ఆజన్మం: షరతుల్లేని ఐక్యత | No conditions for unity | Sakshi
Sakshi News home page

ఆజన్మం: షరతుల్లేని ఐక్యత

Published Sun, Sep 15 2013 2:29 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM

No conditions for unity

అలాంటి సమయంలో మిస్డ్‌కాల్ ఇచ్చినవాడికి కూడా ఫోన్ చెయ్యాలనిపిస్తుంది. అదంతా
ఆ పూటకు లేదూ  ఆ పాట నా మనసును తాకుతున్నంత వరకూ. తర్వాత?

 
 ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు, చాలా అరుదుగా మన టేస్టుకు సరిపడే పాట ప్లే అవుతుంది: ‘యారా ఓ యారా తేరీ అదావోనే మారా...’ వంద రిహార్సల్స్ వేసుకునిగానీ మాట్లాడటానికి సాహసించని నేను, ‘‘ఈ పాట ఎందులో’’దని డ్రైవర్‌ను అడిగాను. అతడు నాకు సరిపడే జవాబివ్వలేదు. బహుశా, నాకు జవాబివ్వడం అంత ప్రాధాన్యమైన విషయంగా అతడికి అనిపించకపోవచ్చు. ఆ పాటను పరిచయం చేసినందుకు నేనామాత్రం నిర్లక్ష్యాన్ని భరించదలిచాను. అలాంటి సమయంలో ఇరుకు రోడ్డు విశాలంగా అనిపిస్తుంది; వర్షపు మడుగులో ప్యాంటు ఎత్తుకుని నడవడంలో ఇబ్బంది ఉండదు; మిస్డ్ కాల్ ఇచ్చినవాడికి కూడా ఫోన్ చెయ్యాలనిపిస్తుంది. అదంతా ఆ పూటకు లేదూ ఆ గంట వరకు; ఇంకా చెప్పాలంటే, ఆ పాట నా మనసును తాకుతున్నంతవరకూ. తర్వాత?
 
 ఇరుకు. బురద. కాల్ కట్. ఈ భావన నాకు ఇంతకుముందు కలగనిది. ఎందుకు నేను ఎవర్నయినా గాఢంగా అభిమానించను! వాళ్లను బిగియారా కౌగిలించుకుని, అలాగే ఉండిపోయేంతగా; వాళ్ల తాలూకు అణువణువూ నాకు ప్రియమైనది అయిపోయి, వాళ్ల కళ్లు, వాళ్ల భుజాలు, వాళ్ల వీపు, వాళ్ల మీసాలు(ఈ చచ్చు మాటను కావాలనే వాడుతున్నాను; నేను కోరుకునేది స్త్రీయే కానక్కర్లేదని చెప్పడానికి)... వాళ్లకు సంబంధించిన ప్రతిదీ నాకు అత్యంత విలువైనదిగా ఎందుకు అనుభూతి చెందను? చలాన్ని అలా కౌగిలించుకోవాలనిపించింది. కానీ నేను ఒప్పుకోని దేని గురించో కూడా మాట్లాడుతుంటాడు; నేను ఒప్పుకునే దేని గురించి మాట్లాడినప్పుడు నాకు ఆ భావన కలిగిందో చెప్పలేను.
 
 బుచ్చిబాబు దగ్గరివాడిగా అనిపిస్తాడు. కానీ ఆ దగ్గరితనం బాబాయ్‌తో సంబంధం లాంటిది కాదు,  పెదనాన్నతో ఉండేటటువంటిది. ఫుకుఓకా అంటే ఇష్టం. ఆయన పెద్ద కళ్లద్దాలు రోజూ తుడిచి పెట్టాలనిపించేంత. పొలంలో సీడ్‌బాల్స్ చేస్తున్న ఆయన్ని పక్కకు జరిపి, నేను చేసిపెడతాను, అని చెప్పేంత. అయితే, ఆయనకు నేను చేసిన అలిఖిత వాగ్దానాల గురించిన చర్చ మా మధ్యే ఉండిపోయింది. అప్పటిదాకా నేను ఆయన్ని కలుసుకోలేను. టాల్‌స్టాయ్, త్స్వైక్, శాలింజర్; ఒక అవ్యక్త రేఖ ఏదో నన్ను వీళ్లతో కలుపుతుంది, నా మనసు మెత్తబడి ద్రవంగా పరిణామం చెందుతుంది. కానీ వాళ్ల చుట్టూ ఉండే అగ్ని వలయం నన్ను భయకంపితుణ్ని చేస్తుంది. ఇంకా, మణిరత్నం, మాజిది, అడ్రియన్ లైన్; వీళ్లు మానసికంగా సన్నిహితులేగానీ, ఆ సాన్నిహిత్యం వారి మీద పడిపోయేలా చేసేది కాదు. ఒక్కోసారి ఈయన్ని కౌగిలించుకుందామనుకున్నా, మళ్లీ వెనక్కి చూసుకుంటే, ఈయన్నేనా ఇలా అనుకున్నది అనిపిస్తుంది. అంతకుముందటి చిక్కటిదేదో క్రమంగా పలుచ బారుతూ వస్తుంది.
 
 అట్లాంటి గాఢమైన అనురక్తి నాకు దేన్లోనూ లేదు. ప్రకృతిలో లేదు, పనిలో లేదు, మనుషుల్లో లేదు, మొత్తంగా జీవితంలోనే లేదు. మీద మీద దొర్ల్లుకుంటూ వెళ్లిపోవడమే తప్ప, లోతుగా, దాన్ని పట్టుకుని ఆస్వాదించడం నాకు చేతకాదు. పచ్చి మామిడాకుల తొడిమ వాసన అనుభవించడం తెలియదు. వేసవి తొలి జల్లుల తర్వాత కనబడే పసుపురంగు పూలత రాలెపూత అని తెలియదు. రోజూ పెరట్లో వాలే బూడిదరంగు పిట్ట పేరు తెలియదు. అసలు అది బూడిద రంగేనో కాదో కూడా తెలియదు.
 
 నాకు నచ్చిన పుస్తకం నచ్చిన మనిషి నుంచి పోస్టులో వచ్చిన క్షణం, ఆకలిగా ఉన్నప్పుడు హోటల్‌కు తీసుకెళ్లిన పరిచయస్థుడి ఔదార్యం, నేను అనుకునే వ్యక్తీకరణ్ని నాకంటే వందేళ్ల ముందే ఆలోచించిన రచయిత ఊహాశక్తి, ఒకరిద్దరు స్నేహితులు గుండెకు గురిచూసి పూవుల్లా విసిరిన మాటలు, ఊపిరిని పాటగా మలిచే గాయకుడు, నా లోపలి నరాన్ని మీటగలిగే సంగీత దర్శకుడు... ఇవన్నీ కొన్ని క్షణాలు! అప్పటికి శాశ్వతత్వాన్ని అద్దుకున్న తాత్కాలిక క్షణాలు!! నాలో ఏదో ఒకటి ఉంది. దాన్ని కరిగించడం సాధ్యం కావట్లేదు. అంటే కరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను; కరిగించేవాళ్లే లేరు.  నేను ఎంతసేపూ తీసుకోవడం గురించే మాట్లాడుతున్నానా? అసహజమైనదేదో వాంఛిస్తూ ఉన్నానా? ఏ ఒక్క ఉద్వేగమూ ఒకే పాయింట్ దగ్గర ఉండిపోవడం కుదరదనీ, ఈ ఎగుడుదిగుడులే సహజమైన స్థితి అని గుర్తించలేకపోతున్నానా? నన్ను నేను పూర్తి అర్పణ గావించుకోవడానికి సంసిద్ధం చేసేదేదో నాలో లేదా? హఠాత్తుగా నాకోటి స్ఫురించింది. గతించేవెన్నో అద్భుతమైనవి కావొచ్చు; కానీ సంపూర్ణ అంగీకారతకు కావాల్సినదేదో వాటిల్లో తక్కువ పడుతోందా? వాస్తవ ప్రపంచంలో ఆ లోటు తీరేది కాదు కాబట్టే, ఆ పరిపూర్ణ మూర్తిగా దేవుడిని నిలబెట్టి ఉంటారా!
 -  పూడూరి రాజిరెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement