అదిగదిగో అద్దాల మేడ
మన దగ్గరే
ప్రాణహిత గలగలలు, ప్రకృతి అందాలు మూడు రాష్ట్రాల సరిహద్దులో మురిపిస్తున్న కట్టడంఇంగ్లండ్ నుంచి అద్దాలను తెప్పించారు. భవన నిర్మాణానికి అద్దాలను ఎక్కువగా వాడడంతో ‘అద్దాల మేడ’ అనే పేరు వచ్చింది. భవనాన్ని ముందు నుంచి చూస్తే తాబేలు ఆకారంలో ఉంటుంది.
అట్టెం మదునయ్య
చెన్నూరు, అదిలాబాద్
తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని సిరొంచా పట్టణంలో ఉన్న అద్దాల మేడ రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించింది. ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం సరిహద్దుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాణహిత నది అవతలి ఒడ్డున సిరొంచాలోని అద్దాల మేడ నుంచే రజాకార్లకు వ్యతిరేకంగా భారతసైన్యం చర్యలు చేపట్టింది. ఇక్కడి నుంచే నిజాం సర్కార్‌పై సైనికులు ఉద్యమించారు.1906లో అప్పటి కలెక్టర్ గ్లాస్‌ఫోర్డ్ దీన్ని నిర్మించగా కలెక్టర్ బంగ్లాగా వినియోగించారు.
అద్దాల మేడ నిర్మించి 108 ఏళ్లు...
అద్దాల మేడ నిర్మించి ఈ ఏడాదికి 108 ఏళ్లు పూర్తయ్యాయి. మేడ ఇప్పటికీ చెక్కుచెదరక పోవడం విశేషంగా. ఈ మేడకు ఇంగ్లండ్ నుంచి అద్దాల తెప్పించారు. భవనానికి అద్దాలను ఎక్కువగా వాడడంతో ‘అద్దాల మేడ’ అనే పేరు వచ్చింది. భవనాన్ని ముందు నుంచి చూస్తే తాబేలు ఆకారంలో ఉంటుంది. లోపల అందమైన గదులు, వంటశాల, విశ్రాంతి గది, సమావేశ గదులు చూపరులను ఆకట్టుకుంటాయి. మూడంతస్తుల మేడ కావడంతో మొదటి అంతస్తులో కలెక్టర్ కార్యాలయం, రెండో అంతస్తులో కలెక్టర్ నివాసం, మూడో అంతస్తు ఎక్కితే 12 కిలో మీటర్ల మేరకు అన్ని గ్రామాలు కనిపిస్తాయి. భవనం లోపల నుంచి 10 కిలో మీటర్ల సొరంగం ఉండేదని, ఈ సొరంగం ప్రాణహిత ఒడ్డు వరకు ఉండేదని సైనికులకు ఈ మార్గం నుంచి ఆయుధాలు అందేవని చరిత్ర చెబుతుంది
ప్రాణిహిత గలగలలు...
అద్దాల మేడ ప్రాణహిత నది ఒడ్డున ఉంది. ఒకవైపు ప్రాణహిత గలగలలు, మరోవైపు పచ్చని చెట్లు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. కోటపల్లి మండలంలోని అర్జున్ గుట్ట దగ్గర నుంచి పడవపై ప్రాణహిత దాటితే అద్దాల మేడ సాక్షాత్కరిస్తుంది. మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ భవనం పర్యాట ప్రేమికుల మనసు దోచుకుంటుంది.