
తెహెల్కా ఎడిటర్ వికృత చేష్ట!
సంస్థలోని మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి
తరుణ్ తేజ్‌పాల్‌పై యాజమాన్యానికి బాధితురాలి ఫిర్యాదు
ప్రాథమిక దర్యాప్తునకు గోవా సర్కారు ఆదేశం
పణజి/న్యూఢిల్లీ: పరిశోధనాత్మక జర్నలిజం ద్వారా సంచలన కథనాలను వెలుగులోకి తెచ్చిన తెహెల్కా మేగజైన్ వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ చిక్కు ల్లో పడ్డారు. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్‌లో పది రోజుల కిందట తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సంస్థలోని ఓ మహిళా జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు దుమారం రేపాయి. హోటల్‌లోని ఓ లిఫ్టులోకి లాగి తేజ్‌పాల్ తనను వేధించారంటూ బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురీకి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఎడిటర్ పదవికి ఆరునెలలపాటు దూరంగా ఉండనున్నట్లు తేజ్‌పాల్ బుధవారం షోమాకు పంపిన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.
అయితే తన చర్యపట్ల విచారం వ్యక్తం చేస్తూ బాధితురాలికి తేజ్‌పాల్ బేషరతు క్షమాపణ చెప్పారని, దీనిపై బాధితురాలు సంతృప్తి వ్యక్తం చేసిందంటూ షోమా గురువారం మీడియాకు చెప్పారు. బాధితురాలు కోరుకున్న న్యాయంకన్నా ఆయన ఎక్కువే చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని సంస్థ అంతర్గత వ్యవహారంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. షోమా వ్యాఖ్యలపై ఎడిటర్స్ గిల్డ్ సహా జర్నలిస్టు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తేజ్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. 2001లో అప్పటి బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ రూ. లక్ష ముడుపులు తీసుకోవడాన్ని తేజ్‌పాల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టడం తెలిసిందే. కాగా, ఈ ఘటనపై గోవాలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. మరోవైపు తేజ్‌పాల్‌ను మంగళవారం ప్రసార భారతి బోర్డు సభ్యుడిగా ఎంపిక చేసిన కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది.