
పరిశోధనాత్మక జర్నలిజం పదును పెరగాలి
సాక్షి, హైదరాబాద్: పరిశోధనాత్మక జర్నలిజం మరింత పదును పెరగాల్సిన ఆవశ్యకత ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. భూ కబ్జాలు, ఆర్థిక నేరాల గుట్టును రట్టుచేసేందుకు కృషిచేయాలని, అప్పుడే దేశ సంపదను కాపాడగలుగుతామని చెప్పారు. క్రైం రిపోర్టర్స్ కమిటీ, ప్రెస్ అకాడమీ సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఏదైనా నేరం జరిగిన సమయంలో పోలీసుల కథనాలను రాయడంతోపాటు నేర స్థలాన్ని స్వయంగా పరిశీలించి వాస్తవాలను బయటకు తీయాలని సూచించారు.
డిటెక్టివ్ కన్నా నిశితంగా పరిశీలించే సామర్థ్యం క్రైం రిపోర్టర్‌కు ఉండాలన్నారు. నేర నిర్ధారణ విషయంలో ఫోరెన్సిక్ విభాగం సేకరించే సాక్ష్యాధారాలు చాలా కీలకమైనవన్నారు. అత్యాచారం జరిగిన తర్వాత బాధిత మహిళలు స్నానం చేయకూడదనే విషయం తెలియకపోవడం వల్ల కూడా సాక్ష్యాధారాలు దొరకడంలేదని అభిప్రాయపడ్డారు. హైస్కూలు, కాలేజీ విద్యార్థులకు కూడా ఫోరెన్సిక్ విభాగం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తే మంచిదని చంద్రకుమార్ సూచించారు. ఫోరెన్సిక్ విభాగం రాష్ర్ట పోలీసుశాఖ పరిధిలో ఉండటం వల్ల నష్టాలే ఎక్కువగా ఉన్నాయని రాష్ర్ట ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ డెరైక్టర్ ఎ.శారద అభిప్రాయపడ్డారు.
సమాజానికి ప్రయోజనం కలిగించే వార్తలకే మీడియా ప్రాధాన్యమివ్వాలని, ప్రజల వ్యక్తిగత విషయాల్లోకి తొంగిచూడటం తగదని రాష్ట్ర పోలీసు అకాడమీ డెరైక్టర్ ఎం.మాలకొండయ్య అన్నారు. నేరాలను మీడియాలో యథాతథంగా చూపడం వల్ల కొందరు స్ఫూర్తిపొంది నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ తిరుమలగిరి సురేందర్, రిటైర్‌డ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ ఎం.నారాయణరెడ్డి, క్రైం రిపోర్టర్స్ కమిటీ కన్వీనర్ ఉడుముల సుధాకర్‌రెడ్డి, కో కన్వీనర్ వలసాల వీరభద్రం సెమినార్‌లో మాట్లాడారు.