పత్రికలకు ఆదరణ భేష్!
ఏయూ జర్నలిజం బీవోఎస్ చైర్మన్ ఆచార్య మూర్తి
ఏఎన్‌యూ: ప్రపంచ వ్యాప్తంగా పత్రికలకు ఆదరణ తగ్గుతున్నా భారతదేశంలో పత్రికలకు ఆదరణ నానాటికీ పెరుగుతోందని ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం బీవోఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్) చైర్మన్ ఆచార్య డి.వి.ఆర్.మూర్తి చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగంలో గురువారం ‘ప్రస్తుత సమాజంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పాత్ర’ అంశంపై డాక్టర్ మూర్తి ప్రసంగించారు. సమాజంలోని సామాన్యుల అవసరాలు, సమస్యలను అధ్యయనం చేసి వాటిని పరిష్కరించే విధంగా పాత్రికేయులు కృషిచేయాలన్నారు. విలువలు, నిబద్ధతతో వృత్తిలో ముందుకు సాగితేనే పాత్రికేయ రంగం దీర్ఘకాలం మనగలుగుతుందని చెప్పారు. రోజురోజుకూ సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందడంతో మీడియా రంగంలో డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. దానికి అనుగుణంగా పాత్రికేయులు పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్‌యూ జర్నలిజం విభాగాధిపతి« డాక్టర్ జి.అనిత, అధ్యాపకుడు డాక్టర్ జె.మధుబాబు పాల్గొన్నారు.