శీతాకాలంలో కాశ్మీరయానం | In the winter Kashmira Cruising | Sakshi
Sakshi News home page

శీతాకాలంలో కాశ్మీరయానం

Published Fri, Jan 2 2015 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

శీతాకాలంలో  కాశ్మీరయానం

శీతాకాలంలో కాశ్మీరయానం

జాన్‌బాబు కొయ్యే
 
ప్రకృతి అందాలకు చక్కని చిరునామా  కాశ్మీరు. పర్వతాలు, లోయలు, సెలయేరుల  సవ్వడులు, విశాల సరస్సులు, పచ్చని మైదానాలు,  సహజవనాలు, ఎత్తై దేవదారు వృక్షాలు, గొర్రెల మందలు...  ఇవన్నీ పర్యాటకులను పరవసింపజేస్తాయి. వీక్షకులకు కనువిందు చేస్తాయి. ప్రపంచంలో తప్పక సందర్శించవలసిన స్థలాల్లో కాశ్మీరు ఒకటి.
 
పీర్‌పంజాల్ పర్వత పంక్తి నుండి గ్రేటర్ హిమాలయాల మధ్యలో ఏర్పడిన విశాలమైన లోయ ప్రాంతమే కాశ్మీరు. సముద్రమట్టం నుండి సుమారు 5-6 వేల మీటర్ల ఎత్తులో, అధిక తేమ కలిగి ఉండుట వల్ల వేసవిలో చల్లగా, శీతాకాలంలో మరింత చల్లగా మంచు కప్పబడి ఉంటుంది.

కాశ్మీరు కేంద్ర విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగంలో సహ ఆచార్యులుగా ఉద్యోగం చేస్తూ నాలుగు ఋతువులను చూశాను. చాలా ప్రాంతాలను స్వయంగా సందర్శించాను. ఎటు చూసినా కొత్త అనుభూతినిచ్చే ఈ ప్రాంతం పురాతన సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉంటుంది. సంవత్సరాన్ని ప్రధానంగా వేసవి శీతాకాలాలు చెరోసగం పంచుకుంటాయి. వేసవిలో కాశ్మీరును సందర్శించడానికి పర్యాటకులు ఇష్టపడతారు కానీ శీతాకాలంలో హిమగిరులతో కనిపించే కాశ్మీరు అనుభూతులను పొందలేరు. అసలైన కాశ్మీరు అందాలను చూడాలనుకునేవారు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు కొనసాగే శీతాకాలంలో సందర్శించక తప్పదు. కాశ్మీరు అందాలను చిత్రీకరించిన రోజా, హైదర్ సినిమాల్లో చివరి ఘట్టాలు ఇక్కడి శీతాకాల అందాలకు నిలువుటద్దాలు.

 కాశ్మీరులో కాలుష్యం ఇతర ప్రాంతాలతో పోలిస్తే కాస్త తక్కువే. కారణం ఇక్కడ పంటలు తప్ప పరిశ్రమలు లేవు. అక్టోబర్ నెలలో కాశ్మీరు ఆపిల్, నవంబర్‌లో కాశ్మీరు కుంకుమ పంట మొదలువుతాయి. ప్రపంచంలో ఉత్తమ శ్రేణి కుంకుమ ఇరాన్, స్పెయిన్ కాశ్మీరు నుండి లభిస్తున్నాయి.

 స్థానిక స్త్రీ, పురుషులు వేరుగా ప్రత్యేకంగా తయారు చేసిన ఉలెన్ నిలువుటంగీ ‘ఫెరన్’ ధరిస్తారు. ఇది కాశ్మీర్ సంప్రదాయానికి ప్రతీక. డిసెంబర్ 8న కాశ్మీరులో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్రమోడి కాశ్మీర్ శీతాకాల సంప్రదాయ దుస్తులైన ‘ఫెరన్’ ధరించి ప్రసంగించారు. ‘కాంగ్రీ’ అని పిలిచే నిప్పుల కుండను చిన్న బుట్టలో పెట్టి కూడా తీసుకెళతారు. వెచ్చదనాన్ని పొందుతారు.
 
సందర్శనీయ స్థలాలు

 శ్రీనగర్‌లో ఎత్తై హరిపర్వతం, గోపాధారి (శంకరాచార్యుని కొండ) ఎక్కి చూస్తే నగరాన్ని డాల్ సరస్సును చూడవచ్చు. ఇక్కడ పురాతన దేవాలయాలు, మధ్య యుగం నాటి మసీదులు, కోట బురుజులు అలనాటి వైభవాన్ని జ్ఞాపకం చేస్తాయి. హజ్రత్‌బాల్ దర్గాలో మహ్మద్ ప్రవక్త యొక్క తల వెంట్రుక భద్రం చేయబడిందని ఇక్కడ ప్రజల నమ్మకం. కోర్ భవాణి దేవాలయం పురాతనమైన చారిత్రక పూజా స్థలం. కల్హణుడు తన గ్రంథం ‘రాజతరంగిణి’లో ఈ దేవాలయాన్ని గూర్చి ప్రస్తావించాడు. శ్రీనగర్ ప్రధాన కూడలిలో ఒక చర్చి కూడా ఉంది. ఇక షాలిమర్ గార్డెన్, నిషార్ గార్డెన్, పీర్‌మహల్ గార్డెన్‌లు రమణీయమైన సహజ వనాలు. పీర్‌మహల్‌ను దారాషికో తన సూఫీ గురువు కొరకు నిర్మించాడు.

 ప్రపంచ ఖ్యాతి పొందిన ‘డాల్ లేక్’లో తేలియాడే ఇళ్లు దర్శనమిస్తాయి. ఈ బోట్ హౌసుల్లో పర్యాటకులు బస చేయవచ్చు. కాస్త ఖరీదు ఎక్కువైనా వసతులు, రాచమర్యాదలు, కాశ్మీర్ వంటలు, చలిని తట్టుకోవడానికి తగిన వెచ్చని ఏర్పాట్లు చేయుట వల్ల మంచి అనుభూతిని పొందవచ్చు. ఇక సరస్సులో రొమాంటిక్ షికారా (బోట్ విహారం)కు వెళ్లి చిన్న చిన్న దోవులను చూసి రావచ్చు. తేలియాడే కూరగాయల బజారును సందర్శించవచ్చు. ఇది 8 కి.మీ. పొడవు, 4. కి.మీ. వెడల్పుతో సుమారు 26 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. చుట్టూ కొండలు ఒక పక్క మొగల్ గార్డెన్‌తో మధ్యలో ఫౌన్‌టెన్‌లతో పర్యాటకులకు ఆహ్లాదంగా ఉంటుంది. దీనికి దగ్గర్లో నిగోన్ లేక్, శ్రీనగర్‌కి కొంత దూరంలో ఊలార్‌లేక్, మానసబల్ లేక్‌లు చెప్పుకోదగ్గ సందర్శనా స్థలాలు.

 జీలమ్ నది కాశ్మీరుకు జీవనధార. అనంతనాగ్ జిల్లాలో ‘వెరినాగ్’ దగ్గర ఒకే నీటి ఊట నుండి జలధార ప్రవహించినందున దీనిని ‘జీలమ్’ అని అంటారు. కొంచెం దూరంలో కొక్రనాగ్ దగ్గర ఐదు పాయలుగా వీడి సహజమైన వనాన్ని సృష్టించి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ చిన్న సెలయేరులు కోడి పాదం వలే వీడి ప్రవహించుట వల్ల కోక్రనాగ్ అని పిలుస్తారు. తేటగా కనిపించే స్వచ్ఛమైన జలధారల దగ్గర విద్యార్థులతో ఒక రోజంతా గడిపాను.

 శ్రీనగర్ నుండి ఉదయమే బయలుదేరి సాయంకాలానికి తిరిగి వచ్చేసే సందర్శనా స్థలాలు చాలా ఉన్నాయి. ఇలాంటి స్థలాల్లో గుల్‌మార్గ్ ముఖ్యమైనది. నగరానికి వంద కి.మీ. దూరంలో ఉన్న ఈ ప్రాంతం 30 కి.మీ.ఘాట్ రోడ్డు పైకి ఎక్కాలి. ఇది ఎత్తై ప్రాంతమే కాదు, దేవదారు వృక్షాలతో తెల్లని మంచుతో కప్పబడి ఉంటుంది. వాహనాలు పైకి ఎక్కడం ఒక సాహసోపేతమైన చర్యే. టంగ్‌మార్గ్ బిగించి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇక్కడ అద్దెకు చైన్లు బిగిస్తారు. మంచు బూట్లు చలి దుస్తులు కూడా అద్దెకు ఇస్తారు. శీతాకాలమంతా దట్టమైన మంచు ఆవరించి ఉంటుంది. గుల్‌మార్గ్ పైకి వెళ్లగానే విశాలమైన మంచు మైదానం ప్రత్యక్షమవుతుంది. ధృవ ప్రాంతాలలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. నడవలేనివారి కొరకు గుర్రాలతో గుజ్జార్‌లు, స్లెడ్జ్ బండ్లతో కుర్రాళ్లు వచ్చి సేవలందిస్తామంటారు. భాష లోపాలను అనువుగా తీసుకుని ఎక్కువ డబ్బులు కూడా గుంజుతారు. ఇక్కడ బస చేయుటకు హోటల్ నివాసాలు ఉంటాయి. మంచుపై స్కేటింగ్ (స్కీయింగ్) చేయుటకు శిక్షణా శిబిరాలున్నాయి. తగిన ఐడి కార్డు చూపిస్తే కావలసిన పరికరాలు అద్దెకు ఇస్తారు. మంచుపై స్కీయింగ్ చక్కని అనుభూతి కలుగుతుంది.

 ఇక్కడ నుండి మరింత ఎత్తై పర్వతాలపైకి వెళ్లడానికి ‘రోప్ వే’ ఉంది. రెండు దశలుగా పైకి వెళ్లాలి. పర్యాటక విభాగం వారు రక్షణాదళం సహాయంతో ఈ ‘రోప్ వే’ నిర్వహిస్తున్నారు. టిక్కెట్‌లు ఆన్‌లైన్‌లో కూడా లభిస్తాయి. ఇంకా సొనా మార్గ్, పెహుల్ గామ్, బేతాజ్ వేలీ, దోద్‌పత్రి పర్యాటకులను ఆకర్షించే స్థలాలు. సందర్శకులు కాశ్మీరులో ఎదుర్కొనే చిన్న సమస్య ఒకటుంది. రాష్ట్రంలోకి ప్రవేశించగానే వారి మొబైల్ ఫోన్‌లు, పోస్టు పెయిడ్ అయితేనే పని చేస్తాయి.

  కాశ్మీర్‌లోని పర్యాటక స్థలాలలో సందర్శకులు ఏమైనా ఇబ్బందులు పడినా లేక చిక్కుబడినా నిత్యం పహారా కాస్తున్న భాతర సైనికులు తక్షణమే ప్రత్యక్షమవుతారు.

షాపింగ్ చేయడానికి...

కాశ్మీర్‌లో షాపింగ్ చేయుటకు శ్రీనగర్‌లోని లాల్ చౌక్, రోగల్ చౌక్, అనువైన స్థలాలు. శీతాకాల దుస్తులు, శాలువాలు, కాశ్మీర్ క్రాఫ్ట్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. ఢిల్లీలోని పాలికా బజార్, కరోల్ బాగ్ వలె ఇక్కడ వ్యపారస్థులు మోసం చేయరు. కానీ, పష్‌మీనా శాలువాలు రెండు నుండి డెబ్భై వేల వరకూ ఉంటాయి. ఎందుకంటే పష్ మీనా జాతి గొర్రెల నుండి తీసి నేసిన ఈ ఊలు మృదువుగా తేలికగా ఉంటుంది. ఆ నాణ్యత, ఖరీదు తెలియకుండా కొనాలని ప్రయత్నిస్తే నష్టపోయే ప్రమాదముంది. చేనేత కార్పెట్‌లు, మెరిసే రాగి, నగిషీ వెండి వస్తువులు ఆకర్షణీయంగా ఉంటాయి. దూర విదేశాలకు పర్యాటనకు వెళ్లేవారు ముందు మన కాశ్మీరులోని శీతాకాల అందాలను వీక్షించండి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement