
అక్షరాలలో అక్షరంగా...
అవిశ్రాంతం అరవై తర్వాత
‘జర్నలిజంలో సృజనరాగాలు’ సృష్టించిన కథకులు. ‘సాహితీ మంత్ర నగరిలో సుస్వరాలు’ పలికించిన అవిశ్రాంత సిరాధార. ‘అస్తిత్వవాదం- ఆవలితీరం’తో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. సద్గ్రంధపఠనం... సజ్జన సాంగత్యంతో జీవించడమే ఆనందకరమైన జీవనం... అంటున్న మునిపల్లె రాజు... నేటి అనుభవాలు... ఆయన మాటల్లో...
నేను నలభై ఏళ్లపాటు రక్షణరంగంలో ఉద్యోగం చేసి 1983లో రిటైరయ్యాను. అది ఆ రంగం నుంచి విరమణ మాత్రమే. అప్పటినుంచి నేను సాహిత్యరంగంలో మథనం చేస్తున్నాను. డిఫెన్స్‌లో ఉన్నప్పుడు రాసిన కథలను సంకలనం వేశాను. అలా మొదలైన పుస్తకాల పరంపరలో నాలుగు కథల సంకలనాలు, రెండు కవితా సంకలనాలు, రెండు సాహిత్య వ్యాసాలు ప్రచురించాను. ప్రొఫెసర్ నిడదవోలు మాలతి నా రచనలను ఇంగ్లిష్‌లో ముద్రిస్తున్నారు.
ప్రణాళికతో కాదు...
రక్షణరంగం నుంచి ఉద్యోగవిరమణ తర్వాత జీవితాన్ని ఫలానా విధంగా గడపాలనే ముందస్తు ప్రణాళికలేవీ వేసుకోలేదు. స్వీయక్రమశిక్షణ వల్లనే నా జీవితం ప్రణాళికాబద్ధంగా నడుస్తోంది. నేను ఉద్యోగంలో అస్సాం తదితర ప్రదేశాల్లో ఉన్నప్పుడు అక్కడికి కుటుంబాన్ని తీసుకెళ్లే పరిస్థితి లేదు. పిల్లల చదువుకు ఇబ్బంది కలగకుండా నా భార్య సులోచన హెదరాబాద్ లో కుటుంబాన్ని చక్క దిద్దుకునేది. నేను రిటైర్ అయ్యే నాటికి కుటుంబపరంగా నా బాధ్యతలను తను ఓ ప్రణాళిక ప్రకారం నిర్వహించింది. పిల్లల బాధ్యత లేకపోవడంతో ఉద్యోగానంతర జీవితాన్ని సాహిత్యానికే అంకితం చేశాను.
రోజూ చదువుతూ... రాస్తూ...
ఉదయం ఆరింటికి నిద్రలేచిన తర్వాత ఓ అరగంట సేపు కాలనీలోనే నడుస్తాను. ఇంటికి వచ్చిసేదదీరిన తర్వాత ఉత్తరాలకు జవాబులు రాస్తాను. సాహిత్యాభిలాషుల ఉత్తరాలలో క్షేమసమాచారాలు రెండు వాక్యాల్లో ఉంటే విషయచర్చ నాలుగు పేజీలు ఉంటుంది. గత రెండు నెలలుగా పెద్ద ఉత్తరాలు రాయడానికి శక్తి చాలక క్లుప్తంగా ముగిస్తున్నాను. ఈ మధ్య ఢిల్లీ నుంచి ముఖ్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి ఎక్కువ ఉత్తరాలు వస్తున్నాయి. సాహిత్య అకాడమీ ప్రస్తుతం అవార్డుకి ఎంపికైన రచయితల కథలను 22 భాషల్లోకి అనువదించి ప్రచురించే పనిలో ఉంది. ఆ పనులకు సంబంధించిన సలహా, సంప్రదింపులు ఉత్తరాల రూపంలో నడుస్తుంటాయి. ఉత్తరం ఒక అద్భుతమైన మాధ్యమం. సామాన్యంగా క్షేమసమాచారాలు తెలియచేసే సాధనంగా కనిపిస్తుంది. కానీ అక్షర లక్షలు విలువ చేసే విషయాలను చేరవేయడానికి ఇంతకంటే మరో మంచిమార్గం ఉండదని నా నమ్మకం. ఇందిరా గాంధీకి నెహ్రూ అనేక విషయాలను ఉత్తరాల్లోనే తెలియచేశారు. అలాగే చలం గారి ఉత్తరాల్లోనూ అనేక సాంఘిక, సామాజిక అంశాల చర్చ ఉండేది. ఆయన మా పినతండ్రికి స్నేహితులు, సహోద్యోగి కూడా కావడంతో ఆయన ఉత్తరాలు రాసే విధానాన్ని దగ్గరగా గమనించగలిగాను.
తొలి పాఠకురాలు...
ఆంగ్లంలో పాతకాలపు కాల్పనిక సాహిత్యం అంతా చదివాను. భారతీయ సాహిత్యం చాలా వరకు చదివాను. నా పదకొండవ యేట తొలిసారిగా రాశాను. ఉద్యోగంలో చేరిన తర్వాత రచనల్లో వేగం కొంత తగ్గింది. అయితే 1950-60 మధ్య కాలంలో చాలా కథలు రాశాను. ఏ కథ రాసినా మొదటగా చదివేది సులోచన మాత్రమే. ఆమె మంచి క్రిటిక్ కూడా. రాయలసీమ కరువు నేపథ్యంలో రాసిన ‘వీర కుంకుమ, ‘బిచ్చగాళ్ల జెండా’ కథలు ఆమెకి చాలా ఇష్టం. నా లైబ్రరీలో రెండు-మూడు లక్షల రూపాయల విలువ చేసే పుస్తకాలున్నాయి. మా పెద్దబ్బాయి తన ఇంటిని నా అవసరానికి తగినట్లు కట్టించాడు. ఇటీవల తొంభయ్‌లో అడుగుపెట్టాను. ఇప్పటికీ వార్తాపత్రికలు కాక వార, పక్ష, మాసపత్రికలు పది వరకు వస్తాయి. వాటన్నింటినీ చదువుతాను. తేడా అంతా అప్పట్లో కూర్చుని చదివేవాడిని. ఇప్పుడు పడుకుని చదువుతున్నాను. డాక్టర్ సూచన మేరకు ఇప్పుడు పుస్తకావిష్కరణలు, సమీక్ష సమావేశాలకు ఒంటరిగా వెళ్లడం లేదు. నేను వెళ్లడం లేదనడం కంటే డాక్టరు జాగ్రత్తలన్నీ మా ఆవిడతో చెప్పడంతో ఆవిడే నన్ను వెళ్లనివ్వడం లేదనడమే కరెక్ట్.
ఫొటోలు: జి. రాజేశ్
‘బీట్ పోలీస్’ పేరుతో 40 నిమిషాల నిడివి షార్ట్ ఫిల్మ్ తీశాను. నా మనుమరాలు యూ ట్యూబ్‌లో పెట్టింది. నా రచన సినిమాగా రావడం ఇది తొలిసారి కాదు. నేను రాసిన ‘పూజారి’ నవలను బిఎన్‌రెడ్డిగారు ‘పూజాఫలం’ పేరుతో సినిమా తీశారు.
- మునిపల్లె రాజు