైనా ఆలోచించారా?
సమాజంలోని సమస్యలు, ప్రజల డిమాండ్లను పరిష్కరించడంలో మీకు ఆసక్తి ఉందా?
పై ప్రశ్నలకు మీ సమాధానం ‘‘అవును’’ అయితే.. ఈ బ్రాంచ్ మీకు సరిపోతుంది. సమాజ సమస్యల పరిష్కారంలో చొరవ చూపడంతోపాటు మానవ జీవితం సౌకర్యవంతంగా సాగిపోయేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచిస్తుండాలి.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్
ఎలక్ట్రానిక్ ఉపకరణాల పట్ల మీకు ఆసక్తి ఉందా?
మీ ఇంట్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పనిచేసే విధానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా?
అసలు కంప్యూటర్ సీపీయూలో వాస్తవంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
మైక్రోప్రాసెసర్స్/కమ్యూనికేషన్స్ పట్ల మీకు ఆసక్తి ఉందా?
పై ప్రశ్నలకు మీ సమాధానం ‘‘అవును’’ అయితే.. ఈ బ్రాంచ్ మీ కోసమే. సీఎస్‌ఈ, ఈఈఈలోని కొన్ని సబ్జెకులు ఇందులోనూ ఉంటాయి. ఈ బ్రాంచ్‌లో చేరాలంటే.. మ్యాథ్స్, ఫిజిక్స్‌లో గట్టి పట్టు ఉండాలి. ఇక ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ బ్రాంచ్‌ల మధ్య కొద్ది తేడానే ఉంటుంది.
సరైన బ్రాంచ్ ఎంపిక చేసుకోవడం ఎంత ప్రధానమో, సరైన కాలేజీని ఎంపిక చేసుకోవడమూ అంతే ముఖ్యం. అందుబాటులో ఉన్న కళాశాలలు, వాటి గుర్తింపు స్థితిగతులు, మౌలిక వసతులు, బోధనా సిబ్బంది, ప్లేస్‌మెంట్స్ తదితరాలను విశ్లేషించుకొని కాలేజీని ఎంపిక చేసుకోవాలి. దీనికోసం కళాశాల వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాలి. పూర్వవిద్యార్థుల నుంచి సమాచారం తీసుకోవాలి. ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునే ముందు విద్యార్థి.. సంబంధిత రంగంలో పనిచేస్తున్న వారిని సంప్రదించాలి. వారి జీవన సరళిని, కెరీర్ అవకాశాలను అధ్యయనం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ బ్రాంచ్ ఎంపికపట్ల తుది నిర్ణయం తీసుకోవడం తేలికవుతుంది.
మీ చేతికున్న ఐదు వేళ్లలో ఏ వేలు మంచిదనే దానికి సమాధానం చెప్పడం ఎంత కష్టమో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో ఏది మంచిది? అనే దానికి సమాధానం చెప్పడం కూడా అంతే కష్టం! ప్రతి బ్రాంచ్‌కూ తనకే సొంతమైన కొన్ని సానుకూలతలుంటాయి. ప్రస్తుత సమాజాభివృద్ధికి అన్ని బ్రాంచ్‌ల ఇంజనీర్లూ అవసరమే. అందువల్ల గందరగోళానికి గురికాకుండా వ్యక్తిగత అభిరుచులు, సామర్థ్యం, భవిష్యత్తు అవకాశాల ఆధారంగా బ్రాంచ్‌ను ఎంపిక చేసుకొని, పట్టుదలతో శ్రమిస్తే మీరు ఉత్తమ ఇంజనీర్‌గా నిలవడం తథ్యం!
వ్యక్తిగత సామర్థ్యం, ఆసక్తి ఆధారం
విద్యార్థులు నాలుగేళ్ల తర్వాత ఏమిటి? అనే ప్రశ్న వేసుకొని సరైన ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలి. కేవలం తల్లిదండ్రులు, స్నేహితుల సూచనలపైనే పూర్తిగా ఆధారపడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. విదేశాల్లో ఉద్యోగావకాశాలతో పోల్చితే భారత దేశ జాబ్ మార్కెట్ భిన్నంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటాయి. అందువల్ల వచ్చే నాలుగైదేళ్లలో ఇక్కడ జాబ్ మార్కెట్ ఏయే రంగాల్లో బాగుంటుంది. ఉన్నత చదువులు చదివేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక స్థితిగతులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. విద్యార్థులు బ్రాంచి ఎంపికలో ఉద్యోగానికే తొలి ప్రాధాన్యం ఇస్తారు. అయితే అదే సమయంలో పరిశోధన, సృజనాత్మక రంగం దిశగా కూడా వెళ్లొచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీటిపై ఆసక్తి ఉన్నవారు రీసెర్చ్‌కు అవకాశమున్న బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలి. అన్నింటికీ మించి విద్యార్థులు.. తమ సామర్థ్యం, ఇష్టాయిష్టాల ఆధారంగా బ్రాంచ్‌ను ఎంపిక చేసుకుంటే ఎంచుకున్న లక్ష్యాన్ని తేలిగ్గా చేరగలరు!
- సీహెచ్ శోభన్‌బాబు,
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐఐటీ హైదరాబాద్.