
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ‘ఫేక్ న్యూస్’ (నకిలి వార్తలు) అంశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఫేక్‌న్యూస్ రాసినట్టు, ప్రసారం చేసినట్టు నిరూపితమైన జర్నలిస్ట్‌లకు ప్రభుత్వ గుర్తింపు (అక్రిడిటేషన్) కార్డు రద్దుచేస్తామన్న కేంద్ర సమాచారశాఖ వివాదాస్పద పత్రికా ప్రకటన మనదేశంలో సంచలనం సృష్టించింది. దీనిపై దేశవ్యాప్తంగా జర్నలిస్టులు, రాజకీయపార్టీలు మొదలుకుని అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యంతో కొన్ని గంటల్లోనే ప్రభుత్వం దీన్ని వెనక్కు తీసుకుంది. వచ్చే ఏడాది లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పత్రికలు, మీడియా నియంత్రణ ప్రయత్నాల్లో భాగంగానే జర్నలిస్టుల గుర్తింపు కార్డుల రద్దు ప్రతిపాదన వచ్చిందనే విమర్శలు వెల్లువెత్తాయి.
విశ్వసనీయతకు గ్రేడింగ్...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యాజోక్యంపై ఆధారాలు బయటపడుతున్న నేపథ్యంలో ఐరోపా వ్యాప్తంగా ఫేక్‌న్యూస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఏయే చర్యలు తీసుకోవాలనే దానిపై బ్రసెల్స్ కసరత్తుచేస్తోంది. నకిలి వార్తలపై పోరులో భాగంగా సరిహద్దులు లేని విలేకరులు (రిపోర్టర్స్ వితవుట్ బార్డర్స్–ఆర్‌ఎస్‌ఎఫ్), వివిధ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు కలిసి మంగళవారం జర్నలిస్టుల కోసం విశ్వాస,పారదార్శకత ప్రమాణాలు ప్రకటించాయి. జర్నలిజం ట్రస్ట్ ఇనిషియేటివ్ (జేటీఐ) ద్వారా స్వతంత్రత, వార్త వనరులు (న్యూస్ సోర్స్), ఉన్నతస్థాయి నైతికత ప్రమాణాలు »ే రీజు వేసి మీడియా సంస్థలను సర్టిఫై చేయాలని భావిస్తున్నారు. దీనికి ఏజెన్సీఫ్రాన్స్ ప్రెస్ (ఏఎఫ్‌సీ), యూరోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ (ఈబీయూ), గ్లోబల్ ఎడిటర్స్ నెట్‌వర్క్ మద్దతు తెలిపాయి. ఫేక్‌న్యూస్ పేరిట పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కుంటున్న దృష్ట్యా మీడియాకు విశ్వసనీయతను కలిగించేందుకు ఈ చర్య దోహదపడుతుందని ఆర్‌ఎస్‌ఎఫ్ అధిపతి క్రొస్టోఫో డెలోరి అభిప్రాయపడ్డారు. ప్రపంచస్థాయిలో వార్తలు, సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా స్వయం నియంత్రిత యంత్రాంగాన్ని తాము ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు.
ట్రంప్‌తో...
2016 ఎన్నికల్లో అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక ఆయనపై అనేక వ్యతిరేకవార్తలొచ్చాయి. మీడియాలో తనపై వచ్చిన కథనాలను ‘ఫేక్‌న్యూస్’గా అభివర్ణిస్తూ ట్రంప్ ఈ పదబంధాన్ని ›ప్రచారంలోకి తీసుకొచ్చారు. దరిమిలా తమకు వ్యతిరేకంగా వచ్చే మీడియా కథనాలు, వార్తాసంస్థల వార్తలను గురించి వివిధదేశాల్లోని నాయకులు ఈ పదాన్నే ఉపయోగించడం పరిపాటిగా మారింది. ఫేక్‌న్యూస్‌తో పాటు తప్పుడు సమాచారంతో జరిగే ప్రచారాల వల్ల ప్రస్తుత సమాజం నిజమైన సవాళ్లనే ఎదుర్కుంటున్నా, ఈ వార్తల నియంత్రణ ముసుగులో పత్రికాస్వేచ్ఛను హరించేందుకు వివిధదేశాల్లోని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.
