ఏ రోజు పేపర్లో కపిల్ ఫొటో కనబడితే, ఆ రోజు చించడం, అతికించడం! నోటుబుక్కు అయిపోయేసరికి పొట్ట ఉబ్బిపోయి, మూస్తే విచిత్రంగా కనిపించేది. కీసరగుట్ట స్కూల్లో ఎయిత్‌లో ఉన్నప్పుడు ఐ.శ్రీనుగానికీ అరవింద్‌కూ నాకూ పోటీ; క్రికెట్‌కు సంబంధించిన పేపర్ కటింగ్స్ సంపాదించడంలో! ఐ.శ్రీను ఎందుకంటే, బి.శ్రీను, సి.శ్రీను, డి.శ్రీను, జె.శ్రీను, కె.శ్రీను... ఇంతమందుండేవారు. నేను ప్రత్యేకంగా కపిల్‌దేవ్ బొమ్మలను సేకరించేవాడిని. ఒక నోటు బుక్కులో ఏ రోజు పేపర్లో కపిల్ ఫొటో కనబడితే, ఆ రోజు చించడం, అతికించడం! నోటుబుక్కు అయిపోయేసరికి దాని పొట్ట ఉబ్బిపోయి, మూస్తే విచిత్రంగా కనిపించేది. కొంతకాలానికి ఈ అలవాటు ఎలాగో ఎగిరిపోయింది. ఇప్పుడు నా జీవితంలో క్రికెట్‌కే స్థానం లేదు.
ఇది నైన్త్ ఆ ప్రాంతంలో ఉండేది. రోడ్డుమీద కనబడే బోర్డుల్లో ఏ ఇంగ్లీషు పదాన్ని చూసినా, అందులో ఎన్ని ‘జడ్’లు ఉండగలవో లెక్కిస్తూ ఉండేవాణ్ని. మనసులోనే దానికి సంబంధించిన క్యాల్కులేషన్ జరుగుతూ ఉండేది. ‘వై’కు ‘ఎ’ కలిపితే ఒక జడ్ అవుతుంది. ఉదాహరణకు: అఓఏఐ అంటే ఎస్+ఎ= టి; టి+కె= జడ్(1)+ఇ; ఇ+ఎస్=ఎక్స్, ఎక్స్+హెచ్=జడ్(2)+ఎఫ్, ఎఫ్+ఐ=ఒ; ఫైనల్‌గా 2 జడ్‌లు, ఒక ‘ఒ’. ఈ లెక్కలను సింప్లిఫై చేసుకోవడానికి నాకు నేనే కనిపెట్టుకున్న కొన్ని సమీకరణాలు ఉన్నాయి. రెండు ‘ఎం’లు కలిస్తే ఒక జడ్. ‘ఆర్’కు ‘హెచ్’ కలిపినా జడ్ అవుతుంది. టి+ఎఫ్= జడ్. ఎస్+టి+ఎం కలిపితే రెండు జడ్లు వస్తాయి.
పై పెదవి చివర్లను కొంచెం లోనికి వంచి, నె.మ్మ.ది.గా జారవిడుస్తుంటే అదో రకంగా ఉంటుంది. పెదవి అంచు హోల్డ్ కావాలంటే, కొద్దిగా పొడిగా ఉండాలి. ఇక చూడు, పెదవి ముడవడం, నెమ్మదిగా జారవిడవడం. నిజంగా నేను ఏం చేసేదీ కరెక్టుగా ఇక్కడ రాయనూలేనూ, బొమ్మ గీసి చూపనూ లేనుగానీ అదొక పిచ్చిలా తయారయ్యింది కొన్నాళ్లు. తరచూ చేయడం వల్ల, ఆ రాపిడికి పై పెదవి అంచు మధ్యభాగం నల్లబడిపోయేది.
ఇప్పటివరకు ఎన్ని సినిమాలు విడుదలయ్యుంటాయి? ఎంతమంది దర్శకులు ఉండివుంటారు? ఎంత మంది సినిమా పాటలు రాసివుంటారు? నిర్మాతలు, సంగీత దర్శకులు, ఛాయాగ్రాహకులు, రచయితలు, గాయనీగాయకులు, ఎడిటర్లు... ఫైట్ మాస్టర్లను కూడా వదలకుండా నోటుబుక్కులో గీతలు కొట్టి పేర్లు నమోదు చేస్తూ పోయేవాడిని. ఎక్కడ కొత్త పేరు కనబడినా అందులో చేర్చేవాణ్ని. సినిమాను మినహాయించిన ప్రపంచం ఉంటుందంటే నమ్మని రోజుల్లో... నా వ్యక్తిగత ప్రపంచాన్ని రసమయం చేసినవాళ్లందరికీ అది నేనిచ్చిన నివాళి కావొచ్చు!
మొన్న మా గోపాల్రావుపల్లె అత్తమ్మ వాళ్ల మనవడి గురించి దుఃఖపడుతూ, ‘‘డాక్టర్ ఏదిజెప్పినా మారుత్తరం ఇయ్యకుండా అచ్చుడేగదారా,’’ అంది. ఆమెనూ ఆమెతోపాటు మమ్మల్నీ దుఃఖపెట్టే ఆ కారణం ఇక్కడ అసందర్భం. కాకపోతే, చదువుకోని ఆ అత్తమ్మ నోట పలికిన ‘మారుత్తరం’ అనే మాట నాకు కొత్తది. దీన్ని ఎందుకు సందర్భం చేస్తున్నానంటే, ఇలాంటి పదాల్ని సేకరించే పిచ్చి కూడా కొంతకాలం కొనసాగించాను. కనీసం ఒక వెయ్యి పదాలు! బస్సులో వెళ్తున్నప్పుడో, ఆడవాళ్లు పిండి విసురుతూ ముచ్చట్లు పెడుతున్నప్పుడో, మా పెద్దమ్మ ఉన్నట్టుండి ఏ సామెతో విసిరినప్పుడో... అరే ఇది దొరికింది, అది దొరికింది, అని గబగబా రాసుకోవడం! ఆరేడేళ్ల తర్వాత అదేపనిని ‘తెలంగాణ పదకోశం’గా నలిమెల భాస్కర్ సార్ మరింత అర్థవంతంగా తలకెత్తుకుంటారని అప్పుడు తెలీదు.
క్రికెట్ ఫొటోల స్థానంలో న్యూస్‌పేపర్లో నచ్చేవి కట్ చేసి అతికించే పిచ్చి కొన్ని రోజులు కొనసాగింది. చాలావరకు ఉద్వేగాలకు సంబంధించిన క్లిప్పింగ్స్ సేకరించేవాడిని. దానికి సమాంతరంగా ‘బుక్ క్రికెట్’లో ప్రపంచకప్ నిర్వహిస్తుండేవాణ్ని; కనబడిన ప్రతిమనిషి పేరూ రాసుకోవాలని కొంతకాలం ఆరాటపడ్డాను; భూమ్మీద ఉన్నందరినీ వీడియో తీయాలని కొంతకాలం ఆలోచించాను; ‘భరనభభరవ’ తెలిసిన రోజుల్లో గురువులు, లఘువుల సాక్షిగా ‘అసురోత్పలమాల’ పద్యం రాసే పనిలోపడ్డాను; కొన్ని నెలలు సినిమా పాటలు రాసి కాల్చేశాను; కొంతకాలం నవలలు మొదలుపెట్టి మూలన పడేశాను. కారణం: ఎక్కడో ‘వ్యాట్ 69’ అని చదువుతాం. ఇక నా నవల్లో విలన్‌కు అది తాగే సీన్ పెట్టాలి! కానీ అదేమిటో నాకే తెలియకుండా నా పాత్రను ఎలా రుచి చూడనిచ్చేది?
మన ఖాళీ సమయాల్ని పూరించిన కొన్ని పిచ్చి విషయాలు, అప్పుడు పిచ్చివిగా కనబడక జీవితం హాయిగా గడిచిపోయింది. వాటిని పిచ్చి అని గుర్తించడం మొదలెట్టాక, అవి తొలగిపోయాయిగానీ, వాటిని భర్తీ చేసే మంచి పిచ్చులేవో జొరబడక ఆ శూన్యం అలా కొనసాగుతూ వస్తోంది.
- పూడూరి రాజిరెడ్డి