మదిని దోచే చిత్రాన్నిచ్చే.. ఫొటోగ్రాఫర్
గత స్మృతుల్లోకి తీసుకెళ్లి, మనసును పులకరింపజేసే శక్తి అందమైన ఛాయాచిత్రానికి ఉంది. వంద మాటలు చెప్పలేని భావాన్ని ఒక్క ఫొటో సులువుగా తెలియజేస్తుంది. మదిని దోచే అపురూపమైన ఫొటోలను తన కెమెరాలో బంధించి, భద్రంగా మన చేతికందించే కళాకారుడు.. ఫొటోగ్రాఫర్.
సృజనాత్మకతతో అద్భుతాలే
మనదేశంలో ఆదరణ పొందుతున్న కెరీర్.. ఫొటోగ్రఫీ. వృత్తిపరమైన సంతృప్తి, సమాజంలో పేరు, పనికి తగ్గ వేతనం అందించే కెరీర్ ఇది. సృజనాత్మకత, కష్టపడే తత్వం ఉంటే ఫొటోగ్రఫీలో అద్భుతాలే సృష్టించొచ్చు. ఆధునిక సమాచార సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో అందరూ ఫొటోగ్రాఫర్ల అవతారం ఎత్తుతున్నారు. ఆకట్టుకొనే దృశ్యం కనిపిస్తే చాలు.. ఫోన్‌లో బంధించి, వెంటనే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. స్నేహితుల నుంచి ‘లైక్’లు కొల్లగొడుతున్నారు. మనం తీసిన ఫొటోను నలుగురు మెచ్చుకుంటే.. కలిగే సంతృప్తికి వెలకట్టలేం. ఈ నేపథ్యంలో ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీపై అడుగులేస్తున్న వారెందరో ఉన్నారు. ఆసక్తి, అభిరుచితో తీసిన మంచి ఫొటోలను కళాభిమానులు వేలాది రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. వివాహాలు, శుభకార్యాల్లో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ల అవసరం తప్పనిసరిగా మారింది. ఇక మీడియాలో ఫొటో జర్నలిస్టుల పాత్ర కీలకం. ఒక్క ఫొటోతో సంచలనం సృష్టించినవారు ఉన్నారు.
అవకాశాలు, సవాళ్లు
మనదేశంలో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. నిపుణులైన ఫొటోగ్రాఫర్లకు ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలకు కొదవ లేదు. ఫ్యాషన్, వైల్డ్‌లైఫ్, జ్యుయెలరీ, సినిమా, జర్నలిజం వంటి విభాగాలు ఇందులో ఉన్నాయి. ఇది ఎన్నో సవాళ్లతో కూడుకున్న వృత్తి. ఫొటోగ్రాఫర్లకు ఓపిక, సహనం తప్పనిసరిగా అవసరం.
హాబీతోపాటు సంపాదన
‘‘అందమైన జ్ఞాపకంగానే కాకుండా అద్భుతమైన కెరీర్‌గా రాణించే అవకాశం ఉన్న రంగం ఫొటోగ్రఫీ. గ్లోబలైజేషన్ వల్ల కంపెనీల ప్రచారానికి విపరీతమైన గిరాకీ పెరిగింది. అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు క్రియేటివిటీ, నాలెడ్జ్ ఉన్న ఫొటోగ్రఫీ నిపుణులకు మంచి వేతనాలను అందిస్తున్నాయి. ప్రకృతి ఆరాధకులు దీన్ని హాబీగా స్వీకరించి ఎంజాయ్ చేస్తూనే డబ్బు సంపాదించుకునేందుకు వీలుంది. గతానికి భిన్నంగా ఫొటోగ్రఫీ కొత్త టెక్నాలజీతో అప్‌డేట్ అవుతోంది. దీన్ని కెరీర్‌గా స్వీకరించిన వారికి మంచి వేతనం లభిస్తుంది. ప్రారంభంలో నెలకు కనీసం రూ. 25 వేలకు పైగా సంపాదించవచ్చు. నాలుగేళ్ల ఫొటోగ్రఫీ కోర్సులో పలు అంశాలపై శిక్షణ ఇస్తారు. మరో నాలుగు నెలలు ఇంటర్న్‌షిప్. అనంతరం ప్రొఫెషనల్‌గా స్థిరపడే అవకాశం ఉంటుంది.’’
- సనకా లక్ష్మీ పవన్, ఫొటోగ్రాఫర్, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి