Puduri Raji Reddy
-
కేంద్ర సాహిత్య అకాడమీలో పూడూరి రాజిరెడ్డి ముచ్చట!
తన కథను ఆంగ్లంలో చదివి వినిపించిన రాజిరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన యువ సాహితీ–ది న్యూ హార్వెస్ట్ కార్యక్ర మంలో యువ రచయిత, ‘సాక్షి’ సాహిత్య పేజీ ఇన్చార్జి పూడూరి రాజిరెడ్డి తాను రాసిన కథను ఆంగ్లంలో వినిపించారు. 40 ఏళ్లలోపు వయసు గల రచయితలను ప్రోత్స హించేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన ఈ కార్యక్ర మంలో పాల్గొనేందుకు తెలుగు భాష నుంచి పూడూరి రాజిరెడ్డికి ఆహ్వానం లభించింది. ఇలా 24 భాషలకు సంబంధిం చిన యువ రచయితలకు ఆహ్వానం రాగా వారు వారి ప్రచురణలను ఆంగ్లంలో చదివి వినిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగపురానికి చెందిన పూడూరి రాజిరెడ్డి 2009లో ‘చింతకింది మల్లయ్య ముచ్చట’ శీర్షికతో రాసిన కథ ‘సాక్షి’ ఫన్డే మ్యాగజైన్లో ప్రచురితమైంది. ఈ కథను రాజిరెడ్డి ఎంచుకుని యువ సాహితీ కార్యక్రమంలో ఆంగ్లంలో ‘హీరో ఆఫ్ నాన్ స్టోరీ’ శీర్షికన చదివి వినిపించారు. ఈ కథలో కథానాయకుడు మల్లయ్య జీవితంలో నాటకీయతను చొప్పించకుండా మల్లయ్యకు ఉన్న తనదైన అస్తిత్వం, ఉనికిని కాపాడుతూ కథనం సాగుతుంది. మనిషిని మనిషిగా గుర్తించకుండా నాటకీయ తను చొప్పించే ప్రయత్నాలను వ్యంగ్యంగా చిత్రిస్తూ సాగుతుందీ కథనం. -
అస్లీ మంజిల్
ఐదో క్లాసులో ఉన్నప్పుడు పెద్దమామ గృహప్రవేశానికి మేడ్చల్ వచ్చాం. బంగ్లా మీదికి ఎక్కితే విమానాలు తలమీదే ఎగురుకుంటూ పోతున్నాయి. హైదరాబాదీకి మేడ్చల్ మేడ్చలే కానీ.. వేములవాడ దగ్గరి పల్లెటూర్లో పుట్టిన వాడికి మేడ్చల్ అంటే హైదరాబాదే ! ఆ బంగ్లా మీది నుంచి ఎత్తుగా ఒక నిర్మాణం కనబడింది. నాలుగు గుమ్మటాలు! ‘ఓహో అయితే ఇదే పుస్తకంలో చదువుకున్న చార్మినార్ కావొచ్చు,’ అనుకున్నా. దాన్ని మా సుహాసిని వదిన సరిదిద్దింది. ‘‘ఇది మసీదు; చార్మినార్ అంటే సిటీలో ఉంటుంది,’’ అంది. మేడ్చల్‌లో ఏనాడూ హైదరాబాద్‌ను హైదరాబాద్ అనగా వినలేదు. ‘సిటీ’యే! అదీ హైదరాబాద్ అనే ఉనికితో నా తొలి సంపర్కం. తర్వాత కీసరగుట్ట రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. దానికోసం ఉప్పల్ బస్టాపులో 242 జీ ఎక్కాను. ఆలియా కాలేజీలో ఇంటర్ చేశాను. సిటీ అంతా నాకు థియేటర్లుగా పరిచయం! ‘మనోహర్ టాకీస్ లేదా?’ ‘ఆరాధన నుంచి ముందుకువోతే...’ ‘వెంకటాద్రి ఉంది సూడు’ ఇట్లా! సికింద్రాబాద్ ఏనాడో హైదరాబాద్‌ను పెళ్లాడింది కాబట్టి రెంటినీ ఒకటిగానే కలిపేసి చెప్పేస్తున్నా.హైదరాబాద్‌లోనే మొదటిసారి థియేటర్లో టికెట్‌కు నంబర్ ఉంటుందని తెలుసుకున్నా. ప్రశాంత్; రౌడీగారి పెళ్లాం; హెచ్ 14. టీ చుక్క చొక్కా మీద ఒలికిపోతే ఆ రోజంతా వాసన వచ్చిన ఇరానీ చాయ్‌ని మొదటిసారి ఇక్కడే రుచిచూశాను. బ్లూ సీ; సికింద్రాబాద్.తొలి సిగరెట్ ఇక్కడే కాల్చాను. సీనియర్ ఇంటర్; జూ పార్క్ దగ్గర; శివగానితో. కానీ కాల్చడం అంటే అది కాదని తెలియడానికి నాకు మరో రెండేళ్లు పట్టింది. మొదటి సాఫ్ట్ పోర్న్ సినిమా ఇక్కడే చూశాను. లాంబా; హిజ్ వైఫ్ అండ్ హర్ లవర్; నాకు తొలి ‘దర్శనం’ ఇచ్చింది హెలెన్ మిర్రెన్! గప్‌చుప్ పేరుతో ఒక గుండ్రటి ఐటెమ్ ఉంటుందని ఇక్కడే తెలుసుకున్నా (రేతిఫైల్ బస్‌స్టేషన్). మొదటి దమ్కీ బిర్యానీ ఇక్కడే తిన్నా (బాంబే హోటల్; రాణీగంజ్). అప్పుడే చేస్తున్న బ్రెడ్ వాసన ఇక్కడే పీల్చాను (చార్మినార్). అమ్మాయి సిగరెట్ తాగడం ఇక్కడే చూశాను (సంగీత్ థియేటర్). పార్కులో అమ్మాయీ అబ్బాయీ యథేచ్ఛగా ముద్దుపెట్టుకోవడం ఇక్కడే చూశాను (సంజీవయ్య పార్క్). నా తొలి ‘ఉద్యోగం’ ఇక్కడే చేశాను. అంకుర్ బట్టల షాపులో హెల్పర్‌గా! చెప్పుకోవడానికి బాగుండే కష్టాలు నాక్కూడా కొన్ని ఉన్నయ్! యండమూరిని మాత్రమే చదివిన నాకు చలం పుస్తకాలు ఇక్కడే పరిచయం (సుల్తాన్‌బజార్ విశాలాంధ్ర). పాతపుస్తకాలు అమ్మడం ఇక్కడే చూశాను (కోఠి). నా తొలి కథ ఇక్కడే రాశాను. డిగ్రీ అయిన తర్వాత రామ్‌నగర్‌లో అద్దెకున్నాను ఫ్రెండ్స్‌తో. ఓనర్ అర్జునరావు. ఆ మేడమీద రాశాను ‘ఆమె పాదాలు’. అంతకుముందు కొన్నిరాసినా కూడా నేను స్టాంపు కొట్టుకోవచ్చు అనుకున్నాను దీంతో. మొదటిసారి సెల్‌ఫోన్ వాడింది ఇక్కడే. ఇంటర్నెట్ వినియోగించింది ఇక్కడే. భోజనం లేకుండా ఒకే రోజు మూడు సినిమాలు చూసింది ఇక్కడే. రన్నింగ్ బస్సుల నుంచి దూకి పడ్డది ఇక్కడే! కర్ఫ్యూ ఇక్కడే మొదటిసారి అనుభవించాను. పోలీసు దెబ్బ ఇక్కడే తిన్నాను. కాలు తొక్కి కూడా పశ్చాత్తాపం ప్రకటించని మనుషుల్ని ఇక్కడే చూశాను. కొనకపోతే కొట్టేంత పనిచేసే పొగరుబోతు అమ్మకందారుల్ని ఇక్కడే చూశాను. ఇంత.. సందులో ఇళ్లుండటం ఇక్కడే చూశాను. ముందట డ్రైనేజీ పారుతుంటే మనుషులు తినాల్సిరావడం ఇక్కడే చూశాను. షాపుల ముందు మనుషులు చాలీచాలని బట్టలతో నిద్రించడం ఇక్కడే చూశాను. ఇంకా, ఇప్పటి చాలామంది మిత్రుల్ని కలుసుకుంది ఇక్కడే! నా ఇద్దరు పిల్లలు ప్రాణం పోసుకుంది కూడా ఇక్కడే! అందుకే ఈ నగరాన్ని ఎంతగా ప్రేమిస్తానో అంతగా ద్వేషిస్తాను; ఎంతగా ద్వేషిస్తానో అంతగా ప్రేమిస్తాను. ఎందుకంటే నా జీవితంలోని చాలా విలువైన భాగం, విడదీయలేని భాగం ఈ నేలతో ముడిపడి వుంది కాబట్టి! పూడూరి రాజిరెడ్డి (poodoorirajireddy@gmail.com) -
ఆజన్మం: పదేళ్ల నాటి జాబితా
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 6115 నుంచి ఐదురెట్లు పెరిగింది (30,550). వెండీ అంతే! కిలో 9000 ఉండేది 45,460 నడుస్తోంది. ఈ ఆలోచనకు బీజం ఏమిటో ఇప్పుడు గుర్తులేదు; అప్పటికి ఇంకా జర్నలిజంలోకి కూడా రాలేదు; కానీ, కాలంలో వీటి పరుగును చూడాలనే కోరిక ఏదో ఉండివుంటుంది. అందుకే సరిగ్గా దశాబ్దం కింద, నవంబర్ 23, 2003న కొన్ని వస్తువులు, సేవల ధరలను డైరీలో రాసిపెట్టాను. అప్పుడు పటాన్చెరులో ఉన్నాను కాబట్టి, ఆ స్థానీయత అనివార్యం. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటున్నాను కాబట్టి ఇదీ దృష్టిలో ఉంచుకోవాలి. పరిధి అవరోధం కాని ఇతర అంకెలు కూడా ఉన్నాయి. పదేళ్ల కింద కిలో టమోటా 8 రూపాయలు. నిన్నా మొన్న నలభై ఉంది; ‘ఇవ్వాళ’ పాతిక్కి దిగింది(!). అప్పటి 9 రూపాయల ఉల్లిగడ్డ నిన్న 34! తడిచినవైతే 15; జిట్టిగడ్డలు 10; నెలరోజుల క్రితం 60 కూడా అమ్మారు. మూడ్రూపాయల ఇరానీ చాయ్ పదైంది! 1.60 కోడిగుడ్డును కిరాణాలో ఐద్రూపాయలకు కొన్నాను; రైతుబజార్లో డజన్ 48. డజన్ అరటిపళ్లు 35. పదేళ్లకింద 10. పటాన్చెరు ‘ఆనంద్’లో మీల్స్ 25 ఉన్నప్పుడు, హైదరాబాద్‌లో భోజనం 40 ఉండేది. ‘కాకతీయ మెస్’లో ఇప్పుడు 70! ఇంకొన్ని ధరలు: బ్రాకెట్లో ఇస్తున్నవి ఇప్పటివి. అన్నీ కిలోకు. ఆలుగడ్డ 12 (24); క్యారట్ 12 (20); చక్కెర 16 (32); అన్నపూర్ణ ఉప్పు 6.50 (16); గోధుమరవ్వ 14 (32); మసూరి బియ్యం 16 (40); చికెన్ 64 (148); మటన్ 120 (400). మొక్కజొన్న క్వింటాల్ 505 (1274). ఇంకా- పాలు 200 ఎంఎల్ 3.50 (‘విజయా’ లీటర్ 34); సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ 47 (80); 200 ఎంఎల్ కూల్‌డ్రింక్ 5 (10); మీడియం సైజు కుండ 15 (50); మైసూర్ శాండల్ సబ్బు 18 (30); అజయ్ టూత్ బ్రష్ 15 (21); లేజర్ బ్లేడ్ 1.50 (2); రెనాల్డ్స్ జెట్టర్ పెన్ 15 (20), రీఫిల్ 6.50 (8); కాల్గేట్ టూత్‌పేస్ట్-100గ్రా. 30 (37); 1.5వోల్ట్స్ బ్యాటరీ 7 (10); ఆల్ ఔట్ 42 (59); జెమిని టీ పొడి-25గ్రా 4.50 (100గ్రా. 34); రిన్ సుప్రీమ్-125గ్రా 8.50 (సర్ఫ్ ఎక్సెల్ అయింది; 100గ్రా. 10). పదేళ్ల కింద- ఫోన్ కాల్ లోకల్ 90 సెకన్లకు 1.50. అదే 180 సెకన్లకు 2. ఇప్పుడు మొబైల్స్ వచ్చేశాయి. పాటలు నింపిద్దామని 10 బ్లాంక్ క్యాసెట్స్ సెట్ కోఠిలో 135కు కొన్నానప్పుడు. ఇప్పుడు క్యాసెట్స్ ఎక్కడ? సినిమా బాల్కనీ పటాన్చెరు ‘రుక్మిణి’లో 25, హైదరాబాద్‌లో 35-40 ఉండేది; ఇప్పుడు మల్టీప్లెక్స్‌లో 200. హెయిర్ కట్ 12 ఉండేది; గుడిమల్కాపూర్‌లో(కాలనీలో) 30 తీసుకుంటున్నారు. మెయిన్‌రోడ్డులో 60. ఆర్రూపాయల షేవింగ్ కూడా 30 అయింది. కేబుల్ బిల్ రెట్టింపై 200 అయింది. బీర్ కూడా డబులై 90 అయింది. కింగ్సైజ్ గోల్డ్‌ఫ్లేక్ డైలీ పేపర్‌తో సమానంగా 2.80 ఉండేది. పేపర్ 5 ఐతే, సిగరెట్‌కు పాన్‌షాపులో 8 ఇవ్వాలిప్పుడు. ఇంకా కొన్ని: ఇండియాటుడే వీక్లీ 8 (20); ఎంప్లాయ్మెంట్ న్యూస్ 5 (8); టైలర్ చార్జ్- చొక్కా 50 (200); టైలర్ చార్జ్- ప్యాంటు 90 (250); రూపా చేతుల బనీన్ 40 (75); యూరో అండర్వేర్ 45 (100); లాండ్రీలో ఐరన్- సింగిల్ క్లాత్ 1.50 (4); జిరాక్స్ కాపీ 1 (2); పటాన్చెరు-కోటి బస్ టికెట్ 13 (20); హైదరాబాద్-వేములవాడ ఎక్స్‌ప్రెస్ టికెట్ 58 (116); పెట్రోల్ లీటర్ 37 (83); డాక్టర్ కన్సల్టేషన్ ఫీ 30 (‘కేర్’లో 1+1 విజిట్=500). డైలీ బస్ పాస్-ఆర్డినరీ సబర్బన్ 28 ఉండేది. ఇప్పుడు అర్బన్, సబర్బన్, ఆర్డినరీ, మెట్రో అంతా ఒకటే టికెట్. 70! ఎల్పీజీ సిలిండర్ 270 ఉండేది. ఇప్పుడు ఆధార్, బ్యాంకు, జమ, గొడవ! సబ్సిడీతో 412; లేకుండా 1060 దాకా! ‘మోటార్ బైక్’ 40000 నుంచి 64000 అందుకుంది. 24 క్యారెట్ల 10గ్రా. బంగారం 6115 నుంచి ఐదురెట్లు పెరిగింది(30,550). వెండీ అంతే! కిలో 9000 ఉండేది 45,460 నడుస్తోంది. ఇక, రూపాయి విలువ ఇలా మారింది: డాలర్ 45.53 (62.72); యూరో 56.14 (85); పౌండ్ 79.70 (101.66). రిజర్వు బ్యాంకు వడ్డీరేటు 6 శాతం (9); బ్యాంకుల్లో వ్యక్తిగత వడ్డీరేటు 13 శాతం (18-25); పల్లెటూళ్లలో వ్యక్తిగత వడ్డీ అప్పుడూ ఇప్పుడూ 24 శాతమే! దేశ ఆర్థికాభివృద్ధి రేటు అప్పుడు 4.5 శాతం. ఇప్పుడు 5 అంటున్నారు. బీఎస్ఇ సెన్సెక్స్ పాయింట్ల సూచి 5263 నుంచి 20217కు ఎగబాకింది(!). చివరగా- ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.57,141 కోట్లు ఉండేది. ఇప్పుడు ‘సమైక్యాంధ్రప్రదేశ్’ రుణం 1,60,000 కోట్లు! సాధారణంగా అంకెలు కనబడే ఐటెమ్స్ చదవడానికి హాయిగా ఉండవు. అందుకే ఫీచర్ రైటర్స్ 10 అని వేయాల్సిన చోట పది అనే రాస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఈ అంకెలు నాకు తమాషాగా కనబడుతున్నాయి. కాకపోతే, ఈ అంకెలు వేస్తూ కూర్చోవడానికి కారణమైన నిరుద్యోగపు ఖాళీదనంలో మాత్రం ఏ తమాషా లేదు! - పూడూరి రాజిరెడ్డి -
ఆజన్మం: ఒక (అ)పరిచిత ముఖం
ఆయనతో నేను సంభాషించినట్టుగా ‘ప్లే’ చేసుకుంటే అది సరిగ్గా అమరుతోంది. అంటే ఆయన నాకు ఎక్కడో తారసపడ్డాడనిపించేంత వాస్తవికంగా ఆ ఊహ పొసిగింది. ధ్యానం మీద కూడా నాకు ఆసక్తి లేకపోలేదు. కొన్నిసార్లు ప్రయత్నించిన మాట కూడా నిజమే! తీరా ఆ సమయంలో, నాలోకి మరింత బలంగా చొచ్చుకువచ్చే శబ్దాల్తో మమేకమైపోతాను; ఎంతగా అంటే, వేటిని తొలగించుకోవాలని చెబుతుంటారో, వాటిని కాక, తొలగించుకోవడమనే కర్తవ్యాన్నే మరిచిపోతాను. అయితే, ఎప్పటికైనా ధ్యానాన్ని విస్మరించకూడని లక్ష్యంగా గుర్తిస్తూనే... అలాంటిదొకటి ఇవ్వబోయే ఆనందమంటూ ఏమీవుండబోదనే ‘సంశయాత్మక జాగ్రత్త’ను గమనింపులో ఉంచుకుంటూనే... ఏదైనాసరే, దాన్ని నాకు నేనుగా తేల్చుకోవాల్సిన విషయంగా పక్కకు పెట్టేస్తుంటాను. కళ్లు మూసినప్పుడు పరిస్థితి అలావుంది సరే; తెరిచినప్పుడు మాత్రం దానికి భిన్నంగా ఏంవుందీ! మొన్నోరోజు, యథావిధిగా ఆఫీసుకని బయల్దేరాను. మా కాలనీలోంచి మెహిదీపట్నాన్ని అందుకోగలిగే మెయిన్ రోడ్డుకు వస్తుండగా ఒకాయన స్కూటర్ మీద వెళ్లడం చూశాను. శివాలయం దాటుతున్నాడు. రోజూ కనబడే వందల ముఖాల్లో అదీ ఒకటి; దానికి ఏ ప్రత్యేకతా లేదు; రెండు కళ్లు, రెండు చెవులు, ఒక ముక్కు, కొంత జుట్టు! నాలుగు అడుగులు వేసేంతవరకే ఈ భౌతిక వర్ణన పరిధి! దీనికి ఆవల కూడా ఆ ముఖానికీ నాకూ మధ్యన ఏదో ఉందనిపిస్తోంది. ఏమిటది? ఆయనతో నేను సంభాషించినట్టుగా ‘ప్లే’ చేసుకుంటే అది సరిగ్గా అమరుతోంది. అంటే ఆయన నాకు ఎక్కడో తారసపడ్డాడనిపించేంత వాస్తవికంగా ఆ ఊహ పొసిగింది. కాబట్టి ఆయన నాకు తెలుసు. కాని ఎక్కడ, ఎలా తెలుసు? ఆ లొకాలిటీలో నేను ఎక్కడెక్కడ వ్యవహారం కోసం తిరగ్గలిగే అవకాశం ఉంది? జిరాక్సు, పాలు, పాన్‌డబ్బా, కిరాణా, కర్రీ పాయింట్, గోల్డెన్ ప్యాలెస్... ఊహూ! ఏ క్లూ లేదు. ఎంతకీ తెగని ‘సుడోకు’ను ఇక చేయలేమని తేలిపోయాక, పేపర్‌ను మానసికంగా గిరవాటేసినట్టుగా ఆ ఆలోచనను దులిపేసుకున్నాను.అయితే, తెల్లారి, అదే తోవలో, ఎడమవైపు వేసుకున్న బ్యాగును వీపుకు సమంగా ఉండేట్టుగా జరుపుకొంటూ మెయిన్‌రోడ్డున వస్తుండగా- ఉన్నట్టుండి, అసందర్భంగా ఆ ముఖం మళ్లీ నా మెదడులో ప్రత్యక్షమైంది. అవునుగదా, ఇంతకీ ఆయనెవరు? ఎంత గింజుకున్నా స్ఫురించలేదు. నేను షేర్ ఆటో ఎక్కడంతో, చోటుచాలక, ఆ ఆలోచనే నన్ను దిగిపోయింది. చిత్రంగా- మళ్లీ మరుసటి రోజు, ఆ పైరోజు... అదే తోవలో, అదే సమయంలో, శివాలయం ఇంకో నాలుగడుగుల్లో వస్తుందనగా- అంటే ఏ పాయింట్లో ఆయన్ని ‘తొలిసారి’ చూశానో అక్కడే ఉన్నట్టుండి, ‘అరే! ఆ ముఖం ఎవరిదో ఇంకా గుర్తురాలేదే’ అని గుర్తురావడం... అవే పోలికలున్న మరో ముఖం హఠాత్తుగా ఈ ముఖం మీద ఇంపోజ్ అవుతుంది. రెండూ కలిసిపోయి... అసలు ఏ ముఖం నాక్కావాలి? ఇదా, అదా? రెంటికీ సారూప్యత ఉన్నప్పటికీ ఎక్కడో వాటిని వేరుచేసే కీలకాన్ని కాసేపటికి పట్టుకుంటాను. ఇద్దరిలో ఈయనది కొంచెం నడ్డిముక్కు. ఆఆఆ... నాక్కావాల్సింది ఇదే! ముక్కు సరే; ముఖం ఎవరిది? ఒక్కోసారి, పళ్లల్లో జామగింజ ఇరుక్కుంటే, నాలుకతో ఎన్ని జిమ్నాస్టిక్స్ చేయించినా అది ఊడిరాదు. ఇక విసిగిపోయి, నాలుక మానాన నాలుకను పడేశాక, ఎప్పుడో ఉన్నట్టుండి, గింజ పళ్లకిందికి వచ్చి ‘కిట్క్’మంటుంది; నాలుక నోరంతా సంచరించే స్వేచ్ఛ దొరుకుతుంది. ఇదిగో, అలా, నేను ఆయనెవరో ఉన్నట్టుండి ‘ఊడిపడ్డాక’ ఆ ఆలోచననుంచి విముక్తం కాగలిగాను. ఇంతాచేస్తే- ఆయన, నేను ఏ వారానికో వెళ్లి గోధుమపిండో, ఎండు ఖర్జూరాలో కొనే రైతుబజార్ దుకాణదారు! ఒక నిర్ణీత ప్రదేశంలో, కుర్చీకి పైన, భుజాల వరకే చూసివున్న ముఖాన్ని... స్కూటర్ మీద కాళ్లు కనబడేలా, పైగా బంధితుడిలా కాకుండా సంచారిలా చూసేసరికి... తెలిసిన ముఖమే అయినా తెలియని దేహం కావడంతో లింకు తెగిపోయినట్టుంది! ఆ ముఖం ఇంకా కిందికి, కాళ్ల దాకా కూడా వ్యాపించివుంటుంది... ఆ కాళ్లకు ప్యాంటు వేసివుంటుంది... అన్న స్పృహ అంతకుముందు మనకు ఎందుకు ఉండబోతుంది? చాలా విషయాలు- ఇలాగే మనకు ముఖం వరకే తెలిసివుండి, తీరా దాన్ని నిలబెట్టిన కాళ్లు కనబడ్డప్పుడు- రెంటినీ కలుపుకోవడంలో విఫలమై ఉక్కిరిబిక్కిరి అవుతామేమో! - పూడూరి రాజిరెడ్డి -
ఆజన్మం: ఇలాంటి కొన్ని పిచ్చులు కూడా...
ఏ రోజు పేపర్లో కపిల్ ఫొటో కనబడితే, ఆ రోజు చించడం, అతికించడం! నోటుబుక్కు అయిపోయేసరికి పొట్ట ఉబ్బిపోయి, మూస్తే విచిత్రంగా కనిపించేది. కీసరగుట్ట స్కూల్లో ఎయిత్లో ఉన్నప్పుడు ఐ.శ్రీనుగానికీ అరవింద్‌కూ నాకూ పోటీ; క్రికెట్‌కు సంబంధించిన పేపర్ కటింగ్స్ సంపాదించడంలో! ఐ.శ్రీను ఎందుకంటే, బి.శ్రీను, సి.శ్రీను, డి.శ్రీను, జె.శ్రీను, కె.శ్రీను... ఇంతమందుండేవారు. నేను ప్రత్యేకంగా కపిల్‌దేవ్ బొమ్మలను సేకరించేవాడిని. ఒక నోటు బుక్కులో ఏ రోజు పేపర్లో కపిల్ ఫొటో కనబడితే, ఆ రోజు చించడం, అతికించడం! నోటుబుక్కు అయిపోయేసరికి దాని పొట్ట ఉబ్బిపోయి, మూస్తే విచిత్రంగా కనిపించేది. కొంతకాలానికి ఈ అలవాటు ఎలాగో ఎగిరిపోయింది. ఇప్పుడు నా జీవితంలో క్రికెట్‌కే స్థానం లేదు. ఇది నైన్త్ ఆ ప్రాంతంలో ఉండేది. రోడ్డుమీద కనబడే బోర్డుల్లో ఏ ఇంగ్లీషు పదాన్ని చూసినా, అందులో ఎన్ని ‘జడ్’లు ఉండగలవో లెక్కిస్తూ ఉండేవాణ్ని. మనసులోనే దానికి సంబంధించిన క్యాల్కులేషన్ జరుగుతూ ఉండేది. ‘వై’కు ‘ఎ’ కలిపితే ఒక జడ్ అవుతుంది. ఉదాహరణకు: అఓఏఐ అంటే ఎస్+ఎ= టి; టి+కె= జడ్(1)+ఇ; ఇ+ఎస్=ఎక్స్, ఎక్స్+హెచ్=జడ్(2)+ఎఫ్, ఎఫ్+ఐ=ఒ; ఫైనల్‌గా 2 జడ్‌లు, ఒక ‘ఒ’. ఈ లెక్కలను సింప్లిఫై చేసుకోవడానికి నాకు నేనే కనిపెట్టుకున్న కొన్ని సమీకరణాలు ఉన్నాయి. రెండు ‘ఎం’లు కలిస్తే ఒక జడ్. ‘ఆర్’కు ‘హెచ్’ కలిపినా జడ్ అవుతుంది. టి+ఎఫ్= జడ్. ఎస్+టి+ఎం కలిపితే రెండు జడ్‌లు వస్తాయి. పై పెదవి చివర్లను కొంచెం లోనికి వంచి, నె.మ్మ.ది.గా జారవిడుస్తుంటే అదో రకంగా ఉంటుంది. పెదవి అంచు హోల్డ్ కావాలంటే, కొద్దిగా పొడిగా ఉండాలి. ఇక చూడు, పెదవి ముడవడం, నెమ్మదిగా జారవిడవడం. నిజంగా నేను ఏం చేసేదీ కరెక్టుగా ఇక్కడ రాయనూలేనూ, బొమ్మ గీసి చూపనూ లేనుగానీ అదొక పిచ్చిలా తయారయ్యింది కొన్నాళ్లు. తరచూ చేయడం వల్ల, ఆ రాపిడికి పై పెదవి అంచు మధ్యభాగం నల్లబడిపోయేది. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు విడుదలయ్యుంటాయి? ఎంతమంది దర్శకులు ఉండివుంటారు? ఎంత మంది సినిమా పాటలు రాసివుంటారు? నిర్మాతలు, సంగీత దర్శకులు, ఛాయాగ్రాహకులు, రచయితలు, గాయనీగాయకులు, ఎడిటర్లు... ఫైట్ మాస్టర్లను కూడా వదలకుండా నోటుబుక్కులో గీతలు కొట్టి పేర్లు నమోదు చేస్తూ పోయేవాడిని. ఎక్కడ కొత్త పేరు కనబడినా అందులో చేర్చేవాణ్ని. సినిమాను మినహాయించిన ప్రపంచం ఉంటుందంటే నమ్మని రోజుల్లో... నా వ్యక్తిగత ప్రపంచాన్ని రసమయం చేసినవాళ్లందరికీ అది నేనిచ్చిన నివాళి కావొచ్చు! మొన్న మా గోపాల్‌రావుపల్లె అత్తమ్మ వాళ్ల మనవడి గురించి దుఃఖపడుతూ, ‘‘డాక్టర్ ఏదిజెప్పినా మారుత్తరం ఇయ్యకుండా అచ్చుడేగదారా,’’ అంది. ఆమెనూ ఆమెతోపాటు మమ్మల్నీ దుఃఖపెట్టే ఆ కారణం ఇక్కడ అసందర్భం. కాకపోతే, చదువుకోని ఆ అత్తమ్మ నోట పలికిన ‘మారుత్తరం’ అనే మాట నాకు కొత్తది. దీన్ని ఎందుకు సందర్భం చేస్తున్నానంటే, ఇలాంటి పదాల్ని సేకరించే పిచ్చి కూడా కొంతకాలం కొనసాగించాను. కనీసం ఒక వెయ్యి పదాలు! బస్సులో వెళ్తున్నప్పుడో, ఆడవాళ్లు పిండి విసురుతూ ముచ్చట్లు పెడుతున్నప్పుడో, మా పెద్దమ్మ ఉన్నట్టుండి ఏ సామెతో విసిరినప్పుడో... అరే ఇది దొరికింది, అది దొరికింది, అని గబగబా రాసుకోవడం! ఆరేడేళ్ల తర్వాత అదేపనిని ‘తెలంగాణ పదకోశం’గా నలిమెల భాస్కర్ సార్ మరింత అర్థవంతంగా తలకెత్తుకుంటారని అప్పుడు తెలీదు. క్రికెట్ ఫొటోల స్థానంలో న్యూస్పేపర్లో నచ్చేవి కట్ చేసి అతికించే పిచ్చి కొన్ని రోజులు కొనసాగింది. చాలావరకు ఉద్వేగాలకు సంబంధించిన క్లిప్పింగ్స్ సేకరించేవాడిని. దానికి సమాంతరంగా ‘బుక్ క్రికెట్’లో ప్రపంచకప్ నిర్వహిస్తుండేవాణ్ని; కనబడిన ప్రతిమనిషి పేరూ రాసుకోవాలని కొంతకాలం ఆరాటపడ్డాను; భూమ్మీద ఉన్నందరినీ వీడియో తీయాలని కొంతకాలం ఆలోచించాను; ‘భరనభభరవ’ తెలిసిన రోజుల్లో గురువులు, లఘువుల సాక్షిగా ‘అసురోత్పలమాల’ పద్యం రాసే పనిలోపడ్డాను; కొన్ని నెలలు సినిమా పాటలు రాసి కాల్చేశాను; కొంతకాలం నవలలు మొదలుపెట్టి మూలన పడేశాను. కారణం: ఎక్కడో ‘వ్యాట్ 69’ అని చదువుతాం. ఇక నా నవల్లో విలన్‌కు అది తాగే సీన్ పెట్టాలి! కానీ అదేమిటో నాకే తెలియకుండా నా పాత్రను ఎలా రుచి చూడనిచ్చేది? మన ఖాళీ సమయాల్ని పూరించిన కొన్ని పిచ్చి విషయాలు, అప్పుడు పిచ్చివిగా కనబడక జీవితం హాయిగా గడిచిపోయింది. వాటిని పిచ్చి అని గుర్తించడం మొదలెట్టాక, అవి తొలగిపోయాయిగానీ, వాటిని భర్తీ చేసే మంచి పిచ్చులేవో జొరబడక ఆ శూన్యం అలా కొనసాగుతూ వస్తోంది. - పూడూరి రాజిరెడ్డి