Ajanmam
-
ఆజన్మం: వెయ్యి ప్రశ్నల ఉదయం
‘‘ఇట్ల గట్టిగ ఉండద్దు; ఇల్లంత ఇప్పేసి మళ్లీ మనం మెత్తగ గట్టుకుందం నానా’’ అన్నాడు. కన్నీ, నానీ, బంగారుతండ్రీ లాంటి నాటకీయ మాటలు- ఎవరి నోటినుంచైనా రావడం సహజమైన విషయమేనని తండ్రయ్యాకగానీ నాకు అర్థంకాలేదు. పిల్లలతో అనుబంధం ఎలా ఉంటుందంటే- వాళ్లతో గడిపినప్పటికంటే- కొన్ని రోజులు గడిచాక, ఆ సందర్భం చుట్టూ అంటుకునివున్న మకిలి అంశాలేమైనావుంటే కరిగిపోయి, కేవలం వాళ్లకు వాళ్లుగా నిలబడి మరింత మురిపెం కలిగిస్తారు. ముఖ్యంగా వాళ్ల ప్రశ్నలు, చేష్టలు! ‘‘పొద్దున లేశినంక ఎందుకు మొఖం కడుక్కొని, ఎందుకు తానం చెయ్యాలి?’’ అని అడుగుతాడు మా పెద్దోడు. ‘‘చీమలు మూతలు దీస్కొని లోపల్కి వోతయా?’’ అని వాడి సందేహం. ఎటూ నేనిచ్చేవి సారహీనమైన జవాబులే అయివుంటాయి కాబట్టి, వాటిని ఇక్కడ రాయను. ‘‘పల్లికాయ బుక్కితే ఇక్కడ ఎందుకు కదులుతది?’’ అని నా కణతను చూపిస్తాడు. ఇంకా వాడి ప్రశ్నలు ఎలా ఉంటాయంటే: ‘‘కుక్క ఎందుకు మాట్లాడది?’’ ‘‘మరి (‘ఐస్ ఏజ్’లో) ఏనుగు ఎందుకు మాట్లాడుతంది?’’ ‘‘నీ కాళ్లు అంత పెద్దగ ఎందుకున్నయ్?’’ ‘‘నాకు మీసాలు ఎందుకు రాలేదు?’’ ‘‘నాన్నా, నీకు ఇక్కడ(చంక) గడ్డం ఎందుకుంది?... మరి ఎంటికలుంటే చక్కిలిగిలి అయితదా?’’ ‘‘చెడ్డి ఇప్పినప్పుడు (నేను) తువ్వాల కట్టుకోవద్దా?... నేను చిన్నపిల్లగాణ్ని కదాని సిగ్గు కాదా?’’ ‘‘లేదంటే కర్రె దొడ్డికత్తదా?’’ అంటాడు, జ్వరం వస్తుందని చెబితే. ‘‘అమ్మ పత్తి ఏర ఎందుకువోదు?’’ అనడుగుతాడు, నానమ్మ పనికెళ్లడం చూస్తాడు కాబట్టి. వాళ్లమ్మ ఇంట్లో ఏదో పనిచేస్తూ వీణ్ని వినిపించుకోకపోతే వీడి స్తోత్రం: ‘ఓ గోర్లపేంటు పెట్టుకున్నమ్మా... ఓ బొట్టు పెట్టుకున్నమ్మా... ఓ గాజులు వేసుకున్నమ్మా...’ ‘‘తిరుపతి మామ రెండు సార్లు పెళ్లి చేసుకుంటడా?’’ అని వాడి అనుమానం. ఎంగేజ్మెంట్, తర్వాత పెళ్లి అవుతుందిగా! ‘‘నానా, నేను నిన్ను పెళ్లి చేసుకోవన్నా?’’ ‘‘నన్నా!’’ ‘‘అమ్మను?’’ ‘‘వద్దురా!’’ ‘‘మరి పప్పక్కను?’’ ‘‘అట్లనద్దురా.’’ ఓసారి- జ్యువెలరీ యాడ్‌లో ఉన్న ‘వధువు’ను చూపిస్తూ, ‘‘ఈమెను పెళ్లి జేసుకుంట’’ అన్నాడు. ‘‘పెళ్లి జేసుకొని ఏం జేస్తవ్‌రా?’’ ‘‘పేమిత్త!’’ ..!!!.. వాణ్ని చదువుకు వేయడంలోని అనివార్య నిర్దయను అనుభవిస్తున్నాను. ఒక్కోరోజు బడికి పోను నాన్నా, అంటాడు. ‘‘ఎప్పుడు నేనేనా? తమ్ముణ్ని ఒక్కసారన్న తోలియ్యవా’’ అని ప్రశ్నిస్తాడు. ఒక గేదె, పెయ్య రోడ్డుమీద వెళ్తుంటే- ‘‘బర్రె బయట్నే మూత్రం ఎందుకు పోస్తది? బాత్రూమ్ల పెండ పెడితే ఏమైతది?’’ అన్నప్పుడు నవ్వొస్తుంది; ‘‘క్యాప్టెల్ బర్రె స్మాల్ బర్రె’’ అనడం ముచ్చటగొలుపుతుంది; కానీ, ‘‘బుక్కుల్నేమో ఫిష్షంటం, బయట్నేమో చేపంటమా?’’ అన్నప్పుడు మాత్రం మన విద్యావ్యవస్థ కలిగిస్తున్న గిల్టును తొలగించుకునేందుకు నాకు కొంత సమయం పడుతుంది. ‘‘(ఈ) మామిడికాయలు అన్ని మనయేనా?’’ ‘‘కాదు తాతయ్యవాళ్లయి.’’ ‘‘తాతయ్యవాళ్లు మనింట్ల ఎందుకు వెట్టిండ్రు శెట్టు?’’ ‘‘ఇది వాళ్ల ఇల్లే.’’ ‘‘మరి మనది?’’ ఇల్లు మనది కాకపోవడం అనేది కూడా ఉంటుందని వాడికి జీర్ణం కాలేదు. అదే అద్దింట్లో ఒకరోజు ఉరుకుతూ గచ్చు మీద పడిపోయాడు. పెపైదవి చీరుకుపోయి, రక్తం కారింది. ‘‘ఇట్ల గట్టిగ ఉండద్దు; ఇల్లంత ఇప్పేసి మళ్లీ మనం మెత్తగ గట్టుకుందం నానా’’ అన్నాడు. గాల్లో అక్షరాల స్వరూపం గీస్తుంటాడు. వాడిని టీవీ లోపట్కి పంపియ్యిమంటాడు. తాళం తీయగలుగుతున్నాడు. తలకు పెట్టిన నూనె తీసెయ్యమంటాడు. ‘నీకు పెద్ద ఇల్లు కట్టిత్త, నీ పుస్తకాలన్నీ పెట్టుకుందు’వని చెబుతాడు. వాడు చెప్పింది నాకు అర్థం కాకపోతే ‘నానా నేనేమంటున్ననా...’ అని వివరించబోతాడు. సూదిత్తే ఏ(డ)వాలి; బిష్షాం అంటే ఇట్ల (గుడ్లు తేలిసి) పడిపోవాలంటున్న చిన్నోడి దశను వీడు దాటిపోయాడు. ‘నువ్వింక బుద్దెప్పుడు నేర్సుకుంటవ్రా’ అని తమ్ముణ్ని గదమాయిస్తాడు. ‘‘ఇవ్వాళ చిన్నోడి గోర్లు దీయాలె’’ అంది వాళ్లమ్మ. ‘‘పండ్లు కూడా తీయాలి నాన్నా, ఊకె కొరుకుతున్నడు’’ అన్నాడు. ఇదేమీ కంక్లూజన్‌కు వచ్చే సందర్భం కాదుగానీ, ఆఫీసునుంచి వెళ్లగానే రోజూ పరుగెత్తుకు వచ్చేవాడు రాలేదు. నాకంటే టీవీలో మహేశ్‌బాబు ఎక్కువైపోయిన వాస్తవాన్ని ఎలా జీర్ణించుకోగలను! రేపెప్పుడో అమ్మాయి వాడి జీవితంలోకి వస్తే? ప్రయారిటీల్లో మన స్థానమేంటని ఎప్పటికప్పుడు పూర్తి అవగాహనతో ఉండటమేనా మనం చేయాల్సింది! మామూలుగా నాకన్నా ముందు లేవడు. ఎప్పుడైనా! అలా ఓరోజు మంచం దిగుతూ- నేను మేలుకున్నాను అప్పటికి- నా కాళ్ల మీది చెద్దరు సరిచేసి దిగుతున్నాడు. అయ్యో నా బంగారుతండ్రీ! - పూడూరి రాజిరెడ్డి -
ఆజన్మం: ఒక (అ)పరిచిత ముఖం
ఆయనతో నేను సంభాషించినట్టుగా ‘ప్లే’ చేసుకుంటే అది సరిగ్గా అమరుతోంది. అంటే ఆయన నాకు ఎక్కడో తారసపడ్డాడనిపించేంత వాస్తవికంగా ఆ ఊహ పొసిగింది. ధ్యానం మీద కూడా నాకు ఆసక్తి లేకపోలేదు. కొన్నిసార్లు ప్రయత్నించిన మాట కూడా నిజమే! తీరా ఆ సమయంలో, నాలోకి మరింత బలంగా చొచ్చుకువచ్చే శబ్దాల్తో మమేకమైపోతాను; ఎంతగా అంటే, వేటిని తొలగించుకోవాలని చెబుతుంటారో, వాటిని కాక, తొలగించుకోవడమనే కర్తవ్యాన్నే మరిచిపోతాను. అయితే, ఎప్పటికైనా ధ్యానాన్ని విస్మరించకూడని లక్ష్యంగా గుర్తిస్తూనే... అలాంటిదొకటి ఇవ్వబోయే ఆనందమంటూ ఏమీవుండబోదనే ‘సంశయాత్మక జాగ్రత్త’ను గమనింపులో ఉంచుకుంటూనే... ఏదైనాసరే, దాన్ని నాకు నేనుగా తేల్చుకోవాల్సిన విషయంగా పక్కకు పెట్టేస్తుంటాను. కళ్లు మూసినప్పుడు పరిస్థితి అలావుంది సరే; తెరిచినప్పుడు మాత్రం దానికి భిన్నంగా ఏంవుందీ! మొన్నోరోజు, యథావిధిగా ఆఫీసుకని బయల్దేరాను. మా కాలనీలోంచి మెహిదీపట్నాన్ని అందుకోగలిగే మెయిన్ రోడ్డుకు వస్తుండగా ఒకాయన స్కూటర్ మీద వెళ్లడం చూశాను. శివాలయం దాటుతున్నాడు. రోజూ కనబడే వందల ముఖాల్లో అదీ ఒకటి; దానికి ఏ ప్రత్యేకతా లేదు; రెండు కళ్లు, రెండు చెవులు, ఒక ముక్కు, కొంత జుట్టు! నాలుగు అడుగులు వేసేంతవరకే ఈ భౌతిక వర్ణన పరిధి! దీనికి ఆవల కూడా ఆ ముఖానికీ నాకూ మధ్యన ఏదో ఉందనిపిస్తోంది. ఏమిటది? ఆయనతో నేను సంభాషించినట్టుగా ‘ప్లే’ చేసుకుంటే అది సరిగ్గా అమరుతోంది. అంటే ఆయన నాకు ఎక్కడో తారసపడ్డాడనిపించేంత వాస్తవికంగా ఆ ఊహ పొసిగింది. కాబట్టి ఆయన నాకు తెలుసు. కాని ఎక్కడ, ఎలా తెలుసు? ఆ లొకాలిటీలో నేను ఎక్కడెక్కడ వ్యవహారం కోసం తిరగ్గలిగే అవకాశం ఉంది? జిరాక్సు, పాలు, పాన్‌డబ్బా, కిరాణా, కర్రీ పాయింట్, గోల్డెన్ ప్యాలెస్... ఊహూ! ఏ క్లూ లేదు. ఎంతకీ తెగని ‘సుడోకు’ను ఇక చేయలేమని తేలిపోయాక, పేపర్‌ను మానసికంగా గిరవాటేసినట్టుగా ఆ ఆలోచనను దులిపేసుకున్నాను.అయితే, తెల్లారి, అదే తోవలో, ఎడమవైపు వేసుకున్న బ్యాగును వీపుకు సమంగా ఉండేట్టుగా జరుపుకొంటూ మెయిన్‌రోడ్డున వస్తుండగా- ఉన్నట్టుండి, అసందర్భంగా ఆ ముఖం మళ్లీ నా మెదడులో ప్రత్యక్షమైంది. అవునుగదా, ఇంతకీ ఆయనెవరు? ఎంత గింజుకున్నా స్ఫురించలేదు. నేను షేర్ ఆటో ఎక్కడంతో, చోటుచాలక, ఆ ఆలోచనే నన్ను దిగిపోయింది. చిత్రంగా- మళ్లీ మరుసటి రోజు, ఆ పైరోజు... అదే తోవలో, అదే సమయంలో, శివాలయం ఇంకో నాలుగడుగుల్లో వస్తుందనగా- అంటే ఏ పాయింట్లో ఆయన్ని ‘తొలిసారి’ చూశానో అక్కడే ఉన్నట్టుండి, ‘అరే! ఆ ముఖం ఎవరిదో ఇంకా గుర్తురాలేదే’ అని గుర్తురావడం... అవే పోలికలున్న మరో ముఖం హఠాత్తుగా ఈ ముఖం మీద ఇంపోజ్ అవుతుంది. రెండూ కలిసిపోయి... అసలు ఏ ముఖం నాక్కావాలి? ఇదా, అదా? రెంటికీ సారూప్యత ఉన్నప్పటికీ ఎక్కడో వాటిని వేరుచేసే కీలకాన్ని కాసేపటికి పట్టుకుంటాను. ఇద్దరిలో ఈయనది కొంచెం నడ్డిముక్కు. ఆఆఆ... నాక్కావాల్సింది ఇదే! ముక్కు సరే; ముఖం ఎవరిది? ఒక్కోసారి, పళ్లల్లో జామగింజ ఇరుక్కుంటే, నాలుకతో ఎన్ని జిమ్నాస్టిక్స్ చేయించినా అది ఊడిరాదు. ఇక విసిగిపోయి, నాలుక మానాన నాలుకను పడేశాక, ఎప్పుడో ఉన్నట్టుండి, గింజ పళ్లకిందికి వచ్చి ‘కిట్క్’మంటుంది; నాలుక నోరంతా సంచరించే స్వేచ్ఛ దొరుకుతుంది. ఇదిగో, అలా, నేను ఆయనెవరో ఉన్నట్టుండి ‘ఊడిపడ్డాక’ ఆ ఆలోచననుంచి విముక్తం కాగలిగాను. ఇంతాచేస్తే- ఆయన, నేను ఏ వారానికో వెళ్లి గోధుమపిండో, ఎండు ఖర్జూరాలో కొనే రైతుబజార్ దుకాణదారు! ఒక నిర్ణీత ప్రదేశంలో, కుర్చీకి పైన, భుజాల వరకే చూసివున్న ముఖాన్ని... స్కూటర్ మీద కాళ్లు కనబడేలా, పైగా బంధితుడిలా కాకుండా సంచారిలా చూసేసరికి... తెలిసిన ముఖమే అయినా తెలియని దేహం కావడంతో లింకు తెగిపోయినట్టుంది! ఆ ముఖం ఇంకా కిందికి, కాళ్ల దాకా కూడా వ్యాపించివుంటుంది... ఆ కాళ్లకు ప్యాంటు వేసివుంటుంది... అన్న స్పృహ అంతకుముందు మనకు ఎందుకు ఉండబోతుంది? చాలా విషయాలు- ఇలాగే మనకు ముఖం వరకే తెలిసివుండి, తీరా దాన్ని నిలబెట్టిన కాళ్లు కనబడ్డప్పుడు- రెంటినీ కలుపుకోవడంలో విఫలమై ఉక్కిరిబిక్కిరి అవుతామేమో! - పూడూరి రాజిరెడ్డి -
ఆజన్మం: ఇలాంటి కొన్ని పిచ్చులు కూడా...
ఏ రోజు పేపర్లో కపిల్ ఫొటో కనబడితే, ఆ రోజు చించడం, అతికించడం! నోటుబుక్కు అయిపోయేసరికి పొట్ట ఉబ్బిపోయి, మూస్తే విచిత్రంగా కనిపించేది. కీసరగుట్ట స్కూల్లో ఎయిత్లో ఉన్నప్పుడు ఐ.శ్రీనుగానికీ అరవింద్‌కూ నాకూ పోటీ; క్రికెట్‌కు సంబంధించిన పేపర్ కటింగ్స్ సంపాదించడంలో! ఐ.శ్రీను ఎందుకంటే, బి.శ్రీను, సి.శ్రీను, డి.శ్రీను, జె.శ్రీను, కె.శ్రీను... ఇంతమందుండేవారు. నేను ప్రత్యేకంగా కపిల్‌దేవ్ బొమ్మలను సేకరించేవాడిని. ఒక నోటు బుక్కులో ఏ రోజు పేపర్లో కపిల్ ఫొటో కనబడితే, ఆ రోజు చించడం, అతికించడం! నోటుబుక్కు అయిపోయేసరికి దాని పొట్ట ఉబ్బిపోయి, మూస్తే విచిత్రంగా కనిపించేది. కొంతకాలానికి ఈ అలవాటు ఎలాగో ఎగిరిపోయింది. ఇప్పుడు నా జీవితంలో క్రికెట్‌కే స్థానం లేదు. ఇది నైన్త్ ఆ ప్రాంతంలో ఉండేది. రోడ్డుమీద కనబడే బోర్డుల్లో ఏ ఇంగ్లీషు పదాన్ని చూసినా, అందులో ఎన్ని ‘జడ్’లు ఉండగలవో లెక్కిస్తూ ఉండేవాణ్ని. మనసులోనే దానికి సంబంధించిన క్యాల్కులేషన్ జరుగుతూ ఉండేది. ‘వై’కు ‘ఎ’ కలిపితే ఒక జడ్ అవుతుంది. ఉదాహరణకు: అఓఏఐ అంటే ఎస్+ఎ= టి; టి+కె= జడ్(1)+ఇ; ఇ+ఎస్=ఎక్స్, ఎక్స్+హెచ్=జడ్(2)+ఎఫ్, ఎఫ్+ఐ=ఒ; ఫైనల్‌గా 2 జడ్‌లు, ఒక ‘ఒ’. ఈ లెక్కలను సింప్లిఫై చేసుకోవడానికి నాకు నేనే కనిపెట్టుకున్న కొన్ని సమీకరణాలు ఉన్నాయి. రెండు ‘ఎం’లు కలిస్తే ఒక జడ్. ‘ఆర్’కు ‘హెచ్’ కలిపినా జడ్ అవుతుంది. టి+ఎఫ్= జడ్. ఎస్+టి+ఎం కలిపితే రెండు జడ్‌లు వస్తాయి. పై పెదవి చివర్లను కొంచెం లోనికి వంచి, నె.మ్మ.ది.గా జారవిడుస్తుంటే అదో రకంగా ఉంటుంది. పెదవి అంచు హోల్డ్ కావాలంటే, కొద్దిగా పొడిగా ఉండాలి. ఇక చూడు, పెదవి ముడవడం, నెమ్మదిగా జారవిడవడం. నిజంగా నేను ఏం చేసేదీ కరెక్టుగా ఇక్కడ రాయనూలేనూ, బొమ్మ గీసి చూపనూ లేనుగానీ అదొక పిచ్చిలా తయారయ్యింది కొన్నాళ్లు. తరచూ చేయడం వల్ల, ఆ రాపిడికి పై పెదవి అంచు మధ్యభాగం నల్లబడిపోయేది. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు విడుదలయ్యుంటాయి? ఎంతమంది దర్శకులు ఉండివుంటారు? ఎంత మంది సినిమా పాటలు రాసివుంటారు? నిర్మాతలు, సంగీత దర్శకులు, ఛాయాగ్రాహకులు, రచయితలు, గాయనీగాయకులు, ఎడిటర్లు... ఫైట్ మాస్టర్లను కూడా వదలకుండా నోటుబుక్కులో గీతలు కొట్టి పేర్లు నమోదు చేస్తూ పోయేవాడిని. ఎక్కడ కొత్త పేరు కనబడినా అందులో చేర్చేవాణ్ని. సినిమాను మినహాయించిన ప్రపంచం ఉంటుందంటే నమ్మని రోజుల్లో... నా వ్యక్తిగత ప్రపంచాన్ని రసమయం చేసినవాళ్లందరికీ అది నేనిచ్చిన నివాళి కావొచ్చు! మొన్న మా గోపాల్‌రావుపల్లె అత్తమ్మ వాళ్ల మనవడి గురించి దుఃఖపడుతూ, ‘‘డాక్టర్ ఏదిజెప్పినా మారుత్తరం ఇయ్యకుండా అచ్చుడేగదారా,’’ అంది. ఆమెనూ ఆమెతోపాటు మమ్మల్నీ దుఃఖపెట్టే ఆ కారణం ఇక్కడ అసందర్భం. కాకపోతే, చదువుకోని ఆ అత్తమ్మ నోట పలికిన ‘మారుత్తరం’ అనే మాట నాకు కొత్తది. దీన్ని ఎందుకు సందర్భం చేస్తున్నానంటే, ఇలాంటి పదాల్ని సేకరించే పిచ్చి కూడా కొంతకాలం కొనసాగించాను. కనీసం ఒక వెయ్యి పదాలు! బస్సులో వెళ్తున్నప్పుడో, ఆడవాళ్లు పిండి విసురుతూ ముచ్చట్లు పెడుతున్నప్పుడో, మా పెద్దమ్మ ఉన్నట్టుండి ఏ సామెతో విసిరినప్పుడో... అరే ఇది దొరికింది, అది దొరికింది, అని గబగబా రాసుకోవడం! ఆరేడేళ్ల తర్వాత అదేపనిని ‘తెలంగాణ పదకోశం’గా నలిమెల భాస్కర్ సార్ మరింత అర్థవంతంగా తలకెత్తుకుంటారని అప్పుడు తెలీదు. క్రికెట్ ఫొటోల స్థానంలో న్యూస్పేపర్లో నచ్చేవి కట్ చేసి అతికించే పిచ్చి కొన్ని రోజులు కొనసాగింది. చాలావరకు ఉద్వేగాలకు సంబంధించిన క్లిప్పింగ్స్ సేకరించేవాడిని. దానికి సమాంతరంగా ‘బుక్ క్రికెట్’లో ప్రపంచకప్ నిర్వహిస్తుండేవాణ్ని; కనబడిన ప్రతిమనిషి పేరూ రాసుకోవాలని కొంతకాలం ఆరాటపడ్డాను; భూమ్మీద ఉన్నందరినీ వీడియో తీయాలని కొంతకాలం ఆలోచించాను; ‘భరనభభరవ’ తెలిసిన రోజుల్లో గురువులు, లఘువుల సాక్షిగా ‘అసురోత్పలమాల’ పద్యం రాసే పనిలోపడ్డాను; కొన్ని నెలలు సినిమా పాటలు రాసి కాల్చేశాను; కొంతకాలం నవలలు మొదలుపెట్టి మూలన పడేశాను. కారణం: ఎక్కడో ‘వ్యాట్ 69’ అని చదువుతాం. ఇక నా నవల్లో విలన్‌కు అది తాగే సీన్ పెట్టాలి! కానీ అదేమిటో నాకే తెలియకుండా నా పాత్రను ఎలా రుచి చూడనిచ్చేది? మన ఖాళీ సమయాల్ని పూరించిన కొన్ని పిచ్చి విషయాలు, అప్పుడు పిచ్చివిగా కనబడక జీవితం హాయిగా గడిచిపోయింది. వాటిని పిచ్చి అని గుర్తించడం మొదలెట్టాక, అవి తొలగిపోయాయిగానీ, వాటిని భర్తీ చేసే మంచి పిచ్చులేవో జొరబడక ఆ శూన్యం అలా కొనసాగుతూ వస్తోంది. - పూడూరి రాజిరెడ్డి -
ఆజన్మం: షరతుల్లేని ఐక్యత
అలాంటి సమయంలో మిస్డ్‌కాల్ ఇచ్చినవాడికి కూడా ఫోన్ చెయ్యాలనిపిస్తుంది. అదంతా ఆ పూటకు లేదూ ఆ పాట నా మనసును తాకుతున్నంత వరకూ. తర్వాత? ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు, చాలా అరుదుగా మన టేస్టుకు సరిపడే పాట ప్లే అవుతుంది: ‘యారా ఓ యారా తేరీ అదావోనే మారా...’ వంద రిహార్సల్స్ వేసుకునిగానీ మాట్లాడటానికి సాహసించని నేను, ‘‘ఈ పాట ఎందులో’’దని డ్రైవర్‌ను అడిగాను. అతడు నాకు సరిపడే జవాబివ్వలేదు. బహుశా, నాకు జవాబివ్వడం అంత ప్రాధాన్యమైన విషయంగా అతడికి అనిపించకపోవచ్చు. ఆ పాటను పరిచయం చేసినందుకు నేనామాత్రం నిర్లక్ష్యాన్ని భరించదలిచాను. అలాంటి సమయంలో ఇరుకు రోడ్డు విశాలంగా అనిపిస్తుంది; వర్షపు మడుగులో ప్యాంటు ఎత్తుకుని నడవడంలో ఇబ్బంది ఉండదు; మిస్డ్ కాల్ ఇచ్చినవాడికి కూడా ఫోన్ చెయ్యాలనిపిస్తుంది. అదంతా ఆ పూటకు లేదూ ఆ గంట వరకు; ఇంకా చెప్పాలంటే, ఆ పాట నా మనసును తాకుతున్నంతవరకూ. తర్వాత? ఇరుకు. బురద. కాల్ కట్. ఈ భావన నాకు ఇంతకుముందు కలగనిది. ఎందుకు నేను ఎవర్నయినా గాఢంగా అభిమానించను! వాళ్లను బిగియారా కౌగిలించుకుని, అలాగే ఉండిపోయేంతగా; వాళ్ల తాలూకు అణువణువూ నాకు ప్రియమైనది అయిపోయి, వాళ్ల కళ్లు, వాళ్ల భుజాలు, వాళ్ల వీపు, వాళ్ల మీసాలు(ఈ చచ్చు మాటను కావాలనే వాడుతున్నాను; నేను కోరుకునేది స్త్రీయే కానక్కర్లేదని చెప్పడానికి)... వాళ్లకు సంబంధించిన ప్రతిదీ నాకు అత్యంత విలువైనదిగా ఎందుకు అనుభూతి చెందను? చలాన్ని అలా కౌగిలించుకోవాలనిపించింది. కానీ నేను ఒప్పుకోని దేని గురించో కూడా మాట్లాడుతుంటాడు; నేను ఒప్పుకునే దేని గురించి మాట్లాడినప్పుడు నాకు ఆ భావన కలిగిందో చెప్పలేను. బుచ్చిబాబు దగ్గరివాడిగా అనిపిస్తాడు. కానీ ఆ దగ్గరితనం బాబాయ్‌తో సంబంధం లాంటిది కాదు, పెదనాన్నతో ఉండేటటువంటిది. ఫుకుఓకా అంటే ఇష్టం. ఆయన పెద్ద కళ్లద్దాలు రోజూ తుడిచి పెట్టాలనిపించేంత. పొలంలో సీడ్‌బాల్స్ చేస్తున్న ఆయన్ని పక్కకు జరిపి, నేను చేసిపెడతాను, అని చెప్పేంత. అయితే, ఆయనకు నేను చేసిన అలిఖిత వాగ్దానాల గురించిన చర్చ మా మధ్యే ఉండిపోయింది. అప్పటిదాకా నేను ఆయన్ని కలుసుకోలేను. టాల్‌స్టాయ్, త్స్వైక్, శాలింజర్; ఒక అవ్యక్త రేఖ ఏదో నన్ను వీళ్లతో కలుపుతుంది, నా మనసు మెత్తబడి ద్రవంగా పరిణామం చెందుతుంది. కానీ వాళ్ల చుట్టూ ఉండే అగ్ని వలయం నన్ను భయకంపితుణ్ని చేస్తుంది. ఇంకా, మణిరత్నం, మాజిది, అడ్రియన్ లైన్; వీళ్లు మానసికంగా సన్నిహితులేగానీ, ఆ సాన్నిహిత్యం వారి మీద పడిపోయేలా చేసేది కాదు. ఒక్కోసారి ఈయన్ని కౌగిలించుకుందామనుకున్నా, మళ్లీ వెనక్కి చూసుకుంటే, ఈయన్నేనా ఇలా అనుకున్నది అనిపిస్తుంది. అంతకుముందటి చిక్కటిదేదో క్రమంగా పలుచ బారుతూ వస్తుంది. అట్లాంటి గాఢమైన అనురక్తి నాకు దేన్లోనూ లేదు. ప్రకృతిలో లేదు, పనిలో లేదు, మనుషుల్లో లేదు, మొత్తంగా జీవితంలోనే లేదు. మీద మీద దొర్ల్లుకుంటూ వెళ్లిపోవడమే తప్ప, లోతుగా, దాన్ని పట్టుకుని ఆస్వాదించడం నాకు చేతకాదు. పచ్చి మామిడాకుల తొడిమ వాసన అనుభవించడం తెలియదు. వేసవి తొలి జల్లుల తర్వాత కనబడే పసుపురంగు పూలత రాలెపూత అని తెలియదు. రోజూ పెరట్లో వాలే బూడిదరంగు పిట్ట పేరు తెలియదు. అసలు అది బూడిద రంగేనో కాదో కూడా తెలియదు. నాకు నచ్చిన పుస్తకం నచ్చిన మనిషి నుంచి పోస్టులో వచ్చిన క్షణం, ఆకలిగా ఉన్నప్పుడు హోటల్‌కు తీసుకెళ్లిన పరిచయస్థుడి ఔదార్యం, నేను అనుకునే వ్యక్తీకరణ్ని నాకంటే వందేళ్ల ముందే ఆలోచించిన రచయిత ఊహాశక్తి, ఒకరిద్దరు స్నేహితులు గుండెకు గురిచూసి పూవుల్లా విసిరిన మాటలు, ఊపిరిని పాటగా మలిచే గాయకుడు, నా లోపలి నరాన్ని మీటగలిగే సంగీత దర్శకుడు... ఇవన్నీ కొన్ని క్షణాలు! అప్పటికి శాశ్వతత్వాన్ని అద్దుకున్న తాత్కాలిక క్షణాలు!! నాలో ఏదో ఒకటి ఉంది. దాన్ని కరిగించడం సాధ్యం కావట్లేదు. అంటే కరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను; కరిగించేవాళ్లే లేరు. నేను ఎంతసేపూ తీసుకోవడం గురించే మాట్లాడుతున్నానా? అసహజమైనదేదో వాంఛిస్తూ ఉన్నానా? ఏ ఒక్క ఉద్వేగమూ ఒకే పాయింట్ దగ్గర ఉండిపోవడం కుదరదనీ, ఈ ఎగుడుదిగుడులే సహజమైన స్థితి అని గుర్తించలేకపోతున్నానా? నన్ను నేను పూర్తి అర్పణ గావించుకోవడానికి సంసిద్ధం చేసేదేదో నాలో లేదా? హఠాత్తుగా నాకోటి స్ఫురించింది. గతించేవెన్నో అద్భుతమైనవి కావొచ్చు; కానీ సంపూర్ణ అంగీకారతకు కావాల్సినదేదో వాటిల్లో తక్కువ పడుతోందా? వాస్తవ ప్రపంచంలో ఆ లోటు తీరేది కాదు కాబట్టే, ఆ పరిపూర్ణ మూర్తిగా దేవుడిని నిలబెట్టి ఉంటారా! - పూడూరి రాజిరెడ్డి