నెట్‌ఇంట్లో అఁ ఆఁ..! | Citizen Journalism | Sakshi
Sakshi News home page

నెట్‌ఇంట్లో అఁ ఆఁ..!

Published Sun, Sep 13 2015 10:25 PM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

నెట్‌ఇంట్లో అఁ ఆఁ..! - Sakshi

నెట్‌ఇంట్లో అఁ ఆఁ..!

అ అంటే అద్భుతం, ఆ అంటే ఆశ్చర్యం. ఈవారం మన నెట్ ఇంట్లోఅన్నీ ఇలాంటి విశేషాలే. కుప్పలు కుప్పలుగా కబుర్లు, గంపలకొద్దీ గాసిప్‌లు, వీసెల్లెక్కన వింతలు, విడ్డూరాలు... ఇలా సెల్ఫీల నుంచి సిటిజెన్ జర్నలిజం దాకా అన్నిటికీ పుట్టిల్లు.. మన నెట్టిల్లు. కంప్యూటర్‌ని కలలోనైనా చూడని ఓ పూలమ్ముకునే అమ్మాయిని ఈ నెట్ ఇల్లు బ్యూటీ అట్లాస్‌లోకి ఎక్కించగలదు. ఉద్యోగం చేసి బోరుకొట్టిన యువకుడికి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటివ్వగలదు. ఇలా అద్భుతం, ఆశ్చర్యం, అద్వైతం,ఆలోచన, అనూహ్యం, అసాధ్యం అనిపించే గతవారపు నెట్ సంచలనాల సమాహారం... మీకోసం...
 
ఆశ్చర్యం
మన మంత్రి ఒకాయన చైనాకి వెళ్లాడట. చైనా మంత్రి ఆస్తి చూసి ఆశ్చర్యపోయాడట. ఇంత ఆస్తి ఎలా వచ్చింది అని అడిగాడట. చైనావాడు దూరంగా ఉన్న ఒక వంతెనను చూపించి ‘బ్రిడ్జి కనిపిస్తుందా?’ అని అడిగాడట. అవునన్నాడు మనవాడు. ‘‘అందులో టెన్ పర్సెంట్ నా వాటా’’ అన్నాడట చైనా మంత్రి. కొన్నాళ్లకి చైనా మంత్రి మన దేశానికి వచ్చాడట! మన మంత్రిగారి సంపద చూసి నోరు వెళ్లబెట్టాడట! ఇదెలా సాధ్యం అని అఢిగాడటు. మనవాడు ‘‘దూరంగా వంతెన కనిపిస్తోందా?’’ అని అడిగాడట! చైనా మంత్రికి ఏమీ కనిపించలేదు. ‘‘ఉహూ’’ అన్నాడు. ‘‘నా వాటా సెంట్ పర్సెంట్’’ అన్నాడట మనవాడు. ఈ వీడియో సరిగ్గా ఆ కథకి అద్దం పడుతుంది. మహారాష్ర్టలోని నాగపూర్‌కి, మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాని కలిపే హైవే నిర్మాణం ఎంత ‘పైన పటారం లోన లొటారం’గా జరిగిందో ఓ చిన్నపాటి వరద చెప్పేస్తుంది. కొద్దికొద్దిగా నీరు వచ్చి రోడ్డుపైనుంచి ప్రవహించడం, అడుగునుంచి రోడ్డును క్షణాల్లో కోసేయడం, ఆ తరువాత మొత్తంగా రోడ్డు డొల్లతనం బయటపడడం చూడొచ్చు. ఇది ఈమధ్యే జరిగిన సంఘటన. పదకొండు లక్షలమంది ఈ మూడు నిమిషాల విడియోని చూశారు. మీరూ చూడండి. మేరా భారత్ మహాన్ అనండి.
 https://www.facebook.com/arvind.shrivastava.773/videos/678813465553732/
 
 
 
ఆలోచన
చైనాలో ఇటీవలే రెండో ప్రపంచయుద్ధం విజయోత్సవాలు జరిగాయి. బీజింగ్‌లో భారీగా సైనిక కవాతులు జరిగాయి. దీని కోసం చైనాలో కొన్ని చోట్ల వాహనాల రాకపోకల్ని నిషేధించారు. దీంతో ప్రజలకు  ఆకాశం స్పష్టంగా కనిపించసాగింది. భవనాలు, వాటి డిజైన్లు, వాటికి అమర్చిన కిటికీలు కళ్లకు కట్టినట్టు కనిపించాయి. కొత్త బీజింగ్‌ను చూసినట్టు అనిపించింది. ప్రజలందరూ దీన్ని పడీ పడీ చూశారు. ఉత్సవాలు అయిపోయాయి. నిషేధాలు తొలగిపోయాయి. మళ్లీ కార్లు, స్కూటర్లు రోడ్లపై రయ్‌మన్నాయి. కొద్ది గంటల్లోనే ఆకాశం దుమ్ముతో మసకబారింది. భవనాలు అస్పష్టం అయిపోయాయి. బీజింగ్‌పై కాలుష్యం కంబళి కప్పుకుంది. పొల్యూషన్ బీజింగ్‌ను ఎలా కమ్మేసుకుంటుందో చెప్పే ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. వాహన కాలుష్యం బీజింగ్‌ను ఏం చేస్తోందో ఈ రెండు ఫొటోలు చూస్తే తెలుస్తుంది.
 http://en.yibada.com/articles/61158/20150907/after-brief-blue-skies-from-parade-beijings-air-pollution-is-back.htm#ixzz3l97Z0A9R
 
 
 
అద్భుతం
అనగనగా అనగనగా ఒక మునీరా. ఆమెది మధ్య ఆసియాలోని తాజికిస్తాన్. అనగనగా ఒక మిహైలా. ఆమెది యూరప్‌లోని రొమేనియా. మిహైలా ఒక ఫోటోగ్రాఫర్. మునీరా పూలమ్ముకునే పాప. మిహైలా ప్రపంచమంతా తిరుగుతుంది. మునీరాకి సొంత ఊరు తప్ప వేరే ప్రపంచం తెలియదు. అట్లాస్ ఆఫ్ బ్యూటీ  ప్రాజెక్టులో భాగంగా మిహైలా నొరోక్ తాజికిస్తాన్ రాజధాని దుషాన్బేలో అతివల అందాలను క్లిక్ చేస్తూ ఉండగా, తోటలో పూలు ఏరుకుంటూ 19 ఏళ్ల మునీరా మీర్జోయేవా కనిపించింది. అంతే మిహైలా ఆమెను క్లిక్‌మనిపించింది. ఆ తరువాత ఏమైంది? ఆ తరువాత కథంతా సోషల్ మీడియా నడిపించింది. మునీరా ఫోటోని చూడగానే సోషల్ మీడియాకి వైరల్ ఫీవర్ వచ్చింది. వందలు వేలుగా, వేలు లక్షలుగా షేర్లు అయ్యాయి. మునీరా ఉన్నట్టుండి సెలబ్రిటీ అయింది. ఆమె గురించి చెప్పుకుని ఇప్పుడు తాజికిస్తాన్ తలకిందులైపోతోంది. కటిక పేదరికంలో మగ్గుతున్న మునీరాకోసం ఇప్పుడు తాజిక్ ఫేస్‌బుక్‌లో క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధిని సేకరించడం మొదలైంది. సోషల్ మీడియా పవరేంటో చూపించిన సక్సెస్ స్టోరీలో తమాషాగా హీరోయిన్లే తప్ప హీరోలు లేరు.
 
అసహ్యం
మనిషి రెండు కాళ్ల పశువు. మిగతా పశువులు గడ్డం గీసుకోవు. ద్విపాద పశువు గీసుకుంటాడు. అంతే తేడా! మనిషి పశువేనన్న విషయంలో ఎవరికీ సందేహం రాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు పశువులాగా వ్యవహరిస్తూనే ఉంటాడు. ఓ సూపర్ మార్కెట్‌లో తల్లిదండ్రులు పిల్లాడిని ఆడుకొమ్మని వదిలి, సామాన్లు కొనుక్కోవడంలో మునిగిపోయారు. ఓ రెండు కాళ్ల పశువు ఇదే అదనుగా ఆ పాలుగారే పసివాడిని బలవంతంగా పెదాలపై ముద్దులు కురిపించి, తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తాడు. ఆకలిగొన్న తోడేళ్లు మేకపిల్లలను ఎలా వేటాడేస్తాయో చూడాలంటే అడవుల్లోకి వెళ్లక్కర్లేదని నిరూపిస్తాడు. ఎవరో దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఎక్కడ జరిగింది. ఎవరు చేశారు అన్నది ఇక్కడ అప్రస్తుతం. బాల్యాన్ని ఎలా చిదిమేస్తున్నారన్నది తెలుసుకోవడం ముఖ్యం. పీడోఫీలియా అన్న ముద్దు పేరుతో చెలామణి అయ్యే ఈ పైశాచికాన్ని చూసైనా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నదే ఈ వీడియో సందేశం. తండ్రులూ తల్లులూ... తస్మాత్ జాగ్రత్త!
 http://www.indiatimes.com/videocafe/this-video-of-a-mall-toy-car-operator-forcibly-kissing-a-child-will-scare-you-even-if-you-are-not-a-parent-244963.html
 
 
 
అద్వైతం
యుద్ధం చేసేవాడెలా ఉండాలి? బుల్లెట్ల భాష మాట్లాడాలి. బాంబులతో దోస్తీ చేయాలి. బంకర్లలో నుంచి ఎప్పటికప్పుడు ఇదే ఆఖరి శ్వాస అన్నట్టు బతకాలి. తుపాకీ తోడుండాలి. కొండకోనల్లో కలాష్నికోవ్ లే దోస్తులు. గండశిలల్లో గ్రేనేడ్లే ప్రియురాళ్లు. చెట్టు చాటునో, గుట్ట మాటునో పొంచి ఉన్న చావు కోసం ప్రతి క్షణం ఇదే ఆఖరి క్షణం అన్నట్టు బతకాలి. అనునిత్యం చావుతో సహవాసం చేసే సైనికుడికి ఆకలేసినప్పుడు ఓ రెండు ఎండు రొట్టెలు, కాసింత కూర కడుపు నింపుతుంది. బండరాయే డైనింగ్ టేబుల్‌గా మారుతుంది. ఆ క్షణంలో భార్యా పిల్లలు గుర్తుకొచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఓ సిక్ఖు సైనికుడు తాను తినే రొట్టె ముక్కలనే లాలనగా, ప్రేమగా ఓ ఉడుతతో పంచుకుంటున్న ఒకటిన్నర నిమిషాల వీడియో మన గుండె లోపలి పొరల్ని గీరుతుంది. తుపాను మధ్య ప్రశాంతతో ఉన్న ఆ జవాను, ఆయనతో దోస్తీ చేసిన ఉడుత ఉరుకులను చూస్తూంటే యుద్ధం అమరత్వ లబ్ధ్ది మాత్రమే కాదు అద్వైత సిద్ధినీ ఇస్తుందనిపిస్తుంది.
 https://www.facebook.com/PunjabSpectrumCom/videos/1038045736212019/
 
 
 
అనూహ్యం
దుబాయి షేకులు ఏదైనా చేయగలరు. అప్పట్లో ఆకాశాన్ని ముద్దాడే వెయ్యడుగుల ఎత్తై బూర్జ్ ఖలీఫా భవనంపై టెన్నిస్ స్టేడియం కట్టారు. ఇప్పుడు తాజాగా సముద్రం లోతుల్లో టెన్నిస్ స్టేడియం కట్టబోతున్నారు. ఈ స్టేడియం పూర్తయితే నీలి రంగు నీరు, అందులో ఈదుకుంటూ పోయే చేపలు, సొర చేపలు, నలువైపులా ముసురుకుంటుంటే మధ్యలో ‘లవ్ వన్ లవ్ ఆల్’ నడుస్తూ ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు టెన్నిస్ కోర్టులు కట్టబోతున్నారు. క్రిస్తాఫ్ కొటాలా అనే పోలండ్ ఆర్కిటెక్ట్ ఈ అద్భుత అంతఃస్సాగర విశ్వామిత్ర సృష్టి చేయబోతున్నాడు. దీనికోసం పగులలేని, పగలలేని గాజు షీట్లు తయారు చేయబోతున్నారు. త్వరలో మారియా షరపోవా, రఫేల్ నాదల్, సెరీనా, మన సానియా మీర్జాలు జలక్రీడలు, టెన్నిస్ క్రీడల్ కలిసి ఆడేస్తారేమో! దీనార్లు, రియాల్స్ దండిగా ఉన్న దుబాయి బాబులు సృష్టించబోతున్న వాటర్ వరల్డ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా గుప్పుమంటోంది.
 http://www.pursuitist.in/an-underwater-tennis-court-in-dubai-to-host-grand-slam-tournaments/?utm _ source=taboola&utm_medium=cpc&utm_campaign=pursuitist_traffic&utm_term=greatandhra
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement