puduri rajireddy
-
రియాలిటీ చెక్... ఏక్ అకేలా ఇస్ షెహర్ మే...
రియాలిటీ చెక్: పూడూరి రాజిరెడ్డి తెనాలి ప్రచురణలు హార్డ్‌బౌండ్ ఎడిషన్ వెల: రూ. 250 ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు వివరాలకు: 9550930789 మంచి పుస్తకం: కలం భుజాన వేసుకొని బయల్దేరడం కష్టమే అందరికీ. ఎవరు వెళ్తారు చెప్పండి. ఒకనాడు ఒక శ్మశానానికి, ఒకనాడు ఒక శవాల గదికి, ఒకనాడు పొగలు చిమ్మే కిక్కిరిసిన సిటీబస్సు తొడతొక్కిడిలోకి, ఒకనాడు ఒక వేసవి ఎండ వడగాడ్పులోకి, ఒకనాడు ఒక సెక్స్‌వర్కర్ ఎదుట కూచుని ఆమె చెప్పే ఒకరాత్రి 17 సార్ల మృగరతి అనుభవంలోకి. ధైర్యం కావాలి. ధైర్యమేనా? ప్రేమ కావాలి. చేతులు సాచి కావలించుకునే గుణం. ఎవరూ చూడకుండా కన్నీరు కార్చుకునే కరుణ. అయ్యో... అయ్యో... అని గుండెలు బాదుకునే స్పందన. దానిని వ్యాఖ్యానించగల తాత్త్వికత. పూడూరి రాజిరెడ్డి ఇవన్నీ తాను పడి తన వాక్యం వల్ల, తన కలానికి ఉన్న లెన్సుల వల్ల, ఆ లెన్సు మాత్రమే చిత్రిక పట్టే దృశ్యాల వల్ల మనకు చూపించాడు ‘రియాలిటీ చెక్’లో. సాక్షి ఫన్ డేలో సూపర్ హిట్ కాలమ్ ఇది. వారం వారం వచ్చింది. ప్రతి వారం రాజిరెడ్డి ఏదో ఒక పరిచిత, అపరిచిత ప్రాంతానికి వెళ్లి మనకు పరిచితమైన సంగతిలోని అపరిచితమైన విశేషాన్ని అపరిచితమైన విశేషంలో అతి పరిచితమైన మానవ సహజ స్వభావాలను చూపి అబ్బుర పరుస్తాడు. ఇదంతా పిచ్చిలా ఉంది- పాతరోజుల్లో జర్నలిజమే ఒక వెర్రి అనుకునే జర్నలిస్టులు ఇలా చేశారు- ఇవాళ ఎవరు చేస్తున్నారు అనంటే? అప్పుడూ నదులు పారాయి. రేపూ పారుతాయి. కొత్తతరం వచ్చి కొత్తగా గోపురాలెక్కి అరచి అరచి చూపిస్తుంది లోకాన్ని- ఇటు చూడండి అని. యాభైకి మించిన వారాలు హైదరాబాద్‌లోని యాభైకి మించిన తావుల్లో రాజిరెడ్డి కూలబడి కూచుని ఏం చూశాడో చెప్పాడు ఇందులో. ఇది వర్తమానమా. ఇలాగే గతం లేదూ? ఇలాగే భవిష్యత్తు ఉండదూ? మరి దీనిని ఎందుకు చదవాలి. మనల్ని మనం చూసుకొని మనం మాత్రమే ఇలా కాదు అందరూ ఇలాగే ఉన్నారు అనుకొని ఊరట చెందడానికి. బాధ పడేవాళ్లను చూసి బాధ పడ్డానికి, ధైర్యంగా ఉన్నవారిని చూసి ధైర్యం తెచ్చుకోవాడానికి. ఇది ఒక వైద్యం. లేదా సుఖమయమనుకునే దొంగ గంతలు కట్టుకున్నవారిని ఈడ్చుకెళ్లి తప్పనిసరిగా ఎక్కించాల్సిన రోగం. మన చుట్టూ ఎలా ఉందో తెలుసుకోకపోతే ఎలా? వార్తల చాటున దాగిన కథలు ఇవి. రచయితలకు పట్టని సజీవ చిత్రాలు. మంచి వచనానికి ముఖం వాచినవాళ్లు దీనిని చదివి పాయసం చేసుకొని తిని అమ్మయ్య అనుకోరూ. తెలుగును ఎవరూ కాపాడనక్కర్లేదు. అదే ఎవడిదో ఒకడి కడుపులో దూరి తనను తాను కాపాడుకుంటుంది. అందుకొక సాక్ష్యం కూడా ఈ పుస్తకం. దీనిని చాలా అందంగా ఖర్చుతో తెనాలి ప్రచురణల వాళ్లు పుస్తకంగా తెచ్చారు. మంచితో మిలాఖత్ అయ్యేవాళ్లు ఎక్కడైనా ఉంటారు. వయసొచ్చిన పిల్లలందరి చేత దీనిని చదివిస్తే ఎలా ఉంటుందంటారు? పోనీ పి.జి కుర్రాళ్లందరినీ బెత్తంతో కొట్టి చదివిస్తే? మన సమాజపు రియాలిటీ తెలిసి దారిలో పడరూ? సినిమా పుస్తకం: దాసరి కంఠంలో గజమాల.... పాలకొల్లు నుంచి మద్రాసు ప్రయాణం... పులులు సింహాల మధ్య- పాములు మొసళ్ల మధ్య- ఏ అండా దండా లేకుండా పైకి రావడం- సినిమా ఒక శక్తిమంతమైన మీడియా అనుకుంటే దానితో ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటో తెలుసుకొని కొద్దో గొప్పో సంస్కరణల కోసం దానిని ఉపయోగించడం- ఇవన్నీ చేసి సాధించినవారు దాసరి నారాయణరావు. 150 సినిమాలకు దర్శకత్వం వహించడం అంటే ఇక ఎప్పటికీ ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డు అది. పని పట్ల ఒక రకమైన వెర్రి, ఉన్మాదం ఉంటే తప్ప సాధ్యం కాదు. అందుకనే ఆయన అన్ని సినిమాలు తీయగలిగారు. దాసరి తీసిన 150 సినిమాల గురించి వాటి తెర వెనుక కథ గురించి అవి చూపిన ప్రభావం గురించి ఈ పుస్తకం- ‘విశ్వవిజేత విజయగాథ’లో వివరించారు జర్నలిస్టు వినాయకరావు. తాత-మనవడు, స్వర్గం-నరకం, చిల్లరకొట్టు చిట్టెమ్మ, శివరంజని, సర్దార్ పాపారాయుడు, ప్రేమాభిషేకం... వీటి వెనుక కథలు ఆసక్తి రేపుతాయి. దాసరి అన్ని చిత్రాలు ఒకెత్తు... ‘అద్దాల మేడ’ ఒకెత్తు. సినిమా వాళ్ల మీదే తీసిన ఈ సినిమా- ఇండస్ట్రీ ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మరొక ఆశ్చర్యం ఏమిటంటే ఇవాళ మనం చాలా పెద్ద పెద్దవి అనుకుంటున్న చాలా సినిమాలని ఆయన కేవలం 20 రోజుల్లో 28 రోజుల్లో తీసి సూపర్ హిట్ చేయడం. నిర్మాత, ఇండస్ట్రీ మేలును ఆకాక్షించే దర్శకుడు చేయాల్సిన పని అదే. కాని ఇవాళ ఏం జరుగుతోంది? ఎన్ని కోట్లు... ఎన్ని వర్కింగ్ డేస్... అలాగని హిట్ కొట్టగలుగుతున్నారా? అందరు దర్శకులకూ దర్శకులు కావాలనుకునేవారికి పాఠం ఈ పుస్తకం. దాసరి ఒక సినిమా లైబ్రరీ. ఆ లైబ్రరీ నుంచి అందిన మరో మంచి పుస్తకం ‘విశ్వవిజేత విజయగాథ’. సినిమా పట్ల ఆసక్తి ఉన్నవారందరూ చదవదగ్గ పుస్తకం ఇది. హార్డ్ బౌండ్ ఎడిషన్: రూ.400; ప్రతులకు - 9985411019 సాహిత్య డైరీ: రన్నింగ్ కామెంటరీ.... తెలుగు పత్రికా రంగంలో వినూత్న ప్రయోగంగా వాసికెక్కిన దేవిప్రియ - రన్నింగ్ కామెంటరీ- మూడు సంపుటాల ఆవిష్కరణ సభ జనవరి 29, బుధవారం సాయంత్రం. వేదిక: ఫ్యాప్సీ భవన్, రెడ్‌హిల్స్. దాసరి నారాయణరావు, వేదకుమార్, హరగోపాల్, కె.రామచంద్రమూర్తి, గోరటి వెంకన్న తదితరులు పాల్గొంటారు. తెలుగు కథ- ప్రాంతీయ అస్తిత్వం కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో జనవరి 28 నుంచి 29 వరకు తెలుగు కథ- ప్రాంతీయ అస్తిత్వం అనే అంశంపై రెండు రోజుల పాటు సదస్సు జరుగుతుంది. డా.ఎస్.అబ్దుల్ ఖాదర్, డా.సంగిశెట్టి శ్రీనివాస్, డా.నందిని సిధారెడ్డి, డా.వి,త్రివేణి, డా.సంగెనేని రవీంధ్ర, డా. పసునూరి రవీందర్, డా. సామాన్య, డా.మాడభూషి సంపత్ కుమార్ తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 98669 77741 కొత్త పుస్తకాలు ఊహాచిత్రం... దారి ఏర్పడనంత వరకూ నడిచే నడక కూడా వృథా పోదు. ఎక్కడికి పోవాలి... ఎందుకుపోవాలి తెలియకుండా కొంత దూరం నడవడం ఏం వృథా? కాలు సాగి... సుదూర లక్ష్యం ఏర్పరుచుకోవడానికి వీలవుతుంది. అరిపిరాల సత్యప్రసాద్ ఏ విధమైన రచయిత? ఏ భావజాలపు రచయిత? ఎందుకు రాస్తున్న రచయిత? ప్రస్తుతానికి జవాబులు లేవు. కాని అతడి కథాసంపుటి ‘ఊహాచిత్రం’ చదివితే అతనొక మంచి రచయిత కాదగ్గ రచయిత అనిపిస్తుంది. కథ కట్టడం తెలుసు. కథకు అవసరమైన భాష తెలుసు. లాలిత్యమైన కథనం, సుతిమెత్తనైన వరుస, చెప్పాల్సింది ముఖం మీద బాదినట్టుగా కాకుండా మెల్లగానే అలాగని స్పష్టంగా చెప్పే గుణం.... ఇవన్నీ ఊహాచిత్రంలో కనపడతాయి. మధ్యతరగతిలో ఉండే దొంతరల మధ్య ఊపిరాడక చిక్కుబడిన గాలిని విడుదల చేయజూసిన కథలు ఇవి. తప్పించుకోవాల్సినవి తెలియజేయడం, సర్దుకుపోవాల్సినవాటితో సర్దుకుపోవడం నేర్పిస్తాయివి. చిన్న సెంటిమెంట్‌ను తట్టి లేపడం కూడా ఒక సుగుణమే. ‘స్వప్న శేషం’, ‘ఊహాచిత్రం’, ‘ఐదు వందల రూపాయల నోటు’, ‘చినుకులా రాలి’... రచయిత సామర్థ్యాన్ని చూపుతాయి. అనవసర కపటత్వాలను వదిలి మనిషి తన నిజమైన ఆనందాన్ని వెతుక్కోవడానికి దోవ చూపే కథలు ఇవి. చదవతగ్గవి. వెల: రూ.120/- ప్రతులకు: 9966907771 ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు.... లాటిన్ అమెరికా చుట్టూ ఉండే మార్మిక ఆకర్షణ మరో భూభాగానికి లేదు. అక్కడి వీరులు ప్రపంచాన్ని అలాగే ఆకర్షించారు. అక్కడ భాష, భావజాలం, ఉద్యమాల ఊపు కూడా. సాహిత్యం ఏం తక్కువని. మార్కెజ్ (మార్క్వెజ్ అనకూడదట) తన కలంతో మేజిక్ రియలిజాన్ని సృష్టించి ప్రపంచానికి ఎక్కించాడు. బోర్హెస్ ఇక్కడి నుంచే తన కథలతో ప్రపంచమంతా వ్యాపించాడు. గద్దలకు ఏమీ తోచకపోతే వాలే ఈ నేల మీద నిలబడి అక్కడి ప్రజలు నిత్యం పహారా కాస్తూ గద్దల రాకను హెచ్చరించే కథలెన్నింటినో రాస్తూనే ఉన్నారు. అలాంటి 20 కథలను నిజాయితీగా అనువాదం చేసి అందించారు ‘ఎలనాగ’. సాధారణంగా భారతీయ కథలో కనిపించని ఎక్స్ప్రెషన్, దృశ్యాలని కత్తిరించి తిరగేసి చెప్పడం ఇక్కడి రచయితలు చేశారు. అసలు ఈ కథల్లోకి సంచరించడమే పూర్తిగా కొత్త. కథాభిమానులకు ఇది మంచి కానుక. వెల: రూ.150 ప్రతులకు: 9866945424 -
ఆజన్మం: వెయ్యి ప్రశ్నల ఉదయం
‘‘ఇట్ల గట్టిగ ఉండద్దు; ఇల్లంత ఇప్పేసి మళ్లీ మనం మెత్తగ గట్టుకుందం నానా’’ అన్నాడు. కన్నీ, నానీ, బంగారుతండ్రీ లాంటి నాటకీయ మాటలు- ఎవరి నోటినుంచైనా రావడం సహజమైన విషయమేనని తండ్రయ్యాకగానీ నాకు అర్థంకాలేదు. పిల్లలతో అనుబంధం ఎలా ఉంటుందంటే- వాళ్లతో గడిపినప్పటికంటే- కొన్ని రోజులు గడిచాక, ఆ సందర్భం చుట్టూ అంటుకునివున్న మకిలి అంశాలేమైనావుంటే కరిగిపోయి, కేవలం వాళ్లకు వాళ్లుగా నిలబడి మరింత మురిపెం కలిగిస్తారు. ముఖ్యంగా వాళ్ల ప్రశ్నలు, చేష్టలు! ‘‘పొద్దున లేశినంక ఎందుకు మొఖం కడుక్కొని, ఎందుకు తానం చెయ్యాలి?’’ అని అడుగుతాడు మా పెద్దోడు. ‘‘చీమలు మూతలు దీస్కొని లోపల్కి వోతయా?’’ అని వాడి సందేహం. ఎటూ నేనిచ్చేవి సారహీనమైన జవాబులే అయివుంటాయి కాబట్టి, వాటిని ఇక్కడ రాయను. ‘‘పల్లికాయ బుక్కితే ఇక్కడ ఎందుకు కదులుతది?’’ అని నా కణతను చూపిస్తాడు. ఇంకా వాడి ప్రశ్నలు ఎలా ఉంటాయంటే: ‘‘కుక్క ఎందుకు మాట్లాడది?’’ ‘‘మరి (‘ఐస్ ఏజ్’లో) ఏనుగు ఎందుకు మాట్లాడుతంది?’’ ‘‘నీ కాళ్లు అంత పెద్దగ ఎందుకున్నయ్?’’ ‘‘నాకు మీసాలు ఎందుకు రాలేదు?’’ ‘‘నాన్నా, నీకు ఇక్కడ(చంక) గడ్డం ఎందుకుంది?... మరి ఎంటికలుంటే చక్కిలిగిలి అయితదా?’’ ‘‘చెడ్డి ఇప్పినప్పుడు (నేను) తువ్వాల కట్టుకోవద్దా?... నేను చిన్నపిల్లగాణ్ని కదాని సిగ్గు కాదా?’’ ‘‘లేదంటే కర్రె దొడ్డికత్తదా?’’ అంటాడు, జ్వరం వస్తుందని చెబితే. ‘‘అమ్మ పత్తి ఏర ఎందుకువోదు?’’ అనడుగుతాడు, నానమ్మ పనికెళ్లడం చూస్తాడు కాబట్టి. వాళ్లమ్మ ఇంట్లో ఏదో పనిచేస్తూ వీణ్ని వినిపించుకోకపోతే వీడి స్తోత్రం: ‘ఓ గోర్లపేంటు పెట్టుకున్నమ్మా... ఓ బొట్టు పెట్టుకున్నమ్మా... ఓ గాజులు వేసుకున్నమ్మా...’ ‘‘తిరుపతి మామ రెండు సార్లు పెళ్లి చేసుకుంటడా?’’ అని వాడి అనుమానం. ఎంగేజ్మెంట్, తర్వాత పెళ్లి అవుతుందిగా! ‘‘నానా, నేను నిన్ను పెళ్లి చేసుకోవన్నా?’’ ‘‘నన్నా!’’ ‘‘అమ్మను?’’ ‘‘వద్దురా!’’ ‘‘మరి పప్పక్కను?’’ ‘‘అట్లనద్దురా.’’ ఓసారి- జ్యువెలరీ యాడ్‌లో ఉన్న ‘వధువు’ను చూపిస్తూ, ‘‘ఈమెను పెళ్లి జేసుకుంట’’ అన్నాడు. ‘‘పెళ్లి జేసుకొని ఏం జేస్తవ్‌రా?’’ ‘‘పేమిత్త!’’ ..!!!.. వాణ్ని చదువుకు వేయడంలోని అనివార్య నిర్దయను అనుభవిస్తున్నాను. ఒక్కోరోజు బడికి పోను నాన్నా, అంటాడు. ‘‘ఎప్పుడు నేనేనా? తమ్ముణ్ని ఒక్కసారన్న తోలియ్యవా’’ అని ప్రశ్నిస్తాడు. ఒక గేదె, పెయ్య రోడ్డుమీద వెళ్తుంటే- ‘‘బర్రె బయట్నే మూత్రం ఎందుకు పోస్తది? బాత్రూమ్ల పెండ పెడితే ఏమైతది?’’ అన్నప్పుడు నవ్వొస్తుంది; ‘‘క్యాప్టెల్ బర్రె స్మాల్ బర్రె’’ అనడం ముచ్చటగొలుపుతుంది; కానీ, ‘‘బుక్కుల్నేమో ఫిష్షంటం, బయట్నేమో చేపంటమా?’’ అన్నప్పుడు మాత్రం మన విద్యావ్యవస్థ కలిగిస్తున్న గిల్టును తొలగించుకునేందుకు నాకు కొంత సమయం పడుతుంది. ‘‘(ఈ) మామిడికాయలు అన్ని మనయేనా?’’ ‘‘కాదు తాతయ్యవాళ్లయి.’’ ‘‘తాతయ్యవాళ్లు మనింట్ల ఎందుకు వెట్టిండ్రు శెట్టు?’’ ‘‘ఇది వాళ్ల ఇల్లే.’’ ‘‘మరి మనది?’’ ఇల్లు మనది కాకపోవడం అనేది కూడా ఉంటుందని వాడికి జీర్ణం కాలేదు. అదే అద్దింట్లో ఒకరోజు ఉరుకుతూ గచ్చు మీద పడిపోయాడు. పెపైదవి చీరుకుపోయి, రక్తం కారింది. ‘‘ఇట్ల గట్టిగ ఉండద్దు; ఇల్లంత ఇప్పేసి మళ్లీ మనం మెత్తగ గట్టుకుందం నానా’’ అన్నాడు. గాల్లో అక్షరాల స్వరూపం గీస్తుంటాడు. వాడిని టీవీ లోపట్కి పంపియ్యిమంటాడు. తాళం తీయగలుగుతున్నాడు. తలకు పెట్టిన నూనె తీసెయ్యమంటాడు. ‘నీకు పెద్ద ఇల్లు కట్టిత్త, నీ పుస్తకాలన్నీ పెట్టుకుందు’వని చెబుతాడు. వాడు చెప్పింది నాకు అర్థం కాకపోతే ‘నానా నేనేమంటున్ననా...’ అని వివరించబోతాడు. సూదిత్తే ఏ(డ)వాలి; బిష్షాం అంటే ఇట్ల (గుడ్లు తేలిసి) పడిపోవాలంటున్న చిన్నోడి దశను వీడు దాటిపోయాడు. ‘నువ్వింక బుద్దెప్పుడు నేర్సుకుంటవ్రా’ అని తమ్ముణ్ని గదమాయిస్తాడు. ‘‘ఇవ్వాళ చిన్నోడి గోర్లు దీయాలె’’ అంది వాళ్లమ్మ. ‘‘పండ్లు కూడా తీయాలి నాన్నా, ఊకె కొరుకుతున్నడు’’ అన్నాడు. ఇదేమీ కంక్లూజన్‌కు వచ్చే సందర్భం కాదుగానీ, ఆఫీసునుంచి వెళ్లగానే రోజూ పరుగెత్తుకు వచ్చేవాడు రాలేదు. నాకంటే టీవీలో మహేశ్‌బాబు ఎక్కువైపోయిన వాస్తవాన్ని ఎలా జీర్ణించుకోగలను! రేపెప్పుడో అమ్మాయి వాడి జీవితంలోకి వస్తే? ప్రయారిటీల్లో మన స్థానమేంటని ఎప్పటికప్పుడు పూర్తి అవగాహనతో ఉండటమేనా మనం చేయాల్సింది! మామూలుగా నాకన్నా ముందు లేవడు. ఎప్పుడైనా! అలా ఓరోజు మంచం దిగుతూ- నేను మేలుకున్నాను అప్పటికి- నా కాళ్ల మీది చెద్దరు సరిచేసి దిగుతున్నాడు. అయ్యో నా బంగారుతండ్రీ! - పూడూరి రాజిరెడ్డి -
ఆజన్మం: సబ్బునురగలాంటి సంగతులు
దుస్తుల్ని ఉతుకడంలో ఈ మజా ఉండదు. అలా కంటిముందట శుభ్రమైపోయే గుణం బట్టల్లో లేకపోవడం వల్లనేమో! సబ్బు నురగను చూస్తే మాత్రం ఉత్తేజం కలుగుతుంది. ‘చిన్నప్పుడు’ అమ్మకోసం గిన్నెలు తోమిపెట్టాను. ఎడమచేత్తో ‘పుష్’ చేస్తూ, కుడిచేత్తో ‘పుల్’ చేస్తూ గిన్నెను గుండ్రంగా తిప్పడం తోమడంలో ఒక టెక్నిక్! ఆ రెండూ నిజంగా జరుగుతున్నాయా అని గుర్తించలేనంత సమన్వయంతో చేతులు పనిచేయడం ఒక ఆశ్చర్యం. అయితే, ఆ గిన్నె అలా తిరుగుతూ, పడే నీటి ధారకు మురికి అలా వదులుతూ పోతూవుంటే చూడ్డానికి బాగుంటుంది. పాత్రలు రాతివెండివై, తోమడానికి వాడింది బూడిదైతే గనక, ఆ ఫీలింగ్ రెట్టింపవుతుంది.అదే, దుస్తుల్ని ఉతుకడంలో ఈ మజా ఉండదు. బహుశా, అలా కంటిముందట శుభ్రమైపోయే గుణం బట్టల్లో లేకపోవడం వల్లనేమో! కానీ సబ్బు నురగను చూస్తే మాత్రం ఉత్తేజం కలుగుతుంది. ముఖ్యంగా దానిమీద ఏర్పడే గాలి నీడలు! నురగ బుడగలాంటి ఒక ఇల్లుండి, అలా గాల్లో తేలిపోయి, మబ్బుల మీద కాసేపు దొర్లి, ఠప్‌మని అది నిశ్శబ్దంగా చిట్లిపోయినప్పుడు విరిగిపడే తుంపరముక్కలకు చప్పున కళ్లు మూసుకుని చప్పట్లు కొట్టి, కిందపడకుండా జాగ్రత్తగా మేఘాల్ని పట్టుకుని భూమ్మీదకు దుంకి... చిన్నతనపు పెద్దకోరిక! అదే చిన్నతనంలో బ్రెడ్డు నిర్మాణం నన్ను ఆశ్చర్యగొలిపేది. తెరలు తెరలుగా, జాలిజాలిగా, ఆ డబల్రొట్టెలో అన్ని గదులు ఉండటం చిత్రంగా ఉండేది. ఎలా ఏర్పాటు చేసివుంటారు! అవి పాలల్లో మరింత రుచిగా ఉండటానికి నాకు ఈ బుల్లిగదులూ కారణమే! అదే చిరు గదుల నిర్మాణం వల్ల దోమతెరను చూసినా నాకు బాగుంటుంది. అలా నిలబడిపోయి ఎంతసేపైనా చూస్తూవుండొచ్చు. అయితే, ఇది చిత్రపడి చూడటం కాదు. ఒక రొమాన్స్ ఏదో ఉంటుందందులో! ఎందుకో అడ్డు-నిలువు గీతలు, అవి ఏర్పరిచే పటాలు నాకు ముచ్చటేస్తాయి. కాగితం మీద చతురస్రం బాగుంటుంది. అడ్డము, పొడవు మాయమైపోయిన ఒక పూర్ణ ఆకృతి ఏదో అందులో ఉంటుంది. అయితే వస్తురూపంలో మాత్రం దీర్ఘచతురస్రం ఇంపుగా ఉంటుంది. వృత్తం ఉత్తి వృత్తంగా బాగోనిది ఆమ్మాయిల రింగుల రూపంలో మాత్రం సార్థకత చేకూర్చుకుంటుంది. మా ఇంట్లోకి కరెంటు వచ్చిన చారిత్రక సందర్భం నాకు గుర్తుంది. అంతకుముందు ఇంట్లో ‘ఎక్క’లుండేవి. వాటిని పెట్టడానికి చెమ్మలు! సాయమానులో, అర్రలో, చంకలో, ముందింట్లో, వాకిట్లో ఈ చెక్కతో చేసిన చెమ్మలు గోడకు కొట్టివుండేవి. అవి లేకపోతే దీగుట్లో పెట్టేవాళ్లం. పొద్దు గూట్లో పడగానే, అమ్మ దీపాలు ముట్టించేది. కొద్దికొద్దిగా కిరోసిన్‌ను తాగుతూ వత్తి మండటం మొదలయ్యేది. కింద చిక్కటి పసుప్చచ్చ, తర్వాత ఎరుపు, ఆపైన నలుపు ఆవరించివుండే ఈ మంటను ఎంతసేపైనా అలా చూడాలనిపించేది. వత్తి కొన్నిరోజులు కాలాక, దానిమీద ఏర్పడే నల్లటి కొరుకులను చేత్తో దూస్తుంటే అవి వేళ్లకు కలిగించే స్పర్శ బాగుండేది, నల్లటి మసిరంగు అంటినప్పటికీ. ఎప్పుడూ కాదుగానీ ఒక ప్రత్యేక మూడ్‌లో ఉన్నప్పుడు కిరోసిన్ వాసన కూడా బాగుంటుంది. ముదురు కలుపు తీసిన తర్వాతి వరిపొలం కొన్నిసార్లు నా సాయంకాలపు నేత్ర విడిది! వరినాట్లు వేయడంలో శ్రమసౌందర్యం ఉండొచ్చేమోగానీ, అప్పుడే నాటిన వరిపొలంలో సొగసేమీ లేదు. కానీ క్రమంగా- ఒడ్ల మీది బురద తడి ఆరిపోయి, పక్కకు వాలిపోయిన పనలు నిటారుగా నిలబడుతూ, గంట్లు విస్తారమవుతూ, ఆకులు ముదురాకుపచ్చ రంగును సంతరించుకుంటూ... చెడ్డీలనాటి బాల్యంలోని కుదురులేనితనాన్ని వదిలించుకుని, కౌమారంలోకి వచ్చాక ఉండే శారీరక ఒద్దికను అలవర్చుకుని... పొద్దుగుంకే వేళలో ఏకప్రేయసి నియమంలేని చిరుగాలి తుంటరిగా మేను నిమురుతుంటే అలలాగా ఆనందనృత్యం చేస్తూ... తినబోయేది అన్నాన్నా? తినవల్సింది ఈ అందాన్నా? అలా తదేకంగా చూడొద్దంటారుగానీ, నిద్దరోతున్న బుజ్జాయిల ముఖాల్ని చూడగలగడం అదృష్టం! పిల్లి ఒళ్లు విరుచుకోవడం చూడదగిన దృశ్యం! వేసివున్న మెత్తలు, తెరిచివున్న కిటికీ రెక్కలు, గూనపెంకుల ఇండ్లు, ‘జుయ్య్’మని చిరుమండే వెలుగు జాలి కందిళ్లు, పాతకాలపు చేతిరాతలు... వాటితో ముడిపడిన ఏ భావన వల్లనో నాకు ఆత్మీయంగా తోస్తాయి. ఏ టీవీ రీమోట్ ప్యాకింగ్ కోసమో వాడే పాలిథీన్ గాలిబుడగలను చిట్లిస్తూ ఉంటే కూడా సరదాగా ఉంటుంది. ఉత్తి శూన్యమే! కానీ శూన్యంలో ఏమీ లేదని ఎలా అనగలం? - పూడూరి రాజిరెడ్డి -
ఆజన్మం: షరతుల్లేని ఐక్యత
అలాంటి సమయంలో మిస్డ్‌కాల్ ఇచ్చినవాడికి కూడా ఫోన్ చెయ్యాలనిపిస్తుంది. అదంతా ఆ పూటకు లేదూ ఆ పాట నా మనసును తాకుతున్నంత వరకూ. తర్వాత? ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు, చాలా అరుదుగా మన టేస్టుకు సరిపడే పాట ప్లే అవుతుంది: ‘యారా ఓ యారా తేరీ అదావోనే మారా...’ వంద రిహార్సల్స్ వేసుకునిగానీ మాట్లాడటానికి సాహసించని నేను, ‘‘ఈ పాట ఎందులో’’దని డ్రైవర్‌ను అడిగాను. అతడు నాకు సరిపడే జవాబివ్వలేదు. బహుశా, నాకు జవాబివ్వడం అంత ప్రాధాన్యమైన విషయంగా అతడికి అనిపించకపోవచ్చు. ఆ పాటను పరిచయం చేసినందుకు నేనామాత్రం నిర్లక్ష్యాన్ని భరించదలిచాను. అలాంటి సమయంలో ఇరుకు రోడ్డు విశాలంగా అనిపిస్తుంది; వర్షపు మడుగులో ప్యాంటు ఎత్తుకుని నడవడంలో ఇబ్బంది ఉండదు; మిస్డ్ కాల్ ఇచ్చినవాడికి కూడా ఫోన్ చెయ్యాలనిపిస్తుంది. అదంతా ఆ పూటకు లేదూ ఆ గంట వరకు; ఇంకా చెప్పాలంటే, ఆ పాట నా మనసును తాకుతున్నంతవరకూ. తర్వాత? ఇరుకు. బురద. కాల్ కట్. ఈ భావన నాకు ఇంతకుముందు కలగనిది. ఎందుకు నేను ఎవర్నయినా గాఢంగా అభిమానించను! వాళ్లను బిగియారా కౌగిలించుకుని, అలాగే ఉండిపోయేంతగా; వాళ్ల తాలూకు అణువణువూ నాకు ప్రియమైనది అయిపోయి, వాళ్ల కళ్లు, వాళ్ల భుజాలు, వాళ్ల వీపు, వాళ్ల మీసాలు(ఈ చచ్చు మాటను కావాలనే వాడుతున్నాను; నేను కోరుకునేది స్త్రీయే కానక్కర్లేదని చెప్పడానికి)... వాళ్లకు సంబంధించిన ప్రతిదీ నాకు అత్యంత విలువైనదిగా ఎందుకు అనుభూతి చెందను? చలాన్ని అలా కౌగిలించుకోవాలనిపించింది. కానీ నేను ఒప్పుకోని దేని గురించో కూడా మాట్లాడుతుంటాడు; నేను ఒప్పుకునే దేని గురించి మాట్లాడినప్పుడు నాకు ఆ భావన కలిగిందో చెప్పలేను. బుచ్చిబాబు దగ్గరివాడిగా అనిపిస్తాడు. కానీ ఆ దగ్గరితనం బాబాయ్‌తో సంబంధం లాంటిది కాదు, పెదనాన్నతో ఉండేటటువంటిది. ఫుకుఓకా అంటే ఇష్టం. ఆయన పెద్ద కళ్లద్దాలు రోజూ తుడిచి పెట్టాలనిపించేంత. పొలంలో సీడ్‌బాల్స్ చేస్తున్న ఆయన్ని పక్కకు జరిపి, నేను చేసిపెడతాను, అని చెప్పేంత. అయితే, ఆయనకు నేను చేసిన అలిఖిత వాగ్దానాల గురించిన చర్చ మా మధ్యే ఉండిపోయింది. అప్పటిదాకా నేను ఆయన్ని కలుసుకోలేను. టాల్‌స్టాయ్, త్స్వైక్, శాలింజర్; ఒక అవ్యక్త రేఖ ఏదో నన్ను వీళ్లతో కలుపుతుంది, నా మనసు మెత్తబడి ద్రవంగా పరిణామం చెందుతుంది. కానీ వాళ్ల చుట్టూ ఉండే అగ్ని వలయం నన్ను భయకంపితుణ్ని చేస్తుంది. ఇంకా, మణిరత్నం, మాజిది, అడ్రియన్ లైన్; వీళ్లు మానసికంగా సన్నిహితులేగానీ, ఆ సాన్నిహిత్యం వారి మీద పడిపోయేలా చేసేది కాదు. ఒక్కోసారి ఈయన్ని కౌగిలించుకుందామనుకున్నా, మళ్లీ వెనక్కి చూసుకుంటే, ఈయన్నేనా ఇలా అనుకున్నది అనిపిస్తుంది. అంతకుముందటి చిక్కటిదేదో క్రమంగా పలుచ బారుతూ వస్తుంది. అట్లాంటి గాఢమైన అనురక్తి నాకు దేన్లోనూ లేదు. ప్రకృతిలో లేదు, పనిలో లేదు, మనుషుల్లో లేదు, మొత్తంగా జీవితంలోనే లేదు. మీద మీద దొర్ల్లుకుంటూ వెళ్లిపోవడమే తప్ప, లోతుగా, దాన్ని పట్టుకుని ఆస్వాదించడం నాకు చేతకాదు. పచ్చి మామిడాకుల తొడిమ వాసన అనుభవించడం తెలియదు. వేసవి తొలి జల్లుల తర్వాత కనబడే పసుపురంగు పూలత రాలెపూత అని తెలియదు. రోజూ పెరట్లో వాలే బూడిదరంగు పిట్ట పేరు తెలియదు. అసలు అది బూడిద రంగేనో కాదో కూడా తెలియదు. నాకు నచ్చిన పుస్తకం నచ్చిన మనిషి నుంచి పోస్టులో వచ్చిన క్షణం, ఆకలిగా ఉన్నప్పుడు హోటల్‌కు తీసుకెళ్లిన పరిచయస్థుడి ఔదార్యం, నేను అనుకునే వ్యక్తీకరణ్ని నాకంటే వందేళ్ల ముందే ఆలోచించిన రచయిత ఊహాశక్తి, ఒకరిద్దరు స్నేహితులు గుండెకు గురిచూసి పూవుల్లా విసిరిన మాటలు, ఊపిరిని పాటగా మలిచే గాయకుడు, నా లోపలి నరాన్ని మీటగలిగే సంగీత దర్శకుడు... ఇవన్నీ కొన్ని క్షణాలు! అప్పటికి శాశ్వతత్వాన్ని అద్దుకున్న తాత్కాలిక క్షణాలు!! నాలో ఏదో ఒకటి ఉంది. దాన్ని కరిగించడం సాధ్యం కావట్లేదు. అంటే కరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను; కరిగించేవాళ్లే లేరు. నేను ఎంతసేపూ తీసుకోవడం గురించే మాట్లాడుతున్నానా? అసహజమైనదేదో వాంఛిస్తూ ఉన్నానా? ఏ ఒక్క ఉద్వేగమూ ఒకే పాయింట్ దగ్గర ఉండిపోవడం కుదరదనీ, ఈ ఎగుడుదిగుడులే సహజమైన స్థితి అని గుర్తించలేకపోతున్నానా? నన్ను నేను పూర్తి అర్పణ గావించుకోవడానికి సంసిద్ధం చేసేదేదో నాలో లేదా? హఠాత్తుగా నాకోటి స్ఫురించింది. గతించేవెన్నో అద్భుతమైనవి కావొచ్చు; కానీ సంపూర్ణ అంగీకారతకు కావాల్సినదేదో వాటిల్లో తక్కువ పడుతోందా? వాస్తవ ప్రపంచంలో ఆ లోటు తీరేది కాదు కాబట్టే, ఆ పరిపూర్ణ మూర్తిగా దేవుడిని నిలబెట్టి ఉంటారా! - పూడూరి రాజిరెడ్డి -
ఆజన్మం: సంసారపు వాసన
నా డిగ్రీ రోజుల్లోని నికృష్టపు ఆలోచనల్లో కూడా, నేను దీన్ని ఊహించలేదు. జీవితంలోకి రాగలిగే ఒక అత్యద్భుతమైన స్త్రీ గురించి ఎన్ని కలలు కన్నప్పటికీ, వాస్తవంలో ‘పెళ్లవడం’ అనే స్టేటస్‌కు నేను మానసికంగా ఎన్నడూ ఎదగలేదు. కాబట్టి, సంసారితనం అనే గుణం నాకు పరాయిది. నేనూ ఒక సంచీ పట్టుకుని, కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లి, ఎక్కడ తాజాగా ఉన్నాయో చూడ్డానికి ఉత్తినే రెండు రౌండ్లు కొట్టి, బెండకాయలు కిలో ఇరవై ఐదు రూపాయలని చెబితే ఇరవై కాడికి బేరమాడ ప్రయత్నించి... అబ్బో! అలాంటిది, జీవితం మనిషికి తెలియనివ్వకుండానే భలే వంగదీస్తుంది. బుద్ధిగా రైతు బజార్‌కు వెళ్లి, పోట్లు పడని క్యారెట్లు ఏరుకుని, కన్నులు లేని ఆలుగడ్డలు చూసుకుని, కొత్తిమీర, పుదీనా సంచీలోంచి బయటకు కనబడుతుండగా గుణగుణా రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న సంసారుల్లో ఒకరిగా కలిసిపోవడం సాధారణమైపోయింది. భార్య పోరాడి కూడా జయించలేనిదాన్ని, పిల్లలు యుద్ధం మొదలెట్టకుండానే లొంగదీసుకుంటారు. నడిచేంత దూరమే అయితే గనక, రైసు బ్యాగును మెడల మీద వేసుకుని వెళ్లిపోగలనిప్పుడు. ఒకప్పుడు ఇదేమాట సలీమ్ చెబితే నమ్మలేకపోయేవాణ్ని. అందరూ చూస్తుండగా అలా ఎలా మోసుకెళ్తాం? పిల్లల కోసం సాయంత్రం కిలోల లెక్కన తూకానికి పోయే బేషజం, ఉదయం ఆఫీసుకు క్యారేజీ పట్టుకొస్తుంటే మాత్రం వదిలిపెట్టదు. అందునా టక్కు చేసుకుంటే మరీ! టక్కు వేసుకుని మూడంతస్తుల చద్దిమూటను మోసుకెళ్లడంలో ఒక రొమాన్స్ ఏదో మిస్సయినట్టు అనిపిస్తుంది. అందుకే రెంట్లో దేన్నో ఒకదాన్నే ఎంపిక చేసుకుంటాను. ఇన్‌షర్ట్ చేసుకుంటే క్యారేజీ పట్టుకోవడం ఎందుకు పొసగని విషయం? టక్కుని నేను వైట్ కాలర్తనానికి చిహ్నంగా భావించడం వల్ల, ఈ గ్లామర్ లేని మోతను తిరస్కరిస్తున్నానా? తినడం కోసం మోసుకెళ్లడాన్ని ఆమోదించినా, సంసారపు వాసనను కలిగించే అన్నంమూటను నాలోని అ-సంసారి ఈసడించుకుంటున్నాడా? నేను రెండు మనసులతో బతుకుతున్నట్టా? ఒక్కోసారి నన్ను నేను పట్టుకుని ఎంతగా వేలాడుతూ ఉంటానంటే, ఇక అందులోంచి బయటపడే అవకాశం ఎంతమాత్రమూ ఉన్నట్టు కనబడదు. పూలమ్మే మనిషి నామవాచకాలు తెలియనివ్వని నగరజీవితం కాబట్టి, ఇక్కడ సర్వనామమే ఉపయోగిస్తున్నాను. పలుచని జనుము సంచీలో కనకాంబరాలు, మల్లెలు, దవనం వేసుకొని ఈయన మెహిదీపట్నంలో బస్సెక్కాడు. కాఫీ కలర్ ప్యాంటు వేసుకున్నాడు. ప్యాంటు కుడికాలి కింది భాగంలో కుట్లు ఊడిపోయినై; మోకాలి మీద చినిగిపోయినచోట మ్యాచ్ కాని నల్లదారంతో రఫ్ చేసివుంది. ఆయన వేసుకున్న అంగీ రంగు ఇదని చెప్పలేం. అంటే, క్రీమ్, ఆరెంజ్, నీలం ఏ రంగుకారంగు విడిగా ఉన్నాయి. దానిమీద ఒక కార్యక్రమం గురించిన మాటలు వీలైనన్ని చోట్లా ముద్రించివున్నాయి. దానికి పై గుండీ లేదు. ఎడమ భుజం మీదా, కుడిచంకలోనూ చిరిగివుంది. కిటికీ వైపు కూర్చుంటే కొంతలో కొంత నయంగానీ, లేదంటే తప్పనిసరై ముఖాన్ని ముఖంలో పెట్టాల్సివచ్చే ఎదురెదురు సీటింగ్ అరేంజ్మెంట్ ఉన్న మెట్రో బస్సది. ఆయన నాకు ఎదురుగా కూర్చున్నాడు. నాకంటే కొంచెం పెద్దవాడు అయ్యుండొచ్చు. మాసాబ్‌ట్యాంక్ దాటుతుండగా వాటర్ ప్యాకెట్ తీశాడు. నోటితో ఒక మూలన కొరికి, మొత్తం నీటిని తాగాడు. ఊ... ఇక దీన్ని కిటికీలోంచి విసిరేస్తాడు, అనుకున్నా. ఏమో! నేను పేదరికం, అనాగరికత కవలపిల్లలనుకుంటాను. కానీ వేయలేదు. దాన్ని అలాగే మడతపెట్టి, పూల సంచీలోనే ఒక పక్కకు పెట్టాడు. ఆ చిట్ట చివరి చుక్కల్ని కూడా నోట్లో వంపుకోవడానికి అనువుగా మడిచివుంటాడా? లేక, దాన్ని అనువైన చోట పడేయడానికి వీలుగా అలా పెట్టివుంటాడా? నా స్టాపులో నేను బస్సు దిగేశాను. అదెందుకో స్పష్టంగా తెలియదుగానీ, రెండోదే నిజమని భావించుకోవడంలో శాంతికి మూలధాతువైనదేదో ఉన్నట్టనిపించింది. - పూడూరి రాజిరెడ్డి -
ఆజన్మం: చిందిపోయే కాంతి
స్నానం ఆలస్యం కావడానికి కారణాన్ని ఒక్కోసారి ఏం చెప్పీ నమ్మించలేం; వినేవాళ్లు మరీ చిన్నపిల్లలైపోతే తప్ప. అలా ఎగిరిపడిన నీళ్లు గుండ్రాలు గుండ్రాలుగా కిందికి జారుతూవుంటాయా! మూలన ఉన్న ఆరెంజ్ కలర్ జీరో బల్బ్ చూస్తుండగా నారింజ అవుతుంది; అది నిజమేనా అని తల కాస్త పెకైత్తగానే పొప్పడికాయ అవుతుంది; మళ్లీ తల వంచితే అరటిపండై కూర్చుంటుంది. అదే వరుసలో బిరడా కాగలుగుతుంది; ఇదేంటో చిత్రం అనుకునేంతలో ఈ ముడి అవతలి ముడిని తాకి ఎనిమిదై వయ్యారాలు పోతుంది; పాతరాతి యుగపు పనిముట్టు అవుతుంది; అంతలోనే నిండు చంద్రుడిని తలపిస్తుంది. నీడల నిష్పత్తులు మారినకొద్దీ ముద్దగా, ముద్దుగా, అప్పుడే ద్రవంలాగా, ద్రవపు కాంతిలాగా రూపాంతరం చెందుతూవుంటుంది. ఒక నీడ కూడా అంత అందంగా ఉండగలదని కొత్తగా నిరూపితమవుతూ ఉంటుంది. వెలుగంతా కింద చిందిపోయినట్టుగా, నీటి బిందువులుగా కాంతి విడిపోతుంది. పైనొక్కటే; కింద అనేకంగా దర్శనమిస్తుంది. చేపపిల్లలాగా ఈ బుడగ కాంతిని మోసుకుంటూ మరో కాంతిలో ఐక్యమైపోతుంది. నీళ్లన్నీ చుక్కలేకుండా కిందికి జారిపోయాక, మళ్లీ ఆ ఒక్కటే మిగిలిపోతుంది. ఇదొక వెలుగు నీడల క్రీడ! మనసులోకి జొరబడిపోయిన పెద్దరికాన్ని నీటిబుడగలు ఇట్టే చిట్లిస్తూవుంటాయి. మోకాళ్ల నొప్పుల జాడల్లేని చిన్నతనంలోకి లాక్కెళ్తూవుంటాయి. ఇది కదా సృజన, అనుకుంటాను పొద్దున. రాత్రెప్పుడో, విద్యుద్దీపాల వెలుగును ఆపేసి, నిద్రకోసం చీకటిని బతిమాలుతున్నప్పుడు, ‘బయ్యమైతుంది నానా,’ అని మా చిన్నోడు నాలోకి ఒదిగిపోతాడు. కనిపించే వెలుగులో కనబడనిది చూడటంలో ఏముంది? ఏమీలేని చీకటిలో ఏదో ఒకటి ఊహించడం కదా అసలైన సృజన! భయపడటం కూడా అంత అగౌరవ పరిచే అంశం ఏమీ కాదు సుమా! - పూడూరి రాజిరెడ్డి అరేయ్.. తురేయ్.. చిన్నప్పుడు నిజంగానే చిన్నగా ఉండివుంటాంగదా! ఆ వయసులోనే, దోస్తుల్ని ‘అరేయ్’ అని పిలుచుకునే ఆప్షన్ ఒకటి ఉంటుందని మనకు ఎలా తెలుస్తుంది! స్నేహం కోసం ఒక మర్యాద సరిహద్దును చెరిపేసుకోవాలన్న నియమాన్ని అప్పుడే ఎలా గ్రహించివుంటాం? మా రమేశ్ గాడు, హరీశ్ గాడు పరిచయమైన కొత్తలో నాతో మామూలుగా మాట్లాడుతూనే, ఎవరితోనైనా నా గురించి చెప్పేటప్పుడు ‘వాడు’ ‘వీడు’ అనేవాళ్లు. ‘‘చందానగర్ల మన రాజిగాడు కనవడ్డడ్రా.’’ ‘నన్ను అరేయ్ అనగలిగేంత గొప్పోళ్లారా మీరు’ అని, ఆ సంబోధనను ఒప్పుకోలేక, నిరాకరించలేక సతమతమైమైమై... ఇక చివరకు, ‘నేను కూడా నిన్ను అంటాన్రోయ్’ అని చాటి చెప్పాలనుకుని, ముందు వినీ వినబడనట్టుగా ‘(అరే)య్’ అని, తర్వాత (అ)రేయ్ అని, అటుపై అరేయ్ దాకా వాళ్ల చెవుల్ని ట్యూన్ చేస్తూ వచ్చాను. పెద్దిరాజుగాడితో నాకు పరిచయం తక్కువ. అయినా వాడితో మాట్లాడిన ఒకట్రెండు సార్లకే మేము ‘అరేయ్’ ‘అరేయ్’ అని పిలుచుకోవడం మొదలుపెట్టాం. అలాగే కృష్ణారావుగాడు. ఇంకొందరుంటారు. వాళ్లతో ఎంతో ఆత్మీయ సంబంధం ఉంటుంది. చెప్పాలంటే పైవాళ్లతోకంటే ఒక లక్షరెట్లు ఎక్కువ పరిచయం ఉంటుంది, అయినా ఆ స్నేహం రేయ్లోకి పురోగమించదు; ఒకే వయసు అనే ప్రాథమిక అర్హత ఉన్నప్పటికీ. ఏ సంకోచం ఇక్కడ పనిచేస్తుంది? మర్యాద ముసుగును తొలగించి పారేసే ఏ కీలకం అక్కడ పనిచేసివుంటుంది? బహుశా, ఎవరో ఒకరు ఆ హద్దును తొలిసారి దాటడానికి అమర్యాదకర సాహసం చేయాలేమో! అసలు అలాంటి ప్రయత్నం కూడా జరిగినట్టు తెలియనంతగా గుట్టుచప్పుడు కాకుండా గుండె కోటలోకి దిగబడాలేమో!