
కళ.. ఆలోచన భళ
కళల పట్ల ఆసక్తి కనబరుస్తున్న నగర యువత
వేసవి శిక్షణా శిబిరాలకు ఏర్పాట్లు పూర్తి
శిక్షణకు సిద్ధమైన పలు వేదికలు
ఆర్ట్, క్రాఫ్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు
నటన నుంచి నాట్యం వరకూ వివిధ రంగాల్లో
మనిషన్నాక కాస్తంత కళాపోషణుండాలోయ్..లేదంటే మనిషికీ.. గొడ్డుకీ తేడా ఏంటి? అని అలనాటి నటుడు.. రావు గోపాలరావు అన్న మాటలను ఈ తరం యువత చెవికెక్కించుకుందో ఏమోగానీ.. చదువులతో పాటు ఏదో ఓ వృత్తిలోనో, కళలోనో ప్రావీణ్యం పొందుతున్నారు. దీనికి అనుగుణంగానే నగర వాసులు తమ ఆసక్తిని వివిధ రంగాలపై కనబరుస్తున్నారు. ఏదో ఒక కళను నేర్చుకునేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే ఔత్సాహికులకు విభిన్న కళల్లో శిక్షణ ఇచ్చేందుకు పలు వేదికలు ఏర్పడుతున్నాయి. హస్తకళలు మొదలు, పెయింటింగ్, సంగీతం, నేచురల్ క్రాఫ్ట్స్, డ్రాయింగ్, డ్యాన్సింగ్ (కూచిపూడి, భరత నాట్యం, వెస్ట్రన్), వివిధ రకాల క్రీడలు, కళల్లో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో చిన్నారులకు, విద్యార్థులకు, యువతకు విభిన్న కళలపై శిక్షణ అందించేందుకు వివిధ సంస్థలు ఇప్పటికే ఏర్పాట్లు చేశాయి. పలు ఆర్ట్ స్టూడియోలు ఆర్ట్ క్యాంపెయిన్స్ ప్రారంభించాయి. – సాక్షి, సిటీబ్యూరో
కళ ఒక వినూత్న వ్యక్తిత్వానికి నిదర్శనం. కళ సంతృప్తి, సాంత్వనకు ప్రతిబింబం.. కళ ఒత్తిడికి ఒక ఉపశమన మార్గం. కళ అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం. ఒకప్పుడు కళలంటే 64 కళలని నిర్వచించే వారు. కానీ ప్రస్తుతం కళకు కాదేదీ అనర్హం అనేలా మారింది. పెయింటింగ్, డ్రాయింగ్, డ్యాన్సింగ్, మొదలు పేపర్ క్రాఫ్టింగ్, పాటరీ మేకింగ్, మ్యూజిక్, మ్యాజిక్, ఆర్కిటెక్చర్, రెసిన్ వర్క్స్, సాహిత్యం, ఫ్యాషన్ డిజైనింగ్, స్టైలింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే వందల కళలు యువతను ఆహ్వానిస్తున్నాయి. సాంస్కృతిక కళలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ప్రస్తుతం అధునాతన కళలు, కళాత్మక పద్ధతులు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ కళలను కొందరు ట్రెండ్‌గా నేర్చుకుంటుంటే.. మరి కొందరు తమ భవిష్యత్తును కళారంగం వైపు మలచుకోవడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ కళలను ఆదరించడంలో, ఆస్వాదించడంలో సాంస్కృతిక కళలు, మోడ్రన్ ఆర్ట్స్ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి.

కళా విలాసం..
మొదటి నుంచీ కళలంటే సంగీతం, సాహిత్యం, సాంస్కృతిక నృతకళలపైనే ఎక్కువ ఆసక్తి చూపించే వారు. అయితే ప్రస్తుతం అవి విలాసవంతమైన కళలుగా మారిపోయాయి. ఈ కళలు నేరి్పంచే వారు, సంస్థలు తక్కువగా ఉండటం.. అదే సమయంలో ఔత్సాహికుల సంఖ్య పెరగడంతో సంప్రదాయ కళల విలువ అమాంతం పెరిగిపోయింది. ఈ కళలలో శిక్షణను అందించడానికి నగరం నలుమూలలా ట్రైనింగ్ సెంటర్లు వెలిశాయి. ఇంటికొచ్చి మరీ నేరి్పంచే వారు కూడా ఉన్నారు. నగర వేదికగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోనూ కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి రెండు నెల నుంచి రెండేళ్ల వరకూ శిక్షణను అందించే కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. నగరంలోని రవీంద్రభారతి, శిల్పారామం, శిల్పకళావేదిక, త్యాగరాయ గాన సభ వంటి వేదికలు వీరందరికీ కళా ప్రదర్శనకు వేదికలుగా నిలుస్తున్నాయి.

వినూత్న ఆవిష్కరణలు..
మారుతున్న కాలానికి అనుగుణంగా కళల్లోనూ వినూత్న ఆవిష్కరణలు వస్తున్నాయి. ముఖ్యంగా రెసిన్ ఆర్ట్ వర్క్, పాటరీ మేకింగ్, అక్రిలిక్ పెయింటింగ్, వెస్ట్రన్ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్, సాల్సా డ్యాన్సింగ్ వంటి కళలకు మంచి క్రేజ్ పెరుగుతోంది. ఈ తరం యువతకు హస్తకళల పట్ల ఆసక్తి పెరిగింది. ప్రధానంగా గ్రామీణ, గిరిజన హస్తకళల్లో నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం నగరంలోని పలు ఆర్ట్ స్టూడియోలు వారాంతాల్లో, రెండు నెలల కోర్సులుగా వీటిపై శిక్షణ అందిస్తున్నారు. స్టోన్‌కార్వింగ్, పేపర్ క్రాఫ్ట్, లీఫ్ ఆర్ట్ వంటి వినూత్న కళలకు జై కొడుతున్నారు. మరికొందరు థియేటర్ ఆర్ట్స్ అంటూ సినిమాల వరకూ వెళుతున్నారు. కొందరైతే ఇల్యూజన్ పేరిట విభిన్న కళలకు శ్రీకారం చుడుతున్నారు.
ట్రెండ్‌గా ఇంటీరియర్ ఆర్ట్..
ఇంటీరియర్ కళ అన్నా, ఇంటీరియర్ కళాకృతులన్నా ఈ తరానికి ఇష్టం పెరిగింది. ఇందులో భాగంగా కళాకృతులను తయారు చేయడం నేర్చుకోడానికి అమితంగా ఇష్టపడుతున్నారు. ఇంటిని అందంగా అలంకరించే టెర్రకోట బొమ్మలు, మట్టి పాత్రలు, దారం అల్లికలు వంటివి తయారు చేయడంలో మేము శిక్షణ ఇస్తున్నాం. నగరంలోని కార్ఖానాలో ఎర్త్ అండ్ ఆర్ట్ అనే మా స్టూడియోలో స్టోన్ కారి్వంగ్, బ్లాక్ ప్రింటింగ్, రేడియం తదితర వర్క్‌షాపులను నిర్వహిస్తున్నాం. అవసరమైన మెటీరియల్ మేమే అందిస్తాం.
– ఫాతిమా ఖుజీమా, ఎర్త్ అండ్ ఆర్ట్ స్టూడియో
కళాకారులదే భవిష్యత్తు..
జీవితాన్ని సరికొత్తగా ఆస్వాదించాలనుకునే వారు కనీసం ఏదో ఒక కళలో ప్రావీణ్యం సంపాదిస్తారు. కళాత్మకత అనేది ఒక జీవన విధానం. ఇందులో భాగంగా నేను చెక్కపై కళాకృతులను సృష్టించే ఆర్ట్‌లో ప్రావీణ్యం సాధించాను. గ్రామీణ వాతావరణం నుంచి వచ్చాను. కాబట్టి అందమైన గ్రామీణ ఇతివృత్తాలను చెక్కుతుంటాను. వీటికి నగరంలో మంచి ఆదరణ లభిస్తోంది. భవిష్యత్తులో కళతో ప్రయాణం చేసే వారికి ప్రత్యేక గౌరవం, గుర్తింపు లభిస్తుంది.
– సాయికుమార్, ప్రముఖ వుడ్ ఆర్టిస్ట్
డిజైనింగ్‌పై ఆసక్తి.. ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్ట్స్ సైతం ట్రెండ్‌గా మారాయి. మిగతా కళలు ఎలా ఉన్నా ఈ ఫ్యాషన్ సంబంధింత కళలు సంతృప్తితో పాటు వృత్తిపరమైన ఆర్థిక సౌలభ్యాన్ని సైతం అందిస్తుండటం విశేషం. నగరంలోని పలు బొటిక్‌లు, జ్యువెలరీ మేకింగ్ సంస్థలు ఈ ఫ్యాషన్ డిజైనర్లకు ఉపాధి అవకాశాలు కలి్పస్తున్నారు. దీంతో డిజైనర్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది.