భవితకు ‘నిర్మాణ’ రంగం | Bhavita 'construction' sector | Sakshi
Sakshi News home page

భవితకు ‘నిర్మాణ’ రంగం

Published Wed, Jun 8 2016 1:59 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

భవితకు ‘నిర్మాణ’ రంగం - Sakshi

భవితకు ‘నిర్మాణ’ రంగం

నిర్మాణ రంగం ప్రస్తుత శరవేగంగా వృద్ధి చెందుతున్న విభాగం. మార్కెట్ వాటా పరంగా గత నాలుగేళ్లుగా సగటున పది శాతం వార్షిక వృద్ధి నమోదు చేసుకుంటోంది. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలోనూ కేరాఫ్‌గా నిలుస్తోంది కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్. ఉపాధి కల్పనలో ఈ రంగం జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. తాజా నివేదికల ప్రకారం- 2022 నాటికి నిర్మాణ రంగం, దాని అనుబంధ మౌలిక సదుపాయాల విభాగాల్లో 12.67 మిలియన్ల కొత్త ఉద్యోగాలు నమోదవడం ఖాయమని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో నిర్మాణ రంగంలో కెరీర్ అవకాశాలు.. జాబ్ ప్రొఫైల్స్, అవసరమైన స్కిల్స్‌పై విశ్లేషణ..
 
ప్రాజెక్ట్ మేనేజర్స్
నిర్దిష్టంగా ఒక నిర్మాణం, లేదా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టే వ్యక్తులు.. ప్రాజెక్ట్ మేనేజర్స్. బీటెక్, ఎంటెక్ స్థాయిలో సివిల్ ఇంజనీరింగ్, దాని అనుబంధ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ప్రాజెక్ట్ మేనేజర్స్‌గా చేరొచ్చు. వీరికి అకడమిక్ అర్హతలతోపాటు ప్లానింగ్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్, ఒక ప్రాజెక్ట్ సమర్థంగా పూర్తి చేయడంలో ఎదురయ్యే సానుకూల, ప్రతికూల అంశాలపై ముందుగానే అవగాహన, నాయకత్వ లక్షణాలు, బృంద నైపుణ్యాలు ఉండాలి.
 
సైట్/ప్రాజెక్ట్ ఇంజనీర్స్
ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తిగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే నిపుణులే.. సైట్/ప్రాజెక్ట్ ఇంజనీర్స్. బీటెక్/ఎంటెక్ స్థాయిలో సివిల్, అనుబంధ బ్రాంచ్‌లలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను సైట్/ప్రాజెక్ట్ ఇంజనీర్స్‌గా నియమిస్తారు. ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించి డిజైన్, ప్లానింగ్, షెడ్యూలింగ్, ఎగ్జిక్యూషన్, రిస్క్ మేనేజ్‌మెంట్, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఉంటే కెరీర్‌లో మంచి స్థాయికి చేరొచ్చు.
 
సూపర్‌వైజర్స్
ఉన్నతాధికారులకు, క్షేత్రస్థాయిలో సిబ్బందికి మధ్య వారధిగా పనిచేసేవారే.. సూపర్‌వైజర్స్. నిర్దిష్ట ప్రాజెక్ట్ పనితీరును పర్యవేక్షించే విధులను నిర్వర్తించడం సూపర్‌వైజర్స్ ప్రధాన బాధ్యత. నిర్దిష్ట ప్రాజెక్ట్‌కు అవసరమైన పరికరాలు, మెటీరియల్, మెషినరీ అవసరాల గురించి ముందస్తు అవగాహన ఉంటే సూపర్‌వైజర్స్‌గా మరింత రాణించొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా కింది స్థాయిలో దినసరి వేతనంపై  పనిచేసే సిబ్బంది నిర్వహణ విషయంలో వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరం. డిప్లొమా స్థాయిలో సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు సూపర్‌వైజర్స్ పోస్టుకు అర్హులు.
 
స్వల్పకాలిక కోర్సులతో
వృత్తి నైపుణ్యాలు ఉన్నవారికి నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలం. కొద్దిపాటి శిక్షణ, స్కిల్స్‌తో బార్ బెండర్, మ్యాసన్, ప్లంబర్, పెయింటర్, వెల్డర్, ఎక్విప్‌మెంట్ ఆపరేటర్ వంటి పలు అవకాశాలు అందుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ అర్హతతో;  సెట్విన్, నిమ్స్‌మేలలో అందించే స్వల్పకాలిక శిక్షణ ద్వారా విధులు సమర్థంగా నిర్వహించే అవకాశముంది. నిర్మాణ రంగంలో నిపుణులైన మానవ వనరుల ఆవశ్యకత దృష్ట్యా శిక్షణనిచ్చే సంస్థల సంఖ్య సైతం పెరుగుతోంది.

ముఖ్యంగా ప్రభుత్వ పరిధిలో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్, రాష్ట్రాల పరిధిలో డెరైక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ పరిధిలో వృత్తి శిక్షణ కేంద్రాలు, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్‌లో ఈ శిక్షణ లభిస్తోంది. ప్రస్తుతం కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి కన్‌స్ట్రక్షన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కౌన్సిల్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ వంటి సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి.
 
క్యాడ్ కలిసొచ్చే
కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్‌లో రాణించాలనుకునే అభ్యర్థులకు కలిసొచ్చే మరో ప్రధాన అంశం.. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (క్యాడ్)లో నైపుణ్యం. ప్రస్తుతం నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లన్నీ కంప్యూటర్ ఆధారితంగా రూపొందుతున్నాయి. వీటికి సంబంధించిన నైపుణ్యాలను అందించే కోర్సు.. క్యాడ్ డిజైనింగ్. బీటెక్ స్థాయిలో ఈ కోర్సు అందుబాటులో ఉండదు. ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని సర్టిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీన్ని పూర్తి చేసుకుంటే.. క్షేత్ర స్థాయి విధులు ఎక్కువ అని భావించే కన్‌స్ట్రక్షన్ విభాగంలోనే ఇన్-హౌస్ జాబ్స్ సొంతం చేసుకోవచ్చు.
 
నిర్వహణ నైపుణ్యాలు.. కోర్సులు
నిర్మాణ రంగం ఔత్సాహికులు తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలకు... నిర్వహణ నైపుణ్యాలను కూడా సమ్మిళితం చేస్తే కెరీర్‌లో దూసుకెళ్లొచ్చు. ప్రస్తుతం పలు ఇన్‌స్టిట్యూట్‌లు కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ పేరిట ఇటు కోర్ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, అటు నిర్దిష్ట ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలు అందించే విధంగా కోర్సులు అందిస్తున్నాయి. అవి..
* ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ - కోర్సు: అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్.
* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ (నిక్‌మర్) - కోర్సులు: పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ అడ్వాన్స్‌డ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్.
* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) - కాలికట్, కోర్సు: పోస్ట్ డిప్లొమా ఇన్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్
 
నిర్మాణం, అనుబంధ రంగాల గణాంకాలివే
* దేశంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రెండో పెద్ద రంగం.
 * ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రస్తుతం 45 మిలియన్ ఉద్యోగాలు.
* 2022 నాటికి మానవ వనరుల అవసరం 66.62 మిలియన్లకు చేరుకోనుందని అంచనా
* ప్రభుత్వ మౌలిక నిర్మాణ పథకాల్లోనే (హైవేల నిర్మాణం, రైల్వే నిర్మాణం తదితర) 2022 నాటికి 1.8 మిలియన్ల మంది అవసరమని అంచనా.
* వీటిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రేడ్ సర్టిఫికేషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎన్‌ఎస్‌డీసీ) నిపుణుల కమిటీ సూచించింది.
 
పాజిటివ్‌‌స, నెగటివ్స్
* డిమాండ్ - సప్లయ్ కోణంలో ఏ కోర్సు పూర్తి చేసినా కెరీర్ ఖాయం.
* ప్రారంభంలో కింది స్థాయిలోనే నెలకు రూ.10 వేల వరకు సంపాదించే అవకాశం.
* క్షేత్ర స్థాయి విధులే కాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతున్న ఇన్-హౌస్ జాబ్స్.
* సిబ్బందిని, కార్మికులను మెప్పించడంలో ఎదురయ్యే ఇబ్బందులు.
* అధిక శాతం విధులు క్షేత్ర స్థాయిలో నిర్వహించే విధంగా ఉండటం.
* ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించిన మెటీరియల్స్‌ను త్వరగా తెప్పించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు.
 
ఎమర్జింగ్ కెరీర్
కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ ప్రస్తుతం ఎమర్జింగ్ కెరీర్‌గా మారుతోంది. ముఖ్యంగా డిప్లొమా, బీటెక్ స్థాయిలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారికి అవకాశాలు ఖాయం. వీరు తమ అకడమిక్ అర్హతలకు అనుగుణంగా అదనపు సర్టిఫికేషన్ క్యాడ్, క్యామ్ వంటివి నేర్చుకోవడం, అదే విధంగా ఈ రంగానికి సంబంధించి స్పెషలైజ్డ్ శిక్షణ తరగతులకు హాజరవడం వంటివి చేస్తే ఈ రంగంలో మరింత ఉన్నతంగా ఎదగొచ్చు.
- ప్రొఫెసర్ ఆర్.సతీశ్ కుమార్,నిక్‌మర్, హైదరాబాద్
 
ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్
పలు ఇన్‌స్టిట్యూట్స్ వృత్తి శిక్షణ నైపుణ్యాలను అందించే కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. అవి..
నేషనల్ కౌన్సిల్ ఫర్ కన్‌స్ట్రక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్
కోర్సులు: డిప్లొమా ఇన్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ క్వాలిటీ సర్వేయింగ్.
సర్టిఫికెట్ కోర్సులు: సైట్ ఆర్గనైజేషన్ అండ్ లేఔట్; కాంక్రీట్ అండ్ కాంక్రీటింగ్, ప్లాంట్ అండ్ ఎక్విప్‌మెంట్ మెయింటనెన్స్ తదితర కోర్సులు.
వెబ్‌సైట్: www.baionline.in                               
 
నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్
     అసిస్టెంట్ కన్‌స్ట్రక్షన్ లేబొరేటరీ టెక్నీషియన్
     అసిస్టెంట్ స్కాఫోల్డర్
     హెల్పర్ బార్ బెండర్ అండ్ ఫిక్సర్
     హెల్పర్ కార్పెంటర్
     హెల్పర్ కన్‌స్ట్రక్షన్ లేబొరేటరీ టెక్నీషియన్
     హెల్పర్ మాసన్
 వీటిని కన్‌స్ట్రక్షన్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ విభాగం పరిధిలో పలు ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందం ద్వారా అందిస్తోంది
 వెబ్‌సైట్: www.nsdcindia.org

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement