ఈమధ్య మీడియాకు పాఠాలు చెప్పేవారు ఎక్కువయ్యారు. అందులో చిత్తశుద్ధితో, అమాయకత్వంతో మాట్లాడే వారు లేకపోలేదు గానీ... ఆ మాటున మీడియాకు హితబోధలు చేయడానికి, అలా చేసే క్రమంలో దాన్ని దోషిగా చూపడానికి ప్రయత్నిస్తున్నవారున్నారు. మీడియాను నియంత్రించడమే ఇలా దోషిగా చూపడానికి ప్రయత్నిస్తున్నవారి ఆంతర్యమని వేరే చెప్పనవసరం లేదు. మీడియా లోపరహితమైనదని, విమర్శలకు అతీతమైనదని ఎవరూ అనరు. అన్నిటా మంచీ చెడూ ఉన్నట్టే ఇందులోనూ ఉంటుంది. అవాంఛనీయ పోకడలకు పోతూ, వక్రమార్గంలో వెళ్లే ప్రసార మాధ్యమాలు లేకపోలేదు. అయితే, అత్యధిక మీడియా సంస్థలు ప్రజలకు గల తెలుసుకునే హక్కును గుర్తించి, గౌరవించి అందుకు అనుగుణంగా తమ సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే... అస్తిత్వం కోసం వ్యాపార ధర్మాలను ఆచరిస్తున్నాయి.
మీడియా తనను తాను సరిదిద్దుకోకపోతే, విశ్వసనీయత పెంచుకోవడానికి నిరంతరమూ ప్రయత్నించకపోతే కాలగర్భంలో కలిసిపోతుంది. మీడియా స్వేచ్ఛ అంటే మీడియా సంస్థలు తమకు ఏది తోస్తే అది రాసే స్వేచ్ఛ కాదు. ఘటనలను వక్రీకరించే స్వేచ్ఛ అంతకన్నా కాదు. అది వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రజలకున్న హక్కు. భావ ప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇస్తున్న రాజ్యాంగంలోని 19(1) (ఏ) ద్వారా ప్రజలకు సమకూరిన హక్కు. శనివారం న్యూఢిల్లీలో జాతీయ మీడియా కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రసంగిస్తూ పరిశోధనాత్మక జర్నలిజం అంటే కక్ష సాధింపు కాదని హితవు చెప్పారు. మీడియాకు స్వేచ్ఛతోపాటు బాధ్యతలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. అంతకు నాలుగురోజులముందు కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి మనీష్ తివారీ జర్నలిస్టులకు లెసైన్స్‌లు మంజూరుచేసే వ్యవస్థ ఉండాలని సూచించారు. కొన్నాళ్లక్రితం ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ మార్కండేయ కట్జూ కూడా జర్నలిస్టులకు కనీస అర్హతలుండాలని అభిప్రాయపడ్డారు. అందుకోసమని ఆయన ఒక కమిటీ కూడా వేశారు. తన అభిప్రాయాలను నిష్కర్షగా, నిర్మొహమాటంగా చెప్పడం అలవాటున్న కట్జూ నుంచి ఇలాంటి సూచన వచ్చినప్పుడు ఆయనతో గట్టిగా విభేదించినవారు సైతం అందులో దురుద్దేశాలున్నాయని విమర్శించలేదు. అయితే, అలాంటి ప్రతిపాదనలు ఆచరణలోకి వచ్చినప్పుడు రాగల ముప్పును తెలియజేశారు.
ఇప్పుడు పత్రికలు, చానెళ్లకు మారుమూల ప్రాంతాల్లో సైతం విలేకరులు ఉంటున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వాటి పరిష్కారంలో పాలకులు చూపే నిర్లక్ష్యాన్ని వెలుగులోకి తేవడమే కాదు... ప్రభుత్వపరంగా జరుగుతున్న అనేక అవకతవకలను వారు బట్టబయలు చేస్తున్నారు. ఆ క్రమంలో ఎన్నెన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. ఒక పరీక్ష రాయడం ద్వారా, అందులో ఉత్తీర్ణులై, లెసైన్స్ పొందడంద్వారా ఇదంతా సాధ్యమవుతుందనుకుంటే పొరపాటు. ఆచరణ నుంచి మొదలై ఆ క్రమంలోనే దాన్ని మరింత పదునుదేర్చే సృజనాత్మక కళ పాత్రికేయ వృత్తి. విస్తృతాధ్యయనం, సమస్యలపై లోతైన అవగాహన, నిరంతర పరిశ్రమ జర్నలిస్టులకు వన్నెతెస్తాయి. వైద్య వృత్తిలా, న్యాయవాద వృత్తిలా అది ఒక చట్రంలో ఇమిడేది కాదు. పైగా, ఆ రెండు రంగాల్లోనూ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైనవారే ఉన్నా సమస్యలెందుకు తలెత్తుతున్నాయో, ప్రమాణాలు ఎందుకు పడిపోతున్నాయో తివారీ చెప్పాలి. పాత్రికేయ వృత్తి కేవలం సమాచారాన్ని చేరవేయడమే కాదు... ఒక అంశంపై అభిప్రాయాన్ని కూడగట్టేది, ఏర్పరిచేదీ కూడా. దానితో విభేదించేవారు ఆ అభిప్రాయాన్ని పూర్వపక్షం చేయగలిగితే అది నిలబడదు.
ఒకపక్క ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్న కుంభకోణాల కథనాల గురించి సహజంగానే పాలకులకు ఆందోళన ఉంటుంది. ఏదోరకంగా మీడియాను నియంత్రించకపోతే ఈ ధోరణికి అడ్డుకట్టవేయడం సాధ్యంకాదన్న భావమూ వారిలో ఉంటుంది. సరిగ్గా అలాంటి ఆలోచనల నుంచే లెసైన్స్ ప్రతిపాదనలు పుట్టుకొస్తాయి. ప్రపంచీకరణ తర్వాత టెక్నాలజీ విస్తృతమై ఇంటర్నెట్ వంటివి రావడం... అనేకానేక వెబ్‌సైట్ల ద్వారా, బ్లాగుల ద్వారా లక్షలాది మంది వివిధ అంశాలపై అభిప్రాయాలను వ్యక్తీకరించడం పెరిగింది. సామాజిక, ఆర్ధిక అంశాలపై ఇంతక్రితం వెలుగుచూడని కోణాల్లో విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాజకీయ నాయకుడో, మరో పెత్తందారో, ఉన్నతాధికారో విపరీత పోకడలకు పోతున్నప్పుడు, వారిని బట్టబయలు చేయడం ఇప్పుడు సులభమైంది.
ఒక ఎస్‌ఎంఎస్, ఒక ట్వీట్, ఒక యూట్యూబ్ దృశ్యం వారిని నడిబజారులో నిలబెడుతోంది. నోరు జారిన నేతలు కొన్ని గంటల్లో క్షమాపణ చెప్పుకునే పరిస్థితి ఎదురవుతోంది. న్యాయం కోసం మొర పెట్టుకున్నప్పుడు తనను కానిస్టేబుళ్లు చితకబాదారని ఒక మహిళ ఫిర్యాదు చేస్తే ఇదివరకు అది అరణ్యరోదనగా మిగిలిపోయేది. ఇప్పుడది ఒక సామాన్యుడి ద్వారా సెల్‌ఫోన్‌లో రికార్డయి, చానెళ్లలో ప్రసారమై సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకూ వెళ్తోంది. సారాంశంలో... సమాచారాన్ని విస్తృత ప్రజానీకానికి చేర వేయడమనే పని ఇప్పుడు మీడియా సంస్థలకో, పాత్రికేయులకో పరిమితమై లేదు. అది బాధ్యత గుర్తెరిగే ప్రతి ఒక్కరి చేతుల్లోకీ వెళ్లిపోయింది. అత్యాధునిక టెక్నాలజీ వారికి ఆ వెసులుబాటు కల్పించింది. దీన్నంతటినీ నియంత్రిద్దామనీ, నిత్యం సంజాయిషీ ఇచ్చే దుస్థితినుంచి తప్పించుకుందామని పాలకులు ప్రయత్ని స్తున్నారు. అందులో భాగంగానే కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. మీడియా సంస్థలు కక్ష సాధింపు ధోరణితో ప్రవర్తిస్తే, విలువలను తాకట్టుపెట్టి విశృంఖలతకు గేట్లు తెరిస్తే ఆ సంస్థలే విశ్వసనీయత కోల్పోతాయి. సోదిలోకి లేకుండా పోతాయి. ఆ విషయంలో ప్రభుత్వానికి ఆదుర్దా అనవసరం.
పత్రికా స్వేచ్ఛకు ‘లెసైన్స్’!
Published Tue, Aug 27 2013 12:18 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
Advertisement
Advertisement