ఆజన్మం: పదేళ్ల నాటి జాబితా | goods prices to hike more In the last ten years | Sakshi
Sakshi News home page

ఆజన్మం: పదేళ్ల నాటి జాబితా

Published Sun, Dec 8 2013 3:03 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

ఆజన్మం: పదేళ్ల నాటి జాబితా - Sakshi

ఆజన్మం: పదేళ్ల నాటి జాబితా

24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం 6115 నుంచి ఐదురెట్లు పెరిగింది (30,550). వెండీ అంతే!
 కిలో 9000 ఉండేది 45,460 నడుస్తోంది.

 
 ఈ ఆలోచనకు బీజం ఏమిటో ఇప్పుడు గుర్తులేదు; అప్పటికి ఇంకా జర్నలిజంలోకి కూడా రాలేదు; కానీ, కాలంలో వీటి పరుగును చూడాలనే కోరిక ఏదో ఉండివుంటుంది. అందుకే సరిగ్గా దశాబ్దం కింద, నవంబర్ 23, 2003న కొన్ని వస్తువులు, సేవల ధరలను డైరీలో రాసిపెట్టాను. అప్పుడు పటాన్‌చెరులో ఉన్నాను కాబట్టి, ఆ స్థానీయత అనివార్యం. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటున్నాను కాబట్టి ఇదీ దృష్టిలో ఉంచుకోవాలి. పరిధి అవరోధం కాని ఇతర అంకెలు కూడా ఉన్నాయి.
 
 పదేళ్ల కింద కిలో టమోటా 8 రూపాయలు. నిన్నా మొన్న నలభై ఉంది; ‘ఇవ్వాళ’ పాతిక్కి దిగింది(!). అప్పటి 9 రూపాయల ఉల్లిగడ్డ నిన్న 34! తడిచినవైతే 15; జిట్టిగడ్డలు 10; నెలరోజుల క్రితం 60 కూడా అమ్మారు. మూడ్రూపాయల ఇరానీ చాయ్ పదైంది! 1.60 కోడిగుడ్డును కిరాణాలో ఐద్రూపాయలకు కొన్నాను; రైతుబజార్లో డజన్ 48. డజన్ అరటిపళ్లు 35. పదేళ్లకింద 10. పటాన్‌చెరు ‘ఆనంద్’లో మీల్స్ 25 ఉన్నప్పుడు, హైదరాబాద్‌లో భోజనం 40 ఉండేది. ‘కాకతీయ మెస్’లో ఇప్పుడు 70!
 
 ఇంకొన్ని ధరలు: బ్రాకెట్లో ఇస్తున్నవి ఇప్పటివి. అన్నీ కిలోకు. ఆలుగడ్డ 12 (24); క్యారట్ 12 (20); చక్కెర 16 (32); అన్నపూర్ణ ఉప్పు 6.50 (16); గోధుమరవ్వ 14 (32); మసూరి బియ్యం 16 (40); చికెన్ 64 (148); మటన్ 120 (400). మొక్కజొన్న క్వింటాల్ 505 (1274). ఇంకా- పాలు 200 ఎంఎల్ 3.50 (‘విజయా’ లీటర్ 34); సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ 47 (80); 200 ఎంఎల్ కూల్‌డ్రింక్ 5 (10); మీడియం సైజు కుండ 15 (50); మైసూర్ శాండల్ సబ్బు 18 (30); అజయ్ టూత్ బ్రష్ 15 (21); లేజర్ బ్లేడ్ 1.50 (2); రెనాల్డ్స్ జెట్టర్ పెన్ 15 (20), రీఫిల్ 6.50 (8); కాల్గేట్ టూత్‌పేస్ట్-100గ్రా. 30 (37); 1.5వోల్ట్స్ బ్యాటరీ 7 (10); ఆల్ ఔట్ 42 (59); జెమిని టీ పొడి-25గ్రా 4.50 (100గ్రా. 34); రిన్ సుప్రీమ్-125గ్రా 8.50 (సర్ఫ్ ఎక్సెల్ అయింది; 100గ్రా. 10).
 
 పదేళ్ల కింద- ఫోన్ కాల్ లోకల్ 90 సెకన్లకు 1.50. అదే 180 సెకన్లకు 2. ఇప్పుడు మొబైల్స్ వచ్చేశాయి. పాటలు నింపిద్దామని 10 బ్లాంక్ క్యాసెట్స్ సెట్ కోఠిలో 135కు కొన్నానప్పుడు. ఇప్పుడు క్యాసెట్స్ ఎక్కడ? సినిమా బాల్కనీ పటాన్‌చెరు ‘రుక్మిణి’లో 25, హైదరాబాద్‌లో 35-40 ఉండేది; ఇప్పుడు మల్టీప్లెక్స్‌లో 200. హెయిర్ కట్ 12 ఉండేది; గుడిమల్కాపూర్‌లో(కాలనీలో) 30 తీసుకుంటున్నారు. మెయిన్‌రోడ్డులో 60. ఆర్రూపాయల షేవింగ్ కూడా 30 అయింది. కేబుల్ బిల్ రెట్టింపై 200 అయింది. బీర్ కూడా డబులై 90 అయింది. కింగ్‌సైజ్ గోల్డ్‌ఫ్లేక్ డైలీ పేపర్‌తో సమానంగా 2.80 ఉండేది. పేపర్ 5 ఐతే, సిగరెట్‌కు పాన్‌షాపులో 8 ఇవ్వాలిప్పుడు. ఇంకా కొన్ని: ఇండియాటుడే వీక్లీ 8 (20); ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ 5 (8); టైలర్ చార్జ్- చొక్కా 50 (200); టైలర్ చార్జ్- ప్యాంటు 90 (250); రూపా చేతుల బనీన్ 40 (75); యూరో అండర్‌వేర్ 45 (100); లాండ్రీలో ఐరన్- సింగిల్ క్లాత్ 1.50 (4); జిరాక్స్ కాపీ 1 (2);  పటాన్‌చెరు-కోటి బస్ టికెట్ 13 (20); హైదరాబాద్-వేములవాడ ఎక్స్‌ప్రెస్ టికెట్ 58 (116); పెట్రోల్ లీటర్ 37 (83); డాక్టర్ కన్సల్టేషన్ ఫీ 30 (‘కేర్’లో 1+1 విజిట్=500).
 
 డైలీ బస్ పాస్-ఆర్డినరీ సబర్బన్ 28 ఉండేది. ఇప్పుడు అర్బన్, సబర్బన్, ఆర్డినరీ, మెట్రో అంతా ఒకటే టికెట్. 70! ఎల్పీజీ సిలిండర్ 270 ఉండేది. ఇప్పుడు ఆధార్, బ్యాంకు, జమ, గొడవ! సబ్సిడీతో 412; లేకుండా 1060 దాకా! ‘మోటార్ బైక్’ 40000 నుంచి 64000 అందుకుంది. 24 క్యారెట్ల 10గ్రా. బంగారం 6115 నుంచి ఐదురెట్లు పెరిగింది(30,550). వెండీ అంతే! కిలో 9000 ఉండేది 45,460 నడుస్తోంది. ఇక, రూపాయి విలువ ఇలా మారింది: డాలర్ 45.53 (62.72); యూరో 56.14 (85); పౌండ్ 79.70 (101.66).
 
 రిజర్వు బ్యాంకు వడ్డీరేటు 6 శాతం (9); బ్యాంకుల్లో వ్యక్తిగత వడ్డీరేటు 13 శాతం (18-25); పల్లెటూళ్లలో వ్యక్తిగత వడ్డీ అప్పుడూ ఇప్పుడూ 24 శాతమే! దేశ ఆర్థికాభివృద్ధి రేటు అప్పుడు 4.5 శాతం. ఇప్పుడు 5 అంటున్నారు. బీఎస్‌ఇ సెన్సెక్స్ పాయింట్ల సూచి 5263 నుంచి 20217కు ఎగబాకింది(!). చివరగా- ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.57,141 కోట్లు ఉండేది. ఇప్పుడు ‘సమైక్యాంధ్రప్రదేశ్’ రుణం 1,60,000 కోట్లు!
 సాధారణంగా అంకెలు కనబడే ఐటెమ్స్ చదవడానికి హాయిగా ఉండవు. అందుకే ఫీచర్ రైటర్స్ 10 అని వేయాల్సిన చోట పది అనే రాస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఈ అంకెలు నాకు తమాషాగా కనబడుతున్నాయి. కాకపోతే, ఈ అంకెలు వేస్తూ కూర్చోవడానికి కారణమైన నిరుద్యోగపు ఖాళీదనంలో మాత్రం ఏ తమాషా లేదు!
 - పూడూరి రాజిరెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement