ఆజన్మం: వెయ్యి ప్రశ్నల ఉదయం | Thousand questions move around in Children's mind | Sakshi
Sakshi News home page

ఆజన్మం: వెయ్యి ప్రశ్నల ఉదయం

Published Sun, Dec 1 2013 4:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM

ఆజన్మం: వెయ్యి ప్రశ్నల ఉదయం

ఆజన్మం: వెయ్యి ప్రశ్నల ఉదయం

 ‘‘ఇట్ల గట్టిగ ఉండద్దు; ఇల్లంత ఇప్పేసి మళ్లీ మనం మెత్తగ గట్టుకుందం నానా’’ అన్నాడు. కన్నీ, నానీ, బంగారుతండ్రీ లాంటి నాటకీయ మాటలు- ఎవరి నోటినుంచైనా రావడం సహజమైన విషయమేనని తండ్రయ్యాకగానీ నాకు అర్థంకాలేదు. పిల్లలతో అనుబంధం ఎలా ఉంటుందంటే- వాళ్లతో గడిపినప్పటికంటే- కొన్ని రోజులు గడిచాక, ఆ సందర్భం చుట్టూ అంటుకునివున్న మకిలి అంశాలేమైనావుంటే కరిగిపోయి, కేవలం వాళ్లకు వాళ్లుగా నిలబడి మరింత మురిపెం కలిగిస్తారు. ముఖ్యంగా వాళ్ల ప్రశ్నలు, చేష్టలు!
 
 ‘‘పొద్దున లేశినంక ఎందుకు మొఖం కడుక్కొని, ఎందుకు తానం చెయ్యాలి?’’ అని అడుగుతాడు మా పెద్దోడు. ‘‘చీమలు మూతలు దీస్కొని లోపల్కి వోతయా?’’ అని వాడి సందేహం. ఎటూ నేనిచ్చేవి సారహీనమైన జవాబులే అయివుంటాయి కాబట్టి, వాటిని ఇక్కడ రాయను. ‘‘పల్లికాయ బుక్కితే ఇక్కడ ఎందుకు కదులుతది?’’ అని నా కణతను చూపిస్తాడు. ఇంకా వాడి ప్రశ్నలు ఎలా ఉంటాయంటే: ‘‘కుక్క ఎందుకు మాట్లాడది?’’ ‘‘మరి (‘ఐస్ ఏజ్’లో) ఏనుగు ఎందుకు మాట్లాడుతంది?’’ ‘‘నీ కాళ్లు అంత పెద్దగ ఎందుకున్నయ్?’’ ‘‘నాకు మీసాలు ఎందుకు రాలేదు?’’ ‘‘నాన్నా, నీకు ఇక్కడ(చంక) గడ్డం ఎందుకుంది?... మరి ఎంటికలుంటే చక్కిలిగిలి అయితదా?’’ ‘‘చెడ్డి ఇప్పినప్పుడు (నేను) తువ్వాల కట్టుకోవద్దా?... నేను చిన్నపిల్లగాణ్ని కదాని సిగ్గు కాదా?’’
 
 ‘‘లేదంటే కర్రె దొడ్డికత్తదా?’’ అంటాడు, జ్వరం వస్తుందని చెబితే. ‘‘అమ్మ పత్తి ఏర ఎందుకువోదు?’’ అనడుగుతాడు, నానమ్మ పనికెళ్లడం చూస్తాడు కాబట్టి. వాళ్లమ్మ ఇంట్లో ఏదో పనిచేస్తూ వీణ్ని వినిపించుకోకపోతే వీడి స్తోత్రం: ‘ఓ గోర్లపేంటు పెట్టుకున్నమ్మా... ఓ బొట్టు పెట్టుకున్నమ్మా... ఓ గాజులు వేసుకున్నమ్మా...’  ‘‘తిరుపతి మామ రెండు సార్లు పెళ్లి చేసుకుంటడా?’’ అని వాడి అనుమానం. ఎంగేజ్‌మెంట్, తర్వాత పెళ్లి అవుతుందిగా! ‘‘నానా, నేను నిన్ను పెళ్లి చేసుకోవన్నా?’’ ‘‘నన్నా!’’ ‘‘అమ్మను?’’ ‘‘వద్దురా!’’ ‘‘మరి పప్పక్కను?’’ ‘‘అట్లనద్దురా.’’ ఓసారి- జ్యువెలరీ యాడ్‌లో ఉన్న ‘వధువు’ను చూపిస్తూ, ‘‘ఈమెను పెళ్లి జేసుకుంట’’ అన్నాడు. ‘‘పెళ్లి జేసుకొని ఏం జేస్తవ్‌రా?’’ ‘‘పేమిత్త!’’ ..!!!..
 
 వాణ్ని చదువుకు వేయడంలోని అనివార్య నిర్దయను అనుభవిస్తున్నాను. ఒక్కోరోజు బడికి పోను నాన్నా, అంటాడు. ‘‘ఎప్పుడు నేనేనా? తమ్ముణ్ని ఒక్కసారన్న తోలియ్యవా’’ అని ప్రశ్నిస్తాడు. ఒక గేదె, పెయ్య రోడ్డుమీద వెళ్తుంటే- ‘‘బర్రె బయట్నే మూత్రం ఎందుకు పోస్తది? బాత్రూమ్‌ల పెండ పెడితే ఏమైతది?’’ అన్నప్పుడు నవ్వొస్తుంది; ‘‘క్యాప్టెల్ బర్రె స్మాల్ బర్రె’’ అనడం ముచ్చటగొలుపుతుంది; కానీ, ‘‘బుక్కుల్నేమో ఫిష్షంటం, బయట్నేమో చేపంటమా?’’ అన్నప్పుడు మాత్రం మన విద్యావ్యవస్థ కలిగిస్తున్న గిల్టును తొలగించుకునేందుకు నాకు కొంత సమయం పడుతుంది.
 
 ‘‘(ఈ) మామిడికాయలు అన్ని మనయేనా?’’ ‘‘కాదు తాతయ్యవాళ్లయి.’’ ‘‘తాతయ్యవాళ్లు మనింట్ల ఎందుకు వెట్టిండ్రు శెట్టు?’’ ‘‘ఇది వాళ్ల ఇల్లే.’’ ‘‘మరి మనది?’’ ఇల్లు మనది కాకపోవడం అనేది కూడా ఉంటుందని వాడికి జీర్ణం కాలేదు. అదే అద్దింట్లో ఒకరోజు ఉరుకుతూ గచ్చు మీద పడిపోయాడు. పెపైదవి చీరుకుపోయి, రక్తం కారింది. ‘‘ఇట్ల గట్టిగ ఉండద్దు; ఇల్లంత ఇప్పేసి మళ్లీ మనం మెత్తగ గట్టుకుందం నానా’’ అన్నాడు.
 
 గాల్లో అక్షరాల స్వరూపం గీస్తుంటాడు. వాడిని టీవీ లోపట్కి పంపియ్యిమంటాడు. తాళం తీయగలుగుతున్నాడు. తలకు పెట్టిన నూనె తీసెయ్యమంటాడు. ‘నీకు పెద్ద ఇల్లు కట్టిత్త, నీ పుస్తకాలన్నీ పెట్టుకుందు’వని చెబుతాడు. వాడు చెప్పింది నాకు అర్థం కాకపోతే ‘నానా నేనేమంటున్ననా...’ అని వివరించబోతాడు. సూదిత్తే ఏ(డ)వాలి; బిష్షాం అంటే ఇట్ల (గుడ్లు తేలిసి) పడిపోవాలంటున్న చిన్నోడి దశను వీడు దాటిపోయాడు. ‘నువ్వింక బుద్దెప్పుడు నేర్సుకుంటవ్‌రా’ అని తమ్ముణ్ని గదమాయిస్తాడు. ‘‘ఇవ్వాళ చిన్నోడి గోర్లు దీయాలె’’ అంది వాళ్లమ్మ. ‘‘పండ్లు కూడా తీయాలి నాన్నా, ఊకె కొరుకుతున్నడు’’ అన్నాడు. ఇదేమీ కంక్లూజన్‌కు వచ్చే సందర్భం కాదుగానీ, ఆఫీసునుంచి వెళ్లగానే రోజూ పరుగెత్తుకు వచ్చేవాడు రాలేదు. నాకంటే టీవీలో మహేశ్‌బాబు ఎక్కువైపోయిన వాస్తవాన్ని ఎలా జీర్ణించుకోగలను! రేపెప్పుడో అమ్మాయి వాడి జీవితంలోకి వస్తే? ప్రయారిటీల్లో మన స్థానమేంటని ఎప్పటికప్పుడు పూర్తి అవగాహనతో ఉండటమేనా మనం చేయాల్సింది!
 
    
 మామూలుగా నాకన్నా ముందు లేవడు. ఎప్పుడైనా! అలా ఓరోజు మంచం దిగుతూ- నేను మేలుకున్నాను అప్పటికి- నా కాళ్ల మీది చెద్దరు సరిచేసి దిగుతున్నాడు. అయ్యో నా బంగారుతండ్రీ!
 - పూడూరి రాజిరెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement