ఈ కలం.. జన గళం! 'జర్నలిస్టు'
నేచర్ ఆఫ్ జాబ్
సమాజంతో దగ్గరి సంబంధం ఉన్న ఉద్యోగం జర్నలిస్ట్. మిగిలిన ఉద్యోగాలతో పోలిస్తే ఇది ఎంతో వైవిధ్యమైన వృత్తి. రాసే వార్తలో ప్రతి పదం వాస్తవికంగా ఉండాలి. ఎందుకంటే జర్నలిస్టులు రాసే ప్రతి అక్షరం ప్రతి రోజూ ఎన్నో లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో జర్నలిజం యువతకు మంచి కెరీర్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ ఉద్యోగ స్వభావం, అవసరమైన స్కిల్స్ తదితరాలపై కథనం..
రెండు విభాగాలు
జర్నలిజంలో ముఖ్యంగా రెండు విభాగాలుంటాయి. ఒకటి బ్యూరో, రెండోది డెస్క్. బ్యూరోలో రిపోర్టర్లుంటారు. సిటీ, స్టేట్, జిల్లాల వారీగా వేర్వేరు బ్యూరోలుంటాయి. రిపోర్టర్లు ఫీల్డ్‌కు వెళ్లి వార్తను సేకరించి డెస్క్‌కు చేరవేస్తారు. బ్యూరో మాదిరిగానే డెస్క్‌లు కూడా సిటీ, స్టేట్, బిజినెస్, స్పోర్‌ట్స, జిల్లాలు.. ఇలా వేర్వేరుగా ఉంటాయి. డెస్క్‌లో ప్రాథమికంగా సబ్ ఎడిటర్లు ఉంటారు. రిపోర్టర్లు ఇచ్చిన వార్తల్లోని దోషాలను సవరించి, దానికి మంచి శీర్షిక పెట్టి వార్తగా మలుస్తారు. ఒక వార్తకు సంబంధించి తుది నిర్ణయం డెస్క్‌దే.
పనివేళలు
ఎలక్ట్రానిక్ మీడియాలో షిఫ్ట్‌ల వారీగా పనివేళలు ఉంటాయి. ఇవి ప్రతి వారం మారుతుంటాయి. ప్రింట్ మీడియాలో డెస్క్ విభాగంలో సాయంత్రం 5 నుంచి రాత్రి 12 గంటల వరకు పని వేళలు ఉంటాయి. బ్యూరో విభాగం... ఆ రోజు ఉదయం నుంచి జరిగిన అంశాలను సాయంత్రానికల్లా వార్తల రూపంలో డెస్క్‌కు అందిస్తుంది. రిపోర్టర్లు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ.. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా, ఎలాంటి నిర్ణయాలు వెలువడినా వెంటనే వార్తలు రాసి డెస్క్‌కు అందించాల్సి ఉంటుంది.
కావాల్సిన స్కిల్స్
⇒ జర్నలిస్టు కావాలనుకునే వారికి ప్రాథమికంగా, తప్పనిసరిగా భాషపై మంచి పట్టు ఉండాలి.
⇒ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలన్నింటిపై కనీస అవగాహన ఉండాలి.
⇒ నిరంతరం నేర్చుకునే తత్వం అత్యవసరం.
⇒ ఏది వార్తో, ఏది కాదో గుర్తించే నైపుణ్యం ఉండాలి.
⇒ పనిలో వేగం, కచ్చితత్వం తప్పనిసరి.
ఉద్యోగావకాశాలు..
ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ విస్తరిస్తున్న నేపథ్యంలో జర్నలిజంలో ఉద్యోగావకాశాలకు ఢోకాలేదనే చెప్పుకోవాలి. టీవీ చానళ్లు, న్యూస్ పేపర్లలో అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా డెస్క్, బ్యూరో విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు.
వేతనాలు
కెరీర్ ప్రారంభంలో రూ.12 వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత అభ్యర్థి ప్రతిభ ఆధారంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటాయి.
⇒ జర్నలిజం ద్వారా ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో మన వంతు పాత్ర పోషించొచ్చు.
⇒ జర్నలిజం ద్వారా పేదలు, బాధితులకు సాయం చేయొచ్చు. తద్వారా ఆత్మ సంతృప్తి లభిస్తుంది.
⇒ సమాజంలో జర్నలిస్టులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది.
⇒ అన్ని రంగాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఆర్జించవచ్చు.
⇒ జర్నలిజంలో కాలంతో పోటీపడి విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
⇒ ప్రతి రోజు డెడ్‌లైన్‌కు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పని ఒత్తిడి ఎక్కువ.
⇒ సెలవులు తక్కువగా ఉంటాయి.
కోర్సులు
తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో కోర్సులు అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో ఉద్యోగాలు సాధించొచ్చు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం
కోర్సు: ఎంసీజే
అర్హత: కనీసం 40% మార్కులతో ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.osmania.ac.in
ఆంధ్రా విశ్వవిద్యాలయం
కోర్సు: జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్
అర్హత: ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ఏయూసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
కాకతీయ విశ్వవిద్యాలయం
కోర్సు: మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం
అర్హత: ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.kakatiya.ac.in
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం
కోర్సు: ఎంఏ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం
అర్హత: కనీసం 45% మార్కులతో ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.spmvv.ac.in
యోగి వేమన విశ్వవిద్యాలయం
కోర్సు: కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం
అర్హత: ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.yogivemanauniversity.ac.in
తెలంగాణ విశ్వవిద్యాలయం
కోర్సు: కమ్యూనికేషన్‌లో ఎంఏ అర్హత: ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.telanganauniversity.ac.in
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (గుంటూరు) లోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూరవిద్య విధానంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో పీజీ అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.anucde.info