- చెక్కుల రూపంలోనూ ఆస్తి పన్ను చెల్లించవచ్చు : బీబీఎంపీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : తప్పు చేసిన వారికి, చేయని వారికీ ఒకే రకమైన ‘శిక్ష’ను విధించడం ద్వారా చేసిన పొరపాటును బీబీఎంపీ ఎట్టకేలకు సరిదిద్దుకుంది. ఇకమీదట ఆస్తి పన్ను చెల్లింపునకు చెక్కులను కూడా స్వీకరిస్తామని బుధవారం ప్రకటించింది. నగరంలో ఆస్తి పన్ను చెల్లింపు ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
ఈ నెలాఖరులోగా చెల్లించిన వారికి మొత్తం పన్ను మొత్తంలో ఐదు శాతం రాయితీ కూడా లభిస్తుంది. దీంతో పెద్ద మొత్తంలో పన్ను వసూలయ్యేది. గతంలో చెక్కుల రూపంలో పన్నులను స్వీకరించే వారు. అయితే కొన్ని చెక్కులు నిరాదరణకు గురవడం, బీబీఎంపీ సిబ్బందే అవకతవకలకు పాల్పడడం వల్ల ఎన్నడూ లేని విధంగా ఈఏడాది డీడీలు లేదా పే ఆర్డర్ల రూపంలో మాత్రమే పన్ను చెల్లించాలని బీబీఎంపీ షరతు విధించింది. రూ వెయ్యి లోపు అయితే నగదు రూపంలోనే చెల్లించవచ్చని ఆదేశించింది.
వీటి కోసం బ్యాంకుల వద్ద క్యూలో నిలుచుకోలేక చాలా మంది పన్ను చెల్లింపు పట్ల ఉత్సాహం చూపించలేదు. సాధారణంగా ఈ ఒక్క నెలలోనే రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు వసూలయ్యేది. ప్రస్తుతం ఇప్పటి వరకు రూ. 84 కోట్లు మాత్రమే వసూలైంది. మరో వారం రోజుల్లో రూ.150 కోట్ల వరకు వసూలు కావడం గగనమే. డీడీలు, పే ఆర్డర్ నిబంధన వల్లే పన్ను చెల్లింపు పట్ల నగర పౌరులు పెద్దగా ఉత్సాహం చూపడం లేదని తేలడంతో బీబీఎంపీ నాలుక్కరచుకుని, నష్ట నివారణ చర్యలు చేపట్టింది. దీనికి తోడు బీబీఎంపీ సిబ్బంది ఈ నెల 17 వరకు లోక్‌సభ ఎన్నికల్లో నిమగ్నం కావడం, తర్వాత వరుసగా మూడు రోజులు సెలవు రావడం వల్ల కూడా పన్ను వసూలులో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
గడువు పెంపు అనుమానమే
సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఐదు శాతం రాయితీ పొందడానికి గడువు తేదీని పొడిగించే అవకాశాలుంటాయి. అయితే ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, గడువు పెంపు అనుమానమేనని బీబీఎంపీ అధికారులు చెబుతున్నారు. అసలే ఆదాయం లేక నానా అగచాట్లు పడుతున్న బీబీఎంపీకి ప్రస్తుత పన్ను వసూలు వైనం మూలిగే నక్కపై తాటికాయ పడిన చందాన తయారైంది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినందున ఎన్నికల కమిషన్ అనుమతితో వచ్చే నెలాఖరు వరకు ఐదు శాతం రాయితీ గడువును పొడిగించినట్లయితే పన్ను వసూళ్లు ఊపందుకుంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెల్ల అర్జీ తప్పనిసరి
ఈ ఏడాది పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు లేనందున, నిర్ణీత దరఖాస్తు పూర్తి చేసి సమర్పించాలనే నిబంధనపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పన్ను మొత్తంలో మార్పు లేనప్పుడు దరఖాస్తు ఎందుకని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు. అయితే కేఎంసీ చట్టం ప్రకారం పన్ను మొత్తంతో పాటు నిర్ణీత దరఖాస్తును భర్తీ చేసి సమర్పించడం తప్పనిసరని బీబీఎంపీ తెలిపింది. కాగా బీబీఎంపీ సహాయ రెవెన్యూ అధికారి కార్యాలయాలతో పాటు ఐడీబీఐ బ్యాంకు, కెనరా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, బెంగళూరు వన్ కేంద్రాల్లో డీడీలు లేదా పే ఆర్డర్ల రూపంలో ఆస్తి పన్ను చెల్లించే అవకాశం కల్పించినట్లు వివరించింది. రూ.వెయ్యి లోపైతే నగదు రూపంలో చెల్లించవచ్చని తెలిపింది.