- మీడియాపై విమర్శలు, దాడికి ట్రంప్ ట్విటర్ వేదికగా స్పందిస్తుంటారు. ఫేక్‌న్యూస్ స్టోరీలను విమర్శిస్తూ సింక్లర్ బ్రాడ్‌కాస్ట్ గ్రూప్ ప్రసారం చేసిన వార్తలను వెనకేసుకొచ్చారు.
- మలేషియాకు, ఆ దేశ పౌరులకు నష్టం జరిగేలా మలేషియాలో, బయటా అసత్య వార్తలు ప్రచారంలోకి తీసుకొచ్చే వారిపై 5 లక్షల రింగిట్టుల (1.23 లక్షల డాలర్ల) వరకు జరిమానాతో పాటు గరిష్టంగా ఆరేళ్ల జైలుశిక్ష విధించేలా అక్కడి ప్రభుత్వం చట్టం తెచ్చింది. సాథారణ ఎన్నికల నేపథ్యంలో ఈ చట్టపరిధిలోకి వార్తాసంస్థలు, డిజిటల్ పబ్లికేషన్లు, సోషల్ మీడియాను తీసుకొచ్చారు.
- ఆన్‌లైన్‌లో పనిగట్టుకుని తప్పుడు వార్తలు ప్రచారం చేయడాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టే అంశాన్ని సింగపూర్ పార్లమెంటరీ కమిటీ సమీక్షిస్తోంది. ఆ దేశ చరిత్రలోనే సుదీర్ఘంగా (8 రోజుల పాటు) సాగిన సమీక్ష గతనెల 29న ముగిసింది. తీసుకురాబోయే కొత్త చట్టంపై వచ్చేనెలలో ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయనుంది.
- ‘రాప్లర్’ అనే న్యూస్‌సైట్‌పై తనకు నమ్మకం పోయిందని పేర్కొంటూ అధికార కార్యకలాపాలు కవర్ చేయకుండా ఆ సంస్థపై ఫిలిప్పిన్స్ అధ్యక్షుడు రోడ్రిగొ డ్యూటెర్టొ నిషేధం విధించారు. ఆ సంస్థను ఫేక్‌న్యూస్ సంస్థగా ఆయన అభివర్ణించారు. డ్యూటెర్టో విధానాలు, ప్రకటనల్లో కచ్చితత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ, ఎండగట్టడమే ‘రాప్లర్’చేసిన నేరం.ఈ చర్యతో పాటు యాంటీ ఫేక్ న్యూస్ చట్టాన్ని కూడా డ్యూటెర్టొ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పుడు వార్తలకు జరిమానతో పాటు ఇరవై ఏళ్ల వరకు జైలుశిక్ష విధించాలని ప్రతిపాదిస్తున్నాడు.
- థాయ్‌లాండ్ సైబర్ భద్రతా చట్టం కింద అసత్య సమాచార వ్యాప్తికి ఏడేళ్ల దాకా జైలుశిక్ష వేస్తారు. అక్కడి రాచరిక కుటుంబం అవమానాల పాలు కాకుండా అడ్డుకునేందుకు ఆ దేశ మిలటరీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.
- బోగస్ రిపోర్టులు, ఇతరులను కించపరిచేలా చేసిన పోస్టింగ్‌లను వెంటనే తొలగించకపోతే సామాజిక మాధ్యమాలపై 50 మిలియన్ల యూరోల (60 మిలియన్ డాలర్లు) వరకు జరిమానా విధించేలా జర్మనీ ఇప్పటికే చట్టం చేసింది.
- ఎన్నికల నేపథ్యంలో నకిలి వార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు ఫ్రాన్స్ కూడా చట్టాన్ని రూపొందిస్తోంది.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment