ఆజన్మం: చిందిపోయే కాంతి
స్నానం ఆలస్యం కావడానికి కారణాన్ని ఒక్కోసారి ఏం చెప్పీ నమ్మించలేం; వినేవాళ్లు మరీ చిన్నపిల్లలైపోతే తప్ప. అలా ఎగిరిపడిన నీళ్లు గుండ్రాలు గుండ్రాలుగా కిందికి జారుతూవుంటాయా! మూలన ఉన్న ఆరెంజ్ కలర్ జీరో బల్బ్ చూస్తుండగా నారింజ అవుతుంది; అది నిజమేనా అని తల కాస్త పెకైత్తగానే పొప్పడికాయ అవుతుంది; మళ్లీ తల వంచితే అరటిపండై కూర్చుంటుంది. అదే వరుసలో బిరడా కాగలుగుతుంది; ఇదేంటో చిత్రం అనుకునేంతలో ఈ ముడి అవతలి ముడిని తాకి ఎనిమిదై వయ్యారాలు పోతుంది; పాతరాతి యుగపు పనిముట్టు అవుతుంది; అంతలోనే నిండు చంద్రుడిని తలపిస్తుంది.
నీడల నిష్పత్తులు మారినకొద్దీ ముద్దగా, ముద్దుగా, అప్పుడే ద్రవంలాగా, ద్రవపు కాంతిలాగా రూపాంతరం చెందుతూవుంటుంది. ఒక నీడ కూడా అంత అందంగా ఉండగలదని కొత్తగా నిరూపితమవుతూ ఉంటుంది. వెలుగంతా కింద చిందిపోయినట్టుగా, నీటి బిందువులుగా కాంతి విడిపోతుంది. పైనొక్కటే; కింద అనేకంగా దర్శనమిస్తుంది. చేపపిల్లలాగా ఈ బుడగ కాంతిని మోసుకుంటూ మరో కాంతిలో ఐక్యమైపోతుంది. నీళ్లన్నీ చుక్కలేకుండా కిందికి జారిపోయాక, మళ్లీ ఆ ఒక్కటే మిగిలిపోతుంది. ఇదొక వెలుగు నీడల క్రీడ! మనసులోకి జొరబడిపోయిన పెద్దరికాన్ని నీటిబుడగలు ఇట్టే చిట్లిస్తూవుంటాయి. మోకాళ్ల నొప్పుల జాడల్లేని చిన్నతనంలోకి లాక్కెళ్తూవుంటాయి. ఇది కదా సృజన, అనుకుంటాను పొద్దున.
రాత్రెప్పుడో, విద్యుద్దీపాల వెలుగును ఆపేసి, నిద్రకోసం చీకటిని బతిమాలుతున్నప్పుడు, ‘బయ్యమైతుంది నానా,’ అని మా చిన్నోడు నాలోకి ఒదిగిపోతాడు. కనిపించే వెలుగులో కనబడనిది చూడటంలో ఏముంది? ఏమీలేని చీకటిలో ఏదో ఒకటి ఊహించడం కదా అసలైన సృజన! భయపడటం కూడా అంత అగౌరవ పరిచే అంశం ఏమీ కాదు సుమా!
- పూడూరి రాజిరెడ్డి
అరేయ్.. తురేయ్..
చిన్నప్పుడు నిజంగానే చిన్నగా ఉండివుంటాంగదా! ఆ వయసులోనే, దోస్తుల్ని ‘అరేయ్’ అని పిలుచుకునే ఆప్షన్ ఒకటి ఉంటుందని మనకు ఎలా తెలుస్తుంది! స్నేహం కోసం ఒక మర్యాద సరిహద్దును చెరిపేసుకోవాలన్న నియమాన్ని అప్పుడే ఎలా గ్రహించివుంటాం?
మా రమేశ్ గాడు, హరీశ్ గాడు పరిచయమైన కొత్తలో నాతో మామూలుగా మాట్లాడుతూనే, ఎవరితోనైనా నా గురించి చెప్పేటప్పుడు ‘వాడు’ ‘వీడు’ అనేవాళ్లు. ‘‘చందానగర్ల మన రాజిగాడు కనవడ్డడ్రా.’’ ‘నన్ను అరేయ్ అనగలిగేంత గొప్పోళ్లారా మీరు’ అని, ఆ సంబోధనను ఒప్పుకోలేక, నిరాకరించలేక సతమతమైమైమై... ఇక చివరకు, ‘నేను కూడా నిన్ను అంటాన్రోయ్’ అని చాటి చెప్పాలనుకుని, ముందు వినీ వినబడనట్టుగా ‘(అరే)య్’ అని, తర్వాత (అ)రేయ్ అని, అటుపై అరేయ్ దాకా వాళ్ల చెవుల్ని ట్యూన్ చేస్తూ వచ్చాను. పెద్దిరాజుగాడితో నాకు పరిచయం తక్కువ. అయినా వాడితో మాట్లాడిన ఒకట్రెండు సార్లకే మేము ‘అరేయ్’ ‘అరేయ్’ అని పిలుచుకోవడం మొదలుపెట్టాం. అలాగే కృష్ణారావుగాడు.
ఇంకొందరుంటారు. వాళ్లతో ఎంతో ఆత్మీయ సంబంధం ఉంటుంది. చెప్పాలంటే పైవాళ్లతోకంటే ఒక లక్షరెట్లు ఎక్కువ పరిచయం ఉంటుంది, అయినా ఆ స్నేహం రేయ్‌లోకి పురోగమించదు; ఒకే వయసు అనే ప్రాథమిక అర్హత ఉన్నప్పటికీ. ఏ సంకోచం ఇక్కడ పనిచేస్తుంది? మర్యాద ముసుగును తొలగించి పారేసే ఏ కీలకం అక్కడ పనిచేసివుంటుంది?
బహుశా, ఎవరో ఒకరు ఆ హద్దును తొలిసారి దాటడానికి అమర్యాదకర సాహసం చేయాలేమో! అసలు అలాంటి ప్రయత్నం కూడా జరిగినట్టు తెలియనంతగా గుట్టుచప్పుడు కాకుండా గుండె కోటలోకి దిగబడాలేమో!