
పంచకుల పరాశక్తి
అల్లరిమూక అల్లరి చేస్తుంది. రాళ్లు రువ్వుతుంది. నిప్పులు చిమ్ముతుంది. ఇటు పౌరుల్ని కాపాడుకోవాలి. అటు అల్లరి చేస్తున్న ఆవేశపరులనూ అదుపు చేయాలి. ఇవి రెండూ పోలీసులు చేయాలి. కానీ పోలీసులే ప్రాణభయంతో పరుగులు తీసే పరిస్థితే వస్తే?! ధీశాలి అయిన ఓ శాంతిశక్తి అవతరించాలి. డేరాబాబా వల్ల జరిగిన అల్లర్లలో పంచకులలో ప్రాణ నష్టం జరగలేదంటే.. అందుకు.. గౌరీ పరాశర జోషీ చూపిన అసమాన ధైర్యసాహసాలే కారణం! ఇంటికెళ్లి చూసుకుంటేనే కానీ ఆమెకు తెలియలేదు.. తన ఒంటిపై గాయాలున్నాయనీ, అవి రక్తం స్రవిస్తున్నాయని! కమిషనర్ గౌరి తన రక్తంతో శాంతిని కాపాడింది.
హర్యాణాలోని పంచకుల నగరం.. డేరా బాబా భక్తుల అల్లర్లతో అట్టుడిగిన ప్రాంతం! గుర్‌మీత్ రామ్ రహీమ్‌ను నేరస్థుడిగా తేల్చగానే.. ఆయన అనుచరులు దాడులు, దహనాలతో పంచకులను అతలాకుతలం చేశారు. నిలువరించడానికి వచ్చిన పోలీసులను కర్రలు, రాళ్లతో కొట్టడం ప్రారంభించారు. వాళ్ల వెర్రి ఆవేశానికి భీతిల్లిన పోలీసులు అక్కడి నుంచి దాదాపుగా పారిపోయారు. ఆ సమయంలో ధైర్యంగా నిలబడ్డ వ్యక్తి ఒక్కరే. అల్లరిమూకల రాళ్లు తగులుతున్నా.. కర్రలు... వేసుకున్న బట్టలను చించుతున్నా.. వెరువక... కర్తవ్య నిర్వహణలో ముందుకెళ్లి.. పంచకులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఆ ఆగడాలను ఆపే ప్రయత్నం చేసిన ఒకే ఒక్క యోధ.. ఓ మహిళ! ఒంటిచేత్తో కాదు కాని తెగువతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇలాగే కొనసాగితే పంచకుల మారణహోమంలా మారే ప్రమాదం ఉందని గ్రహించి సరాసరి తన ఆఫీస్‌కి వెళ్లి సిచ్యుయేషన్‌ను ఆర్మీకి హ్యాండోవర్ చేస్తూ ఆర్డర్ జారీ చేశారు. ఆ ధీరవనితే గౌరీ పరాషర్ జోషి. ఐఏఎస్. పంచకుల డిప్యూటీ కమిషనర్! ఇది ఆగస్ట్ 25వ తేదీ, శుక్రవారం నాడు జరిగింది. అలా ఆ పగలంతా కూడా పంచకుల ప్రతీ గల్లీ, ప్రతీ మూలకు పహారా కాసి లొల్లి సద్దుమణిగాకే రాత్రి మూడు గంటలకు ఇంటికి వెళ్లారు. గుర్‌మీత్ రామ్ రహీమ్ బాబా తన నేరనైజంతో దేశం నోట్లో నానుతుంటే అతని ప్రభావం సృష్టించిన గందరగోళాన్ని ఆపిన సాహసిగా పాపులారిటీ తెచ్చుకున్నారు గౌరి.
కలహండీ నేర్పింది
నిజానికి గౌరి.. ఒడిషా కేడర్ ఐఏఎస్. ఆమె ప్రొబేషనరీ పీరియడ్ అంతా కడుపేదరికం, నిరక్షరాస్యత, మావోయిస్ట్ ప్రాబల్యమూ ఉన్న కలహండీలోనే గడిచింది. ఐఏఎస్‌గా మస్సూరీలో చదువుకున్న థియరీకి ప్రాక్టికల్స్ నేర్చకుంది అక్కడే. క్లిష్టసమయాలను ఎలా డీల్ చేయాలో తెలుసుకుందీ అక్కడే. ప్రజలు మావోయిస్ట్‌లకు ఎందుకు ఆకర్షితులవుతున్నారో.. వాళ్లపట్ల సానుభూతి ఎందుకు చూపిస్తున్నారో.. పాలనాలోపం ఎక్కడుందో క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అవగతం చేసుకున్నారు గౌరి. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందట్లేదని అర్థం చేసుకున్నారు. కలహండీలో పనిచేసిన రెండేళ్లు దాని మీదే దృష్టిపెట్టారు. అక్కడున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి పోయేలా చూశారు. ఇటు పాలనాపరంగానూ తన సిబ్బందిలో ఉన్న అలసత్వాన్ని దులిపేసి క్రమశిక్షణను అలవర్చారు.
బాధ్యతల బరువు పెట్టారు. దాంతో అడ్మినిస్ట్రేషన్ చురుకైంది. ప్రజల సమస్యలకు సత్వరమే పరిష్కారం దొరకడం ప్రారంభమైంది. తద్వారా మావోయిస్ట్‌ల పట్ల ప్రజలకున్న సానుభూతి కాస్తా స్థానిక ప్రభుత్వ యంత్రాంగం పట్ల నమ్మకంగా మారిపోసాగింది. అలా గౌరి కృషి ఫలితాలను అక్కడి ప్రజలు అందుకునేలోపే ఆమె హర్యాణాకు బదిలీ అయిపోయారు. కలహండీలో పనిచేసింది తక్కువ కాలమే అయినా తన పాలనా దక్షత, సామర్థ్యాలతో పెక్కు ప్రభావమే చూపారు. అనతికాలంలోనే మంచి ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు గౌరీ పరాçశర్ జోషీ.
రాజకీయాల్లో.. ప్రభుత్వంలో..
ఇటు రాజకీయంగా.. అటు ప్రభుత్వ పరంగా మంచి పరపతిగల కుటుంబంలోని అమ్మాయి గౌరి. ఆమె తండ్రి ఆర్‌ఎన్ పరాశర్ హర్యాణా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాకు ముఖ్య సలహాదారుడు. అంతేకాదు అన్ని పార్టీల్లోని కీలక వ్యక్తులతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. ఆ పరిచయాలతో హర్యాణా బీజేపీ ప్రభుత్వంలో కూడా పనులు చేయించుకోగల సమర్థుడు ఆయన. గౌరి విషయానికి వస్తే చిన్నప్పటి నుంచీ చురుకైన పిల్ల. పుట్టిపెరిగిందంతా ఢిల్లీలోనే. చదువులో ఎప్పుడూ ఫస్టే. సీబీఎస్‌సీ ట్వల్త్ క్లాస్‌లో మంచి మార్కులు వచ్చాయి. ఆ పర్సంటేజే ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మకమైన సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్‌లో ఆమెకు సీట్‌ను ఖరారు చేసింది. ఇంగ్లీష్ లిటరేచర్‌లో పోస్ట్ గ్రాడ్యూయేషన్ కంప్లీట్ చేశారు.
పెళ్లి.. ఈలోపే హర్యాణా కేడర్‌కు చెందిన అజిత్ జోషీ అనే ఐఏఎస్, గౌరి.. మూడుముళ్లు, ఏడు అడుగులతో ఒక్కటయ్యారు. ఆయన కోసం ఒడిషా నుంచి హర్యాణాకు డిప్యుటేషన్ మీద రావాల్సి వచ్చింది. ఆమె అలా వెళ్లిపోవడం కలహండీ ప్రజలకు బాధ కలిగించింది. నిజానికి ఏ కొత్త ఐఏఎస్‌కైనా కలహండీ ఒక సవాల్. తమలోని అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్‌ను నిరూపించుకునే అవకాశం. కరెక్ట్‌గా ఆ బాటలోనే ఉన్న గౌరి పెళ్లితో అర్ధంతరంగా గమ్యాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అలా హర్యాణాకు ప్రయాణమైంది. అయినా ఆ 24 నెలల్లో కలహండీ సంక్షేమం కోసం ఆమె పాటుపడ్డ తీరు సీనియర్ ఐఏఎస్‌లకి కూడా కష్టమైందే. కాబట్టే అక్కడి ప్రజలకు గౌరి అంటే అంతటి అభిమానం. గొప్ప గౌరవం.
ఇంకా సాగుతూనే ఉంది..
ప్రజాక్షేమం కోసం సివిల్ సర్వెంట్‌గా ఆమె పోరాటం ఇంకా సాగుతూనే ఉందని మొన్నటి పంచకుల సంఘటన కూడా రుజువు చేసింది. గౌరిలోని సమయస్ఫూర్తిని, వేగంగా సరైన నిర్ణయాలు తీసుకోగల దక్షతనూ చూపించింది. పంచకుల ఆకతాయిల హస్తగతం అవుతోందని.. రక్తం పారే ప్రమాదం ఉందని, అగ్ని కీలలు ఎగసే అపాయమూ లేకపోలేదని గ్రహించి.. ఆర్మీ అయితే అదుపులో ఉంచగలదని ఊహించి క్షణాల్లో ఆర్డర్ పాస్ చేశారు. అయినప్పటికీ తన బాధ్యతను మరవలేదు. పంచకుల స్థిమితపడేదాకా తను నిద్రపోలేదు. పంచకుల ప్రశాంతమైందని నిర్ధారించుకున్నాకే ఇంటికి వెళ్లారు. ఆమెను ఆ అవతారంలో చూసిన కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. బట్టలు చిరిగి.. చేతులకు, మొహానికి గాయలతో రక్తమోడుతూ ఉన్నారు. అప్పుడు చూసుకున్నారు తనని తాను గౌరి! అదీ ఆమె నిబద్ధత. ‘నేను ఏది చేసినా.. నా డ్యూటీలో భాగమే. ప్రజల క్షేమం కోసమే. శాంతిభద్రతల పరిరక్షణే నా ధ్యేయం’ అంటారు బ్రేవ్ ఐఏఎస్ గౌరీ పరాశర్ జోషీ.
మహిళాశక్తిని గుర్తించి..
ప్రొబెషనరీగా కలహండీలో అడుగు పెట్టారు. ఆగమ్యగోచరంగా తోచాయి అక్కడి స్థితిగతులు ఆమెకు. రాజకీయనాయకుల నుంచి ప్రభుత్వ సిబ్బంది వరకు ఎవరికీ ఏ బాధ్యతా పట్టదు. వెళ్లిన పదిహేను రోజుల్లోనే బాగా ఆకళింపు చేసుకున్నారు గౌరి. కుటుంబాన్ని దానిద్వారా ఊరిని, సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి స్త్రీనే అని గౌరికి బాగా తెలుసు. అందుకే మహిళల మీద గురి పెట్టారు గౌరి. పేదరికం రాజ్యమేలుతున్న కలహండీలో ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తే చాలా విషయాలు దారిలోకి వస్తాయని ఆమె నమ్మకం. పేదరికంతో యుద్ధం చేయడానికి వాళ్లను సమాయాత్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ స్వావలంబన, డ్వాక్రా వంటి సెల్ఫ్‌హెల్ప్ పథకాలలో వాళ్లను భాగస్వాములను చేశారు. కొంచెం ఆర్థిక పరిపుష్టి సాధించాక అప్పుడు ఇంట్లో నిర్ణయాలు తీసుకునేలా వాళ్లను ఆమె ప్రోత్సహించారు. దాంతోపాటే అక్షరాస్యత దిశగా కూడా వాళ్లతో అడుగులు వేయించారు.
వీటన్నిటితో కలహండీ లేడీస్ పురుషులకు సలహాలిచ్చే దశకు ఎదిగారు. ఊళ్లో సమస్యల గురించి స్థానిక నాయకులను ప్రశ్నించే ధైర్యం తెచ్చుకున్నారు. ఇవన్నీ ఆటోమెటిగ్గా ఆ జిల్లాలోని గ్రామాల్లో ఇతరుల జోక్యాన్ని తగ్గించసాగాయి. ఇలా పరిస్థితి కొంచెం అదుపులోకి రాగానే మావోయిస్ట్ ఆపరేషన్స్ మీదా దృష్టిపెట్టారు ఆమె. అలా పెద్దగా హింసకు పాల్పడకుండానే కొంత మావోయిస్ట్ ప్రాబల్యాన్ని తగ్గించగలిగారు గౌరీ పరాశర్ జోషీ.
జర్నలిజం.. సివిల్ సర్వీసెస్
చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం ఆమె అభిరుచి. నాలుగు రకాల వార్తాపత్రికలను ఆసాంతం చదివేసేవారు. అదే ఆమెలో జర్నలిస్ట్ కలను రగిలించింది. కాలేజ్‌కి వెళ్లే సరికి ఆ కల ఆశయంగా మారింది. దాంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌కి ఎంట్రెన్స్ రాశారు. అంతటి టఫ్ ఎగ్జామ్‌ని అవలీలగా పాస్ అయ్యారు. అంతే అవలీలగా ఐఐఎమ్‌సీ జర్నలిజం డిప్లొమానూ పూర్తి చేశారు. ఆ సమయంలో చాలా మంది జర్నలిస్ట్‌లూ ఆమెకు పరిచయమయ్యారు.
అయితే ఎందుకనో మరి ఐఐఎమ్‌సీ నుంచి బయటకొచ్చేలోపే ఆమె లక్ష్యం మారిపోయింది. ఐఏఎస్ కావాలనుకున్నారు. సివిల్స్‌కి ప్రిపరేషన్ మొదలుపెట్టారు. 2008 యూపీఎస్‌సీ ఎగ్జామ్ రాశారు. గౌరి పాస్ కాకపోతే విస్మయం. క్లియర్ అయితే ఎందుకు ఆశ్చర్యం? ఆల్ ఇండియా 60వ ర్యాంక్‌ను సాధించి ఐఏఎస్ సర్వీస్‌ను ఎంచుకున్నారు గౌరీ పరాశర్ జోషీ. ఒడిషా కేడర్ ఐఏఎస్‌గా చార్జ్ తీసుకున్నారు.
– శరాది