
దెయ్యం కెవ్వుమంది!
దెయ్యాలంటే అందరికీ భయమే. కారణం వాటిని ఎవరూ చూడకపోవడమే. చూస్తే ఇక ఏ భయమూ ఉండదు. ఒకప్పుడు పల్లెటూళ్లలోనే దెయ్యాలు ఎక్కువగా ఉండేవి. నగరీకరణకి ఆకర్షితమై అవన్నీ సిటీల్లోకి వచ్చేశాయి. వాటికి బస్సులు, రైళ్లు ఎక్కాల్సిన అవసరం లేదు. గాల్లోనే వచ్చేస్తాయి. అంతా ఎయిర్ వే. నగరాల్లో ఆల్రెడీ ఉన్న దెయ్యాలు, వలస దయ్యాలు ఏకీకృతమై వాట్సప్‌గ్రూప్‌లా జట్టుకట్టాయి. అందులో కొన్ని వీలు చూసుకుని సినిమాల్లో చేరిపోగా, మరికొన్ని సాహిత్యంలో దూరిపోయాయి. వేషభాషలపై అంతగా పట్టులేనివి జర్నలిజంలోకి దూకేశాయి. హాస్య సినిమాలు చూసి భయపడుతూ, పుస్తకం, పేపర్ తెరవడానికి జడుసుకుంటూ మనం జీవించడానికి వీటి కృషే కారణం.
దెయ్యమంటే ఏమిటని ఒకసారి ఒక స్వామీజీని అడిగాను. ఆయన మొహానికున్న మాస్క్‌ని తీసి నా వైపు చూశాడు. కెవ్వున కేకేసి పారిపోయి వచ్చేశాను. దెయ్యాలు ఎక్కడైనా ఎలాగైనా ఉండొచ్చు. అనవసరంగా హారర్ సినిమాల్లో వెతుకుతూ ఉంటాం. మనల్ని ఎలాగైనా భయపెట్టాలని రాంగోపాల్‌వర్మ ప్రయత్నించి ప్రయత్నించి విఫలమై తానే భయపడి ఊరుకున్నాడు. తెల్లారి లేచినప్పటి నుంచి బోలెడంతమంది నాయకుల్ని చూసి అలవాటుపడిన ప్రాణాలు మనవి. దెయ్యాలకి మనమా భయపడేది?
హారర్ సినిమాల్లో సంగీత దర్శకులు తమదైన శైలిలో కృషి చేస్తారు. కొందరు ఏమీ వాయించకుండా నిశ్శబ్దంతో భయపెట్టాలని చూస్తారు. మరికొందరు డమరుకం దగ్గర్నుంచి డోలు వరకూ ఎడాపెడా ఉతికేసి చెవులు కొరికి తినేస్తారు. వాయిద్యాలతో పాటు మన తలని కూడా బాదేస్తారు. అయినా అన్ని వైపుల నుంచి హారన్లు మోగించే ట్రాఫిక్‌జాంలకే మనం భయపడం. ఇక ఈ వాయిద్యాలొక లెక్క?
బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో దెయ్యాలకి నిర్దిష్టమైన సిలబస్, బాడీలాంగ్వేజి ఉండేది. గడియారం 12 గంటలు కొట్టిన తర్వాతే యాక్టివేట్ కావాలి. అవి రావడానికి ముందు ఒక నక్క, గుడ్లగూబ కొన్ని సౌండ్స్ చేయాలి. కాలికి గజ్జెలు, తెల్లచీర కంపల్సరీ. చక్కటి సంగీతంతో ఒక పాట పాడగలిగితే దెయ్యానికి కాస్త గౌరవం. అయినా దెయ్యాలు ఆడవాళ్లనే ఎందుకు ఆశ్రయిస్తాయనేది చాలామంది సామాజిక వేదాంత తత్వవేత్తల ప్రశ్న.
నిజానికి మగవాళ్లు, దెయ్యాలు ఒకే నాణానికి రెండు ముఖాలని ఎప్పట్నుంచో ఫెమినిస్ట్‌లు చెబుతున్నా, కొంతమంది హ్యూమనిస్ట్‌లు వినడం లేదు. మొగుళ్లని తన్నలేని ఆడవాళ్లకే దెయ్యాలు పడతాయని వెనకటికి మా పెద్దమ్మ ఒక థియరీ కనిపెట్టింది.
భరించినంతకాలం భరించి చెలకోలా తీసుకుని మా పెద్దనాయన వీపుమీద రెండు, మూతి మీద మూడు వాయించేసరికి ఒళ్లు వాతలు తేలి దిక్కులు కూడా చూడకుండా పారిపోయాడు. మొగుడు పరారయ్యాడని నిర్థారించుకున్న తర్వాతే ఆమెలోని దెయ్యం వదిలింది.
టీవీ సీరియళ్లు వచ్చిన తరువాత దెయ్యాలకి చేతినిండా పని తగ్గిపోయింది. సీరియళ్ల స్థాయిలో భయపెట్టడం ఎవరివల్లా కాదని రుజువు చేసుకుని అవి కూడా సీరియళ్లకి అడిక్ట్ అయిపోయాయి. వాస్తవానికి దెయ్యాలు లేవని నాకు చిన్నప్పుడే తెలుసు. ఆ విషయాన్ని ఒక దెయ్యమే చెప్పింది.
- జి.ఆర్. మహర్షి