ఆజన్మం: సబ్బునురగలాంటి సంగతులు | A story of Soap foams | Sakshi
Sakshi News home page

ఆజన్మం: సబ్బునురగలాంటి సంగతులు

Published Sun, Nov 10 2013 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM

ఆజన్మం: సబ్బునురగలాంటి సంగతులు

ఆజన్మం: సబ్బునురగలాంటి సంగతులు

దుస్తుల్ని ఉతుకడంలో ఈ మజా ఉండదు. అలా కంటిముందట శుభ్రమైపోయే గుణం బట్టల్లో లేకపోవడం వల్లనేమో! సబ్బు నురగను చూస్తే మాత్రం ఉత్తేజం కలుగుతుంది.  ‘చిన్నప్పుడు’ అమ్మకోసం గిన్నెలు తోమిపెట్టాను. ఎడమచేత్తో ‘పుష్’ చేస్తూ, కుడిచేత్తో ‘పుల్’ చేస్తూ గిన్నెను గుండ్రంగా తిప్పడం తోమడంలో ఒక టెక్నిక్! ఆ రెండూ నిజంగా జరుగుతున్నాయా అని గుర్తించలేనంత సమన్వయంతో చేతులు పనిచేయడం ఒక ఆశ్చర్యం. అయితే, ఆ గిన్నె అలా తిరుగుతూ, పడే నీటి ధారకు మురికి అలా వదులుతూ పోతూవుంటే చూడ్డానికి బాగుంటుంది. పాత్రలు రాతివెండివై, తోమడానికి వాడింది బూడిదైతే గనక, ఆ ఫీలింగ్ రెట్టింపవుతుంది.అదే, దుస్తుల్ని ఉతుకడంలో ఈ మజా ఉండదు. బహుశా, అలా కంటిముందట శుభ్రమైపోయే గుణం బట్టల్లో లేకపోవడం వల్లనేమో! కానీ సబ్బు నురగను చూస్తే మాత్రం ఉత్తేజం కలుగుతుంది. ముఖ్యంగా దానిమీద ఏర్పడే గాలి నీడలు!
 
 నురగ బుడగలాంటి ఒక ఇల్లుండి, అలా గాల్లో తేలిపోయి, మబ్బుల మీద కాసేపు దొర్లి, ఠప్‌మని అది నిశ్శబ్దంగా చిట్లిపోయినప్పుడు విరిగిపడే తుంపరముక్కలకు చప్పున కళ్లు మూసుకుని చప్పట్లు కొట్టి, కిందపడకుండా జాగ్రత్తగా మేఘాల్ని పట్టుకుని భూమ్మీదకు దుంకి... చిన్నతనపు పెద్దకోరిక!  అదే చిన్నతనంలో బ్రెడ్డు నిర్మాణం నన్ను ఆశ్చర్యగొలిపేది. తెరలు తెరలుగా, జాలిజాలిగా, ఆ డబల్‌రొట్టెలో అన్ని గదులు ఉండటం చిత్రంగా ఉండేది. ఎలా ఏర్పాటు చేసివుంటారు! అవి పాలల్లో మరింత రుచిగా ఉండటానికి నాకు ఈ బుల్లిగదులూ కారణమే!
 
 అదే చిరు గదుల నిర్మాణం వల్ల దోమతెరను చూసినా నాకు బాగుంటుంది. అలా నిలబడిపోయి ఎంతసేపైనా చూస్తూవుండొచ్చు. అయితే, ఇది చిత్రపడి చూడటం కాదు. ఒక రొమాన్స్ ఏదో ఉంటుందందులో!
 ఎందుకో అడ్డు-నిలువు గీతలు, అవి ఏర్పరిచే పటాలు నాకు ముచ్చటేస్తాయి. కాగితం మీద చతురస్రం బాగుంటుంది. అడ్డము, పొడవు మాయమైపోయిన ఒక పూర్ణ ఆకృతి ఏదో అందులో ఉంటుంది. అయితే వస్తురూపంలో మాత్రం దీర్ఘచతురస్రం ఇంపుగా ఉంటుంది. వృత్తం ఉత్తి వృత్తంగా బాగోనిది ఆమ్మాయిల రింగుల రూపంలో మాత్రం సార్థకత చేకూర్చుకుంటుంది.
 
 మా ఇంట్లోకి కరెంటు వచ్చిన చారిత్రక సందర్భం నాకు గుర్తుంది. అంతకుముందు ఇంట్లో ‘ఎక్క’లుండేవి. వాటిని పెట్టడానికి చెమ్మలు! సాయమానులో, అర్రలో, చంకలో, ముందింట్లో, వాకిట్లో ఈ చెక్కతో చేసిన చెమ్మలు గోడకు కొట్టివుండేవి. అవి లేకపోతే దీగుట్లో పెట్టేవాళ్లం. పొద్దు గూట్లో పడగానే, అమ్మ దీపాలు ముట్టించేది. కొద్దికొద్దిగా కిరోసిన్‌ను తాగుతూ వత్తి మండటం మొదలయ్యేది. కింద చిక్కటి పసుప్చచ్చ, తర్వాత ఎరుపు, ఆపైన నలుపు ఆవరించివుండే ఈ మంటను ఎంతసేపైనా అలా చూడాలనిపించేది. వత్తి కొన్నిరోజులు కాలాక, దానిమీద ఏర్పడే నల్లటి కొరుకులను చేత్తో దూస్తుంటే అవి వేళ్లకు కలిగించే స్పర్శ బాగుండేది, నల్లటి మసిరంగు అంటినప్పటికీ. ఎప్పుడూ కాదుగానీ ఒక ప్రత్యేక మూడ్‌లో ఉన్నప్పుడు కిరోసిన్ వాసన కూడా బాగుంటుంది.
 
 ముదురు కలుపు తీసిన తర్వాతి వరిపొలం కొన్నిసార్లు నా సాయంకాలపు నేత్ర విడిది! వరినాట్లు వేయడంలో శ్రమసౌందర్యం ఉండొచ్చేమోగానీ, అప్పుడే నాటిన వరిపొలంలో సొగసేమీ లేదు. కానీ క్రమంగా- ఒడ్ల మీది బురద తడి ఆరిపోయి, పక్కకు వాలిపోయిన పనలు నిటారుగా నిలబడుతూ, గంట్లు  విస్తారమవుతూ, ఆకులు ముదురాకుపచ్చ రంగును సంతరించుకుంటూ... చెడ్డీలనాటి బాల్యంలోని కుదురులేనితనాన్ని వదిలించుకుని, కౌమారంలోకి వచ్చాక ఉండే శారీరక ఒద్దికను అలవర్చుకుని... పొద్దుగుంకే వేళలో ఏకప్రేయసి నియమంలేని చిరుగాలి తుంటరిగా మేను నిమురుతుంటే అలలాగా ఆనందనృత్యం చేస్తూ... తినబోయేది అన్నాన్నా? తినవల్సింది ఈ అందాన్నా?
 
 అలా తదేకంగా చూడొద్దంటారుగానీ, నిద్దరోతున్న బుజ్జాయిల ముఖాల్ని చూడగలగడం అదృష్టం! పిల్లి ఒళ్లు విరుచుకోవడం చూడదగిన దృశ్యం! వేసివున్న మెత్తలు, తెరిచివున్న కిటికీ రెక్కలు, గూనపెంకుల ఇండ్లు, ‘జుయ్య్’మని చిరుమండే వెలుగు జాలి కందిళ్లు, పాతకాలపు చేతిరాతలు... వాటితో ముడిపడిన ఏ భావన వల్లనో నాకు ఆత్మీయంగా తోస్తాయి. ఏ టీవీ రీమోట్ ప్యాకింగ్ కోసమో వాడే పాలిథీన్ గాలిబుడగలను చిట్లిస్తూ ఉంటే కూడా సరదాగా ఉంటుంది. ఉత్తి శూన్యమే! కానీ శూన్యంలో ఏమీ లేదని ఎలా అనగలం?
 -  పూడూరి రాజిరెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement