Shekhar Gupta
-
మైనారిటీలు మారారు.. గుర్తించారా?
కల్లోలం పుట్టుకొచ్చిన ప్రతిసారీ దేశం తగులబడుతూనే ఉంది. ఢిల్లీలోని ధార్యాగంజ్‌లో కారు తగులబడుతోంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో హింసాత్మక శక్తులను చూస్తున్నాం. పశ్చిమబెంగాల్లో ఒక నిప్పురవ్వ దావానలమై మంటలు రేపుతోంది. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఢిల్లీలో లాగా భారతీయ ముస్లింలలో కలుగుతున్న గణనీయ మార్పును ప్రతిబింబించలేకపోయాయి. ఢిల్లీలో ఒక నూతన భారతీయ ముస్లింలు పెరుగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ముస్లింను చూసి ఇక భయపడనవసరం లేదు. వారి జాతీయతను ప్రశంసించడానికి ఇక సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకను, జాతీయ గీతాన్ని ఎత్తిపడుతూ.. అంబేడ్కర్, గాంధీలను గౌరవిస్తూ, హిందుస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పోరాటం చేయడానికి ప్రయత్నిస్తున్న నూతన తరహా ముస్లింలు వీరు. ఢిల్లీలోని జామా మసీదులో గుమికూడిన ముస్లింలు తాము మొదట భారతీయులం అని ప్రకటించడం ద్వారా, మెజారిటీ వర్గంలో ఉన్నందున మన రిపబ్లిక్ పునాదిని మార్చివేయగలమని అనుకుంటున్న వారి భావనను పూర్తిగా తోసిపుచ్చేశారు. అదేసమయంలో భారత రిపబ్లిక్ తన సెలబ్రిటీ రచయిత–కార్యకర్త అయిన అరుంధతీరాయ్‌కు ఎంతగానో రుణపడి ఉంది. ఆమె ఒంటిచేత్తోనే భారతదేశాన్ని మావోయిస్టు సాయుధ తిరుగుబాటుదారుల నుంచి కాపాడారు. మన మావోయిస్టులు ‘తుపాకులు ధరించిన గాంధేయవాదులు’ (‘గాంధియన్స్ విత్ గన్స్’) అని వర్ణించడం ద్వారా ఆమె ఈ ఘనత సాధించారు. ఆమె చేసింది సర్వకాలాల్లోనూ అతి గొప్పగా కోట్ చేయదగిన ఉల్లేఖన. అణిచివేతకు గురవుతున్నవారిగా మావోయిస్టుల మీద అంతవరకు ఉన్న కాస్తంత సానుభూతిని కూడా రాయ్ వ్యాఖ్య సమాధి చేసేసింది. ఏకకాలంలో మీరు గాంధేయవాదిగా, మావోయిస్టుగా ఉండలేరు. బహదూర్ షా జాఫర్ మార్గ్ వద్ద కూర్చుని నేను ఈ వ్యాసం రాస్తూ, జామా మసీదుకు చెందిన 17వ శతాబ్ది నాటి మెట్లమీదుగా వేలాది ముస్లింలు నడుచుకుంటూ పోయిన ఘటనను ఆమె ఎలా వర్ణించి ఉంటారు అని నేను ఆశ్చర్యపోయాను. వీళ్లు ముస్లింలు. ముస్లింలలాగా దుస్తులు ధరించినవారు. ప్రజలు ధరించే దుస్తులు వారి ఉద్దేశాలను తెలుపుతాయని ప్రధానమంత్రి ఇప్పుడే సూచిం చినందున దీన్ని మనం నొక్కి చెబుతున్నాం. ఈ ముస్లింలు మువ్వన్నెల జెండా, రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్తరువులను ధరించి వచ్చారు. కొంతమంది గాంధీ బొమ్మలను పట్టుకున్నారు. వీటితోపాటు జనగణమన, హిందూస్తాన్ జిందాబాద్‌లను వల్లిస్తూ పోయారు. భారత రిపబ్లిక్కి చెందిన అతి పెద్ద మైనారిటీ (ప్రతి ఏడుమంది భారతీయులలో ఒకరు) తమ పవిత్ర మసీదు మెట్లు దిగుతూ తాము ముందుగా భారతీయులమని, భారత రాజ్యాంగంపై, జెండాపై, జాతీయ గీతంపై తమకు విశ్వాసముందని, జనాభా పరమైన మెజారిటీ కారణంగా రిపబ్లిక్ పునాదినే మార్చివేయవచ్చనే భావనను వ్యతిరేకిస్తున్నామని ప్రకటిస్తే ఏం జరుగుతుంది? భారతీయ దేశభక్తికి తామే వారసులమంటూ దేశంలోని మెజారిటీ జనాభా ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చిన ప్రకటనను ముస్లింలు తొలిసారిగా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. దేశంలో నివసించడానికే ఇక్కడున్నాం అంటూ వారు నినదించారు. వీళ్లతో ఇక ఎవరూ పోరాడలేరు. ఎలాంటి సమర్థనా లేకుండా వీరిపై ఎవరూ ఇక తుపాకులు గురిపెట్టి కాల్చలేరు. మన దేశం మారింది. లేక ‘మన దేశం ఇప్పుడు మారిపోతోంది మిత్రులారా’ అనే వాక్యాలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. అలాగే పౌరసత్వ సవరణ చట్టానికి, జాతీయ పౌర పట్టికకు మధ్య పౌరులకు శరణార్థులకు మధ్య ఉన్న సూక్ష్మభేదాన్ని వివరించడం ద్వారా మీరు వారికి ఇక నచ్చచెప్పలేరు. ఇప్పటికే 2021లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీరు ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడేశారు. రెండు లక్ష్యాలను సాధించడానికి మీరు ఇప్పటికే ప్రయత్నాలు చేసి ఉన్నారు. ఒకటి, జాతీయ పౌర పట్టికలో దొరికిపోయే బెంగాలీ హిందువులను పునస్సమీక్షించి కాపాడటం, అదే సమయంలో బెంగాలీ ముస్లింలను బహిష్కరించడం. రెండు, రాష్ట్రంలోనూ దీన్నే పునరావృతం చేస్తామని హామీ ఇచ్చి పశ్చిమబెంగాల్ లోని బెంగాలీ హిందువులను ఆకట్టుకోవడం. అస్సాంలో మంటలు రేకెత్తించడానికి, పశ్చిమబెంగాల్లో మంటలు చల్లార్చడానికి చేసిన ప్రయత్నంలో మీరు ఇప్పుడు ఢిల్లీలో మంటలు రేపారు. టోపీలు, బుర్ఖాలు, హిజబ్, ఆకుపచ్చ రంగు అనేవి ముస్లింలను గుర్తు చేసే అత్యంత స్పష్టమైన మూస గుర్తులు. అలాగే వారి మతపరమైన ప్రార్థనలు కూడా. ఒక స్నేహితుడికి పోలీసు లాఠీలకు మధ్యలో దూరి అతగాడిని కాపాడి దేశవ్యాప్తంగా నెటిజన్ల దృష్టి నాకర్షించిన ఇద్దరు యువతుల ఫోటోను ఫేస్ బుక్‌లో చూసినప్పుడు, ఆ యువతులు జాతీయవాదం లేక లౌకికవాదం పట్ల ఎలాంటి నిబద్ధత లేని, సంప్రదాయ ఇస్లాం మతంతో మాత్రమే ప్రభావితమయ్యారని చెప్పవచ్చు. ఇకపోతే ఏకే 47లు, ఆర్డీఎక్స్లు ధరించిన ముజాహిదీన్, లష్కర్, అల్ ఖాయిదా, ఐసిస్ వంటి సంస్థలకు ప్రాతినిధ్యం వహిం చిన అనేకమంది ఆగ్రహోదగ్రులైన ముస్లింలకు చెందిన బలమైన సంకేతాలను కూడా మనం చూడవచ్చు. ఈ తరహా ముస్లింలతో సులభంగా పోరాడి ఓడించవచ్చు. కానీ భారతీయ ముస్లింలు నిజంగా నిరాశా నిస్పృహలకు గురై ఉగ్రవాదాన్ని చేపట్టి ఉంటే ఏమయ్యేది? సిమీ నుంచి ఇండియన్ ముజాహిదీన్ల వరకు అతి చిన్న ఉగ్ర బృందాలు దీన్ని నిర్ధారించాయి కూడా. అత్యంత ఉదారవాదిగా పేరొందిన నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సైతం 2009 ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సీనియర్ జర్నలిస్టులతో నిండిన సభలో మాట్లాడుతూ, ఇదేవిషయాన్ని నొక్కి చెప్పారు. ముస్లింలకు ప్రత్యేక రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆరోపించే వారెవరైనా సరే, భారతీయ ముస్లింలలో ఒక శాతం (ఇప్పుడు వారి సంఖ్య 20 కోట్లు) మందైనా భారత్‌లో తమకు ఇక భవిష్యత్తు లేదని నిర్ణయించుకుని ఉంటే దేశాన్ని పాలించడం ఎవరికైనా కష్టమయ్యేదని సింగ్ ఆ సభలో చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఏలిన దశాబ్దంలో ఇదీ పరిస్థితి. భారతీయ ముస్లింలు అపమార్గం పట్టకుండా దేశం వారిపట్ల ఔదార్యాన్ని ప్రదర్శించింది. కొంతమంది యువ ముస్లింలు ఉగ్రవాద బాట పట్టారు. కానీ నేడు ఎన్డీఏ ప్రభుత్వం లాగే నాడు యూపీఏ ప్రభుత్వం కూడా వారిపట్ల కఠినంగానే వ్యవహరించింది. ఈ వాస్తవాలపై అనేక భాష్యాలు ఉండవచ్చు. కానీ అంతిమ నిర్ధారణ మాత్రం ఒకటే. ఒక పక్షం మాత్రం ముస్లింలకు క్షమాపణ చెబుతూనే వారు జాతి వ్యతిరేకులుగా మారకుండా వారికి ఎంతో కొంత సహాయం చేయాలని కోరుకునేది. మరో పక్షం మాత్రం ఇప్పుడు కంటికి కన్ను సమాధానం అంటూ రెచ్చిపోతోంది. అలాగే మెజారిటీ వర్గం ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తీవ్రతరం చేయాలని కోరుకుంటోంది. అటు రాజకీయపక్షం ఇటు మెజారిటీ వర్గం ఇద్దరూ ముస్లింలను అనుమాన దృష్టితో చూడటంపై ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఇక భారతీయ ముస్లింల గురించిన ప్రతికూల దృక్పథం ఏదంటే వారి మతాధిపతులే. జామా మసీదు బుఖారీలు, మదానీలు, కమాండో కామిక్ చానల్స్‌లో కనబడుతూ ఫత్వాలు జారీ చేస్తూ బవిరిగడ్డాలతో కనిపించే ముస్లిం మతగురువులను మెజారిటీ వర్గ ప్రజలు ప్రతికూల భావంతో చూస్తున్నారు. ముస్లింల పట్ల ఈ ప్రతికూల భావనలలో చాలావాటిని నేడు సవాలు చేస్తున్నారు. జనగణమన, జాతీయ జెండా, అంబేడ్కర్, గాంధీ బొమ్మలు, హిందూస్తాన్ జిందాబాద్ నినాదాలు.. ఇలా ముస్లింలను పట్టిచ్చే సంప్రదాయ సంకేతాలు మారుతున్నాయి కానీ దుస్తులు మాత్రమే మారలేదు. నాగరికతల మధ్య ఘర్షణ సూత్రం వెలుగులో భారతీయ ముస్లింలను అంచనా వేసేవారు ఘోరతప్పిదం చేస్తున్నట్లే లెక్క. 1947లో భారత్‌లోని మెజారిటీ ముస్లింలు జిన్నాతోపాటు నడిచి తమ కొత్త దేశం పాక్ వెళ్లిపోయారు. కానీ జిన్నా తర్వాత గత 72 ఏళ్లలో వారు తమ దేశాధినేతగా ముస్లింను ఎన్నటికీ విశ్వసించలేదు. వారు ఎల్లవేళలా ముస్లిమేతర నేతనే విశ్వసిస్తూ వచ్చారు. దీనర్థమేమిటి? కల్లోలం పుట్టుకొచ్చిన ప్రతిసారీ దేశం తగులబడుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో హింసాత్మక శక్తులను చూస్తున్నాం. పశ్చిమబెంగాల్లో ఒక నిప్పురవ్వ దావానలమై మంటలు రేపుతోంది. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఢిల్లీలో సంకేతాలు వెలువరించినట్లుగా భారతీయ ముస్లిం లలో గణనీయ మార్పును ప్రతి బింబించలేకపోయాయి. ఢిల్లీలో ఒక నూతన భారతీయ ముస్లిం పెరుగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ముస్లింను చూసి ఇక భయపడనవసరం లేదు. వారి జాతీయతను ప్రశంసించడానికి ఇక సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకను, జాతీయ గీతాన్ని ఎత్తిపడుతూ.. అంబేడ్కర్, గాంధీలను గౌరవిస్తూ, హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పోరాటం చేయడానికి ప్రయత్నిస్తున్న నూతన తరహా ముస్లింలు వీరు. ఇప్పుడు మనం సుప్రసిద్ధ ఉర్దూ కవి రహత్ ఇందోరి రాసిన అమర వాక్యాలను ఈ భయానకమైన కాలంలో తరచుగా ఉల్లేఖిస్తున్నాం. ఆ కవితా పాదాల అర్థం ఏమిటి? ‘‘ఈ నేలపై ప్రతి ఒక్కరూ తమవంతు రక్తం ధారపోశారు. భారత్‌పై ఓ ఒక్కరూ తమ ప్రత్యేక హక్కును ప్రకటించలేరు’’. జాతిలో కలుగుతున్న ఈ మార్పును చూసి రహత్ ఇందూరి తప్పకుండా చిరునవ్వులు చిందిస్తుంటారు మరి. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
కమలం ఓడినా.. హిందుత్వదే గెలుపు
ఇందిరతో పోలిస్తే నరేంద్రమోదీ ప్రాభవం లోక్‌సభ ఎన్నికలకే పరిమితమవుతున్నట్లు స్పష్టమవుతోంది. అనేక రాష్టాల్లో గత రెండేళ్లలో బీజేపీ ప్రభావం 71 నుంచి 41 శాతానికి పడిపోయింది. అయినా సరే లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ ప్రాతిపదికన బీజేపీ దేశవ్యాప్తంగా తన ప్రభావం చూపుతూనే ఉంది. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యంతో సమాఖ్యతత్వం నిజమైన అర్థంలో అమలువుతున్నట్లు ప్రస్తుతం కనిపిస్తున్నా హిందుత్వకు జాతీయ స్థాయిలో సమర్థన లభిస్తోంది. ఆరెస్సెస్/బీజేపీల గుత్త హక్కుగా కనిపించిన ఆర్టికల్ 370, రామాలయ వివాదం, ఉమ్మడి పౌరస్మృతి వంటివాటిపట్ల దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం సాధ్యమవుతోంది. ఇది భావజాలపరంగా ఆరెస్సెస్ విజయమే. అందుకే రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పుట్టి మునుగుతున్నా, హిందుత్వ మాత్రం నేటికీ గెలుస్తూనే ఉంది. అటు నిరాశావాదం.. ఇటు ఆశావాదం.. అనే పాత సామెత ప్రకారం, 2017 నుంచి ఇప్పటిదాకా భారత రాజకీయ పటంలో కాషాయ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోందని గ్రాఫిక్స్ ఆధారిత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీటి ప్రకారం గత రెండేళ్లలో భారతీయ రాష్ట్రాలలో బీజేపీ పాలన 71 నుంచి 40 శాతానికి పడిపోయింది. కాషాయపార్టీ ప్రజాదరణ శిఖరస్థాయికి చేరిందని, నరేంద్రమోదీ ఆధిపత్యం తిరుగులేనిదని అందరూ భావిస్తున్న సమయంలోనే బీజేపీ పరిస్థితి ఇలా దిగజారిపోవడం గమనార్హం. అయితే ఇది నిరాశావాదం దృక్పథానికి సంబంధించింది. ఆశావాద దృక్పథంతో చూసినట్లయితే ఈ సంవత్సరం మే నెలలో లోక్‌సభ ఎన్నికల తర్వాత చూస్తే బీజేపీ ఒక బలమైన రాజకీయ వాస్తవంగా కనిపిస్తుంది. తూర్పున హిందీ ప్రాబల్య ప్రాంతం నుంచీ ఈశాన్య భారత్‌లోని చాలా ప్రాంతాల్లో, పశ్చిమ తీర ప్రాంతాల్లో బీజేపీ పాలన అప్రతిహతంగా సాగుతోంది. ఇప్పటికిప్పుడు తాజాగా ఎన్నికలు జరిగినా 2019 మేలో వెల్లడయిన ఫలితాలకు భిన్నంగా రాకపోవచ్చు. మరి మోదీ విమర్శకులు ఇప్పుడెందుకు పండుగ చేసుకుంటున్నట్లో? అయితే, రాజకీయ వాస్తవం సంక్లిష్టమైంది. కాషాయ పార్టీకి చెందిన అనేక ఛాయలను ఇది ప్రతిబింబిస్తుంది. వీటిలో కొన్నింటిని చూద్దాం. నరేంద్రమోదీ ఎంత మహామూర్తిమత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఆయన ఇందిరాగాంధీ కాదు. ఇందిర శకం నుంచి భారతీయ వోటర్ పరిణితి చెందుతూ వచ్చాడు. లోక్‌సభ, విధాన సభకు మధ్య వోటింగ్ ఎంపికల గురించి ఆమె స్పష్టమైన వ్యత్యాసాన్ని ప్రదర్శించేవారు. ఇందిరాగాంధీకిలాగే మోదీ కూడా లోక్‌సభ ఎన్నికల సందర్భంలో అనామకుడికి సీటు ఇచ్చినా గెలిపించుకునే స్థితిలో ఇప్పటికీ కొనసాగుతున్నారు. కానీ ఇందిరాగాంధీకి మల్లే రాష్ట్లాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించినప్పుడు మోదీ ఈ మ్యాజిక్‌ను పునరావృతం చేయలేరు. దీనికి స్పష్టమైన ఉదాహరణగా మహారాష్ట్రను చూపవచ్చు. అలాగే హరియాణా కూడా. లోక్‌సభ ఎన్నికలు ముగి సిన అయిదు నెలలలోపే ఈ రాష్ట్రంలో బీజేపీ ఓటు దాదాపు 22 శాతం పాయింట్లను పోగొట్టుకుంది. అంటే 58 నుంచి 36 శాతానికి పడిపోయింది. హరియాణాలో విజయదుందుభిని మోగిస్తామని పార్టీ పూర్తిగా అంచనా వేసుకున్న చోట మెజారిటీకి కాస్త దూరంలో నిలిచిపోయింది. ఆర్టికల్ 370ని రద్దుచేసిన 11 వారాల్లోపు బీజేపీకి హరియాణాలో ఇంత గట్టిదెబ్బ తగిలింది. 2014లో ఘనవిజయం సాధించిన తర్వాత కూడా మోదీ ఒక నిర్దిష్ట రాష్ట్రంలో గెలుపు సాధించలేదు. 2017లో ఉత్తరప్రదేశ్, హరి యాణా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అసోం వంటి కొన్ని చిన్న రాష్ట్రాలు దీనికి మినహాయింపు. ఇక్కడ కూడా 2015లో ఢిల్లీలో ఘోర పరాజయం చవిచూశారు. తర్వాత పంజాబ్లోను అదే జరి గింది. ఇక 2017లో ఘనవిజయం తప్పదని భావించిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనీస విజయం వద్దే ఆగిపోయారు. దానికి సైతం మోదీ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక కర్ణాటకలో కాంగ్రెస్‌పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, బళ్లారి బ్రదర్స్‌తో అసాధారణ స్థాయిలో రాజీలు కుదుర్చుకున్నప్పటికీ బీజేపీ మెజారిటీ స్థానాలు సాధించలేకపోయింది. తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్ రాష్ట్ర్లాల్లో ఏకంగా ఓటమినే చవిచూసింది. ఇప్పుడు ఈ సంఖ్యలను కాస్త తిరగేయండి. పంజాబ్ మినహా ఇతర రాష్ట్రాల్లో బీజేపి అధికారం కోల్పోయింది లేక నిర్ణయాత్మక విజయం సాధించడంలో విఫలమైంది. అయితే ఇదే రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఇక ఢిల్లీలో, రాజస్తాన్‌లో, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో ఆప్, కాంగ్రస్ చేతుల్లో ఓడిపోయింది. ఈ ఫలితాలను మదింపు చేస్తే, ఒకేపార్టీ ఆధిపత్యం రాజ్యమేలిన ఇందిరాగాంధీ శకంలోలాగా కాకుండా, నేడు భారత్ మరింత ఎక్కువగా సమాఖ్య దేశంగా పరిణమించింది. లోక్‌సభ, శాసససభల ఎన్నికల్లో ఓటరు పూర్తి వ్యత్యాసం ప్రదర్శించినట్లయితే, బీజేపీ పట్ల శత్రుభావం కలిగి ఉండని పార్టీలు కూడా ఆయా రాష్ట్రాల్లో తమ పట్టు సాధించుకున్నాయి. నవీన్ పట్నాయక్, కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బహుశా డీఎంకే కూడా ఈ కోవకు చెందుతారు. ఈ పరిణామం అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి ప్రత్యర్థులకు సంతోషం కలిగించింది. లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా ఘర్షణ పడిన మమతా ఆరునెలల్లోపే ఈవారంలో జరిగిన మూడు ఉపఎన్నికల్లో విజయ కేతనం ఎగరేశారు. మరీ రెండు స్థానాల్లో అఖండ విజయం సాధించారు. ఇక్కడ కూడా ఓటర్ ప్రదర్శించిన వ్యత్యాసం కనబడుతుంది. ఇక నవ్వులు చిందిస్తున్న మూడో రకం ప్రాంతీయ నేత నితీశ్ కుమార్. ఈయన స్వయానా బీజేపీ భాగస్వామి. బిహార్ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇక అసోంలో జాతీయ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకత తెలుపుతున్న ప్రపుల్ల కుమార్ మహంతా తన స్థానాన్ని పునరుద్ధరించుకోవచ్చు. ప్రస్తుతం బీజేపీ చేతిలో 17 రాష్ట్రాలు ఉంటున్నప్పటికీ దీన్ని అర్ధసత్యంగానే చెప్పాలి. వీటిలో బిహార్, హరియాణాల్లో కాషాయపార్టీకి పూర్తి భిన్నమైన సైద్ధాంతిక దృక్పథం ఉన్న మిత్రపక్షాలతో బీజేపీ భాగస్వామ్యం పంచుకుంది. ఇక మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ వంటి రాష్ట్రాలు ఎల్లప్పుడూ రాజకీయ బేరసారాలకు లోనై స్థానాలు మార్చుకుంటుంటాయి. సిక్కిం, మిజోరంలు ఎన్డీయేలో ఉంటున్నాయి తప్పితే అవి బీజేపీ పాలనలో లేవు. మరోవైపున బీజేపి ఇంతవరకు ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక అనే మూడు ప్రధాన రాష్ట్రాల్లోను మాత్రమే తన చేతిలో పెట్టుకుని ఉంది. చివరిదైన కర్ణాటకలో అస్థిరత్వమే కొనసాగుతోంది. మోదీ–షా వైభవం ప్రభవిస్తున్నందున, బీజేపీ ఒకే ఒక సులభమైన ఫార్ములాను అనుసరించింది. హిందూ ప్రాబల్య ప్రాంతాన్ని, రెండు పశ్చిమ భారత రాష్ట్రాలను చుట్టేయడం. వీటిలో కీలక విజయం ద్వారా మాత్రమే బీజేపీ ఇతరప్రాంతాల్లో చిన్నా చితకా విజ యాలు సాధిస్తూ భారతదేశాన్ని ఏలుతోంది. రాష్ట్రాల్లో ఇది ప్రతిఫలించకపోతే మీరు తప్పకుండా సమానత్వానికి కట్టుబడి ఉండవచ్చు. దీనర్థం ఏమిటంటే, రాష్ట్రాల సీఎంలతో బీజేపీ చర్చలు జరపాల్సి ఉంటుంది. ఇచ్చి పుచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక మమతా వంటి ముఖ్యమంత్రులయితే మీరు ప్రవేశపెట్టే ఆయుష్మాన్ భారత్ వంటి మంచి, భారీ ప్రణాళికలను ముందుకు తీసుకుపోవడానికి కూడా తిరస్కరించవచ్చు. ఇలాంటివారు మీ ఆదేశాలకు ఇకపై తలొగ్గరు. మీరు వారిపట్ల గౌరవం ప్రదర్శించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వారిని సమానులుగా కూడా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రధాని పదే పదే చెబుతున్న సహకారాత్మక సమాఖ్య తత్వం అనేది ఇక మాటలలో కాక చేతల్లో చూపాల్సి ఉంటుంది. ఉదాహరణకు మహారాష్ట్రను తీసుకోండి. ఎన్సీపీ, కాంగ్రెస్‌లు శివసేనతో ఎందుకు కలిశాయి. తొలి రెండు పార్టీలు అక్కడ ఉనికి, అధికారాలకోసం పోట్లాడుతున్నాయి. కానీ శివసేన ఎందుకు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు? సైద్ధాంతికంగా తమకు పట్టున్న చోట బీజేపీ వేగంగా విస్తరిస్తోంది. ఏకైక పార్టీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా శివసేన నేరుగా ప్రదర్శించిన స్వీయరక్షణా ప్రతిస్పందనగానే దీన్ని చూడాలి. భావసారూప్యం కూడా ఇక్కడ పనిచేయలేదు. ఇక కేంద్ర–రాష్ట్రాల సమీకరణాలు 1989–2014కి సంబంధించి 25 సంవత్సరాల చరిత్రకు మళ్లీ దగ్గరవుతోంది. దీనికి సంబంధించి మహారాష్ట్రలో వస్తున్న సవ్వడి ప్రత్యేకమైనది. ప్రధాని మానస పుత్రిక అయిన బుల్లెట్ రైలును వీరు వ్యతిరేకిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా, ఆర్టికల్ 370, అయోధ్య ఆలయ సమస్యవంటివి భారత రాజకీయాలనే విడదీస్తూ బీజేపీ/ఆరెస్సెస్‌కు అనుకూలతను సృష్టిం చేవి. కానీ ఇప్పుడు కశ్మీర్, రామాలయం, ఉమ్మడి పౌరస్మృతి వంటివి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయాన్ని కూడగడుతున్నాయి. కేరళలో వామపక్ష ప్రభుత్వం కూడా శబరిమలపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయలేకపోతోంది. రాహుల్ గాంధీ తరచుగా ఆలయాలను సందర్శిస్తూ, తన బ్రాహ్మణ గోత్రాన్ని చెప్పుకోవలసి వస్తోంది. భారత రాజకీయ చిత్రపటంపై ఎలాంటి రాజకీయ క్రీనీడలు కనిపిస్తున్నప్పటికీ, ఆరెస్సెస్/బీజేపీ భావాలకు సంబంధించినంతవరకు అది కాషాయ రంగును పులుముకుంది. ఆరెస్సెస్ కానీ, బీజేపీ కానీ ఇప్పుడు సులభంగా విజయాన్ని ప్రకటించవచ్చు. హెగ్డేవార్, గోల్వాల్కర్, సావర్కార్ వంటివారు దీనికి అంగీకరిస్తారు కూడా. వ్యాసకర్త: శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
లౌకిక కూటమి ‘శివ’సాయుజ్యం
సోనియా గాంధీ బీజేపీని ఒక రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా ఒక శత్రువులాగా పరిగణిస్తున్నారని గతంలో అడ్వాణీ ఆరోపించారు. తన రాజకీయాలను ఇలా నిర్వచించుకున్న అదే పార్టీ, బీజేపీతో దాని పొత్తుదార్లతో పోరాడటం అనే లక్ష్యంలో భాగంగా ఎవరితోనైనా సరే పొత్తు పెట్టుకోవడానికి సుముఖత చూపుతోంది. స్వాతంత్య్రానంతర చరిత్రలో.. శివసేన వంటి పక్కా హిందుత్వ పార్టీని కాంగ్రెస్ కౌగలించుకోవడం ఇదే మొట్టమొదటిసారి. రెండు పరస్పర భిన్నమైన తీవ్ర భావజాలాలు కలిగిన బీజేపీ, వామపక్షం తమ ఉమ్మడి శత్రువుగా భావించిన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కలవడానికి ఏమాత్రం సందేహించనప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ అదే పని ఎందుకు చేయకూడదు? ఒకప్పుడు కాంగ్రెస్ భారత రాజకీయాలను ఏకధ్రువంగా మార్చింది. ఇప్పుడు బీజేపీ ఆ పని చేస్తోంది. మరి కాంగ్రెస్‌కు ఆ వెసలుబాటు ఎందుకు ఉండకూడదు? రాజకీయాల్లో కానీ, యుద్ధంలో కానీ అతి ప్రాచీన సూత్రం ఏమిటంటే, శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అనే. అందులోనూ కనీసం పోరాడేందుకు కూడా వీల్లేని స్థితిలో మిమ్మల్ని చరిత్ర పక్కకు తోసేసినప్పుడు ఇక మీరేం చేస్తారు? అలాంటప్పుడు సాంప్రదాయిక సూత్రాలు ఎంతమాత్రం సరిపోవు. ఒకసారి మీరు నిస్పృహలో కూరుకుపోయాక ఆ సూత్రాలను వెనక్కు తిప్పడానికి కూడా మీరు ప్రయత్నిస్తారు. శత్రువుకు మిత్రుడు మీకు మాత్రం మిత్రుడు కాదా? వారి సంబంధంలో కాస్తంత చీలిక కనిపిస్తున్నా సరే.. దాన్ని అతి చిన్న పదునైన గొడ్డలితో ఎందుకు చీల్చివేయకూడదు? మహారాష్ట్రలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఇదే గేమ్‌ను ఆడుతున్నాయి. ఈ కథనం రాసే సమయానికి వారి మధ్య ఒప్పందం ఇంకా కుదరలేదు. కానీ భారత రాజకీయాల్లో ఎంత మార్పు చోటు చేసుకుంటోందో గ్రహించడానికి శివసేనతో కలిసి తాము అధికారం పంచుకోవడానికి సుముఖంగా ఉన్నామని వారు ప్రకటించిన వాస్తవం చాలు.. దశాబ్దాలుగా లౌకిక కూటమికి కట్టుబడి ఉన్న ఈ రెండు పార్టీలూ మితవాద హిందుత్వ, మతతత్వ పార్టీగా ఇంతకాలం తాము ఖండిస్తూ వచ్చిన పార్టీతో సంప్రదింపులకు సిద్ధమవుతున్నాయి. ఇది తన భావజాలపరమైన లక్ష్మణరేఖను దాటుతున్న భారత ప్రధాన లౌకిక సమ్మేళనంకి స్పష్టమైన సంకేతం మరి. శరద్ పవార్ ఇన్నేళ్లుగా బీజేపీ, శివసేనలతో పోరాడుతూనే వచ్చారు. ఈ రెండు పార్టీలు ఆయన్ను దొంగ అనీ వక్రరాజకీయవేత్త అని నిత్యం పిలుస్తూ వచ్చేవి. పైగా ఈ దఫా మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట రేట్ ఒక కుంభకోణంలో శరద్ పవార్ పేరును ఇరికించింది కూడా. అయితే ఇదే మోదీ ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇది భారతరత్న తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన అవార్డు. పవార్, థాక్రేలు కూడా కొన్ని సార్లు వాస్తవదృష్టితో కూడిన రాజకీయ సంబంధ బాంధవ్యాలను నెరుపుతూ వచ్చారు. మరోవైపున కాంగ్రెస్ ఆ మార్గంలో ఎన్నడూ నడవలేదు. కాంగ్రెస్ పట్ల బద్ధ విమర్శకులు దీంతో విభేదించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ పార్టీతోనూ సంప్రదింపులు జరిపింది. అలాంటి ఒప్పందాల్ని స్థానిక పరిమితులతో, స్వల్ప స్థాయిలో, మరీ ముఖ్యంగా మైనారిటీ రాజకీయాలపై స్వారీ చేస్తున్న చిన్న బృందాలతో మాత్రమే కుదుర్చుకునేది. అయితే స్వాతంత్య్రానంతర చరి త్రలో.. పక్కా హిందుత్వ పార్టీని కాంగ్రెస్ కౌగలించుకోవడం ఇదే మొట్టమొదటిసారి. కాంగ్రెస్ రాజకీయాల సారాంశాన్ని ప్రత్యేకించి సోనియాగాంధీ నాయకత్వంలో గత రెండు దశాబ్దాలుగా సాగుతూ వచ్చిన దాని రాజకీయాలను మీరు అర్థం చేసుకున్నట్లయితే హిందుత్వ పార్టీలను అది తన ప్రధాన సైద్ధాంతిక శత్రువులుగా చూస్తూ వచ్చేది. తన రాజకీయాలను మొత్తంగా హిందుత్వ పార్టీలకు వ్యతిరేకంగానే నడుపుతూ వచ్చేది. 2003లో ఎన్డీటీవీ వాక్ ది టాక్ షోలో నాతో నిర్వహించిన ఇంటర్వ్యూలో అడ్వాణీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సోనియా గాంధీ బీజేపీని ఒక రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా ఒక శత్రువులాగా పరిగణిస్తున్నారని అడ్వాణీ ఆరోపిం చారు. తన రాజకీయాలను ఇలా నిర్వచించుకున్న అదే పార్టీ, బీజేపీతో దాని పొత్తుదార్లతో పోరాడటం అనే లక్ష్యంలో భాగంగా ఎవరితోనైనా సరే పొత్తు పెట్టుకోవడానికి సుముఖత చూపుతోంది. శిరోమణి అకాలీ దళ్, శివసేన ఇంతవరకు బీజేపీ మిత్రపక్షాలు అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సోనియా నేతృత్వంలో, కాంగ్రెస్ వామపక్షాలతో అనేకసార్లు పొత్తు కుదుర్చుకుంది. మతతత్వ శక్తులను అధికారం నుంచి దూరంగా పెట్టడానికి హెచ్.డి. దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌ల యునైటెడ్ ప్రంట్ ప్రభుత్వాలకు బయటినుంచి మద్దతివ్వడంతో ప్రారంభించి 2004 సార్వత్రిక ఎన్నికల ఫలితం తర్వాత యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ)కు నాయకత్వం వహించి తన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది. సంకీర్ణ యుగంలో, కాంగ్రెస్ పార్టీ ఒకటీ, రెండూ సందర్భాల్లో గతంలో బీజేపీతో పొత్తు కూడిన పార్టీలతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదుర్చుకున్న బీజేపీ మిత్రుల్లో మమతా బెనర్జీ, చంద్రబాబునాయుడు, నితీశ్ కుమార్ ఉన్నారు. అంతే కానీ హిందుత్వ పార్టీతో లేక అకాలీలతో కాంగ్రెస్ ఎన్నడూ పొత్తుకు సిద్ధం కాలేదు. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం లేక పొటాను రద్దు చేయడానికి అంగీకరించడం ద్వారా మైనార్టీవాదాన్ని కూడా కౌంగ్రెస్ దగ్గరకుతీసుకుంది. తర్వాత ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిని పరిశీలించడానికి సచార్ కమిటీని కూడా కాంగ్రెస్ ఏర్పర్చింది. కాబట్టి ఇంత పెద్ద సైద్దాంతిక పెనుగంతు వేయడానికి ముందు కాంగ్రెస్ పార్టీ అనేక అంతర్మథనాలను సాగించింది. పైగా పార్టీలో వాస్తవికవాదంతో నడిచే పాతతరం రాజకీయనేతలకు వామపక్ష సైద్ధాంతిక భావాలు కలిగి ఉండి రాహుల్ గాంధీ చుట్టూ చేరిన యువ నాయకత్వానికి మధ్య జరిగిన వాదనలను కూడా మీరు చూడవచ్చు. మొదటగా కాంగ్రెస్ లోని వృద్ధ నాయకత్వం నేరుగా చెప్పడానికి సాహసించనప్పటికీ, రాహుల్ అనేకసార్లు విఫలమయ్యారని, తమ రాజకీయ కెరీర్లు ముగిసేలోపు తిరిగి కోలుకుంటామని కానీ, అధికారంలోకి వస్తామని కానీ ఏమాత్రం ఆశలేదని వారు భావిస్తున్నారు. రెండు, ఏదో ఒక సమయంలో సీబీఐ లేక ఈడీ కస్టడీలో తమ జీవితాలు కడతేరతాయని వారు భయపడుతున్నారు కూడా. మూడు, సాపేక్షికంగా జేఎన్‌యూ నుంచి దిగుమతవుతున్న రాడికల్ నాయకత్వంతో కూడిన కొత్త తరంలా కాకుండా పాతతరానికి తమ రాజకీయ చరిత్ర ఏమిటో స్పష్టంగా తెలుసు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ నేతృత్వంలో భారత రాజకీయాలు ఏకధ్రువంగా మారిపోవడంతో జనసంఘ్, సోషలిస్టు విమర్శకులు కూడా చాలాసార్లు ఒకటై కలిసిపోయారు. పైగా తమకు పూర్తిగా భిన్నమైన భావజాలం కలిగిన వామపక్షంతో ఉమ్మడి లక్ష్యంకోసం వీరు ఐక్యమయ్యారు. వీపీ సింగ్ హయాంలో బీజేపీ, వామపక్షాలు చేతులు కలపడాన్ని మన జీవితకాలాల్లోనే చూశాం. తర్వాత 2008లో, 2012లో కాంగ్రెస్ నేతృత్వంలోని లౌకిక సమ్మేళనమైన యూపీఏ ప్రభుత్వాలను రెండు సార్లు ఓడించడానికి కూడా వీరు ప్రయత్నిం చారు. ప్రత్యేకించి భారత–అమెరికన్ అణు ఒప్పందం, మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో ఎఫ్‌డీఐలను అనుమతించిన సందర్భంలో ఇలాంటి ఐక్యత కొట్టొచ్చినట్లు కనబడింది. రెండు పరస్పర భిన్నమైన తీవ్ర భావజాలాలు కలిగిన బీజేపీ, వామపక్షం తమ ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా కలవడానికి గతంలో ఏమాత్రం సందేహించనప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ అదే పని ఎందుకు చేయకూడదు? ఒకప్పుడు కాంగ్రెస్ భారత రాజకీయాలను ఏకధ్రువంగా మార్చింది. ఇప్పుడు బీజేపీ ఆ పని చేస్తోంది. మరి కాంగ్రెస్‌కు ఆ వెసలుబాటు ఎందుకు ఉండకూడదు? కాంగ్రెస్‌లోని వాస్తవికవాదులు అడుగుతున్నది దీన్నే మరి. కొన్నిసార్లు బోఫోర్స్ తరహా అవినీతిపై యుద్ధం చేయడానికి వామపక్షం, బీజేపీ కలిసి పోరాడాయి. లేక వారసత్వ రాజకీయాలను సాగనంపడానికి కలిసి పోరాడాయి. కొన్ని సందర్భాల్లో అమెరికా భూతాన్ని (అణు ఒప్పందం), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను బంగాళాఖాతంలో కలిపివేయడానికి ఈ రెండు విరుద్ధ శక్తులు పొత్తు కలిపాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ దాన్నే ఎందుకు కొనసాగించకూడదు? ప్రత్యేకించి మహారాష్ట్రలో మోదీ, షాల బీజేపీని అధికారానికి దూరం పెట్టే అవకాశం పొంచి ఉన్నప్పుడు ఇలాంటి అవకాశాన్ని వదులుకుంటే ఎలా? లోక్‌సభలో 52 స్థానాలను, మహారాష్ట్రలో 44 అసెంబ్లీ స్థానాలను మాత్రమే చేజిక్కించుకున్న కాంగ్రెస్‌కు పోయేదేముంది. మహారాష్ట్రలో అతి తక్కువ కాలం పాటు తాను అధికారంలో ఉండి తర్వాత బీజేపీ గద్దెకెక్కినా సరే అదేమంత పెద్ద విషయం కాదు. ఏదోలా బీజేపీని తరిమేయాలి. పవార్ ఇలాంటి గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ ముందు పెట్టి ఉండకపోతే కాంగ్రెస్–శివసేనల మధ్య పొత్తు గురించి ఇంత హైరానా పడాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ పార్టీగా ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు గడ్డిపోచ సాయం దొరికినా గట్టిగా పట్టుకోవలసిందే మరి. ఆ గడ్డిపోచ ముదురు కాషాయరంగు పార్టీ అయినా సరే దాన్ని కరుచుకోక తప్పదు మరి. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఈ దూకుడే వర్తమాన వాస్తవమా?
1972 నుంచి 2014 మధ్య భారత జాతీయవాదం విస్తృతంగా వేళ్లూనుకుని, భద్రంగా సౌఖ్యమైన స్థితికి చేరుకుంది. చూడటానికి ఇదెంత అద్భుతంగా ఉందంటే ఏకకాలంలో మనం రెండు గేమ్స్ ఆడుతున్నాం. ఒకచోట ఒక ప్రాంతం జెండాను దించి దాన్ని జాతీయ వేడుకగా జరుపుకుంటున్నాం. మరొకచోట తమ జెండా కావాలంటున్న నాగాల డిమాండ్‌ను తోసిపుచ్చుతూనే వారి సాంస్కృతిక ఆకాంక్షలను జాతీయ పరిమితుల్లోనే గుర్తిస్తున్నాం. ఇతరుల భయం లేకుండా నువ్వు రాజకీయాలను ఎలా నడుపుతావన్నదే ముఖ్యం. భారత్ నేడు ఆ స్థితికి చేరుకున్నదనే చెప్పాలి. ఇవాళ చారిత్రకంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా, సైనికపరంగా, ఆర్థికపరంగా భారత్ అత్యంత సురక్షిత స్థానంలో నిలబడింది. భారత్‌ను ప్రపంచదేశాల దృష్టిలో బలోపేతం చేసిన ఈ అతిశయ జాతీయవాదాన్ని మరింతగా దృఢపరచాల్సిన అవసరం ఉంది. నెపోలియన్ బతికి ఉంటే సింహాసనం అంటే ఏమిటి అనే ప్రశ్నను సంధించి దాన్ని తిరిగి ఎలా వదిలేసి ఉంటాడు అనే అంశానికి సంబంధించి గూగుల్ మరింత వైవిధ్యపూరితమైన ఊహను నాకు చెబుతోంది. 1970ల నాటి ప్రామాణిక నాటకం వాటర్లూ లో నటించిన రాడ్ సై్టగర్ ఈ ప్రశ్నకు చెప్పిన సమాధానం ఈ వారం నా మదిలో మెదులుతోంది. సింహాసనం అంటే ఏమిటి అనే ప్రశ్నకు రాడ్ చెప్పిన సింపుల్ సమాధానం ఇలా ఉంటుంది. అది ఫర్నిచర్‌కు చెల్లించిన అధికమొత్తం ధర మాత్రమే. 19వ శతాబ్దం మొదట్లో సింహాసనానికి ఇంకా ప్రాధాన్యత ఉండేది. అయితే ఆధునిక ప్రపంచంలో చాలాచోట్ల సింహాసనం ఇప్పుడు ఉనికిలో లేదు. ఇప్పుడు మన చైతన్యంలోంచి మరుగుపడిపోయిన జాతీయ రాజ్యం, సింహాసనాలు, కిరీటాలు, జాతీయ గీతాలు, జాతీయ పతాకాలు వంటి చిహ్నాలను నెపోలియన్ ఆలస్యంగానైనా సరే ఉపయోగించి అప్పట్లో జాతీయ స్ఫూర్తిని తిరిగి తీసుకొచ్చాడు. అయితే ఆ గత చరిత్రకు చెందిన చిహ్నాలు ఇప్పటికీ పూర్తిగా అంతరించిపోలేదు. చాంపియన్‌షిప్ పోటీల సందర్భంగా మన క్రీడాకారులు జాతీయ చిహ్నాలకు చాలా ప్రాధాన్యమిస్తుం టారు. అయితే ఆధునిక జాతీయ రాజ్యం మరింత స్థిరంగా, సురక్షితంగా పాతుకుపోయింది కాబట్టి అలాంటి గత చిహ్నాలకున్న విలువ ఇప్పుడు ఒక పురాజ్ఞాపకంగా మాత్రమే కొనసాగుతోంది. కాలం మారుతోంది, ప్రజలు మారుతున్నారు, చిహ్నాలు కూడా మారుతున్నాయి. జెండా అంటే ఏమిటి అనే అస్పష్టమైన ప్రశ్నకు ఇప్పటికీ మనం విలువ ఇస్తున్నందుకు కారణం ఉంది. ఎందుకంటే భారతదేశంలో చిరకాలం నుంచి కొనసాగుతున్న రక్తప్లావిత తీవ్రవాదం కొనసాగుతున్న నాగాలాండ్‌లో కొనసాగుతున్న శాంతి చర్చలు చివరికి ముగింపుకొస్తున్న తరుణంలో జెండా అంటే ఏమిటి అనే ప్రశ్నను తిరిగి వేసుకోవలసి వస్తోంది. తాము గతంలో భయంకరమైన తప్పులు చేశానని అటు భారత ప్రభుత్వం, ఇటు నాగాలు ఇప్పుడు అంగీకరిస్తున్నారు. హింస ఇంకా ఎంతోకాలం పనిచేయదని కూడా గ్రహించారు. అయితే నాగాలు తమ సొంత జెండాను ఇప్పటికీ కోరుకుంటున్నారు. కానీ మోదీ ప్రభుత్వం దానికి ఇష్టపడటంలేదు. అయితే ఇరుపక్షాల మధ్య చర్చలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే, సాంస్కృతిక, జాతిపరమైన సందర్భాల్లో మీరు మీ జెండాను పట్టుకోవచ్చని ప్రభుత్వం ఇప్పడు అంగీకరిస్తోంది. అలాగయితే తమ జెండాకు ఏ ఎన్జీవో అయినా పెట్టుకునే సాధారణ జెండా గుర్తింపు మాత్రమే ఉంటుందని నాగాలు వాదిస్తున్నారు. అత్యుత్తమ చర్చ ఏదంటే రెండు పక్షాలు అతి తక్కువ అసంతృప్తితో మాత్రమే చర్చల బల్లనుంచి వెళ్లిపోగలగడమే. చర్చల ఫలి తంలో తమకు ప్రాధాన్యత లేనప్పటికీ ఇరు పక్షాలూ తాము ఏదో ఒకటి సాధించామని చెప్పుకోవడం అని దీనర్థం. కానీ ముయ్‌వా నాగాలకు జెండాను గుర్తించకుండా సంధిపై సంతకం చేయడమంటే పెద్ద అవమానంగా కనిపిస్తోంది. ఇక మోదీ ప్రభుత్వం ముందు ఉన్న చాయిస్ కూడా కఠినంగానే ఉంది. ఈ అక్టోబర్ 31 గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ జెండాను దింపివేసి సర్దార్ పటేల్ జయంతి కూడా కలిసివస్తున్న సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ వేడుకలు జరుపుకుంది. భారతజాతీయ వాదం ఎన్నడూ లేనంత బలోపేతంగా మారిన నేపథ్యంలో కేవలం 30 లక్షల మంది ప్రజలను మాత్రమే కలిగి ఉన్న ఒక ఆదివాసీ రాజ్యం ముందు కేంద్రం ఎలా తలొగ్గి ఉంటుంది మరి? అయితే మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దివంగత ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వంతో పోల్చడానికి కూడా వీల్లేదు. రాజ్యాంగ పరిధిలోనే చర్చలు కొనసాగాలని భారత్ పట్టుబడితే కశ్మీర్ వేర్పాటువాదులు ఎలా స్పందిస్తారు అని ప్రశ్నించినప్పుడు వాజ్‌పేయి తొణుకూ బెణుకూ లేకుండా సమాధానమిచ్చారు.. ‘మేం మానవత్వ పరామితులతో చర్చలు జరుపుకుంటాం’. కానీ మోదీ ప్రభుత్వం కాస్త కఠినవైఖరి వైపుకు మళ్లింది. పట్టువిడుపులు లేని దాని వైఖరికి మొరటు జాతీయవాదం కూడా కాస్త తోడైంది. అలాంటి జాతీయవాదం తన చిహ్నాల తొలగింపు పట్ల సుముఖత ప్రదర్శిం చదు. అందుకే ఒక రాష్ట్ర పతాకను దింపిపారవేసిన ఘటనకు గాను అది వేడుక చేసుకుంటోంది. సుప్రీంకోర్టు తన ఆదేశాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ జాతీయ గీతాలాపనను నిలిపివేయడానికి దేశంలో ఏ సినిమా హాల్ కూడా ధైర్యం చేయడం లేదు. సినిమా హాళ్లలో జాతీయ గీతం ప్రదర్శించినప్పుడు లేచి నిలబడకుంటే అలాంటివారిని మూకుమ్మడిగా వేధిస్తున్నారు. ఇది ఎలా ఉందంటే నూతన తరం భారతీయులు తాము ఒట్టి దేశభక్తులం మాత్రమే కామని జాతీయ వాదులం కూడా అని నిరూపించుకుంటున్నట్లుగా ఉంది. భారతదేశం మొత్తంగా ఒకే రాజ్యాంగం, ఒకే చిహ్నం, ఒకే నేత ఉండాలనే తన సైద్ధాంతిక వ్యవస్థాపకుల దార్శనికతకు బీజేపీ చాలా సమీపంగా వచ్చినట్లు కనిపిస్తోంది. మీరు కూడా నాలాగే 1960లలో పుట్టిన వారే అయితే, ఆ దశాబ్దంలోకి వెళ్లి చూసినట్లయితే భారత్ నేడు చేరుకున్న స్థితి అసాధ్యం అనే భావించేవారు. 1961–71 మధ్య పదేళ్లలో మనం నాలుగు పూర్తి యుద్ధాలను చవిచూశాం. గత అయిదు దశాబ్దాలలో దేశం అన్ని తీవ్రవాద ఉద్యమాలను, వేర్పాటు రాజకీయ ఉద్యమాలను అణిచిపెట్టగలిగే స్థితికి చేరుకోగలుగుతుందని మనం అప్పట్లో ఊహించి ఉండేవారమా? ఆ ప్రమాదకరమైన దశాబ్దంలో భారత్ నిలువునా చీలిపోగలదని అమెరికన్ స్కాలర్ సెలిజ్ హారిసన్ గతంలో అభిప్రాయపడ్డారు. కానీ ఇలాంటి మేధావుల అభిప్రాయాలు తప్పని భారత్ నిరూపించింది. ఇవాళ చారిత్రకంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా, సైనికపరంగా, ఆర్థికపరంగా భారత్ అత్యంత సురక్షిత స్థానంలో నిలబడింది. 2003 కాలానికి వెనక్కు వెళ్లి ఫోక్రాన్ అనంతరం భారత్ అనుసరించిన కఠిన దౌత్య పరిస్థితుల్లోకి వెళ్లి చూడండి. ఇక్కడే భారతీయ వ్యవస్థ మూలమలుపు తిరిగింది. తర్వాత 15 ఏళ్లలో భారత్ అత్యంత సురక్షిత స్థానంలో నిలిచేటట్టుగా పరిణతితో వ్యవహరించింది. ఈ క్రమాన్ని వెనక్కు తిప్పడం అంత సులభంకాదు. ఎవరినైనా పక్కకు నెట్టివేయగల శక్తి, ఏ భూభాగాన్నైనా ఆక్రమించుకునే బలం ఇప్పుడు భారత్‌కు ఉన్నాయి. ఈ భద్రతను భారతీయులమైన మనం అనుభవించడంతోపాటు, ఆ సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తున్నాం. దీనికి భిన్నంగా మనం కొన్ని పాత అభద్రతా భావాలను లేవనెత్తుతున్నాం. మోదీ–షా నేతృత్వంలోని బీజేపీ రాజకీయాల్లో మీకు కారణాలు కనిపిస్తాయి. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడం, కొన్ని అనుకోని సంఘటనల ఆధారంగా విమర్శకులు ఈ ప్రభుత్వంపై దాడి చేస్తున్నారు. ఇది వాస్తవం. కానీ, దీన్ని ఎదుర్కోడానికి తగి నంత బలం భారత్‌కు ఉంది. ఆగస్టు 5న కశ్మీర్లో మౌలిక మార్పులు చేసి మూడు నెలలు గడుస్తున్నా, ఈ రోజు వరకూ ఎప్పుడూ విమర్శించే మూడు దేశాలు తప్ప ఏ ఇతర దేశం ఆ చర్యలను వెనక్కు తీసుకోమని భారత్‌ను కోరలేదు. అది భారతదేశపు అంతర్గత వ్యవహారంగా భావించే మిగిలిన దేశాలన్నీ మౌనం వహించాయి. అంతమాత్రాన, అది ఎప్పటికీ ఇలాగే కొనసాగదు. కశ్మీర్లో చాలా త్వరగానే సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. అక్కడి రాజకీయ నాయకులను, ప్రముఖులను ఎంతో కాలం నిర్బంధంలో ఉంచరు. సమాచార నిర్బంధం కూడా తొలగిపోతుంది. లేకపోతే స్నేహపూరిత ప్రభుత్వాలు కూడా మనవైపు నిలిచే పరిస్థితి ఉండదు. సాధారణ స్థితి నెలకొంటే కశ్మీర్ కూడా జాతీయ వ్యవహారాల్లో బలమైన పాత్ర పోషిస్తుంది. నేడు కశ్మీర్ సమస్య అంటే పాక్ నుంచి ముప్పు, ఇస్లాం ఉగ్రవాదం, జిహాదీ తదితరాలు. ఇది జాతీయ భద్రతకు విచ్చిన్నపరిచే ప్రత్యక్ష ప్రమాదం. వీటిని దృఢంగా ఎదుర్కొంటున్న ఈ అతిశయిం చిన జాతీయవాదాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ కోణం నుంచి చూస్తే మనం చాలా బలంగా ఉన్నాం అని చెప్పడానికి ఎన్నికల శాతాలు అవసరం లేదు. ఎందుకంటే, అప్పుడు ఇతరుల భయం లేకుండా నువ్వు రాజకీయాలను ఎలా నడుపుతావన్నదే ముఖ్యం. 1972 నుంచి 2014 మధ్య భారత జాతీయవాదం విస్తృతంగా వేళ్లూనుకుని, భద్రంగా సౌఖ్యమైన స్థితికి చేరుకుంది. చూడటానికి ఇదెంత అద్భుతంగా ఉందంటే ఏకకాలంలో మనం రెండు గేమ్స్ ఆడుతున్నాం. ఒకచోట ఒక ప్రాంతం జెండాను దించి దాన్ని జాతీయ వేడుకగా చేసుకుంటున్నాం. మరో చోట తమ జెండా కావాలనే వారి ఆకాంక్షలను పరిమితుల్లోనే గుర్తిస్తున్నాం. - శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఆ రెండుచోట్లా ఎదురుగాలి!
జాతీయ స్థాయిలో తిరుగులేని నేతగా నరేంద్రమోదీ స్థిరపడిన తర్వాత మహారాష్ట్ర, హరియాణాల్లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశంలో రాజకీయ పవనాలు మారుతున్నాయన్నదానికి తొలి సంకేతాలను అందించాయి. మోదీ ప్రజాదరణను కోల్పోకున్నా ఆయన పార్టీ ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకతను చవిచూసింది. బీజేపీ పట్ల తమ వైఖరిని అయిదు నెలలలోపే మార్చుకున్నారంటే, జాతీయవాద భావోద్వేగాలు, పాక్ వ్యతిరేక ప్రచారం, మనోభావాలను ప్రేరేపించిన మతపరమైన అత్యుత్సాహం వంటి అనుకూల పవనాలన్నీ ఆర్థిక వ్యవస్థ పతనం, ఉద్యోగాలకు సంబంధించిన భయాందోళనల ముందు వెనకపట్టు పట్టాయన్న సూచనలను సంకేతిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో చాలామంది ఓటర్లు తమ ప్రాథమిక సమస్యల వైపు దృష్టి సారించినట్లే ఉంది. ప్రతిపక్షం మేలుకోవలసిన సమయమిది. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చి ఆలస్యంగా వెళ్లాయి. చివరకు వాయు చలనాలు కూడా రివర్స్ అయ్యాయి. దేశరాజధానిలో ఇవి ప్రస్తుతం పొడిపొడిగా మారాయి. పంజాబ్, హరియాణాల మీదుగా పశ్చిమం నుంచి వచ్చిన వాయుప్రవాహాలు ఆ రాష్ట్రాల్లోని రైతులు పొలాల్లో తగులబెట్టిన ఎండు దుబ్బు పొగను భారీగా వెంటబెట్టుకొచ్చాయి మరి. ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నది ఆకురాలు కాలం. రుతుపవనాల మార్పు వంటి స్పష్టమైనది కాకున్నా రాజకీయ పవనాలు కూడా మారిపోయాయి. ఆర్థిక వ్యవస్థ స్తబ్ధతకు గురైనందున గత కొద్ది సంవత్సరాలుగా బీజేపీ మతంతో కూడిన ఉద్రేకభరితమైన జాతీయవాద పవనాలను రేకెత్తించి దుమారం లేపుతూ వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు, ప్రత్యేకించి బాలాకోట్, అభినందన్ ఘటనలకు ముందు బీజేపీ ఈ తరహా జాతీయ వాదాన్ని పరాకాష్టకు తీసుకెళ్లింది. గత ఏడు దశాబ్దాలుగా పాకిస్తాన్ నుంచి భారత్ బాహ్య ప్రమాదాన్ని ఎదుర్కొనేదని, దీన్ని ఎవరూ పరిష్కరించలేని దశలో నరేంద్రమోదీ అంతిమంగా అడ్డుకున్నారని భారతీయ ఓటర్లు నమ్మేశారు. పైగా మోదీ పాక్ సమస్యను నిర్ణయాత్మకంగా, నిర్భయంగా సైనిక దండనతో పరిష్కరించేశారని, పాకిస్తాన్‌ని ఒంటరిని చేయడమే కాకుండా అంతర్జాతీయంగా భారత్ స్థాయిని పెంచివేశారని భారతీయ ఓటర్లు విశ్వసించారు. ఈ అభిప్రాయానికి వచ్చేశాక ఓటర్లు ఇతర పార్టీల పట్ల తమ విశ్వాసాలను విస్మరించేస్తారు కదా. ఓటరు అభిప్రాయాలు దానికనుగుణంగా మారిపోయాయి. అదేమిటంటే.. పాకిస్తాన్ ముస్లిం దేశం. అది జిహాద్ పేరుతో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తోంది. రక్త పిపాస కలిగిన జిహాదీలు యావత్ ప్రపంచానికే మహమ్మారిగా మారిపోయారు. ప్రపంచమంతటా ఇస్లామిక్ ప్రమాదం పొంచి ఉంది. భారతీయ ముస్లింలు కూడా దానికి మినహాయింపు కాదు. కాబట్టి హిందువులు తమకు తాముగా బలోపేతం కావలసి ఉంది. కానీ ఇలాంటి దురారోపణలు ఏవీ ఎన్నికల ప్రచారంలో పనిచేయలేదు. పేదలకు వంటగ్యాస్, మరుగుదొడ్లు, ఇళ్లు, ముద్రా రుణాలు వంటి పథకాలకోసం కేంద్రప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసిన దాదాపు రూ. 12 లక్షల కోట్ల నగదు పంపిణీనే ప్రచారంలో సమర్థ పలితాలను ఇచ్చింది. ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు వారాల పాటు నేను ఇదే విషయాన్ని రాస్తూ, మాట్లాడుతూ వచ్చాను. ఎన్నికల పరిభాషలో చెప్పాలంటే ఇది జాతీయవాదం, మతం, సంక్షేమం అనే మూడూ సృష్టించిన విధ్వంసం అనే చెప్పాలి. వీటి ముందు ప్రతిపక్షం రఫేల్ యుద్ధవిమానాల కుంభకోణం గురించి చేసిన ప్రచారం అపహాస్యం పాలయింది. పెద్ద నోట్లరద్దు తర్వాత మన ఆర్థిక వ్యవస్థ వృద్ది పతనం, చుక్కలంటుతున్న నిరుద్యోగితను కూడా జనం ఉపేక్షించేశారు. ఈ వారం జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ పవనాలు మారుతున్నాయన్న దానికి తొలి సూచికను అందించాయి. అయితే ఈ ఎన్నికల్లో మోదీ తన ప్రజాదరణను కోల్పోయినట్లు చెప్పలేం. అదే జరిగి ఉంటే కనీసం హరియాణాలో అయినా బీజేపీ ఓటమి పాలయ్యేది. బీజేపీకి అనుకూలంగా తగిన సంఖ్యలో ఓటర్లను మోదీ సాధించారనడంలో సందేహమే లేదు. అయితే అయిదు నెలలక్రితం హరియాణాలో బీజేపీ ఓట్ల శాతం 58 శాతం మేరకు ఉండగా ఎన్నికల తర్వాత అది 28 శాతానికి గణనీయస్థాయిలో పడిపోయింది. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అత్యంత విశ్వసనీయతను సాధించిన ఇండియా టుడే–యాక్సిస్ ఎగ్జిట్ పోల్ ప్రకటించిన ముందస్తు ఫలితాలు రాజకీయ పవనాల మార్పుకు సంబంధించి కొన్ని సూచనలను వెలువరించాయి. గ్రామీణ యువత, నిరుద్యోగిత, రైతులు, వ్యవసాయ కార్మికులు వంటి పలు విభాగాల్లో కాంగ్రెస్ పార్టీ కంటే 9 శాతం అదనపు పాయింట్లతో బీజేపీ ఇప్పటికీ ఆరోగ్యకరమైన ఆధిక్యతలో ఉంటున్నప్పటికీ పంజాబీ జనాభా గణనీయంగా ఉన్న హరియాణాలో దాని మధ్యతరగతి, అగ్రకులాలతో కూడిన గ్రామీణ ప్రజానీకం కాంగ్రెస్‌ను ఒకరకంగా ఆదుకోవడం బీజేపీకి తీవ్ర సంకటపరిస్థితిని కలిగించింది. మహారాష్ట్రలో కూడా కుంభకోణాల బారిన పడకుండా, ప్రజామోదం పొందిన బీజేపీ ముఖ్యమంత్రి సుపరిపాలనను అందించినప్పటికీ, ఈదఫా ఎన్నికల్లో ఆ పార్టీ మెరుగు పడటానికి బదులుగా గణనీయంగా ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంది. ఇది ముందుగానే ఊహించిందే. అదేసమయంలో కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి కీలకనేతలు నిఘా సంస్థల ఆగ్రహం బారిన పడతామేమోనన్న భీతితో బీజేపీలో చేరిపోయినందున ప్రతిపక్షం ర్యాంకు కూడా పడిపోయింది. పాలకపక్షానికి అనేక అనుకూలతలు ఉన్నప్పటికీ సాపేక్షికంగా ఇలాంటి ప్రతికూల విజయం దక్కిన నేపధ్యంలో బీజేపీని దెబ్బతీసింది ఎవరనే ప్రశ్న వస్తుంది. కాంగ్రెస్ కంటే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రత్యేకించి గ్రామీణ పశ్చిమ మహారాష్ట్ర్లలో బీజేపీని బాగా దెబ్బతీశారు. గుర్తుంచుకోండి.. కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన 11 వారాల తర్వాత, హౌడీ మోదీ, అమెరికాలో ట్రంప్‌తో మోదీ చర్చలు జరిగిన అయిదు వారాల తర్వాత బీజేపీ ఇలాంటి ఫలితాలు సాధించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మామల్లపురంలో టీవీ మాధ్యమాల్లో మోదీ సంచలనం రేపిన కొద్ది కాలంలోనే ఇలా జరగడం గమనార్హం. పై అన్ని అనుకూల అంశాలు ఉన్నప్పటికీ ఓటర్లు చాలామంది బీజేపీ పట్ల తమ వైఖరిని అయిదు నెలలలోపే మార్చుకున్నారంటే, జాతీయవాద భావోద్వేగాలు, పాక్ వ్యతిరేక ప్రచారం, మనోభావాలను ప్రేరేపించిన మతపరమైన అత్యుత్సాహం వంటి అనుకూల పవనాలన్నీ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలకు సంబంధించిన భయాందోళనల ముందు వెనకపట్టు పట్టాయన్న సూచనలను సంకేతిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో చాలామంది ఓటర్లు తమ ప్రాథమిక సమస్యల వైపు దృష్టి సారించినట్లే ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మా ప్రయాణాల్లో పేదలు, ఉపాధి కోల్పోయిన ప్రజలను తరచుగా కలుసుకునేవాళ్లం. ఆర్థిక వ్యవస్థ వికాసం గురించి మోదీ, బీజేపీ చేసిన వాగ్దానాలు ఆచరణలో అమలు కాలేదని, తాము దెబ్బతిన్నామని వీరు మాకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ తాము దేశ ప్రయోజనాల కోసం మాత్రమే మోదీకి ఓటేస్తామని వీరన్నారు. దేశాన్ని రక్షించడానికి మోదీ ఉన్నారు కాబట్టి దేశం సురక్షితంగా ఉంది. కానీ ఆర్థిక వ్యవస్థ పతనం, నిరుద్యోగిత జనాలను నిజంగానే బాధపెడుతోంది. ఇక రైతులు గిట్టుబాటు ధరల లేమితో విసిగిపోయారు. నా ఉద్దేశంలో మతంతో కూడిన జాతీయవాద పవనాలను ఆర్థిక వ్యవస్థ స్తబ్దత, నిరుద్యోగం, అశాంతి, సాధారణ వ్యాకులత వంటివి ఈ ఎన్నికల్లో వెనక్కు నెట్టేసినట్లున్నాయి. పాకిస్తాన్‌పై తాజా దాడులు, కశ్మీర్, ఉగ్రవాదంపై పాలక పార్టీ, ప్రభుత్వం గొంతు చించుకున్నా అది ఎన్నికల ఫలితాలను మార్చలేకపోయాయి. అయోధ్యపై సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇవ్వనుందన్న వార్తలు కూడా హిందీ ప్రాబల్య ప్రాంతంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. వీటికి అతీతంగా చాలామంది ప్రజలు తీవ్ర బాధలకు గురవుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోవాలని వీరు కోరుకున్నారు. హరియాణాలో, మహారాష్ట్రలో బీజేపీకి తగిలిన ఎదురు దెబ్బలు త్వరలో జరగనున్న జార్ఖండ్ ఎన్నికలపై ప్రభావం చూపుతాయా లేదా అన్నది ఎవరికి వారు ఊహించుకోవలసిందే. ఒకటి మాత్రం నిజం. ప్రతిపక్షం ఎట్టకేలకు జూలు విదిలించాల్సిన తరుణం ఆసన్నమైంది. అన్ని విజయాలు ఒక నేతకే ఆపాదించే వ్యక్తి ఆరాధనా సంస్కృతిలో ఎదురుదెబ్బల నుంచి ఆ అధినేతను కాయడం కష్టమే అవుతుంది. ప్రత్యేకించి ప్రస్తుత ఎన్నికల్లో ప్రత్యర్థులచే సంపూర్ణ ఓటమి చెందనప్పటికీ తక్కువ పాయింట్లతో విజయాన్ని నమోదు చేయడం పాలకపక్షానికి తీవ్ర ఆశాభంగాన్నే కలిగిస్తుంది. త్వరలోనే జార్ఖండ్‌లో, తర్వాత ఢిల్లీలో ఎన్నికలు జరగనుందున మోదీనే మళ్లీ ముందుపీటికి తీసుకురావాలా వద్దా అని బీజేపీ నిర్ణయించుకోవాలి మరి. మునిసిపల్ కార్పొరేషన్లపై, పోలీసులపై పూర్తి నియంత్రణ కేంద్రం చేతిలో ఉంటున్నప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో కాంగ్రెస్ కంటే మెరుగ్గానే రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. భారత్‌లో రాజకీయాలు మారడానికి సంవత్సరాల సమయం పడుతుంది కానీ రాజకీయ సీజన్లు మాత్రం శరవేగంగా మారతాయి. దేశరాజధానిలో ఇప్పుడున్న పొడి వాతావరణం, ఆకురాలు కాలం ప్రభావం ఏమిటో మీరు గ్రహించవచ్చు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఈ సంక్షోభానికి శస్త్రచికిత్సే మందు
ఆర్థిక సంక్షోభం పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, హామీలు ఇస్తే సర్దుకునే స్థాయిని దాటిపోయింది. వీటిలో కొన్ని పని చేయొచ్చు, కానీ స్టెరాయిడ్స్, ఇన్సులిన్ లాంటి మందు కావాలి. నిజమైన, ధైర్యంగా తీసుకునే చర్యలు ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు అవసరం. బహుశా, పీఎస్‌యూలను పెద్దఎత్తున ప్రైవేటీకరించడం ద్వారా అది సాధ్యం కావచ్చు.మోదీ ప్రభుత్వం ఆరో ఏడాది పాలనలో కూడా ఇటువంటి చర్యలు తీసుకోనట్టయితే, అది ఓ గెలుపు గుర్రమే కానీ, సంస్కరణలు తీసుకువచ్చే సత్తాను కోల్పోయిందని అభివృద్ధి అనేది వాంఛనీయమైనదే తప్ప అత్యవసరమైన అంశం కాదని నమ్మేవారి మాటలను నిజం చేసినట్లవుతుంది. నిజమైన, సాహసోపేతమైన సంస్కరణతో మాత్రమే ఆర్థిక సంక్షోభాన్ని సరిచేయవచ్చు. నరేంద్రమోదీ ప్రభుత్వం దాన్ని చేయలేకపోతే, అది తన ప్రాభవాన్ని కోల్పోతోందన్న భయాలు రుజువైనట్లే లెక్క. ఇది మన రాజకీయ వర్గాలు తరచుగా ఉపయోగించే వ్యక్తీకరణ కాదు. కానీ భారతీయ పారిశ్రామిక వర్గం జంతు సహజాతాల బలీయమైన ప్రభావం గురించి ప్రతిచోటా మాట్లాడుకుంటూ ఉంటడం కద్దు. భారతీయ కార్పొరేట్ వర్గం నుంచి ఇలాంటి సహజాతాలకు సంబంధించినంతవరకు అభ్యర్థన చేసిన ఏౖకైక నాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్, తర్వాత జస్వంత్ సింగ్ మాత్రమే. ఇక మోదీ ప్రభుత్వం ఆలస్యంగానైనా తన సొంత మాటల్లో ఆ పని చేయడానికి ప్రయత్నించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో, భారతీయ సంపద సృష్టికర్తలను ఆకర్షించడానికి కొంత ప్రయత్నం చేశారు. భారత సంపన్నులను తన ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పడమే కాక, జాతి నిర్మాణంలో వారు చక్కటి పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఎర్రకోట నుంచి ఒక భారతీయ ప్రధాని ప్రైవేట్ పారిశ్రామిక వర్గాన్ని అత్యంత శక్తివంతంగా సొంతం చేసుకున్న ఘటనలలో ఇదీ ఒకటి. ఇది మరింత దిద్దుబాటు చర్యకు వీలు కల్పించింది. భారీగా కార్పొరేట్ పన్ను కోతలు, మూలధన లబ్ధిపై పన్నులో మార్పులు, కార్పొరేట్ లాభాలపై పన్ను తగ్గింపు వంటివి ప్రకటించారు. అదేవిధంగా విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపుదారుల కార్పొరేట్ లాభాలపై పన్ను విధింపును వెనక్కు తీసుకోవడం కూడా జరిగిపోయింది. ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నటికీ వెనక్కు తీసుకోని, నష్టభయాన్ని తట్టుకునే ప్రభుత్వం, పారాచూట్‌ని తనిఖీ చేయకుండానే విమానం వెనుకనుంచి దుమికేయాలని నిర్ణయించుకున్నాక వెనక్కు తిరగని ప్రభుత్వం ఈవిధమైన తిరోగమనాలకు పాల్పడటమే ఒక కొత్త అనుభవం. అలా తిరోగమించడాన్ని ప్రభుత్వంలో ఏ ఒక్కరూ అంగీకరించకపోవచ్చు, కానీ మొట్టమొదటిసారిగా అసాధారణ ప్రజాదరణ కలిగిన ప్రధాని నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వం కలిసి నియంత్రించలేని అంశమేమిటంటే మార్కెట్లే. న్యాయవ్యవస్థ, మీడియా, ఎన్నికల కమిషన్, చివరకు పాకిస్తా¯Œ తో అయినా సరే.. మోదీ అంత శక్తివంతంగా వ్యవహరించగలిగింది. కానీ పశుబలం కలిగిన రాజకీయ అధికారం కూడా మార్కెట్ విషయంలో ఏమీ చేయలేదు. గత కొద్ది వారాలుగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ వాణిజ్య ప్రముఖులను కలుసుకుంటూ వస్తున్నారు. ప్రెస్ కాన్ఫరె¯Œ్స తర్వాత ప్రెస్ కాన్ఫరెన్సులో ఆమె తన బడ్జెట్లోని అత్యంత సమస్యాత్మక విభాగాలను గురించి చెబుతూ వచ్చారు. ఈ ’అప్రియ వార్తల’ బడ్జెట్ ముసాయిదా తయారీలో కీలక వ్యక్తి అయిన ఆర్థిక శాఖ కార్యదర్శి రంగంనుంచి తప్పుకుని ముందస్తు పదవీవిరమణ కోసం ప్రయత్నించారు. ఈదఫా కేంద్రబడ్జెట్ సమర్పించిన తర్వాత ఆర్బీఐ రెండు సత్వర రెపో రేట్స్‌ని తీసుకొచ్చింది. అయినప్పటికీ మన కార్పొరేట్ వర్గం మానసిక స్థితిలో పెద్దగా మెరుగుదల లేదు. చివరకు ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించిన ఇండియా ఎకనమిక్ సమ్మిట్‌లో కూడా మన కార్పొరేట్ వర్గంలో కళాకాంతులు లేవు. చిరునవ్వు కనిపించలేదు. మనం జంతు సహజాతాల గురించి మాట్లాడుతున్నామా? అవి కచ్చితంగా కంటికి కనబడతాయి. మీరు కోరుకుంటున్న రీతిలో జంతువు ఉండలేదు. పులి తోక పైకి లేపి మరీ పడుకుంటుంది. యజమాని వదిలేసిన కుక్క కూడా తన తోకను కాళ్లమధ్య దాచుకుంటూ ఉంటుంది. మీకు నేను వాడుతున్న పదబంధం ఇష్టం కానట్లయితే, కుక్కలతో పోల్చడం ఇష్టం లేకపోతే, నేను మరింత సాంప్రదాయికమైన పదం వెనుక దాక్కుంటాను. అది నైతిక ధృతి లేని సైన్యం. అత్యుత్తమ ఆయుధాలను మీరు ఇవ్వవచ్చు. కానీ సైనికాధికారులు తమ మనస్సులో ఇప్పటికే ఓడిపోవడం జరిగాక, యుద్ధంలో గెలవటం మాట అటుంచి తమ సైనిక బలగాలను కూడా ముందుకు నడిపించలేక పోవచ్చు. సెప్టెంబర్ 24న పన్ను కోతలు తగ్గించినప్పటినుంచి దేశీయ కార్పొరేట్ రంగం తన స్పూర్తిని ఎంతగా కోల్పోయిందంటే, బీఎస్ఈ సెన్సెక్‌లో నమోదైన కంపెనీలు తాజాగా రూ. 2.53 లక్షల కోట్లను కోల్పోయాయి. గత నిర్ణయాలనుంచి వెనక్కు రావడం, వడ్డీ రేట్లలో కోతలు వంటి సంస్కరణలు నిండా ఆవరించిన నిరాశావాదంలోంచి బయటపడలేకపోయాయి. మార్కెట్లకు పికెట్టీ భరోసా ఇచ్చిన తర్వాత కూడా ప్రపంచ స్థాయిలో మార్కెట్ల పరిస్థితి బాగాలేదు. అయితే కార్పొరేట్ వర్గాలు ఎంత అసమర్థంగా ఉన్నప్పటికీ, క్రమరాహిత్యంతో ఉన్నప్పటికీ అధికారపీఠంలో కూర్చుని ఉన్నవారికి నిజం చెప్పడంలో ఇప్పుడు వెనుకాడటం లేదు. మీడియా, న్యాయవ్యవస్థ వంటి కనీసం ఊహించలేని చోట భారతీయ మార్కెట్లు నిర్బయంగా ఒక విషయాన్ని చెబుతున్నయి: మోదీ ప్రభుత్వం దృష్టికి చెడువార్తలను తీసుకుపోండి. గత త్రైమాసికంలో వృద్ధి రేటు 5శాతం వద్ద కనిపడి అందరికీ షాక్ కలిగించింది. అయితే అలా షాక్ తగిలింది అమాయకులకే అనుకోండి. ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తున్న ఎవరికైనా ఇది బోధపడుతుంది. ఏదైనా అసాధారణమైనది జరిగితే తప్ప ఈ పరిస్థితిని మెరుగుపర్చడం కష్టమే. ఆ మార్పు ఏంటన్నది ప్రస్తుతానికి ఎవరికీ తెలీదు. మన అదృష్టాన్ని నిర్ణయించే అలాంటి అసాధారణ పరిణామం ఎవరికైనా తెలిసి ఉంటే, ఆర్బీఐ ఈ సంవత్సరం వృద్ధి అంచనాను 6.9 నుంచి 6.1కి తగ్గించి ఉండదు. ఈరోజు లాభాలు, పన్ను కోతల బట్టి కాక, రేపటి ఆశావాదం బట్టే పారిశ్రామిక వర్గం ముందడుగు వేస్తుంది. ఆ ఆశావాదమే పతనమవుతోంది. మోదీ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దుతో అన సొంత ఆర్థిక అభివృద్దిని విచ్చిన్న పర్చుకోవడం సాధ్యమైనప్పటినిుంచి మన ఆశావాదం తగ్గుపట్టనారంభించింది. వ్యాపార వర్గాలు సాధారణ ప్రజలు, కుటుంబాలనుంచి విభిన్నంగా ఉండవు. భవిష్యత్తు బాగా లేదని అర్థం కాగానే వారు తాజా ఆదాయాలు, సేవింగ్స్, ఇటీవలి పన్ను కోతలు వంటి ద్వారా వచ్చే బొనాంజాలను మొత్తంగా కుటుంబ ఆదాయాలుగా మార్చిస్తారు. పరిస్థితి మెరుగుపడిందని గ్రహించాకే వారు నష్టభయాలకు సిద్ధమై వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. ఈ సమాచారాన్ని మీరు ఎటునుంచి ఎటు తిరగేసినా విషయం మాత్రం అదే. ఎటువంటి మినహాయింపూ లేకుండా అన్ని ఆర్థిక సూచికలు గత కొద్దికాలంగా దిగజారుతూనే ఉన్నాయి. ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఇందుకు మీరు ఏదో కారణం వెతకచ్చు. కానీ, అది చాలా చిన్న విషయం. సమస్య మూలాలు ఇక్కడ ఉన్నాయి. ముఖేష్ అంబానీలాంటివారితో సహా చాలామంది నగదు నిల్వలను వదులుకోవడం లేదు. లేదంటే అప్పులు తగ్గించుకోవడానికీ, ఇబ్బందులు లేకుండా చూసుంటూ, లోన్లను తిరిగి చెల్లిస్తూ కాలం వెళ్లబుచ్చుతూ–మిగిలినవారంతా పెట్టుబడులు పెట్టాలని చూడటం సరికాదు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలను ఎవరిని అడిగినా 1991 తర్వాత ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదని గుసగుసగా చెబుతారు. పన్నుల అధికారులకు దాడులు చేయడానికి, అరెస్ట్ చేయడానికి అవసరమైన అధికారాలు కట్టబెట్టడం వల్ల మాత్రమే కాదు, మొండి బాకీల విషయంలో వ్యవహరిస్తున్న తీరు వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తింది. అన్ని వ్యాపారాల్లో రిస్క్ ఉంటుందని ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు నాతో చెప్పారు. 30 రోజుల్లో నేను తీసుకున్న అప్పు తీర్చకపోతే, బ్యాంకులు నన్ను ఎ¯Œ సీఎల్టీగా పేర్కొంటూ నా పేరును ఎగవేతదారుల జాబితాలో ప్రచురిస్తాయి. నేనెందుకు రిస్క్ తీసుకోవాలి? ఒక మనిషి అనారోగ్యానికి గురైతే ఆసుపత్రికి తీసుకువెళతారా, లేక స్మశానానికా? ఆర్బీఐ కొత్త దివాళా నిబంధనలు భారత పారిశ్రామికవిధానానికి ఎ¯Œ సీఎల్టీ అనే స్మశానాలు నిర్మిస్తున్నట్టుగా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, హామీలు ఇస్తే సర్దుకునే స్థాయిని దాటిపోయింది. వీటిలో కొన్ని పని చేయొచ్చు, కానీ స్టెరాయిడ్స్, ఇన్సులిన్ లాంటి మందు కావాలి. నిజమైన, ధైర్యంగా తీసుకునే చర్యలు ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు అవసరం. బహుశా, పీఎస్‌యూలను పెద్దఎత్తున ప్రైవేటీకరించడం ద్వారా అది సాధ్యం కావచ్చు.మోదీ ప్రభుత్వం ఆరో ఏడాది పాలనలో కూడా ఇటువంటి చర్యలు తీసుకోనట్టయితే, అది ఓ గెలుపు గుర్రమే కానీ, సంస్కరణలు తీసుకువచ్చే సత్తాను కోల్పోయిందని అభివృద్ధి అనేది వాంఛనీయమైనదే తప్ప అత్యవసరమైన అంశం కాదని నమ్మేవారి మాటలను నిజం చేసినట్లవుతుంది. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మనం ఇంకా గెలువని కశ్మీర్
కమ్యూనికేషన్ నిబంధనలను ఎత్తివేయడంపై జాప్యం కొనసాగుతుండటం కశ్మీరీల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. ఇది పరిస్థితులను అదుపు తప్పేలా చేస్తుంది. పైగా కశ్మీర్ స్థితిగతులను ప్రపంచం పరిశీలి స్తోంది కూడా. కానీ ప్రస్తుతం కశ్మీర్ గురించి ప్రపంచం పట్టించుకుంటోందా? కనీసం కశ్మీర్ గురించి ప్రపంచానికేమైనా తెలుసా? కశ్మీర్ ఉపఖండంలో భాగమని, దీనికోసమే భారత్, పాకిస్తాన్ లు అసంగతమైన స్థాయిలో పరస్పరం కలహించుకుంటున్నాయనీ. తరచుగా అణుయుద్ధ స్థాయికి కూడా దీన్ని తీసుకెళుతున్నాయని అర్థమైనప్పుడు మాత్రమే ప్రపంచం అట్లాస్‌లో కశ్మీర్ గురించి శోధిస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కేటగిరీలో ఇమడక పోవచ్చు. ఉపఖండం గురించి అమెరికా అధికారులు తనకు వివరిస్తున్నప్పుడు బటన్, నిప్పిల్ అంటే ఏంటి (భూటాన్, నేపాల్ దేశాలు) అని ట్రంప్ ప్రశ్నించడం ఎవరూ ఇంకా మర్చిపోలేదు. చివరకు గత జూలైలో అమెరికాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో జరిపిన ప్రెస్ కాన్ఫరెన్సులో ట్రంప్ కశ్మీర్‌ని ‘నిత్యం బాంబులు కురుస్తున్న ఆ సుందరమైన స్థలం’ అంటూ వర్ణించడం కూడా మన దృష్టి పథాన్ని దాటిపోలేదు. ఇది మనకు ఏం చెబుతోంది అంటే.. భారత అత్యుత్తమ వ్యూహా త్మక, రాజకీయ ప్రయోజనాల రీత్యా చూస్తే కశ్మీర్‌పై బయటినుంచి వచ్చే ఏ వార్త కూడా మంచి వార్త కాదన్నట్లే.. కశ్మీర్లో తీవ్రవాదం ప్రారంభమైన తర్వాత గత 30 ఏళ్లలో 1991–94 మధ్య కాలంలో మాత్రమే కశ్మీర్ సమస్య ప్రపంచం దృష్టికి వచ్చింది. కశ్మీర్లో ఎవరూ క్షమించలేనటువంటి తీవ్రవాద వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించిన నాటి ప్రధాని పీవీ నరసింహారావు హయాంలోనే కశ్మీర్ సమస్య ప్రపంచానికి తెలియవచ్చింది. ప్రతి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థా అక్కడి అణచివేతను తొలిసారిగా పట్టించుకుంది. మొట్టమొదటిసారిగా క్లింటన్ పాలనా యంత్రాంగం భారత్‌పై మండిపడింది కూడా. కానీ పీవీ నరసింహారావు ఈ సమస్యను అధిగమించి కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ప్రత్యేకించి కశ్మీర్లో అంతర్జాతీయ మీడియా ప్రవేశించడానికి అవకాశం కల్పించి ప్రపంచ అభిప్రాయాన్ని కాస్త చల్లబరిచారు. కానీ మానవ హక్కుల సంస్థలకు ప్రవేశం కల్పించలేదు. దానికి ప్రతిగా తన సొంత జాతీయ మానవ హక్కుల కమిషన్ ను 1993లో నెలకొల్పారు. ఆనాటి నుంచి కశ్మీర్ సమస్యను తెరవెనక్కి నెట్టడం పైనే పీవీ కేంద్రీకరించేవారు. 1994లో అమెరికా కాంగ్రెస్‌లో చేసిన ప్రసంగంలో కూడా కశ్మీర్ విషయాన్ని ఎంతో చతురతతో ప్రస్తావించారు. అయితే దాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోకి టెక్సాస్ని కలిపేసుకున్న విధంగా చారిత్రక పోలికను తీసుకొచ్చారు. మరోవైపున వ్యూహాత్మకంగా కశ్మీర్‌ను స్థాయిని పీవీ తగ్గించివేశారు. అప్పట్లో నాకు ఇచ్చిన ఒక ఇంటర్వూ్యలో కశ్మీర్ భవిష్యత్తును మీరెలా చూస్తున్నారు అని నేను అడిగిన ప్రశ్నకు పీవీ సులువుగా తేల్చిపడేశారు. ‘భాయీ, వారు ఏదో ఒకటి చేస్తారు. మేము కూడా మరొకటి చేస్తాం. ఈ అటలోంచే దాని ఫలితం వస్తుంది’ అనేశారు. కశ్మీర్‌ను ఆయన ఆ స్థాయిలోనే చూశారు. సిమ్లా ఒప్పందం తర్వాత దశాబ్దాల పాటు ఏబీ వాజ్పేయితోసహా భారత ప్రధానులంతా కశ్మీర్ సమస్యను కుదించే వ్యూహాన్నే అవలంబించారు. కార్గిల్ వంటి దాదాపు యుద్ధం సంభవించిన స్థితిలో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదం గురించే మాట్లాడసాగాం. అంతే తప్ప కశ్మీర్‌ను ఒక సమస్యగా చూపించడానికి భారత్ అనుమతించలేదు. చాలాకాలం ఇది చక్కగా పనిచేసింది. 2001లో అమెరికాపై దాడులు జరిగాక పాకిస్తాన్ ని పెంచి పోషించడానికి అమెరికా పూనుకున్నప్పుడు కూడా పాక్ సైన్యం కశ్మీర్ గురించి పెద్దగా మాట్లాడింది లేదు. ఎందుకంటే కశ్మీర్ పరిస్థితిని ఇంకా దిగజార్చాలని అమెరికా భావించలేదు. అదే సమయంలో భారత్ ఈ నూతన పరిస్థితిని చాలావరకు తనకు అనుకూలంగా ఉపయోగించుకుంది. ఈ నేపథ్యంలో మూడు పరిణామాలు ఆవిర్భవించాయి. మొదటిది, భారత్–పాక్‌లు వ్యూహాత్మక సమతుల్య స్థితికి చేరుకున్నాయనీ, సమస్యలు ఏవైనా ఉంటే అవి ఎత్తుడల స్థాయిలోనే ఉంటున్నాయని ప్రపంచం విశ్వసించసాగింది. రెండు, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థతో పాక్, వికాసదశలో సాగుతున్న భారత్ యధాతథస్థితిలోనే తమకు కొత్త ప్రయోజనాలు ఉన్నట్లు గ్రహించాయి. మూడు, రెండు దేశాల కొత్త తరాలు ఆధీనరేఖే తమ సరిహద్దుగా ఆమోదించే స్థాయికి ఎదుగుతూ వచ్చాయి. ప్రస్తుతం మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశం ప్రణాళికా రహితంగానే ఫలప్రదమయ్యే తన పూర్వ ప్రధానుల వైఖరినుంచి పక్కకు తప్పుకుని యధాతథ స్థితిని విచ్ఛిన్నపర్చే స్థాయికి చేరుకుంది. అయితే అలా పాత స్థితిని బ్రేక్ చేసిన మొదటి ప్రభుత్వం మోదీది కాదు. కశ్మీర్ సమస్య తన ప్రాధాన్యతను కోల్పోతోందని నిసృ్పహకు గురైన పాక్ తొలుత 2008లో, తర్వాత పఠాన్ కోఠ్లో, పులవామాలో యధాతథస్థితిని బద్దలు చేయడానికి ప్రయత్నించింది. ఈ దాడులకు పాల్పడింది స్థానికులే అని ఆరోపిస్తే సరిపోతుంది. కశ్మీర్లో యుద్ధవాతావరణాన్ని సృష్టించడం, అణు ప్రమాదాన్ని రేకెత్తించడం, దీంతో ప్రపంచం భీతిల్లగానే ప్రధాన సమస్యవైపు దాని దృష్టిని మళ్లించడం అనేది ఇప్పుడు పాక్ వైఖరిగా మారింది. ఒకవేళ పాక్ వ్యూహం పని చేయకపోతే, అది మరింత అసహనానికి లోనై మళ్లీ అదే పని చేస్తుందేమో తెలీదు. ప్రస్తుతానికి పాక్ వ్యూహం పనిచేయనందునే, రెండోసారి మెజారిటీ సాధించిన మోదీ నాయకత్వంలోని భారతదేశం యథాతథ స్థితిని నిర్ణయాత్మకంగా మార్చే ప్రయత్నం చేసిందని మనం అర్థం చేసుకుంటాం. పాక్ ఇప్పుడు కూడా యుద్ధ బెదిరింపులకు దిగింది. ప్రస్తుతం దాన్ని కూడా వదిలేసింది. తన సైనిక పరిమితులను అది గ్రహించింది. దానికి ప్రపంచంలో ఎవరూ ఆశ్చర్యపోలేదు కూడా. న్యూయార్క్‌లో ఇమ్రాన్ ఖాన్ విలేకరుల సమావేశంలో భారత్‌పై దాడి చేయలేనప్పుడు మనం ఇంకేం చేయగలమని ఆయన అడిగిన తీరును చూపిస్తున్న వీడియో క్లిప్‌ను దయచేసి పరిశీలించండి. ఇప్పటి వరకు బానేవుంది. ఇప్పుడే సమస్యలు మొదలవుతాయి. ఒప్పకున్నా, ఒప్పకోకపోయినా అర్థశతాబ్దం తర్వాత ఇప్పుడు కశ్మీర్ సమస్య అంతర్జాతీయం అయ్యింది. ఇప్పుడు పాక్ కాదు, భారత్ పరిస్థితిని తన చేతిలోకి తీసుకోవాల్సి ఉంది. చైనా, టర్కీ తప్ప ఏ దేశమూ ఆగస్టు 5 తరువాత జరిగిన మార్పులు తన అంతర్గత అంశాలని చెబుతున్న భారత్ వైఖరిని ప్రశ్నించలేకపోవడం, అలాగే, ఆగస్టు 5కు ముందునాటి స్థితి కల్పించాలని డిమాండ్ చేయలేకపోవడం మనకు అనుకూలమే. అమెరికాతో సహా చాలా దేశాలు కశ్మీర్లో జరుగబోయే తదనంతర పరిణామాలపై ఆసక్తితో ఉన్నాయి. ఊచకోత సాగుతోందన్న ఇమ్రాన్ మాటలను ఎవరూ నమ్మడం లేదు. అలాగని, శ్రీనగర్‌లో సాధారణ స్థితిని చూపుతున్న డ్రోన్ చిత్రాలపట్ల కూడా సంతృప్తిగా లేరు. కశ్మీర్లో అమానుషమైన నిర్బంధం కొనసాగుతోంది. వేలాదిమందిని ఎలాంటి ఆరోపణలు, విచారణ లేకుండా నిర్బంధించడంపట్ల ఆయా దేశాలు త్వరలోనే సహనాన్ని వీడొచ్చు. ఐక్యరాజ్య సమితి సమావేశాలు ముగిసినట్టే. పాకిస్తాన్ ను ఏకాకిని చేసి మనం సాధించిన దౌత్య విజయంపై సంబరాలు చేసుకోవచ్చు. మోదీ న్యూయార్క్ నుంచి ప్రతికూల అంశాల కంటే ఎక్కువగా అనుకూల అంశాలతోనే, తిరిగి వస్తున్నారు. కశ్మీర్ మా అంతర్గత అంశం అన్న భారత్ పాతపాటను ఎవరూ సవాల్ చేయలేదు. మోదీతో వైట్ హౌస్‌లో జరిపిన సమావేశంలో సైతం కశ్మీర్లో సాధారణ స్థితిని నెలకొల్పాలనీ, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే ట్రంప్ కోరారు. అంతేగానీ, అగస్టు 5కు ముందునాటి స్థితిని పునరుద్ధరించమని కోరలేదు. అయితే, ఇదే స్థితిని భారత్ భవి ష్యత్‌లో కూడా కొనసాగిస్తే బాధితులమంటూ పాకిస్తాన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించే అవకాశం కశ్మీర్ ఇస్తుంది. న్యూయార్క్‌లో ఏడాది కోసారి తూతూమంత్రంగా సాగే భారత్, పాక్ సమావేశాల్లో కశ్మీర్ భారత అంతర్గత అంశంగా నిలబెట్టుకోవడం దౌత్య విజయం అనుకుంటే, కశ్మీర్ భవిష్యత్, భారత్ చెప్పుకునే జాతిహితం కూడా అందులో ఇమిడి ఉంటాయి. కశ్మీర్లో సమాచార నిషేధం విధించి మరో వారంలో రెండు నెలలు పూర్తవుతాయి. కాలం గడుస్తున్న కొద్దీ కశ్మీర్‌ల్లో ఆగ్రహం పెల్లుబికుతుంది. తగిన సమయంలో దాన్ని అదుపు చేయడం సవాల్‌గా మారుతుంది. సమయం దాటేకొద్దీ హింస, రక్తపాతం చోటుచేసుకునే ప్రమాదం ఉంది. అప్పుడు పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉంది. కశ్మీర్ పట్ల ప్రపంచం వ్యతిరేకంగా స్పందించడం లేదు. కానీ, ఇప్పుడది సున్నిత సమస్యగా మారింది. ఆ విధంగా కశ్మీర్ అంశం అంతర్జాతీయం అయ్యింది. ఆగస్టు 5 నిర్బంధం తర్వాత పరిస్థితిని ఏంటని ఆలోచించడమే కొత్త యధాతథస్థితిగా ఉంటుంది. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
‘ఆర్థికం’తోనే అసలు తంటా!
అణ్వాయుధాలను ఒక దేశ శక్తి సంపన్నతకు కొలమానాలుగా భావించిన కాలం అంతరించింది. ఆర్థిక సుస్థిరతే ప్రపంచస్థాయిలో దేశాల పలుకుబడికి సంకేతంగా మారిన కాలం ఆవిర్భవించింది. ఈ కోణంలో చూస్తే భారత్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సరికొత్త వ్యూహాత్మక ప్రమాదానికి ఆధీనరేఖ వద్ద పాక్ సైనిక బలగాల మోహరింపు, దాని క్షిపణి ప్రయోగాల బూచి, భారత్ భూభాగంపై చైనీయుల ఆక్రమణ కారణాలు కానేకావు. గత పాతికేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా అడుగంటిపోతున్న మన ఆర్థిక వ్యవస్థ అస్థిరతే అసలు ప్రమాద హేతువుగా మారుతోంది. సరిహద్దుల అవతల నుంచి కాకుండా దేశంలోపల పెరుగుతున్న ఈ ప్రమాదం అంతర్జాతీయంగా మన స్థాయిని దెబ్బతీయబోతోంది. పాలకులు తగు గుణపాఠాలు తీసుకోకపోతే మనపట్ల ప్రపంచ సదభిప్రాయం కరిగిపోయే అవకాశం తప్పదు. భారతదేశం ప్రస్తుతం ఒక సరికొత్త వ్యూహాత్మక ప్రమాదాన్ని ఎదుర్కొం టోంది. ఇది భారత్–పాక్ దేశాల మధ్య ఆధీనరేఖ వద్దకు పాకిస్తాన్ మరొక సైనిక బ్రిగేడ్ తరలించడం కాదు. నాటకీయ ఫక్కీలో అది మరొక క్షిపణి ప్రయోగం చేయడం కాదు. భారత భూభాగంలో చైనీ యులు సరికొత్త ఆక్రమణ చేపట్టడం అంతకంటే కాదు. ఈ మూడు అంశాలు వ్యూహాత్మక ప్రమాదానికి కారణాలు కావు. మన సాంప్రదాయిక శత్రువుల నుంచి ఈ ప్రమాదం కలగలేదు. ఇది దేశం లోపలనుంచే పుట్టుకొస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా గుడ్‌విల్ కలిగిన, ముంబైపై ఉగ్రవాద దాడుల తర్వాత ‘ఎదుగుతున్న మంచబ్బాయి’లా పేరు పొందుతున్న మన అతి గొప్ప సంపదను ఈ సరికొత్త ప్రమాదం ధ్వంసం చేయనుంది. అదేమిటో కాదు అడుగంటిపోతున్న మన ఆర్థిక శక్తి. దేశ సుస్థిరతకంటే, ప్రజాస్వామ్యం కంటే భారత్‌ను సమున్నతంగా నిలుపుతూ వచ్చిన ఆర్థిక సంపన్నత క్షీణతే మనం ఎదుర్కొనబోతున్న సరికొత్త వ్యూహాత్మక ప్రమాదం. సులభంగా అర్థం చేసుకోవడానికి ఇలా చూద్దాం. మీ ఆర్థిక వ్యవస్థ 8 శాతం లేక ఆపై స్థాయిలో పెరుగుతున్నప్పుడు, ఏడు హత్యలు చేసి కూడా మీరు తప్పించుకోవచ్చు. అదే 7 శాతం వృద్ది జరుగుతున్నప్పుడు 5 హత్యలు చేసి కూడా మీరు తప్పించుకోవచ్చు. కానీ మీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయినప్పుడు మీరు ప్రమాదకరమైన జోన్లో ఉన్నట్లే లెక్క. ఆర్థిక సంస్కరణలు 1991 వేసవిలో ప్రారంభమైనది మొదలు గత పాతికేళ్లుగా పాశ్చాత్యదేశాలు, తూర్పు, మధ్యప్రాచ్యం తేడా లేకుండా యావత్ ప్రపంచానికీ ప్రీతిపాత్రమైన దేశంగా భారత్ ఎదుగుతూ వచ్చింది. ప్రపంచంలోని పలుదేశాలు అనేక కారణాలతో సంఘర్షించుకుంటున్న తరుణంలో భారత్ తన విశిష్టమైన సామాజిక–రాజకీయ లక్షణాలతో వైవిధ్యపూరితమైన సంస్కృతితో, ప్రజాస్వామిక, వ్యూహాత్మక దన్నుతో ప్రపంచంలో తనదైన గుర్తింపును పెంచుకుంటూ వచ్చింది. కార్గిల్ యుద్ధం, పార్లమెంట్‌పై దాడి, ముంబైపై ఉగ్రవాద దాడి సందర్భంగా ప్రపంచ దేశాలనుంచి భారత్ పొందిన మద్దతులో ఈ గుర్తింపును చూడవచ్చు. వీటన్నింటికంటే భారత్‌కున్న అతి పెద్ద శక్తి ఆర్థికమే. యావత్ ప్రపంచం ఒక మోస్తరు వేగంతో పెరుగుతున్నప్పుడు, భారత్ అతివేగంగా ఎదుగుతున్న రెండో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతూ వచ్చింది. పెరుగుతున్న సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మక ఆవిష్కరణలు, విదేశీ పెట్టుబడుల పట్ల సానుకూలత, సుస్థిర మార్కెట్లు, సరళమైన పన్నుల వ్యవస్థ కారణంగా అది.. ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇక 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి సులువుగా బయటపడిన భారతపై యావత్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపించింది. ఈ కాలం పొడవునా సంక్షుభిత ప్రపంచంలో ఒక స్నేహపూర్వకమైన, సుస్ధిరమైన ఉపఖండంలాగా భారత్ ఎదుగుతూ వచ్చింది. అంతర్జాతీయ పోర్ట్‌ఫోలియోలు, ప్రత్యక్ష మదుపులను అది అయస్కాంతంలా ఆకర్షించింది. భారత ఆర్థిక వ్యవస్థ సుస్ధిరత, భద్రతను చూసి చైనాతో సహా బడా ఆర్థిక శక్తులు, వాటి కార్పొరేషన్లు దేశంలో పెట్టుబడులు పెట్టడానికి పోటీ పడ్డాయి. భారత్ తన సైన్యంపై పెట్టే వ్యయం స్తంభించిపోయినప్పుడు, దాని ఆధునికీకరణ దశ తప్పినప్పుడు, ఆసక్తి కలిగించే దాని ఆర్థికవ్యవస్థే భారత్‌ని అతి గొప్ప వ్యూహాత్మక శక్తిగా మార్చింది. భారీ స్థాయి అణ్వాయుధాల కంటే పెరుగుతున్న జీడీపీనే ఇప్పుడు అత్యంత శక్తివంతమైనదిగా లెక్కిస్తున్నారు. ఏ ఇతర ఆర్థిక వ్యవస్థలోనూ లేనివిధంగా అసంఖ్యాక దిగుమతులను చేసుకునే భారత్ సామర్థ్యంపై చైనా ఆధారపడుతోందంటే అది భారత్‌కు వ్యూహాత్మక సంపదగా మారినట్లే. ప్రత్యేకించి కార్గిల్ యుద్ధం, పార్లమెంటుపై దాడి, ముంబైపై ఉగ్రవాదదాడి వంటి సందర్భాల్లో భారత్–పాక్ మధ్య యుద్ధ సంక్షోభం నెలకొన్నప్పుడు చైనా స్పందనలను గమనించండి. 2009లో దలైలామా తవాంగ్ సందర్శన సమయంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని బలహీన ప్రభుత్వం సైతం చైనాకు ఎదురొడ్డగలగడమే కాకుండా దాని అసంతృప్తిని సునాయాసంగా చల్చార్చింది కూడా. ఇక మోదీ తొలి దఫా పాలనకేసి చూస్తే, ఆర్థిక వృద్ధి కొనసాగడమే కాకుండా 2012–14 నాటి స్తబ్దతను అధిగమించింది. ఇది భారత్‌కు, మోదీకి కూడా ఉపకరించింది. ప్రపంచ నేతల్లో మోదీ ప్రతిష్ట, పలుకుబడి గొప్పగా పెరుగుతూ వచ్చింది. కానీ తన ఈ ప్రతిష్టను పెద్దనోట్ల రద్దు ద్వారా మోదీ స్వయంగా దెబ్బతీసుకున్నారు. నాటినుంచే మన ఆర్థికవృద్ధి పతనమవుతూ వచ్చింది. మోదీ హయాలో ఆర్థిక వ్యవస్థ గత నాలుగు త్రైమాసికాల్లోనే భారీ పతనం చవిచూసింది. ఈరోజు అది కోలుకునే ఆశలు కనిపిం చడం లేదు. ఇదే భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపును దెబ్బతీస్తోంది. ఆర్టికల్ 370 రద్దుపై వస్తున్న అనేక స్పందనల్లో ఇది ప్రతి బింబిస్తోంది. 1971 నాటి యుద్ధం ప్రారంభం నాటి నుంచి భారత్ ఏ రూపంలోనైనా సరే పాక్‌కు వ్యతిరేకంగా చేపట్టిన రెచ్చగొట్టే చర్యల్లో ఇదే అతిపెద్దది. నిజానికి ఇది కశ్మీర్‌కు సంబంధించి పెద్ద మూలమలుపు. అయితే మన ఆర్థిక వ్యవస్థ వ్యూహాత్మక క్షీణతకు తొలి సూచన ఆర్టికల్ 370 రద్దుకు ముందే ట్రంప్ చేసిన ప్రకటనలో వ్యక్తమైంది. ఇమ్రాన్ సమక్షంలో.. భారత్–పాక్ సమస్య పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ట్రంప్ య«థాలాప ప్రకటన చేశారు. ఒక విషయం మాత్రం నిజం. గతంలో భారత ఆర్థిక వ్యవస్థ దూసుకెళుతున్నపుడు ట్రంప్ ఇలాంటి చొరవ చేసి ఉండటం సాధ్యపడి ఉండేది కాదు. అమెరికన్ కంపెనీలు అమెరికాలో కాకుండా భారత్‌లో పెట్టుబడులు, పరి శ్రమలు పెట్టి లాభాలు దండుకుంటున్నాయన్నది ట్రంప్ తొలినుంచే చేస్తూ వస్తున్న ఆరోపణ. భారత్‌లో అమెరికన్ దిగుమతులపై అధిక పన్నులు విధిస్తున్నారనీ ట్రంప్ ఆరోపించేవారు. అలాంటిది.. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ చెప్పడం ఆషామాషీ ప్రకటనగా భావించలేం. చివరకు బలహీనమైన బ్రిటన్ టోరీ ప్రభుత్వం కూడా కశ్మీర్‌పై భారత్ వ్యవహారంపై విమర్శలు చేస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత వ్యతిరేక ధోరణిని కూడా ప్రదర్శించింది. భారత ఆర్థిక వ్యవస్థ వికసిస్తున్నప్పుడు 2002–13 కాలంలో ఆరుగురు బ్రిటన్ ప్రధానులు భారత్‌ను సందర్శించారని మర్చిపోరాదు. భారతీయ కంపెనీ టాటా.. జాగ్వార్ లాండ్ రోవర్ అండ్ కోరస్ కంపెనీని 14.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి బ్రిటన్‌లో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే అతిపెద్ద కంపెనీగా అవతరించిన కాలంలో బ్రిటన్ రాజకీయనేతలు పార్టీలకతీతంగా భారత్ పట్ల సానుకూల దృష్టిని ప్రదర్శించేవారు. ఈ రోజు కశ్మీర్లో పరిస్థితి ఘోరంగా కనబడుతుండవచ్చు కానీ ఇంతకంటే ఘోరంగా మారిన పరిస్థితులను మనం గతంలోనే చూశాం. గూగుల్ ప్రపంచాన్ని ఆవరించకముందు నెలకొన్న మన గతాన్ని మర్చిపోవడానికి మనం అలవాటు పడ్డాం. 1991–94 కాలంలో కశ్మీర్లో ప్రజాగ్రహం, రాజ్య నిర్బంధం, అణచివేత, హింస అంత్యంత ఘోరమైన స్థితికి చేరుకుంది. చిత్రహింసల కేంద్రాలు పెరుగుతూపోయాయి. విదేశీ జర్నలిస్టులను నిషేధించారు. ఎన్ కౌంటర్ హత్యలు సాధారణ విషయం అయిపోయాయి. ప్రతిరోజూ కశ్మీర్లో హత్యలు జరుగుతుండటంతో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది కూడా. దీనికి అంతర్జాతీయ ప్రతిస్పందన కూడా తోడైంది. ప్రపంచ స్థాయిలో భారత్ స్నేహితులు దూరమైన స్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. మన ఏకైక మిత్రదేశం సోవియట్ యూనియన్ ప్రపంచ చిత్రపటంలోంచి అదృశ్యమైంది. మానవ హక్కుల సంస్థలు, స్వచ్చంద సంస్థలచే ప్రభావితమైన బిల్ క్లింటన్ ప్రభుత్వ యంత్రాంగం భారత్‌ను నిరంతరం లక్ష్యంగా చేసుకునేది. ప్రపంచంలో ఏ మిత్ర దేశం తనను ఆదుకునే పరిస్థితి లేని ఆ కాలంలో పీవీ నరసింహారావు స్వదేశంలో కాస్త నిర్దాక్షిణ్యంగానే వ్యవహరించేవారు. తన తొలి దశపాలనలో బిల్ క్లింటన్ ప్రభుత్వ యంత్రాంగం కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసుకున్న ప్రక్రియనే ప్రశ్నించిన దశను, ఉపఖండం మ్యాప్‌ను ఇక ఎంతమాత్రం రక్తతర్పణతో మార్చలేమని తన రెండో దఫా పాలనలో బిల్ క్లింటన్ చేసిన ప్రకటనను పోల్చి చూడండి. 1990లలో కూడా వేగంగా పెరుగుతూ వచ్చిన ఆర్థిక వ్యవస్థే నిర్ణయాత్మకమైన వ్యూహాత్మక సంపదగా ఉండేది. 2019లో క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా భారతీయ పాలనాయంత్రాంగం జవాబుదారీతనం సమస్యను ఎదుర్కొంటూండటాన్ని మనం తప్పక ఆలోచించాల్సిందే. వ్యాసకర్త: శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఆధునికీకరణే అసలైన రక్షణ
అతిశక్తిమంతుడైన ప్రధాని నరేంద్రమోదీ ఈ సారి రక్షణ రంగ కేటాయింపుల్లో నాటకీయ చర్యకు పూనుకుంటారని మన వ్యూహాత్మక నిపుణులు పెట్టుకున్న అంచనాలు ఘోరంగా తప్పాయి. మోదీ మిలటరీ దుస్తుల్లో ఫోజు ఇచ్చినంత మాత్రాన దేశాన్ని పాకిస్తాన్ లాగా దివాలా తీయించి ఐఎమ్ఎఫ్ వద్దకు పరుగుతీసేలా భారత్‌ను మార్చే తరహా యుద్ధవాది కాలేరు. జీడీపీ వృద్ధికి అనుగుణంగానే రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్నది విస్మరించకూడదు. గత యుద్ధాల్లో మాదిరిగా పాక్‌ని కఠినంగా శిక్షిద్దాం అనే తరహా దూకుడు ఆలోచనలు కట్టిపెట్టి రక్షణ రంగానికి కేటాయించిన తక్కువ మొత్తాన్ని మెరుగ్గా, ఉత్తమంగా ఎలా ఖర్చుపెట్టాలన్న అంశంపై ఆలోచించాలి. ఆధునికీకరణ, సంఖ్యాత్మకంగా కాకుండా గుణాత్మకంగా సైనికబలగాలను మెరుగైన శక్తిగా మలచడం ఇప్పటి అవసరం. ఈ వారం ప్రధానంగా మూడు విషయాలు మనలో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ఈ సారి కూడా రక్షణరంగానికి బడ్జెట్లో పెద్దగా అదనపు కేటాయింపులు లేకపోవడం పట్ల మన వ్యూహాత్మక నిపుణుల బృందం పెదవి విరుస్తోంది. రెండు. ప్రముఖ అమెరికన్ వ్యూహాత్మక అంశాల నిపుణుడు క్రిస్టీన్ ఫెయిర్ ది ప్రింట్ మేగజైన్‌కు చెందిన సృజన్ శుక్లాకు ఇచ్చిన ఇంటర్వూ్యలో చేసిన ప్రకటన. దాని ప్రకారం లష్కరే తోయిబా భారత్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలలో ఒకటిగా మాత్రమే ఉండటం లేదు. అది పాకిస్తాన్ సైన్యానికి చెందిన తక్కువ వ్యయంతో ప్రత్యేక సైనిక చర్యలు కొనసాగించే యూనిట్. ఇది భారత్ ఏమాత్రం తూగలేని అత్యంత అసమాన యుద్ధతంత్రాన్ని నడుపుతోంది. ఇలాంటి స్వల్ప స్థాయి యుద్ధతంత్రంలో పాకిస్తాన్‌ని భారత్ అసలు ఓడించలేదు. మూడో అంశం. దివంగత ఎయిర్ కమోడోర్ జస్జిత్ సింగ్ రచించిన ఒక పుస్తకం కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం భారతీయ వాయుసేన తన వద్ద ఉన్న పాత ఫ్రెంచ్ మిరేజ్ విమానాలను పరీక్షించడానికి ఇజ్రాయిల్ ఇంజనీర్లకు అనుమతించింది. వీరు అధునాతన రష్యన్ ఆర్–73 ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను మోసుకెళ్లేలా మన పాత మిరేజ్ యుద్ధవిమానాలను ఆధునికీకరిస్తారు. అయితే వారి ఒరిజనల్ క్షిపణి, మాత్రా–530డి ఉపయోగానికి పనికిరాకుండా పోయిన తరుణంలో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. భారతీయ వాయుసేనకు సొంతమైన ఫ్రెంచ్ మిరేజ్లకు రష్యన్ క్షిపణులను ఇజ్రాయెల్ నిపుణులు అమర్చడం అనే అంశం రాజ్‌కపూర్ కళాఖండం శ్రీ 420 సినిమాలో పాటల రచయిత శైలేంద్ర రాసిన అద్భుతమైన పంక్తులను మరోసారి గుర్తుకు తెస్తోంది. మేరా జూతా హై జపానీ అనే ఆ పాట పల్లవికి అర్థం ఏమిటంటే.. ‘‘నా చెప్పులు జపాన్వి, ట్రౌజర్లు బ్రిటిష్ తయారీ, నా టోపీ రష్యాది కావచ్చు, కానీ నా హృదయం మాత్రం ఇప్పటికీ భారతీయతతో కూడినది’’. ఈ పంక్తులు 1955లో ఒక కొత్త రిపబ్లిక్కు ఉత్తేజం కలిగించేవే మరి. అయితే 65 సంవత్సరాల తర్వాత కూడా మన సాయుధ బలగాల పరిస్థితిని వర్ణించడానికి ఇప్పటికీ ఈ పాటే పాడుకోవలసిందేనా? మొదటగా బడ్జెట్ వర్సెస్ జీడీపీ సమస్యను పరిశీలిద్దాం. ఈ సంవత్సరం రక్షణ రంగ బడ్జెట్‌ని పెన్షన్లతో కలిపి రూ. 4.31 లక్షల కోట్లుగా అంచనా వేశారు. అంటే ఇది స్థూల దేశీయోత్పత్తిలో సరిగ్గా 2 శాతానికి సమానం. దీంట్లో సైనికుల పెన్షన్లను మినహాయిస్తే, రక్షణ బడ్జెట్ రూ. 3.18లక్షల కోట్లు లేదా మన జీడీపీలో 1.5 శాతం మాత్రమే. ఇప్పుడు రెండు ముఖ్య ప్రశ్నలు తలెత్తుతాయి. రక్షణకు ఇంత తక్కువ మొత్తం కేటాయింపుతో భారత్ తన్ను తాను కాపాడుకోగలదా? ఇంతకు మించి అధికంగా రక్షణ రంగానికి కేటాయించడానికి భారత్‌కు శక్తిలేదా? తక్షణ స్పందన ఏమిటంటే ఒకటో ప్రశ్నకు లేదు అనీ, రెండో ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తుంది. కొద్ది కాలం క్రితం వరకు నేను కూడా ఇలాగే భావించేవాడిని. కాని నా అభిప్రాయం తప్పు అనిపిస్తోంది. వ్యూహాత్మక అంశాలపై చర్చలో, జీడీపీకి, జాతీయ బడ్జెట్‌కు మధ్య వ్యత్యాసాన్ని ఎన్నడూ చర్చించరు. బడ్జెట్ మాత్రమే ప్రభుత్వానికి చెంది నదని, జీడీపీ ప్రభుత్వానిది కాదనిపించేలా చర్చలు సాగేవి. అందుకే జాతీయ బడ్జెట్లో కేటాయించే శాతానికి అనుగుణంగానే రక్షణ వ్యయాన్ని పరిశీలించేవారు. ఈరోజు రుణ చెల్లింపులకు కేటాయించే 23 శాతం తర్పాత, బడ్జెట్లో అతిపెద్ద భాగానికి 15.5 శాతం వెచ్చిస్తున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాలు మొత్తంపై పెట్టే వ్యయం (15.1శాతం) కంటే ఇది ఎక్కువ. జీడీపీలో మరొక అర్థ శాతం మొత్తాన్ని లేక మొత్తం బడ్జెట్లో 3.5 శాతం మొత్తాన్ని పారామిలిటరీ బలగాలపై వెచ్చిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏ ఆర్థిక మంత్రి అయినా ఇంతకు మించి రక్షణ రంగానికి నిధులను మళ్లించగలరా? మా డేటా జర్నలిస్టు అభిషేక్ మిశ్రా 1986 నుంచి రక్షణ రంగ బడ్జెట్ ధోరణులను నాకు తెలియపర్చారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ భారీగా సైనిక విస్తరణ చేపట్టిన సంవత్సరాల్లో మాత్రమే మన రక్షణ బడ్జెట్ జీడీపీలో అత్యధికంగా 4 శాతానికి పెరిగింది. కాకతాళీయంగా ఫ్రెంచ్ మిరేజ్ యుద్ధవిమానాలు మనకు అందడం అప్పుడే మొదలయ్యాయి. అప్పటినుంచి బడ్జెట్లు జీడీపీలో సగటున 2.82 శాతం మేరకు నిలకడగా, స్థిరంగా పెరుగుతూ వచ్చాయి. 1991 ఆర్థిక సంస్కరణలతో జీడీపీ వృద్ధి కూడా ముందంజ వేసింది. గత 20 ఏళ్లలో అంటే కార్గిల్ యుద్దం నాటి నుంచి, బడ్జెట్ పెంపు సంవత్సరానికి సగటున 8.91శాతంగా నమోదవుతోంది. ఇప్పుడు మీరు గావుకేకలు వేయవచ్చు, నిందించవచ్చు కానీ నాటి నుంచి ఏ ప్రభుత్వం కూడా డబ్బును మరింతగా ముద్రించడం ద్వారా లేక పేదలకు అందిస్తున్న సబ్సిడీలలో (ఇవి బడ్జెట్లో 6.6 శాతం) లేక వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాలపై పెడుతున్న వ్యయంపై కోత విధించడం ద్వారా రక్షణరంగానికి చేస్తున్న వ్యయాన్ని బాధ్యతారహితంగా లేక రాజకీయ మూర్ఖత్వంతో పెంచిన పాపాన పోలేదు. కానీ అత్యంత శక్తిమంతుడైన ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ దఫా ఏదైనా నాటకీయ చర్యకు నడుం కడుతారని పెట్టుకున్న అంచనాలు తప్పాయి. మోదీ ఎవరి తరపునో మూర్ఖుడిగా తన్ను తాను ముద్రించుకునే తరహా వ్యక్తి కాదు. అలాగని ఎవరినీ లెక్కచేయని యుద్ధవాది అసలే కాదు. మిలటరీ దుస్తుల్లో వ్యూహాత్మక భంగిమ పెట్టినంతమాత్రాన మోదీ పాకిస్తాన్ లాగా దివాలా తీసి, అడుక్కోవడానికి ఐఎమ్ఎఫ్ వద్దకు పరుగుతీసేటటువంటి, జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిచ్చే దేశంగా మాత్రం భారత్‌ను మార్చలేరు. అందుచేత భారతీయ వ్యూహాత్మక చర్చాక్రమం నేటి నూతన వాస్తవికతా స్థాయికి తగినట్లుగా తన వైఖరిని మార్చుకోవలసి ఉంది. ఏది మనకు తగినది అనే దానిగురించే ఆలోచించాలి. వృద్ధి అనేది జీడీపీకి అనుగుణంగానే పెరుగుతుంది. కాబట్టి 2024లో మన జీడీపీ 5 ట్రిలి యన్ డాలర్లకు చేరుకున్నట్లయితే, మన రక్షణ రంగ వ్యయం కూడా 2 శాతంకి మాత్రమే పెరుగుతుంది. కాబట్టి ఈ 2 శాతం మొత్తంతో ఎలాంటి రక్షణను, ఏ రకమైన రక్షణను కొనుగోలు చేయగలం అనే అంశం గురించే ఇప్పుడు మనం చర్చించాల్సి ఉంది. ప్రస్తుత సైనికబలగాల స్థాయిని చూస్తే భారతదేశం దీర్ఘకాలిక యుద్ధంలో (అంటే రెండు వారాలకు మించి సాగే యుద్ధం) పాకిస్తాన్‌తో పోలిస్తే చాలా బలంగా ఉంటున్నట్లు కనిపించవచ్చు. కానీ ఈరోజు ఇది సరిపోదు. పాక్‌తో గతంలో మనం చేసిన రెండు యుద్ధాలు కేవలం 22 రోజులు (1965లో), 13 రోజుల (1971) లోపే ముగిసిపోయాయి. కానీ ఇంత స్వల్పకాలిక యుద్ధతంత్రంలో నేడు పాకిస్తాన్‌ను భారత్ ఓడించలేదని క్రిస్టీన్ ఫెయిర్ సరిగ్గానే చెప్పారు. కాబట్టి మనం వేయాల్సిన ప్రశ్న మరింత సంక్లిష్టమైనది. పుల్వామా వంటి ఘటనల ద్వారా నయవంచనకు దిగుతున్న పాకిస్తాన్‌ను కఠినంగా శిక్షించడానికి భారత్ కీలక ప్రాంతాల్లో ఆధిక్యతను ఇప్పుడు చలాయించగలదా? అందులోనూ భారతీయ సైనికుల ప్రాణాలకు తక్కువ నష్టం వాటిల్లేలా (బాలాకోట్లోలాగా కాకుండా) సమర్థ యుద్ధతంత్రాన్ని భారత్ సాగించగలదా? ఈ దశలో, మన సైనిక బలగాలు కానీ, వైమానిక బలగాలు కానీ, పాకిస్తాన్‌ని కఠినంగా శిక్షించేటంతటి శక్తిని కలిగిలేవు. మూడువారాల యుద్ధాన్ని మర్చిపోండి, కానీ సరిహద్దుల్లో ఆధీనరేఖ వద్ద సైతం పాకిస్తాన్ మనకంటే మెరుగైన ఆయుధాలను, సుశిక్షుతులైన సైనికులను, స్నైఫర్ రైఫిల్స్‌ని, దానికి తగిన మందుగుండు సామగ్రిని మోహరించి ఉంచింది. ప్రత్యేకించి యూపీఏ పదేళ్ల పాలనలో గుణాత్మకంగా పెరిగిన మన వైమానికి శక్తి స్థాయి ఏమిటో ఫిబ్రవరి 26–27 తేదీల్లో జరిగిన పరిణామాలు తేటతెల్లం చేసి మనకు ఆనందం కలిగించాయి. అయితే పాకిస్తాన్‌పై సంపూర్ణ ఆధిక్యత మన నావికా బలగానికే ఉంది. కానీ పాక్‌ని శిక్షించడానికి నావికా బలగాన్ని ఉపయోగించడం అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. పైగా మనం సాగించే జలయుద్ధం వల్ల తక్కిన ప్రపంచానికి రవాణా పరంగా తీవ్ర ఇబ్బందులు కలగవచ్చు. పైగా రూ. 4.31 లక్షల కోట్ల రక్షణ రంగ బడ్జెట్లో అధికభాగం పెన్షన్లకు (రూ. 1.12 లక్షల కోట్లు) పోగా త్రివిధ దళాల వేతనాలకు రూ. 1.08,468 లక్షల కోట్లు ఖర్చవుతోంది. ఇక ఫిక్సెడ్ ఖర్చులు, నిర్వహణ, వినియోగ వ్యయాలకు మరొక లక్ష కోట్లు ఖర్చవుతోంది. ఇక మిగిలిన కొన్ని వందల కోట్ల డబ్బుతో రక్షణ రంగంలో కొనుగోళ్లకు ఎంత ఖర్చు పెట్టగలరు? అందుకే మన సాయుధ బలగాలు ఆధునీకరణ మంత్రం జపిస్తూ ప్రాధేయపడుతున్నాయి. ఇక్కడ సైనిక స్థావరం కావాలి, ఇక్కడ క్షిపణి కేంద్రం ఏర్పర్చాలి. ఇక్కడ రాడార్ నెలకొల్పాలి. ఇవన్నీ అత్యవసరాలే. అయితే ఈ అన్ని యంత్రాల కంటే మనిషి అంటే సైనికులు చాలా ముఖ్యమైనవారు. అగ్రరాజ్యంగా ఎదగాలనుకుంటున్న దేశం మరింత సమర్థవంతంగా ఉండాలి. ఎక్కువ డబ్బును అది వెచ్చించలేకపోతే, కనీసం ఉత్తమంగా అయినా ఖర్చుపెట్టాలి. మీ ఖర్చు మొత్తం వేతనాలు, పెన్షన్లకే ముగిసిపోరాదు. మీ సైనికులకు మరిన్ని ఆయుధాలు కావాలి. కానీ ప్రస్తుత తరుణంలో ఇన్ని లక్షల మంది సైనికులను మనం భరించగలమా? మన బలగాలను సంఖ్యాత్మకంగా కాకుండా గుణాత్మకంగా మెరుగైన శక్తిగా మలచాల్సిన అవసరం ఉంది. భారత్‌కి ఇప్పుడు సూత్రబద్ధమైన మార్పు కావాలి. అంతేతప్ప మన వ్యూహాత్మక బృందాలు గత యుద్ధాలను మళ్లీ చేయాలనే తత్వానికి వెంటనే అడ్డుకట్టలేయాలి. వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta శేఖర్ గుప్తా -
‘గుజరాత్ మోడల్’ మారేనా?
బీజేపీ వెలుపల ఉన్న ప్రతిభావంతులను కూడా ప్రభుత్వ శాఖల్లోకి ఆహ్వానించే సంస్కృతికి గతంలో వాజ్‌పేయి పాలన నిదర్శనం కాగా మోదీ, షా ద్వయం పార్టీ వెలుపలి రాజకీయ శక్తులకు కేంద్రంలో చోటు కల్పించలేదు. పైగా ప్రొఫెషనల్స్, స్పెషలిస్టులు, టెక్నోక్రాట్స్ పట్ల వీరు పూర్తి అవిశ్వాసంతో ఉండేవారు. చక్కటి అకడమిక్ ప్రతిష్ట ఉన్న ఇద్దరు ఆర్బీఐ గవర్నర్లకు మోదీ పాలనలో పట్టిన గతి దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. కానీ తొలిదఫా పాలన మూడేళ్లు పూర్తయ్యాక, ఆర్థిక వ్యవస్థ బీటలువారటం, కొన్ని రాష్ట్రాల శాసనసభల్లో, ఉపఎన్నికల్లో వెనుకంజ వేయడంతో మోదీ పాలనలో కొన్ని మార్పు సంకేతాలు కనిపించాయి. పార్టీతో సంబంధంలేని బ్యురోక్రాట్లు అత్యంత కీలక స్థానాల్లోకి రావడం దీంట్లో భాగమే. కానీ విశ్వాసం, విధేయత కలిగిన వారికి మాత్రమే చోటిచ్చే గుజరాత్ మోడల్ పాలన ప్రాథమికంగా మారబోవడం లేదు. మోదీ–షాల నేతృత్వంలోని బీజేపీ పాలనా వ్యవస్థ అనేకమందికి ఏహ్యభావాన్ని కలిగిస్తుండవచ్చు కానీ వారి విధానాలను విశ్వసించేవారు మాత్రం దాన్ని ‘గుజరాత్ మోడల్’ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఈ విధానాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనం స్పష్టంగా తిలకించవచ్చు. మోదీ విమర్శకులు ఈ పరిణామాన్ని 2002 తదుపరి విభజన రాజకీయాలు అని ముద్రవేసేశారు. అయితే గుజరాత్ నమూనా గురించి కాస్త తక్కువ వివాదాస్పదమైన వ్యక్తీకరణను కూడా మనం చూడవచ్చు. అదేమిటంటే కేంద్రీకృత పాలన. కావాలంటే ప్రధానమంత్రి కార్యాలయంలో తాజా మార్పుల కేసి చూడండి. మోదీ ముఖ్య సహాయకులలో ముగ్గురికి ఇప్పుడు కేబినెట్ ర్యాంక్ కల్పించడం మునుపెన్నడూ జరగని, చూడని వ్యవహారం. మోదీ గుజరాత్ పాలనకు ఇది సహజ క్రమాభివృద్ధి మాత్రమే. కానీ, ఎవరికీ ఇబ్బంది లేకుండా ఈ పరిణామాన్ని మోదీ పాలన నమూనాగా చెప్పుకుందాం. ఇది 2001–02లో గుజరాత్లో ఆవిష్కృతమైంది. 2002 నుంచి 2014 వరకు ఈ నమూనా పరిణమిస్తూ వచ్చింది. ఈ నమూనాను 2014లో మోదీ ఢిల్లీకి వెంటబెట్టుకుని వచ్చారు. ప్రధానిగా రెండో దఫాలో అది మరింత ప్రబలంగా మారనుంది. మోదీ నమూనాకు సంబంధించినంత వరకు అయిదు ముఖ్యమైన మూలస్తంభాలు కనిపిస్తున్నాయి. 1. విశ్వసనీయమైన లెఫ్టినెంట్ల ద్వారా పార్టీని పూర్తిగా అజమాయిషీ చేయగల సుప్రీమో చీఫ్ ఎగ్జిక్యూటివ్. 2. ఎంపిక చేసుకున్న కొద్దిమంది ప్రభుత్వ అధికారుల ద్వారా పాలించడం, వీరికి రిటైర్మెంట్ అనేదే ఉండదు. 3. ఒక దఫా పాలనలో సాధ్యమయ్యే ఫలితాలను ఇవ్వగల కొన్ని ఆలోచనలతో నడిచే మెíషీన్–మోడ్ పాలన. దీన్ని కొద్ది మంది వ్యక్తులు మాత్రమే నడుపుతుంటారు. 4. సైద్ధాంతిక బహుళ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సడలనివ్వకపోవడం. 5. పార్టీ లోపల, వెలుపల ప్రతిపక్షాన్ని మొత్తంగా తటస్థం చేయడం, దీనికి సామ దాన భేద దండోపాయాలన్నింటినీ ఉపయోగిస్తారు. ఈ నమూనా గుజరాత్లో అద్భుతంగా పనిచేసింది. ఎందుకంటే గుజరాత్ ఒక మధ్య స్థాయి, సాపేక్షికంగా తక్కువ వైవిధ్యతలతో కూడిన రాష్ట్రం. ఇలాంటి నమూనా భారతదేశ వ్యాప్తంగా పనిచేయగలుగుతుందా అని చాలా అనుమానాలున్నాయి. ఇప్పటికే కొన్ని సార్లు ఈ నమూనా హెచ్చరికలు పంపింది. పెద్దనోట్ల రద్దు, విదేశీ విధానంలో కొన్ని వెనుకంజలు (ప్రత్యేకించి ఇరుగుపొరుగు దేశాల్లో ప్రారంభ విజయాల తర్వాత), వృద్ధి క్షీణత, ఉద్యోగాలు కోల్పోవడం, 2017 గుజరాత్ ఎన్నికల ఫలితం వంటివి వీటిలో కొన్ని. కానీ అంతిమంగా వచ్చిన ఫలితాలే ముఖ్యమైనవి. కేంద్రంలో బీజేపీ పార్టీ 303 స్థానాలతో కుదురుకుంది. అన్ని రాజధానీ నగరాలకు మల్లే, ఢిల్లీ మొట్టమొదటి లక్షణం బ్యురోక్రటిక్ తత్వం. అందుకే మోదీకి కూడా తన ముగ్గురు సహాయకులకు పదోన్నతి కల్పించక తప్పలేదు. మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఎస్. జైశంకర్‌ను విదేశీ వ్యవహారాల మంత్రిగా ఎంచుకున్నాక, ర్యాంకుల పరమైన అవరోధాన్ని అధిగమించడానికి మాజీ ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా ప్రమోట్ చేయక తప్పింది కాదు. ఆ విధంగా దోవల్‌ని ప్రమోట్ చేశాక, ఐఏఎస్ నుంచి నృపేంద్ర మిశ్రా, పీకే మిశ్రాలకు సమాన స్థాయిని ఇవ్వక తప్పలేదు. ప్రోటోకాల్‌కి సంబంధించిన ఈ అనివార్యతలను మీరు జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరముంది. గతంలో కూడా మంత్రుల స్థాయి లేని వారికి కేబినెట్ ర్యాంకు కల్పించక పోలేదు. ప్రత్యేకించి ప్లానింగ్ కమిషన్, నీతి అయోగ్ అధిపతుల విషయంలో ఇలాగే జరిగింది. ఇక యూపీఏ–2 హయాం లోనూ నందన్ నీలేకనికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) అధిపతిగా స్థానం కల్పించారు. అయితే ఇలాంటి వివరణ మూడు అంశాలను తప్పించుకోలేదు. మొదటగా, మోదీ ప్రపంచంలో వివరణ అనే భావనే తార్కిక విరుద్ధమైనది. రెండోది, మోదీ అనివార్యతకు గురై ఈ మార్పులను చేయాల్సి వచ్చిందని ఇది సూచి స్తోంది. పైగా బ్యూరోక్రాటిక్ ప్రొటోకాల్ విషయంలో తప్పితే మోదీకి ఏ సందర్భంలోనూ బలవంతపు నిర్ణయాలను తీసుకున్న చరిత్ర లేదు. అద్భుత విజయాన్ని సాధించిన తర్వాత ఇలాంటి మార్పులను ఆయన ఎందుకు చేపట్టారు? మూడు, జైశంకర్‌కి ప్రథమ స్థాయిని కల్పించడంలో మోదీ ఎలాంటి ఒత్తిడికి, అనివార్యతకులోను కాలేదు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా మోదీ ఆ మార్పుకు సిద్ధమయ్యారు. దానికనుగుణంగానే మిగతా మార్పులు కూడా సంభవించాయి. ప్రధానిమంత్రి కార్యాలయం అమెరికా అధ్యక్షుడి కార్యనిర్వాహక కార్యాలయాన్ని తలపిస్తోంది. ఇక్కడినుంచే కీలకమైన కేబినెట్ అధికారులు (మంత్రులు) పనిచేస్తుంటారు. విదేశీ వ్యవహారాల నుంచి స్వచ్ఛభారత్ వరకు మోదీ కీలకంగా భావించిన మంత్రివర్గాలను ఆజమాయిషీ చేయడం ద్వారానే మోదీ తొలి దఫా పాలనలో పీఎంఓ ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ శాఖలకు చెందిన ముఖ్య అధికారులు ఎదిగారు నేరుగా తమ బాస్కే జవాబుదారీగా ఉండే కేబినెట్ మంత్రుల స్థాయికి ఎదిగారు. కాబట్టే ప్రధాని సమానులలో ప్రథముడు అనే వెస్ట్ మినిస్టర్ శైలి కేబినెట్ వ్యవస్థ ఇక అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థాయి కలిగిన ఇద్దరు శక్తివంతమైన ఎన్ఎస్ఏలపై విశ్వాసముంచి విదేశీ, రక్షణ శాఖలను నిర్వహిస్తుండగా, మన ప్రధానికి ఇప్పుడు ఇద్దరు చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తోడుగా ఉంటున్నారు. మోదీ రెండో పాలనలో కొన్ని వ్యత్యాసాలు ఉంటున్నాయి. మొదటగా, ఆయన పార్టీని నేరుగా కాకుండా అమిత్ షా ద్వారా నడిపిస్తున్నారు. రెండు ఇందిరాగాంధీలాగా కొనసాగింపును ఒక సైద్ధాంతిక విషయంగా మోదీ భావించరు. ఆయన మార్పును కోరుకునే మనిషి. ఇక మూడోది ఏమిటంటే మోదీకి కుటుంబం కానీ వారసత్వం కానీ లేవు. ఈ ప్రాతిపదికన కూడా మోదీని అమెరికన్ అధ్యక్షుడితో పోల్చవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే మోదీ తర్వాత బీజేపీకి చెందిన మరొక నాయకుడు వెలుగులోకి వస్తాడు తప్ప మరికొందరు నరేంద్ర మోదీలు ఆవిర్భవించలేరు. మోదీ తొలి దఫా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక తార్కిక విమర్శ ఏమంటే ప్రతిభ లోపించిందనే. నేనుకూడా ఈ విషయాన్నే చెబుతూ, స్వతంత్ర భారత్‌లోకెల్లా అత్యంత ప్రతిభా రాహిత్య ప్రభుత్వంగా చాలాసార్లు చెబుతూ వచ్చాను. మోదీకి చాలా సన్నిహితంగా ఉన్న వారు దీన్నే సవాలు చేస్తూ ప్రతిభ, అనుభవం లేకుంటే ఏం.. మేం క్రమంగా నేర్చుకుంటాం అని సమర్థించుకునేవారు. కానీ మేం అధికారం గెల్చుకుని దాన్ని ఇతరులకు బహుమతిగా ఇవ్వబోమని వారు చెప్పేవారు. ఇది వాజ్‌పేయి తరహా టీమ్–బిల్డింగ్‌ను పరిత్యాగం చేయడమే అవుతుంది. వాజ్‌పేయి ప్రతిభను ప్రతి చోటనుంచి వెలికి తీసేవారు. ఉదా. జస్వంత్ సింగ్ ఆరెస్సెస్‌తో సంబంధం లేని వ్యక్తి. యశ్వంత్ సిన్హా, రంగరాజన్ కుమార మంగళం బీజీపీలోకి చాలా లేటుగా ప్రవేశించారు. ఇక జార్జి ఫెర్నాండజ్ మొదటి, చివరి బీజేపీయేతర, కాంగ్రెసేతర మంత్రిగా రక్షణ శాఖను నిర్వహించారు. అరుణ్ శౌరీ శక్తివంతమైన మార్పు ఏజెంటు. తన శాఖలోకి ఆయన వెలుపలినుంచి మేధస్సును, సమగ్రతను తీసుకొచ్చారు. వాజ్‌పేయితో పోలిస్తే మోదీ, షాలు తమ తొలి దఫా పాలనలో పూర్తి వ్యతిరేక దిశలో నడిచారు. పార్టీ వెలుపలి ఏ రాజకీయ శక్తులకూ ప్రభుత్వంలో వీరు చోటు కల్పించలేదు. పైగా ప్రోఫెషనల్స్, స్పెషలిస్టులు, టెక్నోక్రాట్స్ పట్ల వీరు పూర్తి అవిశ్వాసంతో ఉండేవారు. అత్యున్నతమైన అకడమిక్ ప్రతిష్ట కలిగిన ఇద్దరు ఆర్బీఐ గవర్నర్లకు మోదీ పాలనలో పట్టిన గతి దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. మనలాంటి విమర్శకులను కాలం చెల్లిపోయినవారని మోదీ–షా ద్వయం తోసిపుచ్చేవారు. ఆంగ్లేయతత్వం కలిగిన ఢిల్లీ కులీనుల పాత్ర లేకున్నా కేంద్రప్రభుత్వం నడవగలదనే వాస్తవాన్ని మాలాంటి వారు అంగీకరించరని వారు విమర్శించేవారు. కానీ నాలుగో సంవత్సరం నాటికి ఆర్థిక వ్యవస్థ బీటలువారటం, కొన్ని రాష్ట్రాల శాసనసభల్లో, ఉప ఎన్నికల్లో వెనుకంజ వేయడం జరిగిన తర్వాత కేంద్రంలో కొన్ని మార్పు సంకేతాలు కనిపించాయి. దీంట్లో భాగంగానే రిటైర్డ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆర్కే సింగ్, హర్దీప్ పురి వంటివారు ప్రభుత్వ శాఖల్లో ప్రవేశించారు. వారు తమ స్థానాలను మరింత మెరుగుపర్చుకున్నారు కూడా. జైశంకర్ వంటివారిని అత్యున్నత పదవుల్లోకి తీసుకోవడం కూడా దీంట్లో భాగమే. ఇప్పుడు పీఎంఓలో ముగ్గురికి ప్రమోషన్ ఇచ్చారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి ఉన్నతాధికారులను వెనక్కి రప్పించి కీలక పదవుల్లో నిలిపారు. మోదీ నమూనాను ఇప్పటికీ గుజరాత్ నమూనాగానే మనం చూస్తున్నాం. కానీ గుజరాత్‌ను పాలించడం కంటే భారతదేశాన్ని పాలించడం సవాలుతో కూడుకున్నదని గ్రహించాక, బీజేపీలో లభ్యం కాని ప్రతిభావంతులు కూడా ప్రభుత్వానికి అవసరం అవుతున్నారు. మోదీ ఇప్పుడు పార్టీ వెలుపలి ప్రతిభ కోసం చూస్తున్నారు కానీ తమ కెరీర్లో అత్యంత విశ్వసనీయత సాధించిన వారినే మోదీ ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సూపర్ బ్యూరోక్రాట్లతో కూడిన ‘కేబినెట్’ ద్వారా పాలన సాగించనున్న ప్రధాని మోదీ రెండో దఫా పాలనపై ఈ దృష్టితోనే మనం నిశిత పరిశీలన చేయాల్సి ఉంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
క్రికెట్లో ‘బలిదాన్’ ఎందుకు?
టీమిండియా వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి సైన్యంలో పనిచేయడం ఎంత ఇష్టమో తెలీనిది కాదు. కానీ తాను ఆడుతున్న మైదానంలో పిచ్ మీదికి తన రెజిమెంట్ చిహ్నాన్ని తీసుకుపోకుండా ఉండాల్సింది. క్రీడాకారులు ఎవరైనా సరే తమ దేశ సైనిక బలగాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా కాకుండా ఆటలో గెలవడం ద్వారా మాత్రమే తమ తమ దేశాలకు వైభవాన్ని తెచ్చిపెట్టాలి. స్పర్థ మాత్రమే ఉండే ఒక క్రీడా మైదానంలో చంపటానికీ, చావడానికీ సిద్ధపడటాన్ని ప్రతీకగా చూపించే లోగోలకు తావు లేదు. అందుకే జనాభిప్రాయం అనే సముద్రానికి వ్యతిరేకంగా మనలోనూ కొందరం తప్పకుండా ఎదురు నిలబడాలి. ప్రత్యేకించి క్రికెట్‌ను ఎంతగానో ప్రేమిస్తూ, భారత జట్టు గెలవాలని కోరుకుంటున్న మనలాంటి వాళ్లం మన వ్యతిరేకతను ప్రకటించాలి. ఎవరైనా మన క్రీడాపరమైన జాతీయవాదాన్ని ప్రశ్నించినా సరే మనం వెనుకంజ వేయకూడదు. రాజకీయాలు ప్రజలను విభజిస్తుంటే క్రీడలు ఐక్యపరుస్తాయన్న పాత నానుడిని మనం ప్రశ్నించలేం. అందులోనూ గతంలో రెండుసార్లు ప్రపంచకప్ గెల్చుకున్న భారతదేశం ప్రస్తుత ప్రపంచకప్ సీజన్‌కి ఇది మరింతగా వర్తిస్తుంది. క్రీడలు ఐక్యపరుస్తాయి కానీ స్వపక్షపాతంతో మాత్రమే అవి ఐక్యపరుస్తుంటాయి. భారతీయులుగా మనం మన దేశ జట్టుతో ఐక్యమవుతాం. అలాగే ఇతర దేశాల జట్లు కూడా. అందుకనే, మహేంద్రసింగ్ ధోనీ అత్యున్నత త్యాగానికి చిహ్నమైన బలిదాన్ డేగర్ సంకేతాన్ని తన వికెట్ కీపింగ్ గ్లోవ్స్‌లో ధరించిన ఘటన వివాదాస్పదమైంది. ఇది భారతీయ పారామిలిటరీ బలగాలకు సంబంధించిన చిహ్నం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ధోనీ చర్యను వ్యతిరేకించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెటర్లు తమ శరీరాలపై, దుస్తులపై మత సంకేతాలను, జాతీయ లేక వాణిజ్య చిహ్నాలను లేదా లోగోలను ధరించడంపై పరిమితులున్నాయి. ఉదా‘‘కు ఐసీసీ, ఆయాదేశాల క్రికెట్ పాలనా సంస్థల ఆమోదం ప్రకారమే, క్రికెట్ క్రీడను స్పాన్సర్ చేస్తున్న సంస్థలకు చెందిన లోగోలను క్రీడాకారులు ధరించవచ్చు. అనుమతించిన జాతీయ చిహ్నాలను వారు ధరించవచ్చు. ఇవి కాకుండా ఏ ఇతర సాంప్రదాయిక చిహ్నాలను వీరు ధరించరాదు. సైన్యానికి సంబంధించిన చిహ్నాలను అసలు ధరించరాదు. ఎందుకంటే అది క్రీడామైదానమే తప్ప సైనిక దాడి కాదు. ధోనీని సైనిక లోగో కలిగిన గ్లోవ్స్‌ని ధరించేందుకు అనుమతించాలంటూ బీసీసీఐ.. ఐసీసీని అభ్యర్థించింది. ధోనీ గ్లోవ్స్ పట్ల భారీ స్థాయిలో ప్రజానుకూలత ఉంది. ప్రపంచకప్‌లో టీమిండియా, ధోనీ ధీరత్వంతో కూడిన ప్రదర్శనలకు మల్లే మన ప్రత్యేక సైనిక బలగాలు ఉడీ ఉగ్రవాద ఘటన అనంతరం మెరుపుదాడులు చేసి ఎంతోకాలం కాలేదు. మన సైనికబలగాలు పాక్ భూభాగంపై నిర్వహించిన ఈ మెరుపుదాడులకు విక్కీ కౌశల్ నిర్మించిన చిత్రం శాశ్వత స్థాయిని కల్పించింది. ఈ నేపథ్యంలో నిరోధించ వీలులేని మన జాతీయ వాదపు ఆకర్షక శక్తికి చెందిన రెండో వైపున నిలబడి ఏ భారతీయుడు వాదించబోతాడు? అయితే ఎవరో ఒకరు దీనికి వ్యతిరేకంగా నిలబడాలి. ఐసీసీ ఇక్కడే సరిగా వ్యవహరించింది. ధోనీ తన గ్లోవ్స్‌పై ధరించిన సైనిక లోగోనూ తీసివేయాలని ఐసీసీ తేల్చిచెప్పింది. స్పర్థ మాత్రమే ఉండే ఒక క్రీడా మైదానంలో చంపటానికీ, చావడానికీ సిద్ధపడటాన్ని ప్రతీకగా చూపించే లోగోలకు తావు లేదు. అందుకే జనాభిప్రాయం అనే సముద్రానికి వ్యతి రేకంగా మనలోనూ కొందరం తప్పకుండా ఎదురు నిలబ డాలి. ప్రత్యేకించి క్రికెట్‌ను ఎంతగానో ప్రేమిస్తూ, భారత జట్టు గెలవాలని కోరుకుంటున్న మనలాంటి వాళ్లం మన వ్యతిరేకతను ప్రకటించాలి. దీంతో ఎవరైనా మన క్రీడాపరమైన జాతీయవాదాన్ని ప్రశ్నించినా సరే మనం వెనుకంజ వేయకూడదు. దీనికోసం జీసస్ క్రైస్ట్ నుంచి పదాలు అరువు తెచ్చుకుందాం: తండ్రీ వీరిని క్షమించు. ఎందుకంటే వీరికి (దేశభక్తి లేదని మనల్ని నిందిస్తున్నవారు) తామేం చేస్తున్నదీ నిజంగానే తెలీదు. మొదటగా మన ‘జాతీయవాదుల’ వాదనలను, మన కమాండో– కామిక్ టీవీ చానల్స్‌లోని వారి డబ్బారాయుళ్ల వాదనలను పరిశీలిద్దాం. వీళ్లు ఇప్పటికే ‘ధోనీ.. ఆ గ్లోవ్స్‌ను వాడటం కొనసాగించు’ అంటూ హ్యాష్ టాగ్స్ పెట్టి మరీ కామెంట్లు సంధిస్తున్నారు. వీరి వాదన ఏమిటంటే ముందుగా మన సాయుధ బలగాలను మనం తప్పక గౌరవిం చాలి. రెండు, పాకిస్తాన్ వల్ల భారత్ ఇప్పటికే రక్తమోడుతోంది కాబట్టి పాక్‌కు వ్యతిరేకంగా వీలైన ప్రతిచోటా ఇలాంటి ప్రకటనలు చేయాల్సిందే. మూడు, ఒక వ్యక్తి ఎంపికను మీరు తోసిపుచ్చలేరు. ప్రత్యేకించి ధోనీ భారత ప్రత్యేక బలగాల్లో గౌరవనీయ లెఫ్టినెంట్ కర్నల్. పైగా సైన్యంలో చేరేందుకు అర్హతా పరీక్షగా పారాచూట్ నుంచి దుమికి మరీ తన సైనిక చిహ్నాలను (డేగర్, వింగ్స్) సాధించుకున్నాడు. కాబట్టి తాను పనిచేసే రెజిమెంట్ లోగోను తను వాడటాన్ని మీరు తృణీకరించలేరు. ఈ మూడో ప్రశ్నకు మాత్రం సులభంగానే జవాబివ్వవచ్చు. ధోనీ రెజి మెంట్ భారత్ కోసం క్రికెట్ ఆడటం లేదు. పైగా రెజిమెంట్ దుష్టులతో పోరాడుతున్నప్పుడు బీసీసీఐ చిహ్నాన్ని, హాకీ లేక ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చిహ్నాన్ని సైనిక బలగాలు ధరించదు. కాబట్టి సాయుధబలగాలు వారి త్యాగాలను మనం తప్పక గౌరవించాలనడం ఆమోదిం చాల్సిందే. కానీ, కశ్మీర్లో పాకిస్తానీయులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా మన క్రికెటర్లు ఇంగ్లండ్‌లోని లార్డ్స్, ఓల్డ్ ట్రఫోర్డ్, ఓవల్ తదితర మైదానాల్లో ఇలాంటి నిరసన ప్రదర్శనలు చేయాలనటం అర్థరహితమైన విషయం. నిరసన ప్రదర్శనలు చేసేది రాజకీయనేతలు, దౌత్యవేత్తలు కాగా సైనికులు యుద్ధాలు చేస్తారు. ఆటల్లో గెలవడం ద్వారా క్రీడాకారులు తమ దేశాలకు పేరు తీసుకొస్తారు. అంతే తప్ప క్రీడా దుస్తులు ధరించిన సమయంలో తమ సైనిక బలగాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారడం ద్వారా కాదు. ఎందుకంటే ఇలాంటి తరహా ఆటను ఇరుపక్షాలూ ఆడగలవు. భారతీయులు తమ సైనిక దుస్తులు, లోగోలను ధరించగలిగినప్పుడు, పాకిస్తానీయులు కూడా అదే పని చేయగలరు. ఇలాంటి స్ఫూర్తి తక్షణం సాధారణ ప్రజల్లోకూడా చొరబడగలదు. భారత్, పాక్ దేశాల్లో ప్రధానంగా జరిగేది ఇదేమరి. దీనివల్ల ఆటల్లో శతృత్వం పెరుగుతుంది. చివరకు ఇది ఇరాక్, ఇరాన్ దేశాల మధ్య గతంలో జరిగిన భీకర యుద్ధంగా మారిపోతుంది. జార్జ్ ఆర్వెల్ తన 1945 నాటి ‘ది స్పోర్టింగ్ స్పిరిట్’ అనే వ్యాసంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడలు నిజాయితీగానే యుద్ధతంత్రాన్ని అనుకరిస్తుంటాయని రాశాడు. వీటిలో ముఖ్యంగా చెప్పాల్సింది క్రీడాకారుల ప్రవర్తన గురించి కాదని, ప్రేక్షకుల వైఖరినే అని తేల్చిచెప్పాడు. మన క్రీడాకారులూ, క్రీడాకారిణులు పాకిస్తాన్‌తో తలపడుతూ గతంలో కంటే ఎక్కువగా విజయాలు సాధిస్తున్నారు. ఆటలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూనే ఎవరినీ బందీలుగా పట్టుకోవద్దనే పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూన్నారు. ఇరుదేశాల జట్లూ స్నేహపూర్వకరీతిలో, క్రీడాస్ఫూర్తితో ఆడుతున్నారు. తమ ప్రత్యర్థుల కుటుంబాలు, పిల్లలతో కూడా సరదాగా గడుపుతున్నారు. ఈ తరుణంలో, అదృష్టవశాత్తూ మూడునెలల క్రితం బాలాకోట్‌లో మన సైన్యం వాస్తవానికి యుద్ధం చేయలేదు. ఎవరికీ ప్రాణనష్టం జరగని చిన్నస్థాయి దాడి మాత్రమే చేశారు. 1971లో ఇరుదేశాలు పూర్తి స్థాయి యుద్ధంలో మునిగి ఉన్న తరుణంలో కూడా సునీల్ గవాస్కర్, జహీర్ అబ్బాస్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నప్పుడు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్టులో సభ్యులుగా కలిసి ఆడారు. మన వాయుసేన కరాచీపై బాంబుదాడులు జరుపుతున్న సమయంలోనే వారు ఈ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించారు. 1999లో కూడా కార్గిల్‌లో తీవ్రస్థాయి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరుదేశాల జట్లూ ఇంగ్లండ్‌లో సాగుతున్న ప్రపంచ కప్‌లో భాగం పంచుకున్నాయి. చేతులు కలిపారు. ప్రత్యర్థి జట్టులో ఎవరి షూ లేస్ అయినా ఊడిపోతే తాము వెళ్లి వాటిని సరిచేసేటంత గొప్ప ఔదార్యం ప్రదర్శించారు. మిలటరీ చిహ్నాలు, దుస్తులు, మెడల్స్, బ్యాడ్జిలు, బ్యాండ్లూ, కవాతులూ, ఫోజు వంటివన్నీ సాహసప్రవృత్తికి సంకేతాలు. ఆటగాళ్లు కూడా యుద్ధంలో విజయం, పరాజయం లాగే ఆటలో గెలుపు, ఓటమి అనే బ్యాగేజీని మోసుకెళుతూ ఉంటారు. జూన్ 16న భారత్–పాక్ జట్ల మధ్య జరిగే లీగ్ మ్యాచ్‌లో ఒక జట్టు గెలవడం మరొకటి ఓడిపోవడం తప్పదు. ఈ ఓటమిని మన సైన్యం యుద్ధాన్ని కోల్పోయింది అనే స్థాయిలో చూడాలా? ఓల్డ్ ట్రఫోర్డ్‌లో ఇరుపక్షాలూ తమ సైన్యాలను (ప్రేక్షకులు) తీసుకొస్తే ఏం జరుగుతుంది? బ్రిటిష్ ప్రభుత్వం పోలీసులను పురమాయించాల్సి వస్తుంది. ‘ఆటలు దేశాల మధ్య సద్భావనను సృష్టిస్తాయని, ఫుట్‌బాల్‌లో కానీ, క్రికెట్లో కానీ ప్రపంచంలోని సాధారణ ప్రజానీకం మాత్రమే హాజరైనట్లయితే, వారు యుద్ధరంగంలో తలపడాల్సిన అవసరం ఉండద’ని జార్జ్ ఆర్వెల్ చెప్పాడు. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌ను ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించాడు. మానవ నాగరి కత ప్రపంచయుద్ధాలు, ప్రచ్ఛన్నయుద్ధాల నుంచి చాలా ముందుకెళ్లింది. తరచుగా నెలకొనే క్రీడా సంబంధాలు పాత శత్రుత్వాలకు విరుగుడుగా పనిచేస్తాయి. ఇవి ఆటగాళ్లను, వారి అభిమానులను, వారి కుటుంబాలను, స్నేహితులను పరస్పరం నేర్చుకునేలా చేస్తాయి. ప్రజల మధ్య సంబంధాలను పెంచుతాయి. ఒక్కొక్కసారి ఆట మధ్యలో ఏర్పడే నిస్పృహనుంచి బయటపడేలా పరస్పరం సహకారాన్ని పంచిపెడతాయి కూడా. ఒలింపిక్స్ నుంచి పింగ్ పాంగ్ వరకు, బాస్కెట్ బాల్ నుంచి క్రికెట్ వరకు, సాకర్ నుంచి హాకీ వరకు నిర్దాక్షిణ్యంగా సాగే క్రీడా స్పర్థ... సైనికీకరణకు గురైన శత్రుత్వాలను తగ్గించడంలో, మన మనస్సులకు తగిలిన గాయాలను మాన్పడంలో కూడా సహకరిస్తోంది. మన సైన్యం పట్ల వ్యక్తిగతంగా ప్రదర్శించే అంకితభావాన్ని మనం తప్పకుండా అభినందించాలి. పైగా సైన్యంలో గౌరవ హోదాలో పనిచేసే వ్యక్తి తన బ్యాడ్జిని ప్రదర్శించుకుంటే దాన్ని మనం గౌరవించాలి. ధోని ఇందుకు ఉదాహరణ. పద్మ అవార్డును స్వీకరించడానికి ధోనీ ప్రత్యేక బలగాలకు చెందిన పూర్తి లాంఛనాలు ధరించి వెళ్లాడు. ఇది నిజంగానే మంచి సంకేతం కూడా. ఎందుకంటే రాష్ట్రపతి సాయుధ బలగాల సర్వ సైన్యాధ్యక్షుడు మరి. అలాగని ధోనీ తన రెజిమెంట్ మొత్తాన్ని తీసుకుని మైదానంలోకి వెళ్లలేదు. పైగా వికెట్ల వెనుక ధోనీ ఏనాడూ శత్రువును సంహరించే సహజాతంతో ప్రవర్తించలేదు. క్రీజు దాటి ముందుకెళ్లిన బ్యాట్స్‌మన్‌ను స్టంపౌట్ చేసిన ప్రతిసారీ తన గ్లోవ్స్‌లో ధరించిన డేగర్ స్ఫూర్తిని పొందుతూనే ఉంటాడు. అంతే తప్ప ప్రపంచంలోకెల్లా అత్యంత భయంకరమైన స్టంపర్‌గా ధోనీ ఏరోజూ కనిపించలేదు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
కాశీ పునర్వికాసం.. మొదటికే మోసం?
గత 15 సంవత్సరాలుగా భారత్, దాని పొరుగుదేశాల్లో పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో నేను పర్యటిస్తున్నప్పుడు గోడమీది రాతలు అనేది ఒక అన్యాపదేశక పదబంధంగా వ్యాప్తి చెందుతూ వచ్చింది. ఎందుకంటే అతిపెద్ద పండుగల కంటే ఎన్నికల సమయంలోనే ఉపఖండంలో జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. ప్రజల మనస్సుల్లో ఏముంది? వారి ఆశలు, ఆకాంక్షలు, సంతోషాలు, ఆందోళనలు, భయాలు ఏమిటి అనే అంశాలు అన్నీ ఎన్నికల సమయంలో గోడమీది రాతలను చదవడం ద్వారా మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. అది గోడమీది బొమ్మలు కావచ్చు, ప్రకటనలు కావచ్చు, ఆకాశంలో వేలాడే బొమ్మలు, ఇంటి ఆవరణలు, లేదా రాళ్లూ రప్పలపై గీసే బొమ్మలు.. ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో ప్రజాభిప్రాయానికి అసలైన సంకేతంలా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం వారణాసిలో పెద్ద మార్పు కనిపిస్తోంది. తాజాగా అక్కడ పోగుపడిన రాళ్లపై నడుస్తున్నప్పుడు ఒక బుల్డోజర్ కొన్ని గజాల దూరంలో ఆ ప్రాంతాన్ని చదును చేస్తూండటాన్ని మీరు చూడవచ్చు. అక్కడ ఉన్న గోడల్ని కూడా పరిశీలించవచ్చు. అక్కడి రాతల్ని మీరు చదవలేరు. ఎందుకంటే అక్కడ మీరు చదవడానికి ఏమీ లేదు. గతంలో ఉపయోగంలో ఉండి ఇప్పుడు శిధిలాలుగా మారిన అక్కడి దృశ్యాలకేసి చూడండి. వాటిపై నా సహోద్యోగి షోహమ్ సేన్ గీసిన చిత్రాలు చూడండి. లేదా వాటిపై మేం తీసిన వీడియోలను మా వెబ్సైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంటులో చూడండి. ఇవి నిన్నటివరకు అక్కడ కనిపించిన తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లు, కప్‌బోర్డులు వంటి వాటి అవశేషాలకు సంబంధించిన చిత్రాలు. ఇవన్నీ అక్కడి గోడలపై ఏదో జిగురుతో అతికించి మళ్లీ అక్కడినుంచి మొరటుగా లాగిపడేసిన చందాన కనిపిస్తాయి. మిమ్మల్ని ఎవరైనా ఆకాశం నుంచి కిందికి వదిలినట్లయితే, ఒక వింతైన కళాచిత్రాల మధ్యలోకి మీరు ఊడిపడుతున్నట్లు మీకనిపించవచ్చు. లేక, అది మరొక మ్యాడ్ క్యాప్ ఫెవికోల్ యాడ్ చిత్రణగా కూడా ఉండవచ్చు: ఫెవికోల్‌తో మీరు రెండు ఇళ్లను కలపండి, వాటిని బుల్డోజర్తో కూల్చివేయండి. ఇళ్లు మొత్తంగా కూలిపోయినా మా జాయింట్లు మాత్రం నిలబడే ఉంటాయి. వారణాసి గతం ఇక చరిత్రేనా? వారణాసిలో సరిగ్గా ఇప్పుడు ఇదే జరిగింది. కేవలం 4.6 హెక్టార్ల (11.4 ఎకరాలు) విస్తీర్ణంలో ఉన్న ప్రాంతంలో 300 ఇళ్లు, ఆలయాలు, ఇతర భవనాలు ఉండేవి. వీటిలో చాలావరకు ఎంత సన్నిహితంగా ఉండేవంటే, ఏకకాలంలో ఇవన్నీ కలిసి నిర్మించినట్లుగా కనబడుతుండేవి. వీటి కింది భాగంలో వారణాసికే పేరు తెచ్చిన లేదా అపఖ్యాతి తెచ్చిన బైజాంటైన్ గల్లీలు (సందులు) ఉండేవి. ఇవి ఎంత ఇరుకుగా ఉండేవంటే ఇద్దరు మామూలు ఆకారంతో ఉండే మనుషులు మాత్రమే నడవగలిగేటంత సన్నగా ఉండేవి. ఇదంతా ఇప్పుడు చరిత్రలో కలిసిపోయింది. హిందూమతానికి చెందిన అతి పవిత్రమైన, పురాతనమైన కాశీ విశ్వనాథాలయాన్ని ఇన్నాళ్లుగా కనుమరుగు చేస్తూ వచ్చిన ఆశ్రమాలను కూల్చివేశారు కాబట్టి హిందూ ప్రపంచం మొత్తంగా ఆలయాన్ని గంగా ఘాట్ల నుంచి నేరుగా తిలకించవచ్చని మోదీ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికంటే ముఖ్యంగా సాపేక్షంగా నిరాడంబరంగా కనిపించే ఆలయాన్ని సగటు హిందువులు వీక్షిస్తున్నప్పుడు ఔరంగజేబు 1669లో అక్కడే నిర్మించిన జ్ఞాన్వాపి మసీదు కూడా వారికి కనబడుతుంది. కాశీ విశ్వనాథుని మూల ఆలయాన్ని ధ్వంసం చేసి మరీ ఔరంగజేబు ఆనాడు నిర్మించిన మసీదు ఇది. ఇది ఇప్పుడు అందరికీ కనబడుతుంది కాబట్టి మిలిటెంట్ హిందువుల కళ్లకు ఇది కంటగింపుగా మారి వారు తదుపరి కూలగొట్టే లక్ష్యంగా మారవచ్చు కూడా. కాశీలో మసీదు చెక్కుచెదరదు అయితే ఈ ప్రమాదం జరిగే అవకాశం తక్కువేనని నాకు అనిపిస్తోంది. ఈ మసీదును ఇప్పటికే 30 అడుగుల ఎత్తు ఉన్న భారీ ఉక్కు స్తంభాలతో, ఆటోమేటిక్ రైఫిళ్లు ధరించిన సీఆర్పీఎఫ్ బలగాలతో కాపాడుతూ వస్తున్నామని కాశీ విశ్వనాథాలయం అభివృద్ధి సంస్థ సీఈఓ విశాల్ సింగ్ తదితర అధికారులు చెప్పడం వల్ల నేను ఈ అభిప్రాయానికి రాలేదు. నాది అధికారుల వర్ణనకు మించిన వాస్తవిక దృక్పథం. ప్రస్తుత పాలకులు హింసాత్మకమైన మెజారిటీ ముసుగులోని నిరంకుశ అసంతుష్టిపరులే అయినప్పటికీ, మన వ్యవస్థలు రాజ్యాంగాన్ని ఏమాత్రం పరిరక్షించలేనంత బలహీనంగా మారిపోయి ఉన్నప్పటికీ కనుమరుగు ప్రదేశంలో ఉండకుండా అందరూ చేరగలిగిన, చూడగలిగిన భవంతికి ఎవరైనా హాని కలిగించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నా అభిప్రాయం.కాబట్టి ఆలయాన్ని ఘాట్ల నుంచి నేరుగా చూసేందుకు అవకాశం కల్పిస్తూ, గంగానదికి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో పునరభివృద్ధి పనులు చేస్తున్నందువల్ల అక్కడున్న మసీదుకు ప్రమాదం కలిగే అవకాశం ఏమాత్రం లేదు. అంజుమాన్ ఇంతెజామియా మస్జిద్ తరపున ఇలాంటి భయాలను వ్యక్తంచేస్తూ కొందరు స్థానిక ముస్లిం నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది. అయితే అంతకుమించిన వ్యతిరేకత వాస్తవానికి వారణాసి హిందూ సంప్రదాయవాదుల నుంచి ఎదురవుతోంది. ఆలయ ఆవరణలోని నీలకంఠ గేటునుంచి పవిత్రమైన మణికర్ణిక ఘాట్ (అంత్యక్రియలు జరిగే చోటు) వరకు కనెక్ట్ అయి ఉన్న ఇరుకు సందు గుండా నడుస్తూ అక్కడున్న స్థానిక రచయిత, జర్నలిస్టు, మేధావి త్రిలోచన్ ప్రసాద్‌ను కలిశాం. ఆయన ఆగ్రహంతో దహించుకుపోతున్నారు. మార్పుకు వీల్లేని దైవసంకల్పిత స్థలంతో మార్పుకు ఎవరు సాహసిస్తున్నారు? మా వారసత్వాన్ని, పవిత్రమైన ప్రతి అంశాన్ని వారు ధ్వంసం చేస్తున్నారు. దీనికోసం వందలాది కోట్ల రూపాయలను వృధా పరుస్తున్నారు. ఒక జీవన విధానాన్ని ధ్వంసం చేస్తున్నారు అన్నది త్రిలోచన్ ఆగ్రహానికి కారణం. ప్రమాదాలను స్వాగతించే ప్రధాని మీరు ఇష్టపడండి లేక వ్యతిరేకించండి, ప్రధాని నరేంద్రమోదీ ప్రమాదాలను ఆహ్వానించే వ్యక్తి. తన పార్లమెంటరీ నియోజకవర్గంలో 296 భవనాల కూల్చివేతతో ముడిపడివున్న 4.6 హెక్టార్ల ప్రాంత పునర్వికాస కార్యక్రమం మోదీ ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదం అనే చెప్పాలి. ఎందుకంటే అటు ఉదారవాదులే కాదు.. కాశీ ఆలయ శాశ్వతత్వం, శతాబ్దాలుగా మార్పుకు గురికాని దాని విశిష్టత పట్ల గర్వంగా ఫీలయ్యే బ్రాహ్మణ ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారిలో చాలామంది సంప్రదాయకులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. నివాస స్థలాల కూల్చివేతకు ప్రభావితమవుతున్న వారిలో దాదాపు 90 శాతం మంది బ్రాహ్మణులే. దాని పూజారుల్లాగే కాశీలో రాజకీయాలతో సంబంధమున్న పండితుల జనాభానే అత్యధికంగా ఉంటోంది. మోదీ–యోగీలు కాశీ ఆలయ ఆవరణలో తలపెట్టిన ఈ దుస్సాహసిక చర్య వల్ల 60 వేల నుంచి 75 వేల మంది ఓటర్లు వారికి దూరమవుతారని వీరిలో చాలామంది ఢంకా భజాయిస్తున్నారు. దీనికి ముందు,వెనకా జరిగిన ఘటనలను అర్థం చేసుకోవడానికి కాశీ ఆలయ అభివృద్ధి సంస్థ సీఈఓ ఆఫీసులోని చార్టులు, ప్లాస్టిక్ నమూనాల కేసి మనం చూడాలి. ఈయన మేరీల్యాండ్ యూనివర్శిటీ నుంచి పాలనా రంగంలో మాస్టర్ డిగ్రీ పుచ్చుకున్నారు. యూపీ అసెంబ్లీలో నూతన చట్టం తీసుకొచ్చాక ఆలయ అభివృద్ధి సంస్థకు, పాత భవనాల కొనుగోలుకు రూ. 600 కోట్లు కేటాయించారు. ఆ ప్రాంతంలో భూములకు ఉన్న రేట్లకు రెట్టింపు మొత్తాన్ని యజమానులకు చెల్లించారు. వారు బాగానే సంతోషిస్తున్నట్లు కనబడుతోంది. భూ యజమానులకు రూ. 200 కోట్లు చెల్లించారు. ఇక భవనాలపై యాజమాన్యం లేకున్నప్పటికీ కిరాయి హక్కులు తమకే ఉన్నాయని ప్రకటించిన వారికి మరో రూ. 15 కోట్లు చెల్లించారు. ఇక ఆలయ ఆవరణ ప్రాంతంలో 12 మంది యజమానులు మాత్రమే ఇంకా హక్కు కలిగి ఉన్నారు. ఆ ప్రాంతంలోని గృహ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం దాదాపుగా పూర్తయింది. ఆలయ ప్రాకారాన్ని కొత్తగా నిర్మించడానికి మార్చి 8న మోదీ భూమి పూజ కూడా నిర్వహించారు. మరో సంవత్సరంలో ఇక్కడ పని పూర్తవుతుంది. గతంలో ఇళ్ల మరుగున దాగివుండిన 43 ఆలయాలు ఈ ప్రాంతంలో బయటపడ్డాయి. ఇవి దాదాపు ఆక్రమించిన ఆలయాలే. ఇక్కడ నిర్మాణాలు పూర్తయ్యాక, ఆలయ సముదాయం పాత వారణాసి ప్రకటించుకుంటున్నదానికి ఏమంత భిన్నంగా కనబడదు. వారణాసి ఎంపీగా మోదీ అయిదేళ్లు ఉన్నప్పటికీ పరిశుభ్రత, ఆధునికత, అందరికీ అందుబాటులోకి రావడం అనే లక్షణాలకు ఈ పట్టణం ఇంకా దూరంగానే ఉంటోంది. మరి దీనికోసం ఇంత రిస్క్ తీసుకోవలసిన అవసరం ఉందా? నగర అంతర్భాగాన్ని అభివృద్ధి చేయడం భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. మన నాయకుల్లో చాలామంది ఈ యుద్ధరంగానికి దూరంగా ఉండిపోయారు. నగరాల్లో అభివృద్ధి అనే చిక్కుముడిని మొదటగా ఎదుర్కొన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు సంజయ్ గాంధీ. నన్ను ప్రశ్నించవద్దు అనే రకం పచ్చి నియంత అయిన సంజయ్ టర్క్‌మన్ గేట్, జామామసీదు విషయంలో ఏం చేశాడో తెలిసిందే. ఇక రెండో వ్యక్తి కూడా ప్రశ్నించడానికి వీల్లేని మతబోధకుడు మహమ్మద్ బర్హానుద్దీని సయద్నా. ఈయన ఇప్పుడు సెంట్రల్ ముంబైలోని రూ. 4,000 కోట్ల విలువైన బెందీ బజార్ పునర్నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇక మూడో వ్యక్తి నరేంద్రమోదీ. తేడా ఏమిటంటే, మోదీ చట్టాలను ఉపయోగించి, ప్రజలను ఒప్పించే తత్వంతో ఈ పని చేస్తున్నారు. హిందూ ఛాందసత్వానికి మోదీ సవాలు లౌకికవాదం పట్ల మోదీ నిబద్ధతను ప్రశ్నిస్తూనే, ఆయన ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదం బోలుతనాన్ని ఎండగడుతూనే కొన్ని ముఖ్యమైన అంశాల్లో మోదీ హిందూయిజం సామాజిక ఛాందసత్వాన్ని సవాలు చేస్తున్నారని అంగీకరించక తప్పదు. స్వచ్ఛ భారత్, బహిరంగ స్థలాల్లో మల విసర్జనకు వ్యతిరేక ప్రచారాలు వాటిలో ఒకటి. మరొక అంశాన్ని అందరూ ఇప్పుడు మర్చిపోయి ఉండవచ్చు. అదేమిటంటే, గుజరాత్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన అనేక ఆలయాలను నిర్దాక్షిణ్యంగా తొలగించడం. ఈ చర్య విశ్వహిందూ పరిషత్తు నుంచి తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇక కాశీ విశ్వనాథ కారిడార్ వల్ల వారణాసిలోని సాంప్రదాయకుల నుంచి ప్రతిఘటనను ఎదుర్కోవలసివస్తోంది. వారణాసి గురించి చాలామంది విజ్ఞులు, సుప్రసిద్ధ వ్యక్తులు శాశ్వత ప్రభావం కలిగించేలా మాట్లాడారు. వారిలో మార్క్ ట్వైన్ ప్రశంస మరీ గుర్తించుకోవలసి ఉంది: ‘బెనారస్ చరిత్ర కంటే పురాతనమైంది, సాంప్రదాయం కంటే ప్రాచీనమైంది, పురాణాల కంటే పాతది, ఈ అన్నింటినీ కలిపినప్పటికీ రెండు రెట్లు పురాతనమైంది’. కానీ అలాంటి వారణాసి నేటికీ ఇరుకు, మురికితనం విషయాల్లో రెండు రెట్లు మించిన స్థాయిలో కొనసాగాల్సిందేనా? నిజంగానే హిందూయిజం దాని పవిత్రమైన, మోక్షాన్ని కలిగిస్తుందని చెబుతున్న పురాతన నగర వైభవానికి అర్హమైందే. ప్రస్తుతం కొత్తగా ఉన్న ఆలయంలో బుల్డోజర్తో చదును చేయడం ద్వారా ఏర్పడిన శూన్యత చుట్టూ ఉన్న గోడరాతలను చూస్తే మార్క్ ట్వైన్ సైతం ఆశ్చర్యపడతాడు. వారణాసి ఆలయ పరిసరాలు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నాయి. వారణాసి నుంచి మరోసారి మోదీ ఎన్నికవుతారా అని కొద్దిమంది సందేహిస్తున్నారు. వారణాసిలోని సాంప్రదాయిక బ్రాహ్మణ పండితులకు చెందిన వేలాది ఓట్లను మోదీ కోల్పోనున్నారా అనేది మే 23న మాత్రమే మనం అంచనా వేయగలం. కానీ ఒక సంవత్సరంలో ఈ ప్రాజెక్టును మోదీ పూర్తి చేసినట్లయితే, తన జాతీయవాద హిందూ నియోజకవర్గంలో అది ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్టు పట్ల నేనెంతో ఉద్వేగపడుతున్నానని చెప్పడానికి సంతోషపడుతున్నాను. దేశంలోని ఇతర నగరాలకు వారణాసి పునర్వికాసం ఒక పూర్వ ప్రమాణంగా మిగిలి ఉంటుంది. ఢిల్లీలోని చాందినీ చౌక్‌కు పూర్వ వైభవం తేవడానికి ఇది దోహదపడవచ్చు కూడా. ప్రధాని నరేంద్రమోదీ ‘హిందూ హృదయ సామ్రాట్’గా కొనసాగాలంటే మధ్యయుగాల నాటి మసీదులను కూల్చివేయడం కన్నా పురాతన ఆలయాలను పునరుద్ధరించడమే ఆయన చేయగలిగే ఉత్తమ కార్యక్రమంగా ఉంటుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
ఎదురుదాడిలో మమతే సరిజోడీ
ఈ దఫా సార్వత్రిక ఎన్నికల ప్రచారం అన్ని విషాల్లో కంటే భయంకరమైన విషంగా మారుతోందంటే కారణం బీజేపీ నిందాత్మక ప్రచారమే. కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థిగా బరిలో ఉన్న పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎదురుదాడే లక్ష్యంగా చేసుకుని సాగుతోంది. కానీ మోదీ–షాల ఈ నిందాత్మక ప్రచార శైలి పశ్చిమబెంగాల్లో మమతా దీదీ ముందు పనిచేయడం లేదు. కారణం మోదీ–షాలకు మల్లే అసలైన వీధిపోరాట యోధురాలు మమత. కాంగ్రెస్ పార్టీలో రాహుల్, ప్రియాకలతో సహా ఏ ఒక్క నేత కూడా స్ట్రీట్ ఫైటర్ కాదు. అందుకే తన బెంగాల్ గురించి, తన గురించి మోదీ–షా ద్వయం రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే మమత అంతే స్థాయిలో సవాలు విసురుతున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలి... వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నది మన సమాజంలో బాగా వ్యాప్తిలో ఉన్న సామెత. దీన్ని విషానికి విషమే విరుగుడు అని కూడా మీరు ఇంకాస్త పొడిగించి చెప్పవచ్చు. అయితే ప్రస్తుత ఎన్నికల ప్రచారం అన్ని విషాల్లో కన్నా భయంకరమైన విషంగా ఉంటోందని మనం చెప్పుకుంటున్నందున పై సామెతల్లో మూడోది మరింత సందర్భోచితంగా ఉండవచ్చు. ఈ విషప్రచారానికి ప్రధాని నరేంద్రమోదీ తనదైన భూమికను ఏర్పర్చిపెట్టారు. ప్రత్యర్థులను నిదించడంలో ఆయన సాధించిన ఈ విశిష్టతను ఏ ఒక్కరూ తోసిపుచ్చలేరు. ప్రతిపక్షాలను జాతి వ్యతిరేకులనీ, పాకిస్తాన్‌తో కుమ్మక్కయ్యారని, వారసత్వ కుటుంబాలు బెయిల్‌పై ఉంటూ త్వరలో జైలుకు వెళ్లనున్నారనీ.. ఇలా మోదీ దేన్నీ వదిలిపెట్టలేదు. కాగా మోదీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. వీరిలో ఒకరు ముస్లిం శరణార్థులను చెదపురుగులుగా వర్ణిస్తే, మరొకరు బజరంగబలి వర్సెస్ ఆలీ మధ్య పోలిక తెచ్చి విషం చిమ్ముతారు. దేశంలోని విస్తృత ప్రాంతాల్లో, ప్రత్యేకించి హిందీ ప్రాబల్య ప్రాంతంలో ఈ తరహా ప్రచారం నడుస్తోంది. అయితే ఇక్కడ కూడా వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా బరిలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఈ పంథానే సాగిస్తోంది. తనపై ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ దీటుగానే ఎదుర్కొంటోంది. ఇందిరా గాంధీ పాకిస్తాన్నే రెండు ముక్కలు చేసి ఉండగా మా కుటుంబ దేశభక్తిని ఎలా శంకిస్తారు? మా నాన్న, మా నాన్నమ్మ ఇద్దరూ ఉగ్రవాదుల చేతిలో బలైనప్పుడు మేం ఉగ్రవాదం పట్ల మెత్తగా వ్యవహరిస్తున్నారని ఎలా ఆరోపించగలరని రాహుల్ బీజేపీని నిలదీస్తున్నారు. అయితే కాంగ్రెస్ వాదనలో ఆత్మరక్షణ ధ్వనిస్తోంది. పైగా దాని శ్రుతి కూడా సరిగా లేదు. ఎందుకంటే విషాన్ని కొబ్బరినీటితో కడిగేయలేం కదా. దేశం మొత్తం మీద ఎక్కడా జరగనంత హింసాత్మకమైన ఎన్నికల ప్రచారం పశ్చిమబెంగాల్లో జరుగుతోంది. మాటల తూటాలు, భౌతిక దాడులు అక్కడ సహజమైపోయాయి. మోదీ, షాలు తనపై చేస్తున్న విమర్శలకు మమతా బెనర్జీ ఏ సందర్భంలోనూ వెనుకడుగు వేయలేదు. మీరు ఆమెను పరిహసిస్తే, ఆమె మిమ్మల్ని అదే స్థాయిలో హేళన చేస్తారు. మోదీ, షాల బీజేపీ బెంగాల్‌ని గత అయిదేళ్లుగా లక్ష్యంగా చేసుకుంటూ వస్తోంది. అధికార సాధనకు హిందూ–ముస్లింల విభజనే వారికి ఆధారం అయితే, ఉత్తరప్రదేశ్ కంటే బెంగాల్ వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అస్సాంలాగే బెంగాల్లోనూ ముస్లిం జనాభా 30 శాతం మేరకు ఉంది. అస్సాంలో కాంగ్రెస్‌లాగే పశ్చిమబెంగాల్లోనూ పాలకులు మొదట వామపక్షాలు, ప్రస్తుతం మమతా బెనర్జీ ముస్లింలను ఓట్ల కోసం దువ్వుతున్నారని, బుజ్జగిస్తున్నారనే అభిప్రాయం ఆ రాష్ట్రంలో ఉంది. అస్సాంలో ఇది బీజేపీకి విజయం సాధిం చిపెట్టినప్పుడు, బెంగాల్లోనూ ఇది పనిచేస్తుంది. అందుకే బీజేపీ నాయకులు పశ్చిమబెంగాల్లో ఈ దఫా ఎన్నికల్లో 42 ఎంపీ సీట్లకు గాను 22 స్థానాలను కొల్లగొడతామని ఆర్భాటంగా ప్రకటించుకుంటున్నారు. 2014లో తనకు అత్యధిక మెజారిటీని ఇచ్చిన ఉత్తరప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో ఈసారి తనకు కలగనున్న నష్టాలను పశ్చిమబెంగాల్లో అధిక విజయాల ద్వారా పూడ్చుకోవచ్చన్నది బీజేపీ అంచనా అయితే పార్టీ ఈ అంశాన్ని పునరాలోచించుకోవాలి. బెంగాల్లో ప్రధాని మోదీ ర్యాలీలు ఉత్సాహకరంగానూ, భారీస్థాయిలోనూ సాగుతున్నది నిజమే. కానీ బీజేపీకి ఈ రాష్ట్రంలో పునాది తక్కువగా ఉన్నందున సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించడం అనేది కాంచన్‌జంగా పర్వతాన్ని ఎక్కినంత పనే అవుతుంది. ఎన్నికల ప్రచారంలో షాక్ కలిగించి భయపెట్టే తరహా బీజేపీ ఎత్తుగడల పట్ల మమత ఏమాత్రం జంకడం లేదు. కారణం రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ నేతల్లాగా కాకుండా.. మమత నిజమైన వీధి పోరాట యోధురాలు. వామపక్ష నిర్బంధ శిబిరంగా ఉన్న రాష్ట్రంలో మనుగడ కోసం పోరాటంలో గెలిచి వచ్చిన మమత, ప్రతికూల పరిస్థితులను అవకాశంగా మల్చుకోవడం ఎలా అనే కళలో ఆరితేరిపోయారు. దుర్గా పూజ జరుపుకోవడం కూడా బెంగాలీలకు కష్టంగా మారిపోయిందంటూ మోదీ మమత పాలనపై ఆరోపిస్తున్న సందర్భంలోనూ ఆమె అవకాశాలు అందిపుచ్చుకుంటూనే ఉన్నారు. ఆమె తాజా ఎన్నికల ప్రచార ర్యాలీలలో ఒకదాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ‘కొల్కతా శివారులోని భటాపరా (బారక్పూర్), రాజర్హాట్ ప్రాంతాల్లో దుర్గామాతకు పూజలు సజావుగా సాగిపోతూనే ఉన్నాయి. మోదీ బాబూ, మా బెంగాలీల ఎదుట అలా గొంతు చించుకునే ముందు కాస్త హోమ్ వర్క్ సరిగా చేసుకుని రండి’ అని మమతా మాట్లాడుతుంటే క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా అంత వేగంగా మాట్లాడలేడనిపిస్తుంది. ‘హోమ్ వర్క్ చేయకుండానే పాఠశాలకు వెళ్లినప్పుడు టీచర్లు కూడా పిల్లలను మందలిస్తారు. మరి మీరు పచ్చి అబద్ధాలు చెబుతున్నప్పుడు ప్రజలు ఏం చేస్తారో తెలుసా? మీరు బెంగాల్ వచ్చి ఇక్కడి ప్రజల ముందు నిల్చుని మీ రాష్ట్రంలో దుర్గా పూజలు జరగడం లేదని చెప్పండి చాలు...’ అంటూ మమతా వేదికలపై ఆవేశంగా మాట్లాడుతూ ‘మీరే చెప్పండి అమ్మలారా, అక్కలారా.. మనం దుర్గాపూజలు చేస్తున్నామా లేదా’ అంటూ నేరుగా తన సభలకు వచ్చిన వారిని ఉద్దేశించి ప్రశ్నిస్తుండగా జనం ‘అవును, పూజలు చేస్తున్నాం’ అంటూ వంతపాడుతున్నారు. దుర్గా పూజ చేయకుండా మిమ్మల్ని ఎవరైనా ఆపుతున్నారా.. గట్టిగా చెప్పండి అంటూ మమత అడుగుతున్నప్పుడు జనం లేదు లేదు అంటూ ముక్తకంఠంతో సమాధానమిస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో లక్ష్మీపూజ, సరస్వతీ పూజ, క్రిస్టమస్ పర్వదినం, రమజాన్, చాట్ పూజ అన్నీ చేసుకుంటున్నాం కదా అని రెట్టించి అడుగుతుంటే జనం వంతపాడుతున్నారు. అందుకే బెంగాల్లో మోదీ మాటలు, బీజేపీ అసత్యాలు పనిచేయడం లేదు. వ్యక్తుల శీలహరణం చేసే దాని ఎత్తుగడలు పనిచేయడం లేదు అంటూ మమత స్పష్టత నిస్తున్నారు. అందుకే మీరు హోమ్ వర్క్ సరిగా చేయండి. దాన్ని మీ టెలిప్రాంప్టర్‌లో పొందుపర్చండి. అప్పుడే మిమ్మల్ని మీరు మూర్ఖులుగా ప్రదర్శించుకోలేరు మోదీ బాబూ అంటూ మమత హేళన చేస్తున్నారు. రాహుల్‌ను షాజాదా అంటూ మోదీ పరిహసిస్తున్న దానికంటే, మోదీని దొంగ అని రాహుల్ ఎద్దేవా చేస్తున్నదానికంటే మమత వందరెట్లు ఎక్కువగా మోదీ పనిపడుతున్నారు. మోదీకి అసలు సరస్వతీ మంత్రం అనేది ఒకటుం దని తెలుసా, దాన్ని సంస్కృతంలో జపిస్తారని తెలుసా అంటూ ఆమె దాడి చేస్తుంటే బహిరంగ సభలకు హాజరవుతున్న వందలాది ముస్లింలు సంతోషంతో పొంగిపోతుంటారు. ఆ వెంటనే మమత ఆహార వైవిధ్యం గురించి ప్రస్తావిస్తారు. ‘మోదీ బాబూ, మేం గుజరాత్ వచ్చినట్లయితే డోక్లా ఆరిగిస్తాం, తమిళనాడులో ఇడ్లీ, కేరళలో ఉప్మా, బిహార్‌లో లిట్టీ–చొఖ్కా, గురుద్వారాలో హల్వా, పంజాబ్‌లో లస్సీ ఇలా అన్ని రకాల ఆహారాన్నీ మేం తీసుకుంటాం. కానీ మీరు ప్రజలకు చేపలు, మాంసం, గుడ్లు తినవద్దని ఆదేశిస్తారు. గర్భిణి స్త్రీలు గుడ్లు తినవద్దంటూ ఆంక్షలు పెడతారు. చెప్పండి భాయీ, మహళ ఏం తినొచ్చో, ఏం తినగూడదో చెప్పడానికి నువ్వెవరు?’ అంటూ ఆమె మోదీని నిలదీస్తున్నారు. అంతేకాదు. ‘మోదీ ఏం తింటే అదే తినాలని దేశానికి చెబుతున్నారు.. ఆయన వాడే సూట్‌నే అందరూ కొనాలంటున్నారు. రోజు పొడవునా టీవీలో ఆయన ముఖాన్నే చూడాలని చెబుతున్నారు. నేను మోదీని గతంలో స్వార్థం లేని ఆరెస్సెస్ ప్రచారక్ అని భావించేవాడిని. కానీ కాఖీ నిక్కర్లతో పెరేడ్ చేసే ఈ ఆర్ఎస్ఎస్ మనుషులు షాపింగ్ మాల్స్‌లో ప్యాంట్లతో తిరుగుతూ, బ్రీఫ్‌కేసులు మోసుకుంటూ కోట్లరూపాయలు సాధిస్తూ సంపదలతో విర్రవీగుతున్నారు’ అంటూ మమత ముక్తాయిస్తున్నారు. ఆ తర్వాత పెద్ద నోట్ల రద్దు, వెంటనే రఫేల్ వ్యవహారం గురించి ప్రస్తావిస్తారు. చివరగా బీజేపీని పిడుగుపాటుకు గురిచేస్తారు. ‘ఇటీవల వరకు ఆకలి బాధతో ఉన్న పార్టీ, ఒకే బీడీని రోజులో మూడుసార్లు కాల్చి పీల్చుతూ వచ్చిన పార్టీ ఇప్పుడు వందల కోట్లకు యజమాని అయిపోయింది చూడండి’ అంటూ వ్యంగ్యబాణాలు సంధిస్తారు. ‘అయినా వారు తామింకా చౌకీదార్లమే అంటుంటారు’ అని మమత చెబుతుంటే కిందనుంచి జనాలు చౌకీదార్ చోర్ హై (కాపలాదారే దొంగ) అంటూ నినదిస్తారు. రాహుల్ ప్రసంగాల్లో ఒక్కదానికి కూడా జనం ఇలా స్పందించడం మీరు చూసి ఉండరు. రాహుల్ బెంగాల్లో మమత ప్రత్యర్థే కానీ ఆమె రాహుల్ నినాదాన్ని నేర్పుగా తన సొంతం చేసేసుకున్నారు. కాంగ్రెస్ కనిపెట్టిన చౌకీదార్ చోర్ హై నినాదాన్ని ఒక రాష్ట్ర స్థాయి నేత అత్యత సమర్థవంతంగా ప్రయోగిస్తే దేశమంతా అది ఎలా మార్మోగుతోందన్నది ప్రశ్న. దీనికి క్లుప్త సమాధానం ఏదంటే మోదీ–షాల వ్యవహారాన్ని కాంగ్రెస్ ఇంకా అర్థం చేసుకోవడం లేదన్నదే. వాజ్‌పేయి, అడ్వాణీల్లా కాకుండా మోదీ–షాలు వీధిపోరాట యోధులు. వీరు తమకు అనుగుణంగానే బీజేపీ డీఎన్ఏను మార్చిపడేశారు. స్ట్రీట్ ఫైట ర్లతో పోట్లాడాలంటే మీకూ స్ట్రీట్ ఫైటర్లు కావాలి. ముల్లును ముల్లుతో తీయడం, వజ్రాన్ని వజ్రంతోనే కోయడం, విషానికి విషంతోనే విరుగుడు కనిపెట్టడం అని ఈ వ్యాసం మొదట్లో నేను చెప్పిన దాని సారాంశ మిదే. 2019 ఎన్నికల్లో విషపూరితమైన, ప్రజలను విభజించే తరహా ప్రచారాన్ని మాత్రమే మోదీ–షాలు తమ బ్రహ్మాస్త్రంగా మార్చుకుంటే, మమత దాని పరిమితులను ఎత్తి చూపుతున్నారు. లేక 42 మంది ఎంపీలున్న తమ రాష్ట్రంలో అది చెల్లదు అని ఆమె తేల్చిచెబుతున్నారు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మనం గుర్తించని వ్యూహాత్మక తప్పిదం
పాకిస్తాన్ బూచిని చూపి మరోసారి అధికారంలోకి రావచ్చని బీజేపీ–మోదీలు పెను ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దానికి అడ్డుకట్ట వేశారు. పైగా ఎన్నికల నేపథ్యంలో భారతీయ ప్రజాభిప్రాయాన్ని వేరుపర్చే కీలక పాత్రను ఇమ్రాన్ పోషిస్తున్నారు. నరేంద్రమోదీ, బీజేపీ రెండోసారి అధికారంలోకి వస్తే పాక్‌కి మేలు చేకూరుతుందని, కశ్మీర్ సమస్యకు ఉత్తమ పరిష్కారం లభించవచ్చని ఇమ్రాన్ చేసిన ప్రకటన మన వ్యూహాత్మక తప్పిదాన్ని స్పష్టంగా ఎత్తిచూపింది. మన నేతలు ప్రజలను రాజకీయాల కోసం వేరుచేశారు. దేశం నిలువుగా చీలిపోయిన నేపథ్యమే మన ప్రత్యర్థికి మన అంతర్గత రాజకీయాల్లో వేలుపెట్టే అవకాశాన్ని కల్పించింది. వార్తలు నివేదించడానికి నేను తరచుగా పాకిస్తాన్ ప్రయాణిస్తూ ఉండేవాడిని. ఆ క్రమంలో నేను పాక్ వెళ్లడానికి మరోసారి వీసా అప్లికేషన్ దాఖలు చేస్తున్నప్పుడు న్యూఢిల్లీలో బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రముఖ పాక్ హైకమిషనర్ ఒకరు నన్ను పరిహసించడమే కాకుండా కొంచెం ఆగ్రహంతో ప్రశ్నించారు. ‘‘నా దేశ వ్యవహారాల్లో మీరెందుకు ఇంత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు?’’ ‘‘పాకిస్తాన్ రాజకీయాలు భారత అంతర్గత వ్యవహారం కదండీ’’ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో నేను ఆయనకు జవాబిచ్చాను. కాని ఇది తల్లకిందులుగా మారి, భారత్ రాజకీయాలు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాలుగా మారే పరిస్థితి వస్తుందని ఆరోజు మేం అస్సలు ఊహించలేకపోయాం. నరేంద్రమోదీ, బీజేపీ రెండోసారి అధికారంలోకి వస్తే పాకిస్తాన్‌కి మేలు చేకూరుతుందని, కశ్మీర్ సమస్యకు ఉత్తమ పరిష్కారం లభించవచ్చని ఈ వారం మొదట్లో ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనను మనం ఇలాగే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భారతీయ ఎన్నికల ఫలి తంపై ఇంత స్పష్టంగా తన వైఖరిని గతంలో ఏ పాక్ ప్రధాని అయినా ప్రదర్శించిందీ లేనిదీ గుర్తు చేసుకోవడం కష్టమే. పాకిస్తాన్ పౌరులు భారత్‌లో ఓటు వేయరు. భారతీయ ఓటర్లు ఇమ్రాన్ మాటలను వినరు. కాబట్టి భారత్‌లో ఒక అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారంటూ మనం ఇమ్రాన్‌ను నిందించలేం. ఈ అంశంపై ఎలక్షన్ కమిషన్ ఇమ్రాన్‌కి నోటీసు పంపలేదు. ఎందుకంటే ఈసీ నియమావళి పాకిస్తాన్లో వర్తించదు. కానీ ఇమ్రాన్ ప్రకటనపై భారత విదేశాంగ శాఖ సైతం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇక ఖండన గురించి చెప్పపనిలేదు. ఈ మౌనం మనకు ఏం సూచి స్తోంది? బహుశా ఈ మౌనానికి కారణం ఉంది. వ్యవస్థ మొత్తంగా ఒకే ఒక సుప్రీం లీడర్‌కి జవాబుదారీగా ఉంటున్నందున (ఇది నరేంద్రమోదీ గురించి నేను చేసిన వర్ణన కాదు. బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా వర్ణన) మోదీని సమర్థిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఇమ్రాన్ ప్రకటనను ఖండించే ప్రమాదాన్ని ఎవరూ స్వీకరించడం లేదు. ఆ ప్రకటన ఎవరు చేశారన్నది ముఖ్యం కాదు. కానీ ఆ ప్రకటనను ఎవరూ స్వాగతించడానికి సాహసించడం లేదు. అలాగని ఇమ్రాన్‌కి ధన్యవాదాలు చెప్పడం లేదు. ఎందుకంటే, నరేంద్ర మోదీని మరోసారి భారత ప్రజలు ఎన్నుకుంటే పాకిస్తాన్‌కు అది మంచిచేస్తుందని, భారత్‌తో శాంతి స్థాపనకు ఇది సానుకూలమవుతుందని ఇమ్రాన్ చెప్పారు మరి. కేంద్రప్రభుత్వ ఎన్నికల ప్రచారంలోని కీలక ప్రభావిత అంశాలకు ఈ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల కల్పన, దేశాభివృద్ధి వంటి అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని పాకిస్తాన్, ఉగ్రవాదం, ముస్లింలవైపు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వానికి నెలల సమయంపట్టింది. ఎంత సుదీర్ఘకాలం కొనసాగినా సరే.. నిర్ణయాత్మక యుద్ధం చేయడం ద్వారా పాక్‌కు గుణపాఠం చెబుతామనే హామీ ద్వారా మళ్లీ గద్దెనెక్కాలని మోదీ ప్రభుత్వం చూస్తోంది. పాకిస్తాన్‌తో శాంతిస్థాపన అంశంపై అది ఓటు అడగటం లేదు. ఈ కోణంలో ఇమ్రాన్ వ్యక్తం చేసిన మెత్తటి మాటలు తనను ఏదోలా ఉచ్చులోకి దింపాలని చూస్తున్నట్లు కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో పాక్ కేంద్ర బిందువుగా మారడం మన రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిసారి అని ముగించడం సంబద్ధంగా ఉంటుంది. ప్రత్యర్థి విసిరిన ఉచ్చులో చిక్కుకున్నదెవరు, దాంట్లోంచి తప్పించుకున్నదెవరు? అనే అంశానికి సంబంధించి మనం చాలా విషయాలు చూడవచ్చు. ఇంతవరకు దేశ చరిత్రలో ఎవరూ చేయనివిధంగా భారతీయ వ్యూహాత్మక విధానాన్ని ఎన్నికల అంశంగా మార్చుకోవడానికి పాక్ పూనుకుంది. సరిగ్గా ఇలాంటి ఘటనకు సంబంధించి ఒక ఉదాహరణ ఉంది. 1980 నాటి ఎన్నికల కేంపెయిన్‌లో ఇందిరాగాంధీ పదేపదే ఒక విషయాన్ని ఎత్తి చూపేవారు. మొరార్జీ దేశాయి నేతృత్వంలోని జనతా ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉంటోందంటే అతి చిన్న దేశాలు సైతం భారత్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి పూనుకుంటున్నాయి అని ఆమె విమర్శించేవారు. ఇక పాకిస్తాన్‌కు సంబంధించినంతవరకు 1990ల ప్రారంభంలో బేనజీర్ భుట్టో భారత రాజకీయాలపై ముఖ్య ప్రకటన చేశారు. అది ఎన్నికల సమయం కాదనుకోండి. ఒకవైపు కశ్మీర్ తగలబడిపోతుండగా పీవీ నరసింహారావు మౌనమునిలా చూస్తుండిపోతున్నారని, భారత్‌లో ఎవరితో సంప్రదించవచ్చో తనౖకైతే తెలియదని ఆమె ప్రకటించారు. గాంధీ (నెహ్రూ, ఇందిర) కుటుంబసభ్యులు అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండేదని ఆమె మరికాస్త జోడించారు. బేనజీర్ చేసిన ఆ అహంకార ప్రకటనకుగాను బారత్ ఆమెకు భయానక అనుభవాన్ని రుచిచూపుతుందని ప్రధానమంత్రి పీవీ కొంతమంది సంపాదకులతో భేటీ సందర్భంగా ఆగ్రహ ప్రకటన చేశారు. దాంట్లో భాగంగానే ఆయన మొదట్లో కశ్మీర్ ఉగ్రవాదం తొలి దశ పోరాటాలను ధ్వంసం చేసిపడేశారు. అంతకంటే మిన్నగా పంజాబ్‌లో ఖలి స్తాన్ తీవ్రవాదాన్ని తుదముట్టించేశారు. దేశీయ రాజకీయాల్లో పాకిస్తాన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంలో పీవీ చాలా తెలివిగా ఉండేవారు. భారత ఎన్నికలపై ఏనాడూ ప్రభావితం చూపని పాకిస్తాన్‌ను అవకాశం ఇవ్వని వ్యూహాత్మక విజ్ఞత పీవీలో చాలా ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం పాకిస్తాన్‌కి సరిగ్గా అలాంటి బహుమతినే బీజేపీ మోదీ ప్రభుత్వం అందించింది. ఇది తన ఉచ్చులో తానే పడిన చందంగా ఉంది. ఇప్పుడు భారత రాజకీయాలు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాలుగా కనిపిస్తున్నాయి. మన దేశీయ రాజకీయాల్లో పాకిస్తాన్ బహిరంగ జోక్యం పట్ల ఎలా ప్రతిస్పందించాలో మోదీ ప్రభుత్వానికి తెలియడం లేదు. ఇంకా పెద్ద సమస్య ఏమిటంటే, ఈ వైరుధ్యాన్ని తక్కిన ప్రపంచం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. భారత్‌లో అధికారంలో ఉన్న వారు పాకిస్తాన్‌ని శత్రువుగా చేసి తీవ్ర జాతీయవాద ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మరోవైపున పాకిస్తాన్ భారత్‌లో మోదీ ప్రభుత్వమే మళ్లీ ఎన్నికవ్వాలని కోరుకుంటోంది. దీనిపై మీరు సొంత వ్యాఖ్యానాలు చేసుకోవచ్చు. ఇది దక్షిణాసియాలో మాత్రమే సంభవిస్తుంది. ప్రపంచం ఇప్పుడు పైనుంచి కిందికి, కింది నుంచి పైకి తలకిందులుగా మారిపోయినట్లుంది. కౌటిల్యుడి నుంచి మాకియవెల్లి, హెన్రీ కిసింజర్ వరకు ఎవరి విజ్ఞతకు ప్రాధాన్యత ఇవ్వాలనేది మీరే ఎంచుకోవచ్చు. మనందరం మూడు కీలక అంశాలపై ఏకీభావం తెలుపుతాం. 1. మీపై మీరే జోస్యం చెప్పుకోవద్దు. 2. ఏ దశలోనైనా సరే మీ ప్రజాభిప్రాయాన్ని విభజించేటటువంటి దుస్థితిని మీరు ఎన్నడూ అనుమతించవద్దు. 3.అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, నీ దేశ జనాభాలో 15 శాతం, ఆర్థిక వ్యవస్థలో 11 శాతం, మీ విదేశీ మారక నిల్వల్లో 2.5 శాతం మాత్రమే ఉన్న ఒక విఫలదేశానికి.. వచ్చే అయిదేళ్లు మిమ్మల్ని ఎవరు పాలించాలి అనే అంశంపై ప్రభావితం చేసే అవకాశాన్ని మీరు ఎన్నటికీ ఇవ్వవద్దు. దానికి అనుమతించవద్దు. అమెరికా ఎన్నికలపై రష్యా ప్రభావం గురించి ముల్లర్ విచారణ కొనసాగడం, జూలియన్ అసాంజె అరెస్టుతోపాటు మనకు కూడా తాజా సందర్భం సవాలు విసురుతోంది. ఒక అతిచిన్న, పేద, నిరంకుశ, అణ్వాయుధాలు కలిగిన దేశం.. ప్రపంచంలోనే అతి పెద్ద శక్తివంతమైన ప్రజాస్వామిక వ్యవస్థను దాని ఎన్నికల సందర్భంగా ప్రభావితం చేసి దాని ఫలితాన్ని నిర్దేశించేందుకు పావులు కదుపుతోంది. పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రయత్నానికి మూడు కోణాలు ఉన్నాయి. అనేక రహస్యాలను తనలో ఉంచుకున్న వ్యవస్థకు వ్యతిరేకంగా ఉదారవాదంతో కూడిన వైరాగ్యాన్ని పెంచడం, ప్రజాస్వామిక వ్యవస్థల విశ్వసనీయతను ధ్వంసం చేయడం, బలమైన రాజకీయ నేతల వ్యక్తిత్వ హననాలకు పాల్పడటం. ఒకప్పుడు అసాంజే, స్నోడెన్ అమెరికా సమాజానికి నిజమైన ఉదార ప్రతీకలుగా ఉండేవారు ఇప్పుడు వారు అమెరికా రాజకీయాలను వినాశనం దారి పట్టించినందుకు వీరిని ద్వేషించాల్సిన వ్యక్తులుగా అమెరికా ఉదారవాద మీడియా ముద్రిస్తోంది. అయితే ఈ విషయంలో మనం మరీ అతిగా వ్యవహరిస్తున్నామా? చిన్నదేశమైన పాకిస్తాన్‌ని మహా రష్యాతో పోలుస్తున్నామా? ఒక విషయం గుర్తుంచుకోండి. రష్యన్ ఆర్థిక వ్యవస్థ నేడు భారత్ ఆర్థిక వ్యవస్థలో సగంకంటే ఎక్కువగానూ, అమెరికా ఆర్థిక వ్యవస్థ అతి చిన్న భాగంగానూ ఉంటోంది. మీరు మరీ మేధావిగా ఉండనక్కరలేదు. పాకిస్తాన్లో మూడు నక్షత్రాలు ధరించిన సగటు పాక్ జనరల్ ఐఎస్ఐలో లేక దాని ఒకానొక డైరెక్టొరేట్లలో కూర్చుని ఉంటున్నట్లు, అతడి తెలివి తన మెదడులో కాకుండా కాళ్లలో ఉంటుందని ఊహించుకోండి. మోదీ, బీజేపీ ఈ ఎన్నికల్లో మళ్లీ గెలవాలని తామెందుకు భావిస్తున్నాం అనే అంశాన్ని ఇమ్రాన్ నిజంగానే ప్రపంచానికి చెబుతున్నారనుకోండి. ఇలాంటి సైనిక జనరల్ ఇమ్రాన్‌కి ఇచ్చే సలహా ఎలా ఉంటుందో తెలుసా? కశ్మీర్‌లోని కొంత భాగాన్ని ధ్వంసం చేయాలని, సర్జికల్ దాడులకు తిరుగు సమాధానం ఇవ్వాలని మాత్రమే. భారత్‌లో ఎవరైనా స్నోడెన్, అసాంజే లాంటి ఉదారవాదులు ఉన్నారా అని కనుగొనే ప్రయత్నం కూడా ఆ పాక్ జనరల్ చేయడు. పాకిస్తాన్ అలాంటి ప్రయత్నం చేస్తుందా? నాకైతే తెలీదు. చేస్తుం దని ఆశకూడా లేదు. మనం ఇప్పటికే చేసిన వ్యూహాత్మక ఘోర తప్పిదాన్ని చూడలేకపోవడం అనే బాధాకరమైన వాస్తవం నుంచి మనల్ని మనం దాపెట్టుకుంటున్నాం. ఆ తప్పిదం ఏమిటి? మన శత్రువును దేశీ యంగా ప్రజలను వేరుచేసే అంశంగా మల్చడం, మన అంతర్గత వ్యవహారాల్లో వారికి చోటు కల్పించడం. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
కేంద్రంలో ‘ప్రాంతీయ’ ప్రాబల్యం!
ప్రస్తుతం దేశంలో నిజమైన జాతీయ పార్టీ ఏదీ ఇప్పుడు లేదని తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. గతంలో జాతీయపార్టీలుగా పేరొందిన బీజేపీ, కాంగ్రెస్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలుగానే మిగిలిపోయాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ రెండు పార్టీల పాదముద్రలు కనబడుతున్నాయి. వైఎస్సార్ ఆకస్మిక మరణానంతరం తన నిజమైన వారసుడిని ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ ఏపీలో సామూహికంగా ఆత్మహత్య చేసుకుంది. 20 మంది శక్తిమంతులైన ప్రాంతీయ నేతలతో భారత్ నిజమైన ఫెడరల్ రిపబ్లిక్‌గా ఎదుగుతోంది. 2019 సార్పత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సంకీర్ణం తప్పదు. భారతదేశాన్ని అవలోకించడానికి రెండు మార్గాలున్నాయని మీరు అర్థం చేసుకోదలిచినట్లయితే, మీరు తరచుగా దేశరాజధాని ఢిల్లీని వదిలి బయటకు రావాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే లోపలినుంచి బయటకు చూడటం.. అంటే ఢిల్లీ, దేశ ప్రధాన భూభాగం నుంచి వెలుపలకు తొంగి చూడటం లేక వెలుపలినుంచి లోపలికి చూడటం. అంటే దేశ ప్రధాన భూభాగాన్ని సుదూరం నుంచి చూడటం. మీరు లోపలి నుంచి బయటకు చూస్తున్నప్పుడు, జాతీయ పార్టీ, జాతీయ నాయకుల కోణం నుంచి మాత్రమే దర్శించే కోణాన్నే మీకు అందిస్తుంది. అలా కాకుండా సుదూరం నుంచి దాపరికం లేకుండా మీరు చూసినట్లయితే ఈ నూతన భారత్‌లో జరిగిన, జరుగుతున్న మార్పును మీరు చూడవచ్చు. అదేమిటంటే జాతీయపార్టీలుగా ఇన్నాళ్లుగా మనకు తెలిసిన పార్టీలు క్షీణించిపోతున్నాయి. మహా జాతీయ నేత అనే భావన ఇందిరాగాంధీతోనే ముగిసిపోయింది. భారత మహా రాజకీయ చిత్రపటంపై కొత్త చిత్రణలు ఈ వారం ఇద్దరు బలమైన రాష్ట్ర నాయకుల గురించి వివరించాయి. ఒకరు తెలంగాణలో తిరుగులేని నేత కె. చంద్రశేఖరరావు (టీఆర్ఎస్), రెండు. అంధ్రప్రదేశ్‌లో వైఎస్. జగన్మోహన్ రెడ్డి (వైఎస్సార్ సీపీ). భారత్‌లో నిజమైన జాతీయ పార్టీ ఇప్పుడు ఏదీ లేదని ఈ ఇద్దరు నేతలూ తమ శైలిలో చాలా స్పష్టంగా చెప్పారు. ఒకప్పుడు జాతీయ పార్టీలుగా వర్ణించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలుగానే ఉన్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ రెండు పార్టీల పాదముద్రలు కనపడుతున్నాయి. ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ క్షీణించిపోతున్నదని మనం అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో బీజేపీని జాతీయపార్టీగా ఎందుకు చెప్పలేం. ఢిల్లీలో కూర్చున్న మనం దేశం అంటే హిందీ ప్రాబల్యం ఉండే భూభాగం అని అయోమయానికి గురవుతున్నాం. ఉదాహరణకు 2014లో బీజేపీ సాధించిన 282 స్థానాల్లో మెజారిటీ ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హరి యాణా, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ (190 స్థానాలు) రాష్ట్రాల నుంచే వచ్చాయి. బీజేపీ సాధించిన మిగతా సీట్లలో 49 స్థానాలు పశ్చిమప్రాంతమైన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చాయి. అంటే ఈ అన్ని రాష్ట్రాల్లోని మొత్తం 299 సీట్లలో 239 స్థానాలను బీజేపీ సాధిం చింది. అంటే 80 శాతం స్థానాలు ఇక్కడినుంచే వచ్చాయి. మిగిలిన దేశ మంతటా మొత్తం దక్షిణప్రాంతం (కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు), తూర్పున (పశ్చిమబెంగాల్, ఒడిశా), ఉత్తరాన జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని 244 సీట్ల నుంచి బీజేపీ 43 స్థానాలు మాత్రమే గెల్చుకుంది. అంటే 17 శాతం మాత్రమే అన్నమాట. ఈ వ్యత్యాసాన్ని పరిశీలిస్తే బీజేపీని దేశమంతటా పునాది ఉన్న జాతీయ పార్టీగా గుర్తించలేం. అది కేవలం పది రాష్ట్రాల్లో మాత్రమే గెలిచిన పార్టీగా కనిపిస్తుంది. మరి జాతీయ నాయకుల మాటో? నరేంద్రమోదీ ఒక్కరు మాత్రమే ఆ స్థాయిని ఇవాళ ప్రకటించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికీ ఆయన తెలుసు. కానీ ఈ పది రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాల్లో ప్రజలు తనకు అధికంగా ఓట్లు వేసేలా మోదీ మ్యాజిక్ చేయగలరా? బీజేపీకి మెజారిటీనిచ్చిన ఈ పది రాష్ట్రాల్లో కూడా స్థానిక పార్టీలు, స్థానిక నేతల నుంచే మోదీకి సవాల్ ఎదురైంది. బిహార్‌లో లాలూ ప్రసాద్, నితిశ్ కుమార్‌లు సరిసమాన స్థాయి నాయకులు. ఈ ఇద్దరిలో చెరొకరితో కాంగ్రెస్, బీజేపీ జూనియర్ భాగస్వామి స్థాయిలో పొత్తు కట్టాయి. పంజాబ్‌లో బీజేపీ అకాలీదళ్‌తో పొత్తుకలిపి ఉంది. హరియాణాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ స్థానిక భాగస్వామికోసం గాలిస్తున్నాయి. చివరకు అసాధారణమైన వాగ్ధాటి కలిగిన మోదీ సైతం ఏడు రాష్ట్రాలకు మించి ఇతరత్రా తన పార్టీకి మెజారిటీ తీసుకువచ్చే పరిస్థితిలో లేరు. బీజేపీ 7 నుంచి 9 రాష్ట్రాల్లో మాత్రమే జాతీయ పార్టీ స్థాయిలో ఉండగా, కాంగ్రెస్ ఆరు రాష్ట్రాల్లో మాత్రమే జాతీయ పార్టీగా ఉంటోంది. అది కూడా చాలా చిన్న రాష్ట్రాల్లో మాత్రమే. అవేమిటంటే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, పంజాబ్, కర్ణాటక. ఇక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్‌లో కాంగ్రెస్ ఉనికిలో లేకుండా పోయింది. అందుకనే ఓటర్ దేవుళ్లు ఎంత కరుణిం చినా కాంగ్రెస్ గురిపెట్టగల స్థానాలు 150 మాత్రమే. ఇవి కూడా వచ్చే అవకాశం లేదని నాకు తెలుసు. మహా అయితే 100 స్థానాలను అది లక్ష్యంగా చేసుకోవచ్చు. అయితే బీజేపీ అర్థ జాతీయ పార్టీగా తన్నుతాను నిరూపించుకుంటూండగా, కాంగ్రెస్ మూడిట ఒక వంతు కూడా జాతీయ పార్టీ స్థాయిని కలిగిలేదు. నిజానికి, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గెలుపు సాధించగలిగిన నిజమైన చివరి జాతీయ నాయకురాలు ఇందిరాగాంధీ మాత్రమే. ఆమె తదనంతరం 1984 డిసెంబర్లో జరిగిన అసాధారణ ఎన్నికలను మినహాయిస్తే నిజమైన జాతీయనాయకులు కానీ, పార్టీలు కానీ ఆవిర్భవించలేదు. రాజకీయపరమైన ఈ ఖాళీని ప్రజాకర్షణ కలిగిన శక్తిమంతులైన రాష్ట్రాల, కులాల నాయకులు భర్తీ చేశారు. వీరిలో ఏ ఒక్కరినీ ప్రాంతీయ స్థాయి నేత అని వర్ణించినా అది అపప్రయోగమే అవుతుంది. ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలు 1952–77 కాలంలో కేవలం 4 శాతం ఓట్ల శాతాన్ని మాత్రమే సాధించగా, 2002–2018 కాలంలో అది 34 శాతానికి పెరిగింది. ఈ వేసవిలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. తమకు వస్తున్న ఓటింగ్ శాతం ప్రకారం వీరు మరిన్ని స్థానాలను పొందగలరు కూడా. ఇవాళ 34 శాతం ఓటుతో ఈ పార్టీలన్నీ లోక్‌సభ స్థానాల్లో 34 శాతం గెల్చుకోగలవు. ప్రతి అదనపు ఒక శాతం ఓట్లకు గానూ వీరు 11 స్థానాలను అధికంగా పొందనుండగా, జాతీయ పార్టీలు మాత్రం ఒక శాతం అదనపు ఓట్లతో కేవలం 7 స్థానాలు మాత్రమే పొందగలవు. ప్రణబ్ రాయ్, దొరబ్ సోపరివాలా పొందుపర్చిన ది వర్డిక్ట్ నుంచి తీసుకున్న డేటా ఆధారంగా నేను ఇలా చెబుతున్నాను. విభజన పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ వాటా సాంప్రదాయికంగానే 40 శాతం మేరకు ఉండేది. కానీ విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటు శాతం కేవలం 3 శాతానికి పడిపోయింది. మోదీ మెజారిటీతో ఉన్నా, అమిత్‌షా బీజేపీ సభ్యత్వాన్ని 10 కోట్లకు పెంచినా అసోం, త్రిపుర మినహాయిస్తే, కొత్త ప్రాంతాల్లో ఈ పార్టీ ఎక్కడా గెలుపొందలేదు. వాస్తవానికి దేశంలోని ఒక పరిమిత భూభాగంలో లేక రాజకీయ జనసంఖ్యలో ఇవాళ దేశంలో 20 మంది నాయకులు చాలా బలంగా ఉంటున్నారు. మోదీతో సహా ఏ జాతీయ స్థాయి నేత కూడా వీరి ఓట్లను కొల్లగొట్టలేరు. వీరిలో చాలామందికి పాలనాపరమైన, రాజకీయ పరమైన అనుభవం ఉంది. వీరందరికీ విభిన్న భావజాలాలు, అభిప్రాయాలు ఉండవచ్చు కానీ జాతీయ పార్టీల ఆధిపత్యం పట్ల ఏవగింపును ప్రకటించడంలో వీరందరూ ఐక్యత కలిగి ఉంటున్నారు. హిందీ ప్రాంతాలకు, ఢిల్లీకి బయట ఉన్న విశాలమైన ప్రగతిశీల ప్రపంచం మన ప్రముఖుల అభ్రదత అంశాన్ని ఈ ఎన్నికల సీజన్లో పట్టించుకోవడం లేదు. మోదీ గెలవకపోతే ‘కలగూరగంపే’ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. దక్షిణాదిలోగానీ, తూర్పునగానీ మోదీ గెలవకపోతే ఎవరు అనే ప్రశ్నేలేదు. మూడు దశాబ్దాల తర్వాత, కాంగ్రెస్ ఓటమి తర్వాత భారతదేశం నిజమైన ఫెడరల్ రిపబ్లిక్‌గా ఎదుగుతోంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే కాంగ్రెస్, బీజేపీ ఆధిక్యం కోసం పోటీ పడుతున్న రాష్ట్రాల్లో ఒక్క చోటా అసలైన ప్రాంతీయ నాయకుడు లేకపోవడం. యూపీ, బీహార్లలో లాలూ, నితీశ్, మాయావతి, అఖిలేశ్ బలమైన నాయకులు. కానీ, ప్రతి ఒక్కరికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. బీజేపీ వారిని ఎదిరించడం లేదంటే కలుపుకుపోవడం ద్వారా విజయాన్ని పంచుకుంటుంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఒక రకంగా కర్ణాటక సహా చాలా రాష్ట్రాల్లో వారికి బలమైన నాయకులు లేకపోయినా జాతీయ పార్టీలదే ఇప్పటికీ హవా. మరో కారణం బలమైన రాష్ట్ర నాయకులు ఎదగడానికి జాతీయ పార్టీలు సుముఖంగా లేకపోవడం. ఆంధ్రప్రదేశ్‌లో తన నిజమైన వారసుడు వైఎస్ జగన్‌ని ఎదగనీయడానికి బదులుగా కాంగ్రెస్ సామూహికంగా ఆత్మహత్య చేసుకుంది. సీఎం పదవిని ఆశించినందుకు ఆగ్రహిం చిన కాంగ్రెస్ పార్టీ, హెలికాఫ్టర్ ప్రమాదంలో తన తండ్రి వైఎస్సార్ చనిపోయిన తర్వాత వైఎస్ జగన్‌కి కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ వల్ల బీజేపీకి ఏమాత్రం లాభం లేదు. శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే, రమణ్ సింగ్‌లను ఇప్పటికే అది పక్కన పెట్టేసింది. దీంతో భారతదేశపు రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికర దశకు చేరుకున్నాయి. హిందీ ప్రాంతానికి బయట నిజానికి జాతీయ నాయకుడు, జాతీయ పార్టీ ఏర్పడే అవకాశం లేదు. సంకీర్ణ ప్రభుత్వాల పట్ల అభద్రతా భావం కూడా తగ్గుముఖం పడుతోంది. 2014 ఫలితాల్లో వలే పక్కపక్కనే ఉన్న రాష్ట్రాల్లో 200 స్థానాలు సాధించినా సరే.. పూర్తి స్థాయి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడే సూచనలు ప్రస్తుతం లేవు. 2019 ఎన్నికల్లో ప్రచారం చేయడానికేమీ లేదు. ఇవి ఎవరికైనా గాలివాటం ఎన్నికలే. 2014లో వలే కాకుండా 2004లో లాగా ఇవి రాష్ట్రాలవారీ ఎన్నికలని ఇప్పుడు మనం గట్టిగా చెప్పొచ్చు. తదుపరి సంకీర్ణానికి ఎవరు నాయకత్వం వహిస్తారని నన్ను అడగొద్దు, ఎందుకంటే నాకు కూడా తెలీదు. తదుపరి ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించినా రాం విలాస్ పాశ్వాన్ లాంటి వాడు కూడా నోరు తెరవగలిగే మంత్రివర్గం ఏర్పడుతుందని మాత్రమే నేను మీకు చెప్పగలను. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
‘ఉగ్ర’బూచితో గెలుపు సాధ్యమా?
నరేంద్ర మోదీ 2014లో జాతికి గొప్ప ఆశను వాగ్దానం చేసి ఘనవిజయం సాధించారు. అయిదేళ్ల తర్వాత పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద దాడుల భయాన్ని రేకెత్తించి మరోసారి గెలవాలని కోరుకుంటున్నారు. తన పాలనా ఘనతర చరిత్ర ఆధారంగా కాకుండా తన ప్రత్యర్థుల లోపాల్ని చూపి ఓటర్ల వద్దకు వెళ్లే వ్యూహాన్ని మోదీ పకడ్బందీగా ఎంచుకున్నారు. ఈ వ్యూహం వెనుక దేశాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగం, పేదరికం, వ్యవసాయ దుస్థితి వంటి అసలు సమస్యలు మరుగున పడిపోయాయి. రాహుల్ గాంధీ కనీస ఆదాయ పథకం హామీతో ఆలస్యంగా ముందుకొచ్చినా అతి తక్కువ సమయం కారణంగా అది దేశ ప్రజలను ఆకర్షిస్తుందా అనేదే ప్రశ్న. అధికారంలో ఉంటూ ఎన్నికల్లో మళ్లీ గెలుపొందాలని చూసే నాయకుడు తన ఓటర్లను అడిగే స్పష్టమైన ప్రశ్న: మీరు నాకు గతంలో ఓటు వేసినప్పటి కంటే ఇప్పుడు మీ పరిస్థితి బాగుందని భావిస్తున్నారా? కానీ నరేంద్ర మోదీ విషయానికి వస్తే ఆ ప్రశ్న మరోలా ఉంటుంది: మీరు నాకు అధికారం అప్పగించిన నాటి కంటే ఇప్పుడు మీరు మరింత సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నారా? సమాధానం ‘అవును’ అయినట్లయితే, మీరు రెండో దఫా కూడా అధికారంలోకి రావచ్చని భావించవచ్చు. సమాధానం ‘కాదు’ అయినట్లయితే అదే ప్రజలు, అదే ఓటర్లు మిమ్మల్నే మళ్లీ ఎందుకు ఎన్నుకోవాలి? అయితే మోదీ ప్రపంచంలో మూడో సంభావ్యత కూడా సిద్ధంగా ఉంటుంది. 2008లో ముంబైలో బాంబు దాడుల నాటి కంటే మీరు ఇప్పుడు తక్కువ అభద్రతా భావంతో ఉన్నట్లు భావిస్తున్నారా? ఒక సాంప్రదాయిక రాజకీయ నేత ఎల్లప్పుడూ తన పాలనా ఘనతర చరిత్ర ఆధారంగానే ఓటర్ల వద్దకు వెళుతుంటాడు. కానీ తెలివైన రాజకీయనేత మాత్రం తన ప్రత్యర్థుల లోపాల్ని చూపి ఓటర్ల వద్దకు వెళతాడు. ఈ కోణంలో చూస్తే మోదీని తెలివైన నేత అని కాకుండా మరోరకంగా చూడలేం. నిజంగానే మోదీ తన అయిదేళ్ల పాలనలో కశ్మీరేతర భారతదేశంలో ఎలాంటి భారీ స్థాయి ఉగ్రవాద దాడిని చవిచూడలేదు. పంజాబ్ సరిహద్దుకు అత్యంత సమీపంలో గుర్దాస్పూర్, పఠాన్కోట్లలో రెండు విఫల దాడులను మినహాయిస్తే, పాకిస్తానీ ఉగ్రవాద బృందాలు భారత్‌లో మరెక్కడా దాడి చేయలేకపోయాయి. అంతకు ముందు యూపీఏ మలిదశ పాలనలో (2009–14) కూడా కశ్మీర్‌తో సహా భారత్ కూడా ప్రశాం తంగా ఉండిందని మనం గుర్తించడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఆ విషయాన్ని మర్చిపోయింది. జాతీయ భద్రత విషయంలో తన సొంత విజయాల ప్రాతిపదికన మోదీ తాజా ఎన్నికల ప్రచారాన్ని సాగించడం లేదు. బదులుగా మరిన్ని అభద్రతల పునాదిపై తన ప్రచారం సాగిస్తున్నారు. మరోలా చెప్పాలంటే, నేను అధికారంలోకి వచ్చాకే జైషే, లష్కర్, ఐఎస్ఐ ఉగ్రవాదం పతనమైపోయింది చూడండి. 2014లో, మోదీ గొప్ప ఆశను వాగ్దానం చేసి మరీ ఘనవిజయం సాధించారు. అయిదేళ్ల తర్వాత పాకిస్తాన్ నుంచి భీకరమైన ఉగ్రవాద దాడుల భయాన్ని రేకెత్తించి మరోసారి గెలవాలని కోరుకుంటున్నారు. తనను వ్యతిరేకించిన వారెవరైనా సరే, ప్రత్యేకించి కాంగ్రెస్ వ్యతిరేకిస్తే వాళ్లు పాక్‌తో కుమ్మక్కు అయినట్లే లెక్క. అందుకనే, ఉగ్రవాదులు, పాక్ మాత్రమే ఈ ఎన్నికల్లో తన ఓటమిని కోరుకుంటున్నాయని మోదీ చెబుతూ వస్తున్నారు. అదే ఊపులో తన ప్రత్యర్థి ఉగ్రవాదులపై మృదువైఖరితో వ్యవహరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు కూడా. సరిహద్దులు దాటి పాక్‌పై జరిపిన దాడుల్లో విజయానికి సంబంధించిన ఆధారాలను అడిగే సాహసం చేస్తూ ప్రతిపక్షం మన సాయుధ బలగాలను అగౌరవిస్తున్నారని కూడా మోదీ అలవోకగా ఆరోపిస్తున్నారు. 2014లో తానే రేకెత్తించిన గొప్ప ఆశాభావం స్థానం నుంచి 2019లో ఈ భయాలను రేకెత్తించే స్థితికి మోదీ ఎందుకు మారిపోయినట్లు? మోదీ–షా నేతృత్వంలోని బీజేపీ ‘సంపూర్ణ రాజకీయాలు’ అనేభావనను నమ్ముతోంది. ఇక్కడ రాజకీయాలే 24 గంటలపాటు మీ ఏకైక వృత్తి, వినోదం, మనఃస్థితి, మత్తుగా ఉంటుంటాయి. ప్రభుత్వాధికారాన్ని ఏరంకంగానైనా సరే గెల్చుకునే తరహా రాజకీయాలను మనం ఇవాళ చూస్తున్నాం. గెలిచాక ఆ అధికారంతో ఏం చేస్తారో కూడా మనం చూడాల్సి ఉంటుంది.కాబట్టి కృత్రిమ ప్రచారంతో గారడీ చేస్తున్నట్లయితే అది చాలా పదునుగా ఉంటుంది, ఈ తరహా రాజకీయాలకు అది ఉపయోగకరం కూడా. మరోవైపున మీ ఐదేళ్ల పాలన రికార్డు ఆధారంగా తిరిగి గెలుపుకోసం వెళ్లడం అనేది ప్రమాదకరం. ఎందుకంటే అప్పుడు మీరు గతంలో చేసిన వాగ్దానాలకు, ఈరోజు వాటి అమలులోని వాస్తవికతకు మధ్య తేడాను ప్రజలు పోల్చి చూస్తారు. మీరు ఉద్యోగాల కల్పన గురించిన సకల సమాచారాన్ని దాచి ఉంచి జీడీపీ గణాంకాలను పైకి లేవనెత్తవచ్చు. కానీ మీరెలా ఫీలవుతున్నారు అని ప్రజలను అడిగారంటే మాత్రం వారు వెంటనే వాస్తవాలను శోధిస్తారు. మరుగుదొడ్లు, ముద్రా రుణాలు, ఉజ్వల ఎల్పీజీ కనెక్షన్లు, వ్యవసాయానికి మద్దతునిచ్చే ప్రత్యక్ష నగదు బదిలీలు, విద్యుత్ కనెక్షన్లు వగైరా మీ పథకాల ద్వారా ప్రజలు వాస్తవంగా ఎన్ని మేళ్లు పొంది ఉన్నా సరే, ప్రజలు అడిగే ప్రశ్నలు ఇంకా ఉండే ఉంటాయి. అవెంత ప్రమాదకరమో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే 2004 నాటి భారత్ వెలిగిపోతోంది అనే ప్రచారార్భాటం గురించి ఎల్కే అడ్వాణీని అడిగి చూడండి చాలు. మోదీ ప్రారంభ ప్రసంగాలు పాక్, ఉగ్రవాదం, తన ప్రత్యర్థి పార్టీల అవినీతి, వాటి జాతీయవాద రాహిత్యం వంటి వాటిని సూచించేవి. కానీ ఉద్యోగాలు, వృద్ధి, వ్యవసాయ దుస్థితి వంటి అంశాలను తాను ప్రస్తావించేవారు కాదు. దీనర్థం ఏమిటి? ప్రతిపక్షం తనపై మోపే ఆరోపణలను సమర్థించుకోవడానికి భిన్నమైన పద్ధతిలో మోదీ తన ఎన్నికల ప్రచారాన్ని రూపొందించుకుంటున్నారు. ఉగ్రవాదం, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం తర్వాత మరొక అంశం కూడా ముందుపీఠికొస్తుంది. ముస్లిం లను పక్కన బెట్టడం ద్వారా మోదీ, షాలు 2014 ఎన్నికల్లో గెలుపు సాధించారు. మంత్రిమండలిలో, అత్యున్నత రాజ్యాంగ, పాలనా పదవుల్లో ముస్లింలను పూర్తిగా మినహాయించే తరహా అధికార నిర్మాణాన్ని వీరు చేపట్టారు. దేశ జనాభాలో 14 శాతంగా ఉన్న ముస్లింల నుంచి ఏడుగురు అభ్యర్థులను మాత్రమే పోటీకి నిలిపి కూడా లోక్‌సభలో వారు విజయం సాధించారు. ఆ తర్వాత 20 శాతం మంది ముస్లిం జనాభా ఉన్న యూపీలో ఒక్కరంటే ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలపకుండానే ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. మోదీ, షా వ్యూహం ఎంత విజయవంతమైందంటే, బీజేపీ ముస్లింలను ఇంతగా దూరం పెట్టడంపై సవాలు చేయడానికి కూడా కాంగ్రెస్ ధైర్యం చేయడం లేదు. కారణం తననెక్కడ ముస్లిం పార్టీ అని ఆరోపిస్తారో అనే భయం. భావజాలపరంగా కూడా తనకు సవాలు ఎదురు కాకపోవడంతో మోదీ ముస్లింలను దూరం పెట్టడం అనే వ్యూహాన్ని మరింత విస్తృతపరుస్తారంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఆ ధైర్యంతోనే మోదీ తనను పాకిస్తానీలు, ఉగ్రవాదులతోపాటు ప్రతిపక్షం కూడా ఈ ప్రాతిపదికనే ఓడించాలని భావిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ బలమైన ఓటు బ్యాంకు అయిన ముస్లింల వైఖరి ఎలా ఉంటుంది? కాబట్టి ఉగ్రవాదులు, పాకిస్తానీలతోపాటు, ముస్లింలు కూడా తన ఓటమికి ప్రయత్నిస్తున్నారని మోదీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముస్లింలు తనకు ఓటువేయకపోతే ఏం ఫర్వాలేదు. వారికి వ్యతిరేకంగా హిందువులు ఐక్యమవుతారు. అయితే తోటి భారతీయ ముస్లింలకు వ్యతిరేకంగా నేరుగా ఇలా ప్రచారం చేస్తే అది ఫలితమివ్వదు. కాబట్టి ముస్లింల నుంచి ప్రమాదం ఉందని చెబితే చాలు. పాకిస్తానీ ముస్లింలు, భారత్ పాక్ అనుకూల కశ్మీరీలు, పాక్ అక్రమిత కశ్మీర్‌లోని ముస్లింలు, తూర్పున బంగ్లాదేశీ ముస్లింలు అంటూ ప్రచారానికి లంకించుకుంటే సరిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు అమలులో ఉన్న అన్ని దేశాల్లో ఈ ధోరణే ఇప్పుడు నడుస్తోంది. ట్రంప్ మొదలుకుని ప్రపంచంలో ప్రజాదరణ పొందిన నేతలందరూ తమ పునాది వర్గాల గురించి మాత్రమే మాట్లాడుతూ, ఇతరుల్లో భయాందోళనలు కలిగిస్తూ వారిని జాతీయ స్రవంతి నుంచి పక్కను నెట్టివేస్తున్నారు. ట్రంప్ నుంచి, నెతన్యాహు నుంచి మోదీ వరకు మెజార్టీగా ఉన్న ప్రజల్లో ఒక భయానక అనుభవాన్ని కల్పిస్తారు. తమ సొంత దేశంలో తామే మైనార్టీలు కానున్న భావన కలిగిస్తారు. అక్రమ వలసదారులను ట్రంప్ బూచిగా చూపిస్తే, దేశంలోనే ఉన్న వామపక్ష ఉదారవాదులు, మైనార్టీలు, ప్రతిపక్షం, స్వేచ్ఛాయుత మీడియా, నిర్బంధ ప్రతికూలతలను పెద్ద శత్రువుగా మోదీ చూపుతున్నారు. ఇది ప్రతిపక్షాన్ని ఎక్కడికి నెడుతుంది? మోదీ తన వర్గాన్ని సురక్షితంగా ఉంచుకోగా, మిగిలిన వారంతా చెల్లాచెదురుగా ఉండటంతో ఆయన గమ్యం చేరుకోవడం సులువవుతుంది. అవినీతి, జాతీయ భద్రత అంశాల ఆధారంగా కాంగ్రెస్ మోదీతో పోరాడలేదు. తాజా దాడులతో మోదీ అనితర సాధ్యమైన కోటను నిర్మించుకున్నారు. ప్రతిసారీ మోదీ విమర్శకులుగా గుర్తింపు పొందినవారు దాడులపై ఆయన ఉద్దేశాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. కాబట్టి మోదీ రెండు అంశాలను సిద్ధం చేసుకున్నారు. ప్రతిపక్షాన్ని విభజించడం, తన పద్ధతిలో వారిపై యుద్ధం చేయడం. కనీస ఆదాయ పథకం (ఎన్‌వైఏవై) వంటి ప్రకటనలతో కాంగ్రెస్ ఆలస్యంగా మేలుకొంది. కాంగ్రెస్ నెలకు ఆరువేలు ఇస్తామనడం, మోదీ చిన్న రైతులకు ఇస్తానన్న ఐదొందలు కంటే చాలా ఎక్కువ. సంప్రదాయకంగా చూస్తే కాంగ్రెస్ సంక్షేమ పార్టీ కాగా, బీజేపీ కేవలం జాతీయవాద పార్టీ మాత్రమే. తీవ్ర నిరుద్యోగికత, వ్యవసాయ సంక్షోభం, పరిష్కారం కనుగొనకుండా సాగదీయడంపై అసంతృప్తి ఉన్నవారు చాలామందే ఉన్నారు. ప్రశ్న అల్లా ఏమిటంటే మోదీ ఎంపిక చేసుకుంటున్న ప్రచారాంశాలనుంచి బయటకు లాగి, తాను సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం రాబట్టేంత నైపుణ్యం, వనరులు కాంగ్రెస్‌కు ఉన్నాయా అన్నదే. ఒకవేళ దీన్ని సాధించినప్పటికీ, భారత్‌లోనే అత్యంత నిరుపేదలు నివసిస్తున్న పశ్చిమబెంగాల్, ఒడిశా, తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్లలో కాంగ్రెస్‌కు పునాదులే లేవు. కానీ కనీస ఆదాయ పథకం అనేది దాని రాజకీయ చింతనలో ఆసక్తికరమైనదే. ఈ ప్రాతిపదికన కొత్త పొత్తులకు ప్రయత్నాలు ఆరంభించి మోదీకి నిజమైన పోటీ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి మరి కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి మరి. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
స్వీయ విధ్వంసం దిశగా పాక్
భారత్‌తో వెయ్యేళ్ల పవిత్రయుద్ధాన్ని కొనసాగిస్తానని నాటి పాక్ ప్రధాని జుల్ఫికర్ ఆలీ భుట్టో ప్రకటించి 50 ఏళ్లు గడిచాయి. ఈ యాభై ఏళ్లలోనే పాక్ తన సైనిక బలాన్ని మినహాయిస్తే ఉజ్వల గతాన్ని కోల్పోయింది. జనాభా పెరుగుదలలో తప్పిస్తే ఏ రంగంలోనూ భారత్‌తో పోటీ పడే స్థాయి పాక్‌కు లేదు. పుల్వామా ఘటన తర్వాత పాక్ భూభాగంపై భారత్ యుద్ధ విమానాలు దాడి చేసినా అరబ్ దేశాలతో సహా యావత్ ప్రపంచం భారత్‌నే బలపర్చాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాలను పక్కనబెట్టి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కొత్త అడుగు వేయకపోతే పాక్ ఒక జాతిగా, దేశంగా మరింత దిగజారిపోవడం ఖాయం. ఇమ్రాన్‌కు ఆ శక్తి ఉందా అన్నదే కీలకం. నేటి పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు రెండు సవాళ్లు ఎదురవుతాయి. పాక్ చరిత్ర, దాని భూభాగం లేదా రాజకీయాలపై లేక ఆ దేశం గురించిన ఏ అంశంమీద అయినా సరే మాట్లాడాలని ఉన్నా ఎక్కడి నుంచి ప్రారంభించాలన్నదే ప్రశ్న. ఇప్పుడు వింగ్ కమాం డర్ అభినందన్ వర్థమాన్ భారత్‌కి తిరిగి వచ్చే క్షణాల కోసం మనందరం వేచి ఉంటున్నాము. గతంలోకి వస్తే పాక్‌పై చర్చకు నేను 2009, 1999, 1989, 1979 సంవత్సరాలను కూడా ఎంచుకునేవాడిని. అయితే వీటన్నిటికీ బదులుగా నేను మిమ్మల్ని ఇప్పుడు 1969 సంవత్సరంలోకి తీసుకువెళుతున్నాను. కలవరపడవద్దు. మీరు వర్తమానంలోకి త్వరలోనే తిరిగివస్తారు. ముస్లిం దేశాలపై 1967లో సాగించిన ఆరురోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ అద్భుత విజయం సాధించిన తర్వాత ముస్లిం దేశాలు 1969లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ (ఓఐసీ)ను నెలకొల్పాలని నిర్ణయించుకున్నాయి. నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆ సదస్సుకు దూరంగా ఉండటానికి బదులుగా తన మంత్రి పక్రుద్ధీన్ ఆలీ అహ్మద్ (తదువరి భారత రాష్ట్రపతి)ని భారత ప్రతినిధి బృందం అధిపతిగా పంపించాలని నిర్ణయించారు. కానీ ఆమె ప్రయత్నాన్ని పాకిస్తాన్ అడ్డుకుంది. ఆనాటికి ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కల దేశం (పాక్) ప్రాతినిధ్యం లేకుండా ఓఐసీ ఉనికిలోకి రావడం అసాధ్యమన్న తర్కాన్ని ఇస్లామిక్ ప్రపంచం అంగీకరించింది కూడా. ఆనాటికి పాకిస్తాన్‌ను రెండుగా విడిపోలేదని గుర్తుంచుకోవాలి. దీంతో భారత్ రాకను ఓఐసీ తిరస్కరించింది. భారత్‌కు అవమానమే మిగిలింది. సరిగ్గా 50 ఏళ్ల ముందుకెళ్లి చూడండి. నాలుగో ఇస్లామిక్ దేశాల సమితి సదస్సులో భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ గౌరవనీయ అతిథిగా హాజరయ్యారు. ప్రపంచంలోనే ముస్లిం జనాభా అధికంగా కలి గిన మూడో దేశంగా భారత్‌ను ఎత్తిపడుతూ ఆమె ఆ సదస్సులో అద్భుతంగా ప్రసంగించారు. ముస్లింలు భారతీయ వైవిధ్యతలో భాగమని, భారతీయ ముస్లింలలో కేవలం 100 మంది మాత్రమే ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరారని ఆమె తెలిపారు. అయితే ఈ అంశానికి సంబంధించి చాలా భిన్నమైన, సరైన వాదనలు కూడా ఉన్నాయనుకోండి. భారత జాతీయ స్రవంతిలో ఉన్న ముస్లింలను సుష్మా స్వరాజ్ పార్టీ వేరుగా చూడడం, జాతి మొత్తం నుంచి వారిని దూరంగా ఉంచడం, కశ్మీర్‌లను రాక్షసులుగా చిత్రీకరించడంపై చాలా వ్యతిరేకత కూడా ఉంటోంది. కానీ ఒక మతవాద హిందూ జాతీయ మూలాలున్న భారత ప్రభుత్వానికి చెందిన ఒక అత్యున్నత మహిళా నేత ప్రపంచ ముస్లింలకు తన దేశ ముస్లింల గురించి ఇలా చెప్పడంలోని ప్రాధాన్యతను తక్కువ చేసి చూడవద్దు. పైగా భారత్‌ను ఆతిథ్య దేశంగా ఆహ్వానించారన్న దుగ్ధతో పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాల కూటమి సదస్సుకు గైర్హాజర్ కావడాన్ని మనం విస్మరించకూడదు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఇదే పాక్ ఇస్లామిక్ దేశాల కూటమిలో భారత్ చేరికనే వీటో చేయగలిగేటంతటి శక్తిని కలిగి ఉండేది. ఈరోజు భారత్‌కు ఆహ్వానం పట్ల తీవ్ర వ్యతరేకతతో సరిపెట్టుకోవడమే కాకుండా అవమానకరంగా ఆ సదస్సునే పాక్ బహిష్కరించే స్థితిలో పడిపోయింది. తన అణ్వాయుధాలతో, క్షిపణులతో, 20 కోట్లమంది ముస్లిం జనాభాతో ఇస్లామిక్ దుర్గంగా తన్ను తాను పిలుచుకుంటూ వచ్చిన పాకిస్తాన్ ఎలాంటి విషాద స్థితిలోకి కూరుకుపోయిందో ఆలోచించాల్సిందే. 1979లో సోవియట్ యూనియన్ ఆప్ఘనిస్తాన్‌ను దురాక్రమించిన తర్వాత పాకిస్తాన్ ఉన్నట్లుండి అమెరికాకు, దాని మిత్ర దేశాలకు, సౌదీ ఆరేబియా, చైనాలకు కూడా ఆప్తమిత్రురాలైపోయింది. 1971 యుద్ధం తర్వాత పునర్నిర్మాణంలో ఉంటున్న పాకిస్తాన్‌కు దీంతో తన సైన్యాన్ని సాయుధం చేయడం సులభమైపోయింది. ఉన్నట్లుండి పాక్ నియంత జియా ఉల్ హక్ జిహాదీల నిజమైన నేతగా అవతరించేశారు. ఆప్ఘనిస్తాన్‌లో ప్రచ్చన్నయుద్ధం ప్రభావంతో పాకిస్తాన్ సాధించిన ఈ కొత్త శక్తి జియాకు పూర్తిగా తలకెక్కేసింది. సోవియట్ యూనియన్ వంటి అగ్రరాజ్యంపై యుద్ధానికి నాయకత్వం వహిస్తున్న తమకు భారత్‌తో యుద్ధం చేయడం ఒక లెక్కా అనేంత గర్వం జాతీయస్థాయిలో పెరిగిపోయింది. ఆ తర్వాతే భారత్‌లోని పంజాబ్‌లో 1981లో తీవ్రవాదం మొదలైంది. పాక్ ఆధిపత్యం శిఖరస్థాయిలో ఉన్న ఈ దశలోనే నేను పాక్‌లో తొలిసారిగా పర్యటించాను. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన సిక్కు తీవ్రవాదులపై పాక్‌లో జరుగుతున్న విచారణను నివేదించడానికి 1985 వేసవిలో పాక్ వెళ్లాను. అక్కడి ప్రజల సంపద, జీవన ప్రమాణాలు, మౌలిక వసతుల అభివృద్ధి, నాణ్యమైన టెలికామ్ సర్వీసులు వంటి అంశాల్లో సగటు పాకిస్తానీయులు 1985లో సగటు భారతీయులకంటే ఎంతో మిన్నగా జీవించేవారు. ఎందుకంటే పాక్ తలసరి ఆదాయం అప్పట్లో భారత్ కంటే 60 శాతం అధికంగా ఉండేది. మళ్లీ ఇప్పుడు 2019కి వద్దాం. నేడు సగటు భారతీయుడు పాకిస్తానీయుల కంటే 25 శాతం అధికంగా సంపాదిస్తున్నాడు. ప్రచ్చన్నయుద్ధ విజయం ద్వారా సరికొత్త భౌగోళిక వ్యూహాత్మక ప్రాధాన్యత సాధించిన పాకిస్తాన్ 60 శాతం సంపదను పొగొట్టుకుని భారత్ కంటే చాలా వెనుకబడిపోయింది. ప్రతియేటా ఈ అంతరం 5 శాతం మేరకు పెరిగిపోతోంది. భారత ఆర్థిక వ్యవస్థ నేడు పాక్ కంటే 3 శాతం అధిక పాయిం ట్లతో ముందుకెళుతోంది. పాక్‌ను దాటి మనం ఈ స్థాయికి ఎలా చేరుకున్నాం. 50 ఏళ్ల క్రితం నాటి పాక్ ప్రధాని జుల్ఫికర్ ఆలీ భుట్టో భారత్‌పై వెయ్యేళ్ల యుద్ధానికి పిలుపిచ్చారు. అయితే 1969 తర్వాత గడచిన 50 ఏళ్ల కాలంలో పాకిస్తాన్ తన ప్రాధాన్యతను ఎంతగా కోల్పోయిందంటే, ఇస్లామిక్ దేశాల కూటమి సైతం భారత్‌కే ప్రాధాన్యం ఇస్తోంది. మరీ ముఖ్యంగా జిహాద్‌ను జీవనంగా మార్చుకున్న గత 40 ఏళ్ల కాలంలోనే పాక్ ఆర్థిక వ్యవస్థ అడుగంటిపోయింది. భారత్‌తో శాశ్వత రక్తపాత ఘర్షణలకు గాను పాక్ చెల్లించాల్సి వచ్చింది దీంతోనే ముగియలేదు. 1989లో ఓటమిని అంగీకరించిన సోవియట్ యూనియన్ ఆప్ఘనిస్తాన్ నుంచి సైన్యాన్ని వెనక్కు పిలిచేందుకు చర్చలు ప్రారంభించింది. దాంతో విజయోన్మాదం తలకెక్కిన పాక్ పాలనా యంత్రాంగం తన దృష్టిని తూర్పువైపు మళ్లించింది. ఆ తర్వాత మూడేళ్లపాటు కశ్మీర్, పంజాబ్ రక్తమోడాయి. వేలాది మంది శవాలుగా మిగిలారు. ఆ తర్వాత పాక్‌లో అంతర్గత మార్పులు సంభవించి నవాజ్ షరీఫ్ నూతన ప్రధానిగా ఎంపికై 1999 జనవరిలో నాటి భారత ప్రధాని వాజ్‌పేయితో శాంతి చర్చలను ప్రారంభించారు. అదే సమయంలో ఆయన సైన్యం కార్గిల్‌లో యుద్ధరంగాన్ని సృష్టించింది. పాక్ ఆ యుద్ధాన్ని కోల్పోయింది. దాంతోపాటు రెండు ముఖ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. కశ్మీర్ వివాదాస్పద భూభాగం అనే అభిప్రాయం ప్రపంచ స్థాయిలో ముగిసిపోయింది. ఆధీన రేఖ వాస్తవ సరిహద్దుగా ఉంటుం దని, దాన్ని ఇరుదేశాలూ గౌరవించాలనే అభిప్రాయం బలపడింది. పెర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాటు ద్వారా నవాజ్ షరీప్‌ను దించేశారు. దీంతో పాక్ ప్రజాస్వామ్యం మళ్లీ కనుమరుగైంది. ఆ పదేళ్ల కాలంలో పాకిస్తాన్ కశ్మీర్‌పై తన నైతికాధికారాన్ని చేజార్చుకుని సైనిక పాలనన కౌగలించుకుంది. దీనంతటికీ ఒకే ఒక్క కారణం. స్వీయ విధ్వంసకరమైన ఆలోచనా తత్వం. అప్పటినుంచి మనం చాలా దూరం వచ్చేశాం. 2008 ముంబైలో ఉగ్రవాద దాడి ఉన్మాదంతో పాకిస్తాన్ గ్లోబల్ జిహాద్ కేంద్రంగా తన స్థానాన్ని చక్కగా పదిలిపర్చుకుంది. భారత్ విషయానికి వస్తే కార్గిల్ యుద్ధం, పార్లమెంటుపై ఉగ్రదాడి తర్వాత తీవ్రంగా స్పందించకుండా సంయమనం పాటించిన భారత్ తక్కిన ప్రపంచాన్ని తనవైపునకు లాక్కుంది. ఫలితంగా ఈరోజు పుల్వామా దాడి తర్వాత పాక్‌పై ఎదురుదాడి చేసినప్పటికీ సౌదీ అరేబియా, యూఏఈతో సహా యావత్ ప్రపంచ మద్దతును భారత్ పొందుతోంది. ఈ మొత్తం చరిత్రను అవలోకిద్దాం. కేవలం 50 ఏళ్ల కాలంలో పాకిస్తాన్ ఇస్లామిక్ ప్రపంచంలో తన ప్రాధాన్యతను కోల్పోయింది. అరబ్ దేశాలు దాన్ని నిరోధిస్తున్నాయి. ఇరాన్ శత్రుపూరితంగా ఉంది. గత 40 ఏళ్ల కాలంలో పాక్ తలసరి ఆదాయం భారత్‌తో పోలిస్తే 90 శాతం లోటుతో కునారిల్లుతోంది. ఈ అంతరం ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. గత 30 ఏళ్ల గతాన్ని చూస్తే పంజాబ్, కశ్మీర్లో తన సైనిక కేంపెయిన్లను పాక్ కోల్పోయింది. అదే సమయంలో పాక్ నగరాలు, వ్యవస్థలు శాశ్వతంగా జిహాద్ దుర్గాలుగా మారాయి. గత 20 ఏళ్ల కాలంలో ఆధీనరేఖ కశ్మీరులో వాస్తవ సరిహద్దుగా మారిపోయింది. ఉగ్రవాదాన్ని ఒక విధానంగా కొనసాగించడాన్ని ఏ ఒక్కరూ ఇప్పుడు సహించడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా పాకిస్తాన్ భూభాగంపై భారత్ వైమానిక దాడులు చేసినప్పటికీ ఏ ఒక్క దేశమూ దాన్ని ఖండించిన పాపాన పోలేదు. పైగా పాక్ పదే పదే ప్రదర్శిస్తున్న అణు బూచిని భారత్, ప్రపంచం కూడా లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత పాలకుల విధానాలనే కొనసాగించవచ్చు లేక సరికొత్త ఆలోచనలతో నూతన ఇన్నింగ్స్‌ని ప్రారంభించవచ్చు. ఇమ్రాన్ సాహసంగా అడుగులేస్తే అది ప్రమాదకరమే కానీ దానివల్ల పాకిస్తాన్ విజయపథంలో నడిచే అవకాశం ఉంది. ఇమ్రాన్ అలా చేయలేకపోతే, రెండు విషయాలు మాత్ర పక్కాగా జరుగితీరుతాయి. వ్యక్తిగా ఇమ్రాన్ వైఫల్యం. ప్రతిభావంతులైన ప్రజలు, బలమైన జాతీయవాదం, భౌగోళిక సంపన్నత, బలమైన సైన్యం ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఒక జాతిగా దిగజారిపోవడం కొనసాగుతుంది. పాక్ భవిష్యత్తుకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశం ఇదే మరి. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
దాచేస్తే దాగదు ‘రఫేల్’
రఫేల్ ఒప్పందంపై తాజా సంచలనాత్మక వివరాల నేపధ్యంలో స్పష్టమవుతున్నది ఒక్కటే. అహంకారంతో, మూర్ఖత్వంతో కేంద్రం తనకుతానుగా తెచ్చిపెట్టుకున్న కుంభకోణంగా తప్ప మరే కోణంలోనూ దీన్ని చూడలేం. కేంద్రప్రభుత్వం వాస్తవాన్ని ముందే యధాతథంగా చెప్పి ఉన్నట్లయితే, సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి కుంభకోణంలో ఇరుక్కునే ప్రమాదం నుంచి తప్పించుకుని ఉండేది. ప్రత్యర్థులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఆశించగల అర్హత వారికి లేదని, తాము అన్ని అంశాల్లోనూ సరిగా ఉన్నామనే స్వీయ అహంకారంలో మునిగిపోయి ఉన్నప్పుడే ఇలా జరుగుతుంటుంది. రఫేల్ వివాదంలో మోదీ ప్రభుత్వం పతన దశ ఇక్కడే మొదలైంది. రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందంపై తాజాగా ద హిందూ పత్రికలో ఎన్ రామ్ వెల్లడించిన విషయాలు, వాటికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యక్తపరిచిన సమర్థనలు ఈ అంశంపై జరుగుతున్న చర్చను ముందుకు తీసుకుపోవడంలో మరింతగా సహాయపడ్డాయి. ఈ నేపథ్యంలో రఫేల్ ఒప్పందం గురించి స్పష్టమవుతున్నది ఒక్కటే. ఇది అహంకారం, మూర్ఖత్వంతో కేంద్రం తనకుతానుగా తెచ్చిపెట్టుకున్న కుంభకోణంగా తప్ప మరే కోణంలోనూ దీన్ని చూడలేం. రఫేల్ స్పష్టపరుస్తున్న తాజా వివరాలను ఒకటొకటిగా చూద్దాం. 1. మనోహర్ పారికర్ నేతృత్వంలోని రక్షణ శాఖ ఉన్నతాధికారులు రఫేల్ చర్చలు పట్టాలెక్కిన తీరుపై చాలా అసౌకర్యంగా లేక అభద్రతను ఫీలయ్యారు. ఈ ఒప్పందం పట్ల తమ అభ్యంతరాన్ని వారు రికార్డు చేశారు కూడా. 2. కానీ వారి అభ్యంతరాలను మరీ అతిగా స్పందించారని పేర్కొంటూ రక్షణ మంత్రి తోసిపుచ్చారు. పైగా ప్రధానమంత్రి పీఎస్ (బహుశా ప్రిన్సిపల్ కార్యదర్శి)తో సంప్రదింపులు జరపాల్సిం దిగా శాఖాధికారులను ఆదేశించారు. 3. దీనర్థం ఏమిటి? అత్యున్నత స్థానంలో ఉన్న రాజకీయ నాయకత్వం ఉన్నతాధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చిందనే కదా. ఈ ఒప్పందాన్ని సత్వరంగా కుదుర్చుకోవాలని నాయకత్వం కోరుకుంది. 4. సూత్రబద్ధంగా చూస్తే ఇది సరైందే. ఎందుకంటే సందేహాలను లేవనెత్తడం ఉన్నతాధికార వర్గం సహజ స్వభావం. నిర్ణయాత్మక శక్తి కలిగిన రాజకీయ నేత అలాంటి అభ్యంతరాలను తోసిపుచ్చి తన నిర్ణయానికి బాధ్యత తీసుకుంటాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడినుంచి మనం సమస్యను కొనితెచ్చుకుంటాం. పై నాలుగు అంశాలు నిజానికి ఏం చెబుతున్నాయి? అంటే.. ఒక ఒప్పందం కుదరాల్సి ఉంది. సాధారణంగానే ఉన్నతాధికారులు తమ స్వచర్మరక్షణను చూసుకుంటారు, కానీ దృఢమైన, జాతీయవాదంతో కూడిన నిజాయితీ కలిగిన ప్రభుత్వం తమముందు ఉన్న అవరోధాలను తొలగించుకుని ఒప్పందాన్ని ఖాయపరుస్తుంది. అలాంట ప్పుడు సాహస ప్రవృత్తి కలిగిన అదే ప్రభుత్వం ఈ విషయాన్ని నేరుగా ప్రకటించడానికి ఎందుకు సిగ్గుపడుతున్నట్లు? అలా వాస్తవాలను ప్రకటించడానికి భిన్నంగా తన చర్యపై వరుస సమర్థనల వెనుక ఎందుకు దాక్కుంటున్నట్లో? కేంద్రప్రభుత్వం వాస్తవాన్ని ముందే యధాతథంగా చెప్పి ఉన్నట్లయితే, సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి రక్షణ శాఖ కుంభకోణంగా తలెత్తే ప్రమాదం నుంచి తప్పించుకుని ఉండేది. అప్పుడు ఆ సత్యం ఇలా ఉండేది: యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2012 ప్రారంభంలో 125 యుద్ధవిమానాల కొనుగోళ్లకు గాను తక్కువ బిడ్ దాఖలు చేసిన రఫేల్‌ని ఎంచుకున్నారు. కానీ, 14 మంది సభ్యులతో కూడిన ధరల సంప్రదింపు కమిటీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తపరిచింది. నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఈ అంశాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పర్చి ఈ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడానికి ముగ్గురు బాహ్య పర్యవేక్షకుల బృందాన్ని నియమించారు. తర్వాత ఈ అభ్యంతరాలను 14 మంది సభ్యులతో కూడిన పూర్తిస్థాయి కమిటీ తోసిపుచ్చింది. ఒక కమిటీపై మరో కమిటీ, ఆ కమిటీ మరొక కమిటీ చర్చల ప్రక్రియ కొనసాగాక 126 యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం ఖరారైంది. ఆపై ఏం జరిగింది? యధావిధిగానే నాటి రక్షణ మంత్రి ఆంటోనీ సందేహిస్తూనే ఈ కమిటీ తుది నిర్ణయంతో విభేదించి మళ్లీ బిడ్లను ఆహ్వానించాల్సిందిగా సూచించారు. వాస్తవానికి ఈ ఒప్పందం 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో వెలుగులోకి వచ్చింది. అయితే ఆంటోనీ దీనిపై నిర్ణయాన్ని తదుపరి ప్రభుత్వానికి వదిలిపెట్టడానికే మొగ్గు చూపారు. తన హయాంలో ఏ రక్షణ కొనుగోలు కుంభకోణం చోటు చేసుకోకుండా ముగించాలన్నది ఆయన వైఖరి. ఒప్పందంలో ఒక భాగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. పెద్దగా కొనుగోలు చేసిందీ లేదు. కానీ ఆయన సైతం చివరకి అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణంతో పదవిని ముగించాల్సి వచ్చింది. మరి మన నిర్ణయాత్మకమైన, రాజీలేని మోదీ ప్రభుత్వం ఏం చేసింది? అది చాలా మొరటుగా వ్యవహరించింది. భారత వాయుసేన తన అవసరాలకు శాశ్వతంగా ఎదురు చూడలేదు. కాబట్టి కొన్ని విధివిధానాలను పాటించకుంటే ఏం కొంప మునుగుతుంది? పైగా ఆ విధానాలు కార్యనిర్వాహక నిబంధనలే తప్ప రాజ్యాం గబద్ధమైన ఆదేశాలు కావు. కాబట్టి ప్రధాని విశాల జాతి ప్రయోజనాల రీత్యా ఈ విధానాలను పక్కకు తోసేయగలడు. ఇదంతా బాగుంది. కానీ మోదీ ప్రభుత్వం ఈ ఒప్పంద వివరాలను పూర్తిగా ఎందుకు బహిర్గతం చేయలేదు? ఇంతకుముందే దాన్ని బహిర్గతపర్చి ఉంటే గత ఆరునెలలుగా రఫేల్ ఒప్పందంపై వస్తున్న పతాక శీర్షికలు పూర్తి అసందర్భంగా వెలిసిపోయి ఉండేవి. పైగా మీడియా కెమెరాల ముందు, పార్లమెంటులో ప్రస్తుత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ రెచ్చిపోతూ మాట్లాడాల్సిన అవసరం అసలు ఉండేది కాదు. పైగా నచ్చబలికే వాస్తవాలు, ప్రస్తావనలతో ఆమె మంచి ఒప్పందాన్ని కుదుర్చుకుని ఉండి ఉంటే, రాహుల్ పదేపదే ఈ ఒప్పందంపై సంధిస్తున్న ప్రశ్నలకు ఆమె ఎందుకు సమాధానాలు ఇవ్వడం లేదు? రఫేల్ ఒప్పం దంపై రక్షణ శాఖ అభ్యంతరాలు లేవనెత్తిందా లేదా? ఈ ప్రశ్నకు ఆమె నిజాయితీగా అవునని సమాధానం చెప్పి ఉంటే, ఒప్పందంపై వచ్చే అన్ని ప్రశ్నలను ప్రభుత్వం తన విజ్ఞతతో తోసిపుచ్చి ఉండేది. ప్రభుత్వాలు తమను తాను స్వచ్ఛంగా ఉంచుకోవడానికి సాధారణ అంశాలను కూడా పాటించకపోవడానికి సాధారణంగా రెండు కారణాలు ఉంటుంటాయి. మరిన్ని విషయాలను తాను దాచి ఉంచి, వాటిని విమర్శకులు కనుగొనలేరని ప్రభుత్వం భావిస్తున్న సందర్భంగా ప్రభుత్వ వివేకం స్పష్టం కానప్పుడు ఇలా జరుగుతుంటుంది. రెండోది. ప్రత్యర్థులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఆశించగల అర్హత వారికి లేదని, తాము అన్ని అంశాల్లోనూ సరిగా ఉన్నామనే స్వీయ అహంకారంలో మునిగిపోయి ఉన్నప్పుడూ కూడా ఇలా జరుగుతుంటుంది. నన్ను ప్రశ్నించడానికి కూడా నీకెంత ధైర్యం? నీకు లాగ నేను కూడా అవినీతిలో కూరుకుపోయానని అనుకుంటున్నావా? రఫేల్ వివాదంలో మోదీ ప్రభుత్వం పతన దశ ఇక్కడే మొదలైంది. ఒక విశ్లేషకుడిగా, సంపాదకుడిగా ఈ రెండు నిర్ధారణల్లో మొదటిదాన్ని ప్రకటించడానికి నాకు మరింత సాక్ష్యాధారం కావాలి. అదేమిటంటే ప్రభుత్వం విషయాన్ని దాచి ఉంచడానికి ఏవైనా ముడుపులు తీసుకున్నటువంటి తప్పు మార్గంలో నడిచిందా? అదే జరిగివుంటే ప్రతిపక్షం సహనంగా ఉండటానికి కారణమే లేదు. ఇక రెండో నిర్ధారణ నిస్సందేహంగా ఇప్పుడు స్పష్టమైంది. గత మూడు దశాబ్దాల్లో ఈ డ్రామాను రెండు సార్లు విభిన్నమైన ఫలితాలతో చూశాం. మొదటిది బోఫోర్స్. రాజీవ్ గాంధీ స్పష్టంగా విజ్ఞతను ప్రదర్శించి ఉంటే ఆరోపణ వచ్చిన తొలిరోజే విచారణకు ఆదేశించి, నేరస్థులను శిక్షిస్తానని హామీ ఇవ్వడం ద్వారా బోఫోర్స్ కుంభకోణం నుంచి బయట పడేవారు. కానీ రాజీవ్ తప్పు మీద తప్పు చేసుకుంటా వెళ్లిపోయారు. స్విస్ అకౌంట్ వివరాలు వెలికి రాకముందే రాజీవ్ ఈ అంశంలో నిజాయితీతో లేరని, తప్పు చేశారని అనుమానం వచ్చేలా వ్యవహరించారు. దీని పర్యవసానమేమిటో స్పష్టమే. సరే, మీరు పరిశుద్ధులే. కానీ, ఎవరో చేసినప్పటికీ దేశం కోసం సరైన, నిజ మైన, పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి దోషులను పట్టుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అందుకే 32 ఏళ్లు గడిచినా బోఫోర్స్ ముడుపులకు సంబం ధించి ఎవరినీ పట్టుకోలేకపోయారని కాంగ్రెస్ వ్యాఖ్యానించగలిగింది. కనీసం ఒక్క క్రోనా(స్వీడిష్ కరెన్సీ) స్వాధీనం కాలేదు. అదేసమయంలో కోల్పోయిన కాంగ్రెస్ ప్రతిష్ట కూడా తిరిగి రాలేదు. ఢిల్లీ హైకోర్టు దాన్ని కొట్టేసిందనే విషయం పక్కనబెడితే, బోఫోర్స్ మచ్చ మిగిలే ఉంది. ఇక రెండోది, సుఖోయ్–30 కొనుగోళ్లు కూడా పెద్ద కుంభకోణ మేనని మార్మోగింది. 1996లో ఎన్నికలు ప్రకటించినప్పటికీ పి.వి.నర సింహారావు ప్రభుత్వం ఈ ఒప్పందంపై సంతకం చేయడమే కాకుండా, పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా చెల్లించింది. ఈ విషయంలో ఏ నిబంధనలూ సక్రమంగా పాటించలేదు. ఇప్పటి ప్రమాణాలను బట్టి చూస్తే దాన్ని దేశద్రోహంగానే పిలవాల్సి ఉంటుంది. ప్రతిపక్ష బీజేపీ నాయకులపై నమ్మకంతోనే ఆయన అలా వ్యవహరించారు. తరువాత ప్రధాని అయిన దేవెగౌడ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న ములా యం సింగ్ యాదవ్ అన్ని ఫైళ్లను తెరిచి ప్రతిపక్షంలోని పెద్దలందరినీ వదిలిపెట్టేశారు. తెలివిగా సాగిన రాజకీయ నేతల కుమ్మక్కు వ్యవహా రంపై మనం గతంలో ఓ కథనంలో పేర్కొన్నాం. 23 ఏళ్లు గడిచిపోయినా ఇంతవరకూ ఎవరూ సుఖోయ్ గురించి ప్రశ్నించలేదు. భారత వైమానిక దళానికి ఇప్పటికీ సుఖోయ్ విమానాలే ప్రధాన ఆధారం, బలం కూడా. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం ఎక్కడిదో మీరు గమ నించే ఉంటారు. తాను పరిశుద్ధుడనని, తనను నిష్కారణంగా అనుమా నిస్తున్నారని, తాను బాధితుడనని చెప్పుకుని తనకున్న పేరు ప్రఖ్యాతుల ద్వారా మోదీ బయటపడిపోతారనుకుంటే పొరపాటు. రహస్యాలను కాపాడుకోవడంలో ఈ సర్కారుకు అమోఘమైన ప్రావీణ్యం ఉన్నదన్న అభిప్రాయానికి భిన్నంగా రఫేల్æ పత్రాలు ప్రముఖులంతా కొలువుదీరే ఢిల్లీలోని లూటెన్స్‌లో సులభంగా లభ్యమవుతున్నాయి. కనీసం ఈ దశ లోనైనా ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బావుంటుంది. విమ ర్శకులు, జర్నలిస్టులపై దాడి చేయడం కాకుండా, వారి ప్రశ్నలకు సమా ధానాలివ్వాలి. అలా చేయకపోతే, ఈ వ్యవహారం చాలా సులువుగా వారిని ముంచెత్తకమానదు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మన్మోహన్ కంటే ఘనుడు మోదీ!
యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే ఎన్డీఏ ప్రధాని నరేంద్ర మోదీనే ఎక్కువ మార్కులు కొట్టేశారన్నది ఏరకంగా చూసినా వాస్తవమే. బడా రుణ ఎగవేతదారుల వంచనకు అడ్డుకట్టలు వేయడం, ఆహార ధరలను కనీస స్థాయికి తగ్గించడం, ప్రభుత్వ రాబడిని మౌలిక వసతుల కల్పనపై పెట్టి స్థూలదేశీయోత్పత్తిని వృద్ధి చెందించడం వంటి అంశాల్లో గతంలోని ప్రభుత్వాల కంటే మోదీ ప్రభుత్వం మెరుగ్గా వ్యవహరించింది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా పెద్దనోట్ల రద్దు వంటి అకాల చర్యలు చేపట్టడంతో విమర్శలు చెలరేగినప్పటికీ, వినియోగదారుల సంతృప్తి వంటి కొన్ని అంశాల్లో నరేంద్ర మోదీ మంచి మార్కులే సాధించారు. మీ ఓటింగ్ ప్రాధాన్యతలు ఎవరివైపు మొగ్గు చూపుతున్నాయి అనే అంశం ఆధారంగా చూసినట్లయితే, మోదీ ప్రభుత్వం గత అయిదేళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థను మరీ గొప్పగా నడిపిందీ లేదు, అలాగని పూర్తిగా విధ్వంసకరంగా నిర్వహించారని చెప్పడానికీ లేదు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ డేటాను చూసి మాట్లాడమని ఆయన అభిమానులు చెబుతుంటారు. మోదీ విమర్శకులు కూడా ప్రతివాదం చేస్తూ డేటానే చూడాల్సిందిగా చెబుతుంటారు. కానీ అభిమానులుగా మీరు రూపొందిస్తున్న డేటా అబద్ధాలకుప్ప అయినప్పుడు దాన్ని మేం ఎలా అంచనా వేయాలని అడుగుతారు? ఈ అంశంపై ఇరుపక్షాల నిపుణులనూ యుద్ధం చేసుకోనిద్దాం. తర్వాత మోదీ హయాంలో అయిదేళ్లపాటు సాగిన రాజకీయ అర్థశాస్త్రం తీరుతెన్నుల గురించి విస్తృతస్థాయిలో పరిశీలిద్దాం. త్వరలో మోదీ అయిదేళ్ల పాలన ముగియనున్నందువల్ల, ఈ అయిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సరిగా వ్యవహారాలను నడిపిన అయిదు అంశాలను జాబి తాకు ఎక్కిద్దాం. ఈ అంశాన్ని రాజకీయాలు లేక రాజ కీయ అర్థశాస్త్రానికి చెందిన సులోచనాల నుంచే చూస్తున్నాను తప్ప కేవలం అర్థశాస్త్ర దృక్పథం నుంచి మాత్రం కాదని నేను మళ్లీ నొక్కి చెబుతున్నాను. కాబట్టి ఈ కోణంలో ఈ వ్యాసంలో కనిపించే అతి పెద్ద సానుకూలాంశం ఏదంటే ఐబీసీ అమలు. అంటే దివాలా, అప్పుల ఎగవేత కోడ్‌కి చెందిన ప్రక్రియను ఎలా అమలు చేస్తారన్నదే. ఇంతవరకు 12 మంది రుణ ఎగవేత దారుల్ని మాత్రమే రుణ ఎగవేత వ్యతిరేక విచారణ ప్రక్రియలో నిలబెట్టారన్నది వాస్తవం. కానీ ఈ 12 మంది దేశంలోనే అతి పెద్ద, అత్యంత శక్తిమంతులైన వ్యక్తులు. అయితే దేశంలోని చాలామంది శక్తివంతులైన రాజకీయనేతలు, స్పీడ్ డయల్‌పై బతికేసే ప్రభుత్వ ఉద్యోగులు ఈ రుణ ఎగవేతల నుంచి ఎంత పోగు చేసుకున్నారనేది తర్వాతి అంశంగా మిగులుతుంది. కానీ వీరిలో ఏ ఒక్కరికీ ఒక్క ఫోన్ కాల్ చేసి తమ అపరాధాలనుంచి తప్పించుకోవడం సాధ్యం కాలేదు. చివరకు బలవంతులైన రూయాలు, ఎస్సార్లకు కూడా ఇది సాధ్యం కాలేదు. ఇది నిజంగా దేశంలో సరికొత్త రాజకీయ చిత్తశుద్ధికి నిదర్శనం అనే చెప్పాలి. ఈ అంశాన్ని ఇలా చూద్దాం. ఒక ఫ్రెండ్లీ ఫోన్ కాల్ చేయడం ద్వారా తాము చేసిన తప్పుకు శిక్ష పడకుండా తప్పుకునే లేక వాయిదా వేసుకునే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. భారతీయ పెట్టుబడిదారీ విధానంలో మీరు ఇప్పుడు ఒక కొత్త శకంతో వ్యవహరిస్తున్నట్లు తెలుసుకోవాలి. మీ వ్యాపారం విఫలమైనట్లయితేనే దివాలా తీస్తారు. కొత్త శకంలోకి రావాల్సింది పెట్టుబడిదారీ విధానమే కావచ్చు కానీ వ్యాపారంలో వైఫల్యం చెందడం ద్వారా మీరు ఎదుర్కొనవలసిన చేదు నిజాన్ని ఆమోదించాలని సమాజం నేర్చుకోవలసి ఉంది. భారత్‌లో దివాలా తీయడం అనే అంశాన్ని దాచిపెట్టవలసిన కుటుంబ అవమానంగా చూస్తూ్త వస్తున్నారు. బాహాటంగా వామపక్ష–సోషలిస్టు స్వభావంతో ఉన్నప్పటికీ, ’’ఫోన్ బ్యాంకింగ్’’ తరహా రాజ్యవ్యవస్థకు ఈ నేరంలో భాగముంది. నరేంద్రమోదీ ప్రభుత్వం దానికి ముగింపు వాక్యం పలికింది. బడా బాబుల వలువలు ఊడిపోతున్నాయి. ఈ తరహా కార్పొరేట్ డాంబికాలు, ఆడంబరాలు మంటల్లో కాలి పోయిన తర్వాత నూతన భారతీయ పెట్టుబడిదారీ విధానం ఆవిర్భవించగలదు. ఈ పరిణామాన్ని నేనయితే స్వాగతించదగిన తప్పనిసరి అవసరమైన రాజ కీయ, సాంస్కృతిక మార్పుగానే చూస్తున్నాను. ఒకవైపు ముడిచమురు ధరలు పడిపోతున్నప్పటికీ పెట్రోలు ధరలను అధికస్థాయిలో ఉంచినందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం చాలా విమర్శలను ఎదుర్కొంది. కానీ అది యూపీయే హయాంలో ప్రజలు పెట్టిన పెనుకేకల వంటిది కాదు. ఎందుకంటే వినియోగదారు నెల చివరలో తన షాపింగ్ బిల్లు ఎంతయింది కూడా గమనిస్తాడు. మోదీ పాలనాకాలంలో చమురుధరలు బాగా పెరిగాయి కానీ మొత్తం మీద చూస్తే తక్కువ ద్రవ్యోల్బణం ఉంటూ వచ్చింది. ప్రత్యేకించి ఆహారం విషయంలో ఇది మరీ స్పష్టం. మోదీ హయాంలోని ద్రవ్యోల్బణం డేటా అబద్ధాల కుప్ప అని ఎవరూ ఇంకా ఆరోపించడం లేదు. అలాగని జీడీపీ లెక్కల్లాగా దాన్ని మార్చి చూపారని కూడా ఎవరూ ఆరోపించడం లేదు. కాబట్టి మనం న్యాయమైన పోలికను పోల్చవచ్చు. మోదీ ప్రభుత్వం 2014 వేసవిలో ప్రభుత్వాన్ని ఏర్పర్చినప్పుడు, అంతవరకు దేశాన్ని పాలించిన యూపీఏ–2 ప్రభుత్వం.. వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం 8.33 శాతం వరకు పెరిగిన ఆర్థిక వ్యవస్థను మోదీ చేతిలో పెట్టింది. కానీ ఈరోజు అది 2.19 శాతంగా మాత్రమే ఉంది. కాబట్టే చమురుధరలు అధికంగా పెరిగినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొన్న విధానం మోదీ ప్రభుత్వానికి రెండో అతి పెద్ద విజయాన్ని కట్టబెట్టింది. గతంలో చాలా ప్రభుత్వాలు చమురుధరలను తగ్గుముఖం పట్టించే విషయంపై ఆపసోపాలు పడుతూ నోటి బలం ఉన్న నగర కులీనులనుంచి శాంతిని కొనుక్కునేవారు. ధరల రాజకీయం తన సొంత మార్మికతను కలిగివుంది. యూపీఏ–1 హయాంలో వ్యవసాయ పంటలకు కనీస మద్ధతుధరలు పెంచినందున, రైతు, రైతుకూలీ ఇరువురూ సంతృప్తి చెందారు. దీంతో యూపీఏ రెండో దఫా కూడా సులభమైన విజయం సాథించేసింది. కానీ దాని రెండో దఫా పాలనలో వినియోగదారు ఆహార ధరలు చుక్కలనంటాయి, దీంతో వీధుల్లో బలమైన అశాంతి పెరిగింది. చివరకు అదే యూపీయే మనుగడను ధ్వంసం చేసింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం వినియోగదారు ఆహార ధరలను బాగా తగ్గించివేసింది. కొన్నింటికి గరిష్ట మద్దతు ధరను పెంచకపోవడంద్వారా, కొన్నిం టిని బాగా ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వం ఆహార ధరలను తగ్గించగలిగింది. ఈ క్రమంలో మార్కెట్ శక్తులను కేంద్ర పట్టించుకోలేదు. ఫలితంగా, రైతు నిండా మునిగాడు, వ్యవసాయ కూలీల కూలీలు పడిపోయాయి. గత మూడు పంట కాలాల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం గరిష్ట మద్దతు ధరను పెంచడం ప్రారంభించింది. కాని ఇది కూడా త్వరలోనే తనదైన ప్రభావాన్ని చూపుతుంది. అందుచేత మోదీ అయిదేళ్ల పాలనలో రైతు సర్వం కోల్పోయాడంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య తప్పే. అటు వినియోగదారు, ఇటు రైతు ప్రయోజనాలు పరస్పరం విభేదించినంత కాలం.. అధిక ధరలు, పంట ధరల తీవ్ర పతనం కారణంగా ప్రభుత్వం అధికారం కోల్పోవడం అన్నది క్రూరమైన రాజకీయ వాస్తవంగానే ఉంటుంది. ఈ చక్రవ్యూహం నుండి ప్రభుత్వాలు బయటపడాలంటే వ్యవసాయ సంస్కరణలను పెద్ద ఎత్తున చేపట్టడమే ఏకైక మార్గం. ఇక్కడే ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైంది. ఇంధన పన్నుల కింద వసూలు చేసిన అదనపు నగదునంతా మోదీ ప్రభుత్వం ఏం చేసినట్టు? ఇలా వచ్చిన భారీ మొత్తాల్లో వేలాది కోట్ల రూపాయలను ఓటర్లకు నజరానాలుగా ఇచ్చేకంటే ఆర్థిక లోటును పూడ్చడానికి వినియోగించడం సరైనదని అనుకుంటాం. జాతీయ రహదారులపై విస్తృతంగా పెట్టుబడులు పెట్టే బదులు, ఓడరేవులు, సాగర మాల ప్రాజెక్టులు, రైలు మార్గాలు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై తగిన దృష్టి పెట్టొచ్చు. ఎందుకంటే, వీటి నుంచి వచ్చిన ఆదాయం కారణం గానే మన స్థూల దేశీయోత్పత్తి గత పదేళ్లలో మూడు రెట్లు పెరిగినట్టు సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఐదు విజయాలలో నాలుగోదైన పన్నుల చెల్లింపు పెరిగింది. స్థూల దేశీయోత్పత్తిలో 9 నుంచి 12 శాతం పన్నుల నుంచే లభిస్తోంది. ఉన్నత స్థాయిలో చెల్లింపుదారుతో కఠినంగా వ్యవహరిస్తు న్నట్టు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్టు అనిపించినా; కింది, మధ్య స్థాయిల్లోని వారికి సంబంధించి పన్ను విధానం చాలా బాగుంది. చాలావరకు మధ్యవర్తుల ప్రమేయం లేదు. నిషేధించాల్సిన వ్యాపారాలు లేనట్టయితే, ఏజెన్సీలు ప్రత్యేకంగా దృష్టిసారించనట్లయితే, రాజకీయ బాధితులు కాకపోతే పన్ను చెల్లింపుదారుడికి సమస్యలేమీ లేనట్టే. ఐదవది, చివరిదీ జీఎస్టీ. బీజేపీ సొంత కూటమిలోనే దాని సా«ధక బాధకాలు దానికి ఉన్నాయి. అయినా, అది కొనసాగుతూనే ఉంది. చాలా విషయాల్లో వైఫల్యాలు కూడా ఉన్నాయి. వ్యవసాయం నుంచి ఎగుమతుల వరకు, తయారీ రంగం నుంచి ఉపాధి కల్పన వరకు, పీఎస్‌యూలను ఆధునీకరించకపోవడం నుంచి సమాచారాన్ని వక్రీకరిస్తున్నారనే చెడ్డపేరు ఉండనే ఉన్నాయి. వీటితోపాటు పిచ్చుకపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడంలాంటి డీమోనిటైజేషన్ లాంటి చర్యలు కూడా ఉన్నాయి. ఇంకా అనేక అంశాలపై మనం ఫిర్యా దులు చేయొచ్చు. ఈ వారం ఒక ప్రభుత్వం అరుదుగా ప్రదర్శించిన మంచి ఆర్థిక విధానాలను గుర్తిద్దాం.. కేవలం చెత్త రాజకీయాలనే కాదు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
భారత్‌ను బలమైన శక్తిగా మార్చిన ఘనత పీవీదే
హైదరాబాద్ : అంతర్జాతీయంగా అనేక ఒడిదుడుకులు ఉన్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణలతో భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రముఖ పాత్రికేయుడు శేఖర్‌గుప్తా అన్నారు. బల హీన భారత్‌ను బలమైన శక్తిగా మార్చిన ఘనత పీవీదేనన్నారు. మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపించాల్సి వచ్చినా జాతీయ భద్రతపై ఆయన ఏనాడూ రాజీపడని దృఢసంకల్పం ప్రదర్శించారని కొనియాడారు. పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్లో పీవీ స్మారకోపన్యాసం చేశారు. 1991లో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అనిశ్చితి ఉండేదని, గల్ఫ్ యుద్ధం ముగింపు, సోవియట్ పతనం, తదితర అంశాలతో భారత్‌లో ఆ కూడా ప్రభావం ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారని అలాంటి సమయంలో ప్రధానిగా పీవీ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చినా అయోమయానికి గురికాకుండా దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేశారన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న భారత్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంతో పాటు, విదేశీ విధానాన్ని కూడా కొత్త పుంతలు తొక్కించారన్నారు. అప్ప టిదాకా రష్యాతో మైత్రీబంధాన్ని నెరుపుతున్న భారత్‌కు సోవియట్ పతనం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ తదితర దేశాలతో మైత్రి ఏర్పడటానికి పీవీ చేసిన కృషిని చాలామంది మర్చిపోయారన్నారు. అద్వానీ మాటలు నమ్మారు.. బాబ్రీ మసీదు కూల్చివేత అంశంలో పీవీపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలు కావన్నారు. బాబ్రీ మసీదు జోలికి వెళ్లబోమని బీజేపీ నేత అద్వానీ కచ్చితంగా చెప్పిన మాటలను పీవీ నమ్మారని కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేయడంతో పీవీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని వెల్లడించారు. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని ఆపేందుకు రాష్ట్రపతిపాలన విధించి ఉండొచ్చు కదా అని చాలా మంది పీవీని విమర్శిస్తుంటారని అలా కేంద్ర పాలన అమలుకు కనీసం 48 గంటలు పట్టేదని ఆలోగా జరగాల్సిన విధ్వంసం జరిగిపోయిందని పీవీ తనతో చెప్పారని శేఖర్‌గుప్తా గుర్తు చేసుకున్నారు. దేశంలో అల్లర్లు చెలరేగకుండా పీవీ చాకచక్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభంలో అనవసర విషయాల్లో సమయం వృథా చేసి చివరి రెండేళ్లలో జీఎస్టీ లాంటి కీలక సంస్కరణలు అమలు చేయడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అధ్యక్షత వహించగా గౌరవ అతిథిగా సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న పీవీ బహుభాషా కోవిదుడిగా అందరికీ సుపరిచితులని ఆయన రాజకీయాల్లో లేకపోతే కచ్చి తంగా గొప్ప అధ్యాపకుడు, పరిశోధకుడు అయ్యేవారన్నారు. పీవీ తాను నిర్వహించిన అన్ని మంత్రిత్వ శాఖల్లో తనదైన ముద్రను వేసి పనితీరును మెరుగుపరిచారన్నారు. ప్రభుత్వ విభా గాలు సరైన విధానంలో పనిచేసేలా అనేక చర్య లు చేపట్టారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు నవోదయ విధానాన్ని రూపకల్పన చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. -
నేడు పీవీ స్మారక ఉపన్యాసం
సాక్షి, హైదరాబాద్: భారత దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం పీవీ స్మారక ఉపన్యాసం నిర్వహించనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్.37లోని దసపల్లా హోటల్లో ఉదయం 11గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి నేతృత్వంలో జరిగే ఈ సభలో ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకుడు శేఖర్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని పీవీ స్మారక ప్రసంగం చేయనున్నారు. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అధ్యక్షత వహించనున్న ఈ కార్యక్రమానికి సీనియర్ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు తదితరులు హాజరవనున్నారు. -
అనంత ఏకాంతంలో ‘లోపలి మనిషి’
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నం తకాలం అందరూ ‘ఆహా! ఓహో!!’ అన్నారు. పీకలలోతు సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్థిక వ్యవస్థను నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. సంఖ్యా బలం బొటాబొటిగా ఉన్న పాలకపక్షాన్ని అయిదేళ్ళ పాటు ‘పూర్తి కాలం’ అధికార పీఠంపై ఉంచిన ‘అపర చాణక్యుడ’ని వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయిన తరువాత, పొగిడిన ఆ నోళ్లతోనే ఆయన్ని తెగడటం ప్రారంభించారు. పదవికి ప్రాణం ఇచ్చే పార్టీ నాయకులు ఆయన పదవికి దూరం కాగానే వాళ్ళూ దూరం జరిగారు. మాజీగా మారిన పీవీపై విమర్శల దాడి పార్టీకి ఆయన దేశానికి చేసిన ‘మేళ్ళు’ కానరాలేదు. అయిదేళ్ళు ‘తెలుగువాడి’లోని ‘వాడినీ, వేడినీ’ లోకానికి చాటిచెప్పిన ‘వృద్ధ రాజకీయవేత్త’, నిస్సహాయంగా న్యాయస్థానాలలో ‘బోనులో’ నిలబడినప్పుడు, ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోకపోగా ఏమీ తెలియనట్టు ‘కళ్ళు’, ‘నోళ్ళు’ మూసుకున్నారు. ప్రధానిగా ఆయన హయాంలో జరిగిన తప్పులో, పొరబాట్లనో సమర్ధించడం నా ఉద్దేశం కాదు. రాజకీయాల్లో ‘కృతజ్ఞత’, ‘విధేయత’ అనే పదాలకి తావు లేకుండా పోయిందన్న విషయాన్ని విశదం చేయడానికే ఈ ఉదాహరణ. పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఏటా బేగంపేటలోని ఒక సందులో ఉన్న స్వామి రామానంద తీర్ధ ట్రస్టు కార్యాలయానికి వచ్చేవారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తరువాత అక్కడ జరిగిన ట్రస్టు సమావేశాలకు కూడా ఆయన హాజరయ్యేవారు. వాటిని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు ‘అధికారాం తమునందు..’ అనే పద్యపాదం జ్ఞాపకం చేసుకోవాలో, ‘ఈ కర్మభూమిలో పదవి, అధికారం ముందు అన్నీ దిగదుడుపే’ అనే నిజాన్ని హరాయించుకోవాలో నాకు అర్ధం అయ్యేది కాదు. పీవీ గురించిన మరో జ్ఞాపకం నా మదిలో పదిలంగా ఉండిపోయింది. మాజీ ప్రధానిగా పీవీ రాజ్‌భవన్‌లో వున్నప్పుడు, నేనూ, ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావు గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్నతరవాత, రాజ్‌భవన్ గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి వెడుతూ అటువైపు తొంగి చూసాము. ఒకరిద్దరు సెక్యూరిటీ వాళ్ళు మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అక్కడవున్న భధ్రతాధికారిని అడిగాము. అతడు తాపీగా ‘లోపలకు వెళ్ళండి’ అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూనే లోపలకు అడుగు పెట్టాము. పెట్టిన తరవాత, మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తూ కని పించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే, మమ్మల్ని పరి చయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు నా వైపు చూస్తూ, ‘మీ అన్నయ్య పర్వతాల రావు ఎలా వున్నాడయ్యా!’ అని అడిగేసరికి నాకు మతిపోయినంత పనయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వోగా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీగారి గొప్పతనం. ఇది జరిగి ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది. మరో సందర్భంలో పీవీ గారిని ఢిల్లీలో కలిసాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛస్థానంలో ఉన్న పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్దం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే ‘పీవీ గారిని కలవడానికి వీలుంటుందా’ అని వచ్చీరాని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసిగట్టినట్టున్నారు. ‘పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది’ అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా. ‘మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో... మీ రేడియో ఉద్యోగాలు లేవా? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలా ఉంటావ్?’ అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను ఊహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను. పీవీ స్మృతికి నా నివాళి. (నేడు హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో ఉదయం 11 గంటలకు సుప్రసిద్ధ జర్నలిస్టు, ‘ది ప్రింట్’ సంపాదకులు శేఖర్ గుప్తా దివంగత ప్రధాని పీవీపై స్మారకోపన్యాసం చేయనున్నారు) భండారు శ్రీనివాసరావు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ‘ 98491 30595 -
పాలన వీడి ప్రత్యర్థులపై గురి
యువ భారతీయులు 2014లో బ్రాండ్ మోదీ తమకు అమ్మిన ఆశను, ఆశావాదాన్ని ఎంతో మక్కువగా కొనిపడేశారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇందిరాగాంధీ యుగం నాటి కాంగ్రెస్‌గా మారిపోవడమే కాకుండా ఒక ఆవును కూడా తోడు తెచ్చుకోవడంతో అదే యువతరం ఇప్పుడు ఆగ్రహంతో, నిరాశా నిస్పృహలతో దహించుకు పోతోంది. ఇప్పుడు తన సర్కారీ పథకాల గురించి మోదీ జపం చేస్తున్నారు. తాను గతంలో పేర్కొన్న అవినీతి కుంభకోణాలను వెలికి తీసి, తప్పు చేసినవారిని శిక్షించడానికి బదులుగా గాంధీ, చిదంబరం కుటుంబాలకు సంబంధించిన పాత, కొత్త పాపాలచిట్టాను బయటపెట్టడంలోనే ఆయన కాలం గడిపేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్ గురు అలీక్ పదమ్సే తనకు ఇష్టమైన వాక్యాన్ని పదే పదే చెబుతుండేవారు. ‘క్లయింట్లు తమ బ్రాండ్లను జాగ్రత్తగా తీర్చిదిద్దమని నన్ను అడిగేవారు. నేను నా బ్రాండ్‌ను ఎన్నడూ తీర్చిదిద్దనని, నా పోటీదారు బ్రాండ్‌ను మాత్రమే జాగ్రత్తగా చూస్తానని నేను వారికి చెప్పేవాడిని. ‘దురదృష్టవశాత్తూ అలీక్ ఇటీవలే కన్ను మూశారు. నరేంద్రమోదీ, అమిత్ షాలు 2014లో ప్రతిపక్షం ఎలా ఘోర తప్పిదాలకు పాల్పడి ప్రతిపక్ష బ్రాండుగా మారిపోయి ఓట్ల బజారులో తమకు విజయం సాధించిపెట్టిందో అదే పాత్రను ఇప్పుడు పోషిస్తున్న వైనాన్ని ఆలీక్యూతో చాట్ చేస్తే సరదాగా ఉంటుంది కాబోలు. నేరుగా విషయానికి వద్దాం. 2014 వేసవిలో నరేంద్రమోదీ ప్రతి కూలతకు, నిరాశావాదానికి సంబందించిన ఒక్క పదం కూడా పలక లేదు. ఆయన సందేశం చాలా దృఢంగా, స్థిరంగా, నచ్చచెప్పేవిధంగా ఉండేది. అభివృద్ధి, పురోగతి, ఉద్యోగాలు, దృఢ శక్తి, అచ్చేదిన్ (మంచి రోజులు).. అన్ని రంగాల్లోనూ ఆయన ఇవే మాట్లాడేవారు. ఒక స్వచ్ఛ మైన, నిర్ణయాత్మకమైన, పరిమిత ప్రభుత్వం, అపరిమిత పాలనను మోదీ జాతికి హామీ ఇచ్చారు. భవిష్యత్తును గురించి మాత్రమే మాట్లా డుతూ తాను దాన్ని ఎలా విప్లవీకరించబోతున్నదీ ప్రత్యేకించి యువత ముందు స్పష్టంగా చెప్పేవారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ గతం గురించి ఆయన ప్రస్తావించారంటే అది ఆర్థిక పతనం, పాలసీ పరమైన పక్షవాతం, యూపీఏ–2 హయాంలో పాలన పూర్తిగా అడుగం టిపోవడం, దాని ప్రధానికి తీరని అవమానం జరగడం, పర్యావరణ అనుమతుల మిషతో కుంభకోణాల మీద కుంభ కోణాలు చోటు చేసు కోవడం, ప్రభుత్వం మొత్తంగా కుంభకోణాలలో కూరుకుపోవడం వంటి అంశాలనే ప్రస్తావించేవారు. అంతే కానీ ప్రజలను వేరుపర్చడం, విడ దీయడం అప్పట్లో మోదీ ప్రసంగాల్లో ఉండేవి కావు. ఆయన కేంపెయిన్ థీమ్ ఏదంటే సబ్కా సాథ్, సబ్కా వికాస్ (అందరితో ఉంటాను, అంద రినీ ఎదిగేలా చేస్తాను) మాత్రమే. ఈ సబ్కా సాథ్ వెనుక ఉన్న సందేశం ఒక్కటే. నాకు సమస్యలు తెలుసు. నేను పరిష్కారాలతో వచ్చాను. నాకు మీ తీర్పును, సమ యాన్ని, విశ్వాసాన్ని ఇవ్వండి, అన్నదే ఆ సందేశ సారాంశం. ఆ సందేశం గొప్ప ప్రాడక్టుగా మారి తన ప్రతిపక్షాన్ని ఊచకోత కోసేసింది. కానీ వచ్చే ఎన్నికలు ఇక ఆరునెలల్లో రాబోతుండగా మోదీ సందేశం దాదాపు వ్యతిరేకదిశకు మారిపోయింది. ఇందిరాగాంధీ తర్వాత దేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ ఆవిర్భవించారు. కానీ ఇప్పు డేమో కాంగ్రెస్ పార్టీ తనను పని చేయనివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. చివరకు భారత్ మాతాకు జై అనే తన ఊతపదాన్ని కూడా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఇటీవలి తన ఎన్నికల ప్రచారంలో మోదీ వాపోయారు. అంటే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ని నిర్వీర్యం చేసిన 10 జన్‌పథ్ ఇప్పుడు కేవలం 47 పార్లమెంటు స్థానాలు ఉన్నప్పటికీ మోదీని ఊపిరా డకుండా చేస్తోందన్నమాట. మోదీ ప్రభుత్వ పాలనను పరిమితం చేస్తానని వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు సమయమంతా తన సర్కారీ పథకాల గురించి జపం చేస్తున్నారు. తాను గతంలో పేర్కొన్న అవినీతి కుంభకోణాలను వెలికి తీసి తప్పుచేసినవారిని శిక్షించడానికి బదులుగా, గాంధీ, చిదంబరం కుటుంబాలకు సంబంధించిన పాత, కొత్త పాపాల చిట్టాను బయట పెట్టడంలోనే మోదీ కాలం గడిపేస్తున్నారు. 54 నెలల పాటు సంపూర్ణ అధికారాన్ని అనుభవించి, ప్రభుత్వ ఏజెన్సీలను సంపూర్ణంగా భ్రష్టు పట్టించిన తర్వాత దేశ ప్రజలకు ఒరిగింది ఇదే మరి. పాలనను పరిమితం చేయడం, గుజరాత్ తరహా పారిశ్రామికుల నేతృత్వంలోని అభివృద్ధికి తావియ్యడానికి బదులుగా, మరిన్ని కరపత్రా లను మాత్రమే అందిస్తున్నారు. పైగా భవిష్యత్తు గురించి చాలా అరు దుగా మాత్రమే మోదీ మాట్లాడుతుండటం ఆశ్చర్యం గొలుపుతోంది. పైగా గతంలోకి చాలా దూరం వెళ్లిపోయి జవహర్లాల్ నెహ్రూ, ఆయన తండ్రి, పుత్రిక, పటేల్, శాస్త్రిల గురించి పదే పదే మాట్లాడుతున్నారు. ఉద్యోగాలు, వికాస్, సంపద వంటి వాగ్దానాలు గూట్లో చేరాయి. జాతి ఐక్యత, సబ్కా సాత్ బదులుగా ప్రతి సీజన్లోనూ మతపరమైన విభజన మాత్రమే కర్తవ్యంగా మిగిలిపోతోంది. ఈ విషయంలో యోగి ఆదిత్య నాథ్, అమిత్ షా దాని పెద్ద ఆయుధాలుగా మారిపోయారు. అంటే తన సొంత బ్రాండును, లేక ప్రొడక్టును మోదీ నాటకీయం గానే వ్యతిరేక దిశకు మళ్లించేశారు మోదీ. తన సొంత పనితీరు, చేసిన వాగ్దానాల అమలు గురించి ఆలోచించడం మాని, తన ప్రత్యర్థుల ప్రాచీన గతానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ ఓట్లు దండుకోవాలని ప్రయత్నించటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా తన వాగ్దానాల విష యంలో మోదీ తీరు ఎలా ఉందంటే, ‘ఓహ్, వారు ఉద్యోగాలు అడుగు తున్నారా? అయితే వారికి తలొక ఆవును ఇవ్వండి చాలు..’ పనిచేయని గోరక్షణ మరోవైపున భారత్‌లో ఉద్యోగాలులేని యువసైన్యం గ్రామీణ ప్రాంతాల్లో కేరమ్స్, పేకాట అడుకుంటా గడిపేస్తున్నారు లేకపోతే ఊరకే పొగ తాగుతూ, చాట్ చేస్తూ, దాదాపుగా ఉచిత డేటాను అందిస్తున్న చైనీస్ స్మార్ట్ ఫోన్లలో చెత్తనంటినీ చూస్తూ పొద్దుçపుచ్చుతున్నారు. కానీ వీరిలో ఆగ్రహం, నిరాశ పెరిగిపోతోంది. మోదీని అధికారంలోకి తీసు కొచ్చిన వారి ఆకాంక్షలు, ఆత్మగౌరవ తృష్ణ వంటివాటిని బలిపెట్టడానికి కూడా వెనుదీయని వీరు ఇప్పుడు తమ హృదయం నిండా గోరక్షణ కర్తవ్యసాధనలో మునిగిపోతున్నట్లు కనిపిస్తున్నారు. కాని ఇటీవలే ముగి సిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ పవిత్ర కర్తవ్యం పనిచేసినట్లులేదు. నరేంద్రమోదీ పచ్చి వ్యతిరేకులు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను గ్రామీణ, రైతుల దుస్థితి ఫలితమే అని ఎవరైనా విశ్లేషిం చవచ్చు. కానీ బీజేపీ ఈ రాష్ట్రాల్లోని చాలా నగరాలను కూడా పోగొట్టు కుంది. మోదీ మద్దతుదార్లలో చాలా పెద్ద, గొంతుబలం కలిగిన, ఆశా వాదులు పట్ణణ, సెమీ అర్బన్ మధ్యతరగతులకు చెందిన వారు, నిరు ద్యోగ యువతే మరి. 2018లో నెహ్రూను పునరుత్థానం చెందించి మళ్లీ ఆయన్ని సమాధి చేయాలన్న పిలుపును వీరెవరూ పెద్దగా పట్టించుకు న్నట్లు కనిపించలేదు. గందరగోళపడుతున్న ఓటర్లు 2014 సార్వత్రిక ఎన్నికల తీర్పు తర్వాత, భారత్‌లో సహస్రాబ్దిలో, భావజాలరహిత తరం ఆవిర్భవించిందని నేను రాశాను. నేను నీకేమీ బాకీ లేను అనే తరహా తరం పుట్టుకొచ్చింది. రాజరికానికి, వంశపాల నకు సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని వారు తోసిపుచ్చేశారు. ఆ ప్రకారమే కాంగ్రెస్‌ను శూన్యంలోకి నెట్టేశారు. కానీ ఇప్పుడు మోదీ, షాలు ఆ వంశ పాలనకే వ్యతిరేకంగా పోరాడమని మళ్లీ పిలుపు ఇస్తున్నారు. కానీ ఇది పనిచేయడం లేదు. ఓటర్లు గందరగోళ పడుతున్నారు. వారి ప్రశ్న ఒకటే. ‘నేను ఆలోచిస్తున్న వ్యక్తి మీరేనా?’ 2014 నాటి మేధోవంతమైన కేంపెయిన్‌లో సోనియా గాంధీ ఆమె సంక్షేమవాదం గురించి ఒక అద్భుతమైన కథను నరేంద్ర మోదీ జనా లకు చెప్పేవారు. ఒక రైతు అడవిలో వెళుతూ ఆకలితో ఉన్న సింహం దారికి అడ్డంగా నడి చాడు. అతడిని చంపి తినేయాలని సింహం మాటు గాచింది. కానీ రైతు ప్రశాంతంగా ఉన్నాడు. ఆత్మహత్యా ప్రయత్నానికి దిగకు, అంటూ అతడు సింహాన్ని హెచ్చరించాడు. లేకుంటే నిన్ను నా తుపాకితో కాల్చే స్తాను. సింహం ఆగింది. రైతుకేసి తీక్షణంగా చూసింది. కానీ తుపాకి ఏదీ అని అడిగింది. ఆ రైతు తన కుర్తా జేబునుంచి మడిచిన కాగితం బయటకు లాగాడు. ‘‘ఇదిగో ఇక్కడ ఉంది షేర్ భాయ్, తుపాకి ఇంకా దొరకలేదు కానీ సోనియా గాంధీ నాకు గన్ లైసెన్స్ ఇచ్చింది మరి’’. వేలాదిమంది జనం పకపక నవ్వారు. వారు ఈ కథ లోని సందేశం అర్ధం చేసుకున్నారు. దారిద్య్రం, నిరుద్యోగం, భవిష్యత్తుపై ఆకాంక్షలను కేవలం హక్కుదారీ పథకాలు నెరవేర్చలేవు. హక్కులు సంక్రమింపజేసే చట్టాలు(ఆ రైతుకు తుపాకి లైసెన్స్ ఇవ్వడంలాంటివి) మద్దతిచ్చినా సరే ఆ సమస్యలు తీరవు. పైగా జాతీయ ఉపాధి పథకం అనేది దశాబ్దాల కాంగ్రెస్ ప్రభుత్వాల తీవ్ర వైఫల్యానికి అతి గొప్ప సాక్ష్యమని మోదీ విమర్శించారు. కానీ అదే పథకంలోకి తానే ఇప్పుడు మరింత డబ్బు గుప్పిస్తున్నారు. ఇక ఆయుష్మాన్ భారత్ పేదల ఆరోగ్యం కోసం మోదీ ఇస్తున్న తుపాకి లైసెన్సులా ఉంది. 2014లో మోదీ ఒక వంశ పాలనను ఓడించారుగానీ దాని రాజకీయ ఆర్థిక శాస్త్రాన్ని మాత్రం కౌగలించు కున్నారు. సిద్ధాంతాలతో పనిలేకుండా 2014 నుంచి గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వరకూ మోదీని చూసి ఓట్లు కుమ్మరించిన ఓటర్లు ఇప్పుడు అదే మోదీ విధానాలను చూసి గందరగోళంలో పడు తున్నారు. 2014లో నరేంద్రమోదీ, అమిత్‌షాలు తమకు ఎదురే లేదు అన్న విధంగా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించారు. కానీ ఇప్పుడు వారే ఆగ్ర హిస్తున్నారు. గదమాయిస్తున్నారు. తామే బాధితులమని వాపోతు న్నారు. ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఓడిపోయిన తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఓట్లు అడుగుతున్నారు తప్ప తమకు ఓటేయ వలసిందిగా వీరిప్పుడు అడగటం లేదు. గెలిచే టిక్కెట్లను తమ వద్ద ఉంచుకుని కూడా ఇలా తమను ప్రతిపక్ష స్థానంలోకి ఎందుకు మార్చు కుంటున్నారు అనేది గమనించినట్టయితే మనముందు లేని అలీక్ పద మ్సే కూడా పకపకా నవ్వుతారు కాబోలు! వ్యాసకర్త: శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్, twitter@shekargupta -
పెను సంక్షోభం ఊబిలో సీబీఐ
కేంద్ర అవినీతి నిరోధక సంస్థ సీబీఐ రెండు దశాబ్దాల సంస్కరణను ఉల్లంఘించిన కారణంగానే దాని ఉన్నతాధికారులు పరస్పరం దొంగలుగా ఆరోపించుకుని సంస్థ ప్రతిష్టను మంటగలిపారు. దీన్ని సాకుగా తీసుకుని, ఏపీ సీఎం చంద్రబాబు తన రాష్ట్రంలో కేసుల దర్యాప్తునకు సీబీఐకి ఇచ్చిన అధికారాలను సైతం ఉపసంహరించే సాహసానికి పూనుకున్నారు. సీబీఐని సంస్కరించాలని చేసిన ప్రతి ప్రయత్నమూ విఫలమవడానికి కారణం ఏమిటంటే, సంస్థాగత సంస్కరణకు వెలుపల ఉండేలా సీబీఐని రూపొందించడమే. ప్రస్తుత కార్యం మరింత సంస్థాగతమైన క్రమశిక్షణతో సీబీఐని నియంత్రించడమే తప్ప దానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టడం కాదు. ‘హమ్ సీబీఐ సే హై... అస్లీ వాలే‘ (మేం సీబీఐ నుంచి వచ్చాం, నిజమైన సీబీఐ), అని 2013లో నీరజ్ పాండే తీసిన అద్భుతమైన సినిమా స్పెషల్ 26లో ఒక రైడింగ్ పార్టీకి నేతృత్వం వహిస్తున్న సీబీఐ ఇన్స్పెక్టర్ వసీమ్‌ఖాన్ పాత్రను పోషించిన మనోజ్ బాజ్‌పేయి అంటాడు. అస్లీ వాలే అంటూ అతడు చెప్పుకోవడానికి కారణం ఏదంటే, అక్షయ్ కుమార్ నేతృత్వం లోని మరొక బృందం, తాము సీబీఐ నుంచి వచ్చామని చెప్పుకుంటూ సంపన్నులపై దాడి చేసి వారి సంపదను తీసుకుని మాయమవుతుండటమే. సరిగ్గా దీన్ని పోలిన మరొక డ్రామా ఇప్పుడు నిజజీవితంలో చాలావరకు గౌరవనీయ సుప్రీంకోర్టులో ప్రదర్శితమవుతోంది. సీబీఐలో ఉన్న నంబర్ వన్ గ్రూప్, నంబర్ టు గ్రూప్ తమ్ము తాము అస్లీ వాలే అని చెప్పుకుంటూ ఇతరులను దొంగలు అని పిలుస్తున్నారు. ఈ పేలవమైన ఆరోపణలు మరికొన్ని మసాలాలను కలిగి ఉన్నాయి: కేంద్రప్రభుత్వం ఒక పక్షానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు కనబడుతోంది. ఇక ఒక చీఫ్ విజి లెన్స్ కమిషనర్ (సీవీసీ) సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఆయన నెత్తిపై ఒక రిటైరైన న్యాయమూర్తి కూర్చుని ఉండటమే. ప్రతి ఒక్కరూ భారత్‌లో అత్యంత కాఠిన్యవంతులై కార్యకర్తలు, న్యాయవాదుల ఆగ్రహావేశాలకు గురి అవుతున్నారు. ఎందుకంటే ఎవరూ ఎవరినీ నమ్మడంలేదు, ప్రతి ఒక్కరినీ మరొకరు నిశితంగా గమనిస్తున్నారు. అందుచే మనం ఏం చేయాలి? ఇక నిర్ణయించడానికే సంకోచిస్తున్నప్పుడు ఉన్నతాధికారులు చేసేది ఏమిటి? వారు కాలాన్ని వృథా చేస్తున్నారు. అందుకే, నాకు మరో రెండు వారాలు ఇవ్వండి. రోజుల తరబడి వేచి ఉండే సంప్రదాయం ప్రకారం ఇది మరింత ఆలస్యం అయినట్లయితే, ప్రస్తుత డైరెక్టర్ పదవీబాధ్యత వచ్చే జనవరిలో ముగియనుంది. ఆయన్ని వెళ్లనిద్దాం. నంబర్ టూని మాతృసంస్థకు తరలిద్దాం. అప్పుడు కొత్త సీబీఐ బాస్ కోసం శోధన ప్రారంభిద్దాం. ఇదే కథకు ముగింపు. ఈలోగా, మన అత్యంత ముఖ్యమైన అవి నీతి నిరోధక సంస్థ, దాని బాస్‌లు ఒకరిపై ఒకరు లీకులు, పుకార్లు రేపుకుంటూ ఉన్నందున నేటికీ స్తంభించిపోయి ఉంది. నా సహోద్యోగి అనన్య భరద్వాజ్ దీన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనెక్టివిటీ అంటూ సరిగ్గా వర్ణించారు. మరొకరి స్థానంలో పనిచేస్తున్న డైరెక్టర్ కూడా అనుమానాల మధ్య చిక్కుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో మరొక పోలీసును పట్టుకోవడానికి మీరు ఏ పోలీసును నియమిస్తారు? ఈ సంకుల సమరాన్ని అనువుగా తీసుకుని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాష్ట్రంలో కేసుల దర్యాప్తుకు సీబీఐకి ఇచ్చిన అధికారాలను ఉపసంహరించే సాహసానికి పూనుకున్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెంటనే బాబుకు తన మద్దతును ప్రకటించేశారు. ప్రత్యేకించి సీబీఐ దర్యాప్తు, విచారణ కింద ఉన్న ఇతర రాష్ట్రాలు, ప్రతిపక్ష నాయకులు కూడా ఈ ప్రక్రియలో భాగమవడాన్ని దీని ఫలితంగా సీబీఐ ప్రథమస్థాయి రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించవచ్చు కూడా. ఏదేమైనా, కోర్టులను నిందించాలంటే ఇప్పటికే ఆలస్యమైపోయింది. మన కోర్టులు గత రెండు దశాబ్దాలుగా ఏదో ఒకటి చేయాలని కనీస ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. సీబీఐని సంస్కరించడంలో ఈ వైఫల్యానికి నేను న్యాయస్థానాలను నిందించలేను. మనం ఇప్పుడు చూస్తున్నట్లుగా, తనను కోర్టులు, ప్రభుత్వం, లేక సామాజిక కార్యకర్తలు.. చివరకు ఇండియన్ పోలీసు సర్వీసులు వంటి ఏ సంస్థ కూడా పరి శుద్ధం చేయలేనటువంటి రాకాసిలా సీబీఐ మారిపోయింది. ఎందుకంటే, గత రెండు దశాబ్దాలుగా పలువురు మంచి వ్యక్తులు దాంట్లో పనిచేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు తన మంచి పేరును సైతం ఉల్లంఘించిన క్రూర జంతువులా సీబీఐ మారిపోయింది. ఒకప్పడు పంజరంలో చిలుక అని తిరస్కారానికి గురైన ఇదే సంస్థ ఇప్పుడు మన రాజకీయాలకు, రాజకీయ నేతలకు డబ్బులు తీసుకుని శిక్షలు లేకుండా చేయగలిగే స్థాయికి చేరుకుంది. 1990ల్లో (జైన్ హవాలా కేసును గుర్తుతెచ్చుకోండి) సీబీఐ రాజకీయనేతల కెరీర్లనే ధ్వంసం చేసి వారిని మళ్లీ పునరుత్థానం చేసింది. వాస్తవానికి ఎల్.కె. అడ్వాణీ (జైన్ హవాలా), పీవీ నరసింహా రావు (జేఎమ్ఎమ్ ముడుపులు) ఎ. రాజా (టూజీ), దయానిధి మారన్ (టెలిఫోన్ ఎక్చేంజ్ కేసు) వంటి సీబీఐ ప్రాసిక్యూట్ చేసిన ప్రముఖులందరూ చివరికి నిర్దోషులుగా బయటపడ్డారు. అదే సమయంలో సీబీఐ సాగించిన సాక్ష్యాలు లేని తరహా కుంభకోణాల ఉన్మాదం టెలికాం నుంచి మైనింగ్ దాకా మన ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసేసింది. సీబీఐ ప్రభుత్వాలకు ఎంత ప్రశంసాత్మకంగా ఊడిగం చేసిందంటే, బోఫోర్స్ కేసును తుంగలో తొక్కింది లేక తన అభీష్టం ప్రాతిపదికన తిరగదోడింది కూడా. ఈ క్రమంలో ఏ ఒక్కరూ శిక్షలకు గురికాలేదు. పైగా ఆయా కేసుల్లోని నిందితులు అప్పటికే చనిపోయి ఉండటం కూడా తట స్థించేది. సీబీఐకి జవసత్వాలు కలిగించడానికి సుప్రీంకోర్టు ప్రయత్నిం చింది. రెండు భారీ కుంభకోణాలకు సంబంధించి ఉన్నత న్యాయస్థానం నేర విచారణ ప్రక్రియను, విచారణ బృందాలను తన నియంత్రణలోకి తీసుకోకపోయి ఉండవచ్చు గానీ తన ప్రత్యక్ష పరిరక్షణలో ఉంచి పనిచేయించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షించినప్పటికీ జైన్ హవాలా, టూజీ స్పెక్ట్రమ్ కేసులు ఫలితం లేకుండా నీరుగారిపోయాయి. సుప్రీంకోర్టు పదే పదే సీబీఐకి సాధికారత కల్పించేందుకోసం జోక్యం చేసుకుంది, దానికి మరింత స్వతంత్రత కల్పించి, నిష్పాక్షికంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకుంది. ఆ సంస్థ డైరెక్టర్‌కి రెండేళ్ల పదివీకాలాన్ని ఫిక్స్ చేసింది కూడా. సీబీఐ డైరెక్టర్ ఎంపికకోసం త్రిసభ్య ప్రభుత్వ కమిటీని నియమించింది, తర్వాత చీఫ్ విజిలెన్స్ కమిషనర్, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన మరింత నూతనమైన, సృజనాత్మకమైన స్వతంత్ర యంత్రాంగాన్ని రూపొందిం చింది కూడా. నిజానికి ప్రభుత్వ వ్యవస్థ చరిత్ర మొత్తంలో భారత ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఒక కార్యనిర్వాహక పదవికి నియామకం జరిపిన ఘటన ఇదొక్కటి మాత్రమే కావడం విశేషం. అంటే సీబీఐని మన వ్యవస్థ ఎంత తీవ్రంగా పట్టించుకుంటోందో దీన్ని బట్టి తెలుస్తుంది. తర్వాత, అది సాధించిన ఫలితాల బట్టే దాన్ని తూచాల్సి ఉంది. బలహీనపడిన సీబీఐది ఒక ఘోర స్థితి అయితే, మళ్లీ బలోపేతం చేసిన సీబీఐ మరింత ఘోరంగా మారింది. న్యాయవ్యవస్థ పర్యవేక్షణలో నూతన వ్యవస్థలో నియమితులైన అదే డైరెక్టర్ల ఆధ్వర్యంలోని సీబీఐని ప్రభుత్వాలు వరుసగా ఎలా దుర్వినియోగం చేస్తూ వచ్చాయి అనే అంశంపై ఏ పరిశోధకుడైనా మొత్తం పీహెచ్‌డి థీసీస్గా మల్చగలడు. అలాంటి దుర్వినియోగానికి చెందిన అంశాలను కొన్నిం టిని గుర్తుకు తెచ్చుకుందాం. పార్లమెంటులో యూపీఏ ప్రభుత్వం ఎప్పుడైనా విశ్వాస తీర్మానం పరిధిలోకి వచ్చినట్లయితే, అప్పటికే అనుమానితులుగా ఉన్న ములాయం సింగ్ యాదవ్, మాయావతిలపై సాగుతున్న కేసులు అద్భుత పురోగతి సాధించినట్లుగా జాతీయ పత్రికల పతాక శీర్షికల్లో ఊహాజనిత కథనాలు ప్రత్యక్షమయ్యేవి. అలాగే నరేంద్రమోదీ, అమిత్ షా, గుజరాత్లో వారి నమ్మిన బంటు పోలీసులకు వ్యతిరేకంగా సీబీఐని స్పెషల్ పర్పస్ వెహికల్‌గా ఇలాగే ఉపయోగించారు. చివరకు ఇష్రాత్ జహాన్ కేసులో అత్యున్నత ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ని ఇరికించేత స్థాయికి సీబీఐ వెళ్లిపోయంది. ఈ కేసులో మీ అభిప్రాయం ఏదైనా కావచ్చు, అది సంకేతించే అంశం ఏది: ఏం జరిగింది? యూపీఏ బలహీనపడుతోందని సీబీఐ అధిపతి గ్రహించగానే ఆ కేసును సాగదీశారు. తర్వాత మోదీ అధికారంలోకి రాగానే ఆ కేసునే రద్దు చేసి పడేశారు. ఎందుకంటే అడ్డం తిరిగిన సాక్షులు ఈ కేసులో వందకు చేరుకున్నారు మరి. సీబీఐని సంస్కరించాలని చేసిన ప్రతి ప్రయత్నమూ విఫలం కావడానికి ప్రధాన కారణం ఏమిటంటే, సంస్థాగతంగా సంస్కరణకు వెలుపల ఉండేలా సీబీఐని రూపొం దించడమే. న్యాయవ్యవస్థ మందకొడిగా పనిచేస్తున్న వ్యవస్థలో మితిమీరిన అధికారం కలిగివున్న ఏ పోలీసు వ్యవస్థ అయినా ఒక ప్రక్రియలో దండనాధికారిగానే మారిపోతుంది. ఈ స్థితిలో యువకులుగా ఉన్నప్పడు జైలుపాలయిన వారు మధ్య వయస్సు వచ్చినప్పటికీ ఆ జైళ్లలోనే ఉంటారు. అప్పటికి కూడా వారి విముక్తి పొందలేరు. అందుకే ప్రస్తుతం మనకు కావలసింది మరింత సంస్థాగతమైన క్రమశిక్షణ, సీబీఐని నియంత్రించడమే తప్ప దానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టడం కాదు. వినీత్ నారాయణ్ కేసులో తానిచ్చిన తొలి చారిత్రక తీర్పులో సుప్రీంకోర్టు సీబీఐ అధికారాలను పెంచి, దాని అధిపతి పదవీకాలానికి రక్షణ కల్పించింది. ప్రాసిక్యూషన్‌ని కొట్టేయడం లేక నిందితుడిని నిర్దోషిగా ప్రకటించడం జరిగిన ప్రతి సందర్భంలోనూ ప్యానెల్‌లోని ఒక లాయర్ తప్పకుండా సమీక్షించాలి. బాధ్యతలను ఉపేక్షించిన వారిపైనే బాధ్యతను మోపాలి. తన విధిని విస్మరించిన అధికారిపై కఠిన చర్య తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ ఇంతవరకు అలాంటివేమీ జరిగిన పాపాన పోలేదు. ఎందుకంటే కోర్టు తీర్పులో తమకు అనుకూలమైన వాటినే రాజకీయ నాయకులు అందిపుచ్చుకుని ఉపయోగించుకుంటారు. ఇటీవలి కాలంలో నలుగురు సీబీఐ డైరెక్టర్లలో ముగ్గురు వివిధ స్థాయిల్లో అవినీతీ ఆరోపణలను ఎదుర్కొనడంలో ఆశ్చ ర్యపడాల్సింది ఏమీ లేదు. తదుపరి సీబీఐ డైరెక్టర్ ఇంతకు మంచి ఉత్తమంగా ఉండగలరనడానికి గ్యారంటీ ఏదీ లేదు. సీబీఐ కార్యాలయంలో అపరిమితాధికారం ఉంది. కానీ చాలా తక్కువ జవాబుదారీతనం ఉంది. ఇలాంటి పరమ గందరగోళపు సంస్థాగత నిర్మాణంలో సూపర్‌మ్యాన్ మాత్రమే అస్లీ వాలేను నేనే అని ప్రకటించుకోగలడు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
సంకీర్ణ ప్రభుత్వాలంటే భయమేల?
సుస్థిరమైన, పూర్తి మెజారిటీ ప్రభుత్వాలు ముగిసిన తర్వాతే, దేశంలో ఆర్థిక సంస్కరణలు స్పష్టమైన రూపం తీసుకోవడం కాకతాళీయం. కాంగ్రెస్ పార్టీ పతనం తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం స్వల్పకాలం మాత్రమే మనగలగడంతో సంస్కరణల పరీక్షలో పాస్ కాలేకపోయింది. కానీ అతిపెద్ద సంస్కరణల ప్రభంజనం పీవీ నరసింహారావు అస్థిర ప్రభుత్వం ద్వారానే సాకారమైంది. తర్వాత వచ్చిన చంద్రశేఖర్, వాజపేయి ప్రభుత్వాలు సంకీర్ణ ప్రభుత్వాలే అయినా నాటి, నేటి సుస్థిర ప్రభుత్వాలు కూడా చేపట్టలేని సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నాయి. అందుకే మన భవిష్యత్తుకు సుస్థిర ప్రభుత్వాలు అవసరం అంటున్న అజిత్ దోవల్ ప్రతిపాదన వాస్తవ సమ్మతం కాదు. రాబోయే పదేళ్ల కాలానికి భారత్‌కు కఠిననిర్ణయాలు తీసుకోగలిగే, సుస్థిరమైన, మెజా రిటీ ప్రభుత్వం అవసరం ఎంతైనా ఉందంటూ, ఈ గురువారం సర్దార్ పటేల్ స్మారకోపన్యాసం సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్ చేసిన వ్యక్తీకరణపై అన్యాయంగా దాడి చేస్తున్నారు. ఆయనపై ఈ రకమైన దాడి అభ్యంతరకరమైనది. జాతీయ భద్రతా సలహాదారు ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఆ పదవి రాజకీయ నియామకంతో కూడినది. కాబట్టి తన ఓటింగ్ ప్రాధాన్యతలను ఆయన దాచుకోవలసిన అవసరం లేదు. అలాంటి నిర్ణయాత్మకమైన ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ మాత్రమే అందించగలరని దోవల్ పేర్కొన్నా.. నేను ఆయనతో ఘర్షణకు దిగను. దోవల్ చేసిన రాజకీయ ప్రతిపాదనపై కాకుండా ఆయన ప్రాథమిక వాదనపైనే నేను చర్చిస్తాను. సుస్థిరమైన, బలమైన, పూర్తి మెజారిటీ కలిగిన ప్రభుత్వాలు మాత్రమే భారత్‌కు మంచి చేస్తాయని, సంకీర్ణ ప్రభుత్వాలు అస్థిరమైనవని, అయోమయంతో కూడినవని, అస్పష్టమైనవని, అనిశ్చితమైనవని, అవినీతికరమైనవని, బ్లాక్‌మెయిల్‌కి వీలు కల్పిస్తాయని అజిత్ దోవల్ మౌలిక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రతిపాదన.. వాస్తవాల నిర్ధారణలో నిలబడటం లేదు. ముందుగా ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారిద్దాం. ఎందుకంటే ఈ రంగంలో డేటాకు పక్షపాతం ఉండదు. మన రాజకీయ చరిత్రను రెండు సుస్థిర దశలుగా విభజించవచ్చు. ఒకటి 1952–89 కాలానికి చెందింది. ఈ 37 సంవత్సరాల్లో దేశం దాదాపుగా సుస్థిరతను చవిచూసింది. 1970ల చివర్లో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి కానీ సాధారణంగా ఒకే పార్టీ అటు కేంద్రం లోనూ, చాలా రాష్ట్రాల్లోనూ పాలన సాగించిన కాలమది. ఆ దశలో దశాబ్దాలు గడిచే కొద్దీ ప్రభుత్వాలు సుస్థిరతను సాధిం చాయి. ఒక పార్టీ నియంత్రణలో శక్తిమంతంగా అవతరించాయి. అది కూడా తిరుగులేని ఒకే కుటుంబం అంటే గాంధీల కుటుంబ యాజమాన్యంలోనే ప్రభుత్వాలు నడిచేవి. 1984–89లో లోక్‌సభలో గాంధీల పాలన దాదాపు 80 శాతం మెజారిటీని సాధించింది. ఇప్పుడు సరికొత్తగా ప్రతిపాదిస్తున్న సుస్థిరమైన, బలమైన, నిర్ణయాత్మకమైన ‘దోవల్ సిద్ధాంతం’ సరైందే అయితే, ఆ నాలుగు దశాబ్దాల కాలంలో భారత్ అత్యుత్తమ అభివృద్ధిని సాధించి ఉండాలి. కానీ వాస్తవానికి అది 3.5 శాతం కంటే తక్కువ ‘హిందూ అభివృద్ధి రేటు’నే అందివ్వగలిగింది. ఇక రెండోది అస్థిరమైన యుగం. 1989లో రాజీవ్ గాంధీ పరాజ యంతో ఇది మొదలైంది. 2014 వరకు అంటే 25 ఏళ్ల పూర్తికాలం ఈ అస్థిర పాలనా దశ కొనసాగింది. సుస్థిరమైన, పూర్తి మెజారిటీ ప్రభుత్వాలు ముగిసిన తర్వాతే, దేశంలో ఆర్థిక సంస్కరణలు స్పష్టమైన రూపం తీసుకోవడం కాకతాళీయం. కాంగ్రెస్ పార్టీ పతనం తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం స్వల్పకాలం మాత్రమే మనగలగడంతో సంస్కరణల పరీక్షలో పాస్ కాలేకపోయింది. కానీ అతిపెద్ద సంస్కరణల ప్రభంజనం పీవీ నరసింహారావు అస్థిర ప్రభుత్వం ద్వారానే సాకారమైంది. 1996లో పీవీ హయాం ముగిశాక, తదుపరి ఎనిమిదేళ్ల కాలంలో భారత్ అయిదుగురు సంకీర్ణ కూటమి ప్రధానులను, నాలుగు సార్వత్రిక ఎన్నికలను చవి చూసింది. అయిదుగురు ప్రధానులు అని అంటున్నామంటే.. దేవేగౌడ, ఎల్కే గుజ్రాల్ స్వల్పకాలిక ప్రభుత్వాలతోపాటు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా మొదట 13 రోజులపాటు తర్వాత సంవత్సరం పాటు, చివరగా పూర్తికాలం పాలన చేశారు కదా. ఇప్పుడు చూద్దాం. 1991లో మన్మోహన్ సింగ్ తర్వాత రెండవ అత్యంత సంస్కరణాత్మక బడ్జెట్ ఏదంటే 1997 నాటి పి. చిదంబరం ‘డ్రీమ్ బడ్జెట్’ అని చెప్పాలి. ఈ డ్రీమ్ బడ్జెట్లోనే పన్నులు, వడ్డీరేట్లు తగ్గించారు. ఆదాయాన్ని స్వచ్చందంగా వెల్లడించే పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ కాలంలోనే జాతీయ పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ని కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు స్టాక్ మార్కెట్లో ప్రవేశించడానికి తలుపులు తెరిచారు. తద్వారా ప్రైవేటీకరణకు నాంది పలికారు. దేవేగౌడ–గుజ్రాల్ ప్రభుత్వాలను ‘రోజు కూలీ’పై పనిచేసే ప్రభుత్వాలుగా వ్యంగ్యంగా పేర్కొనేవారు. తమాషా ఏమిటంటే మన దేశ చరిత్రలో వామపక్ష భావజాలం అధికంగా కలిగిన ప్రభుత్వాలు ఇవే మరి. మొట్టమొదటిసారిగానే కాదు.. చివరిసారిగా కూడా ఇద్దరు కమ్యూనిస్టు మంత్రులను కలిగిన కేంద్ర ప్రభుత్వాలు ఇవే. వాజ్‌పేయి స్వర్ణచతుర్భుజి పేరుతో జాతీయ రహదారులను ప్రారంభించడానికి, ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలను ప్రైవేటీకరించడానికి, 11 ప్రభుత్వరంగ సంస్థలను, రెండు డజన్ల ఐటీడీసీ హోటళ్లను అమ్మేయడానికి తగిన శక్తిని కలిగి ఉండేవారు. అయితే గత నాలుగున్నర ఏళ్లలో అత్యంత శక్తివంతమైన మోదీ ప్రభుత్వం కనీసం ఒక్కటంటే ఒక్క పీఎస్‌యూని అమ్మలేకపోయింది. చివరకు ఎయిర్ ఇండియా వంటి అసమర్థ సంస్థను కూడా అది వదిలించుకోలేకపోయింది. 1989–2004 మధ్యలో సాగిన 15 ఏళ్ల అస్థిర శకంలో అతిస్పల్పకాలం మనగలిగిన ప్రభుత్వం చంద్రశేఖర్ ప్రభుత్వంగా చెప్పాలి. ఇది కేవలం నాలుగు నెలలు మాత్రమే పాలన సాగించింది. దీన్ని ‘క్యాష్ అండ్ క్యారీ’ ప్రభుత్వంగా అపహాస్యం చేసేవారు. ఎందుకంటే కేవలం 50 మంది సొంత ఎంపీలను మాత్రమే కలిగిన చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ బయటనుంచి ఇచ్చే మద్దతుపైనే ఆధారపడ్డారు. కానీ విదేశీ చెల్లింపుల సంక్షోభాన్ని అధిగమించడానికి ఈయన ప్రభుత్వమే భారత్ బంగారు నిల్వలను విదేశాలకు తరలిం చింది. సంపూర్ణ మెజారిటీ కలిగిన ప్రభుత్వం, చివరకు మోదీ ప్రభుత్వం కూడా దీనికి సాహసించేదని నేను భావించలేను. యశ్వంత్ సిన్హాను తన ఆర్థికమంత్రిగా తీసుకొచ్చిన చంద్రశేఖర్ మరోవైపు డాక్టర్ మన్మో హన్ సింగ్‌ని శక్తివంతమైన ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమించారు. ఆ హోదాలో మన్మోహన్ కేబినెట్ సమావేశాలకు హాజరు కాగలిగేవారు. తదనంతర సంవత్సరాల్లో ఈ ఇద్దరే మన సంస్కరణల రూపశిల్పులుగా అవతరించారు. బలహీనమైన సంకీర్ణ కూటముల హయాంలోనే ఇది చోటుచేసుకుంది. స్థిరంగా 37 ఏళ్లపాటు మన అభివద్ధి రేటును పరిశీలిస్తే అది సగటున 3.5శాతంకు తక్కువే. తర్వాత పాతికేళ్లలో అది 5కు చేరుకుంది. ప్రస్తుతం 7కంటే ఎక్కువే నమోదవుతోంది. పాతదానికంటే రెట్టింపు అయ్యింది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంత వరకు స్థిరమైన ప్రభుత్వాలకు, వృద్ధిరేటుకు మధ్య గ్రాఫ్ వ్యతిరేకంగా ఉంటుంది. కానీ, జాతీయ భద్రత విషయానికి వస్తే సంకీర్ణ ప్రభుత్వాలు అసమర్థమైనవని భావిస్తారు. 1989–90 మధ్య వీపీ సింగ్ హయాంలో మినహాయిస్తే, జాతీయభద్రత విషయంలో మన ప్రభు త్వాలు బలహీనంగా ఎప్పుడూ లేవు. ఆ ప్రభుత్వంలోనూ దోవల్ పని చేశారు. పంజాబ్, కశ్మీర్‌లలో పరిస్థితులు చేయిదాటి పోతుంటే చూస్తూ ఊరుకున్నారు. తర్వాత అవకాశం వచ్చింది. తన సత్తా నిరూపించుకున్నారు. ఇంతకు ముందు నేను రాసినట్టు, పంజాబ్‌లో చంపేసిన ప్రతి ‘ఏ’ కేటగిరీ ఖలిస్తానీ చొరబాటుదారుడినీ ‘గిల్ పట్టుకున్నాడు, దోవల్ పని పట్టాడు’అనే అభివర్ణించారు. చొరబాట్లను రూపుమాపడంలో ఐబీ, పంజాబ్ పోలీస్ మధ్య అది ఓ చక్కని ఆపరేషన్. ఇదే పద్ధతిలో 1991–96మధ్య అస్తవ్యస్థంగా వున్న çకశ్మీర్‌ని అదుపులోకి తీసుకొచ్చారు. దోవల్ కెరీర్ ఎదుగు దలకు ఇవన్నీ దోహదపడ్డాయంటే, అందుకు ఏమాత్రం చరిష్మాలేని ప్రధాని ఆధ్వర్యంలోని బలహీనమైన మైనార్టీ ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. అత్యంత శక్తిమంతురాలిగా వున్నప్పటికీ పోఖ్రాన్–1 పరీక్షలను అణుబాంబు ప్రయోగంగా చెప్పు కోడానికి ఇందిర సాహసించలేదు. శాంతి యుత ప్రయోజనాలకే అణు ప్రయోగాలు అనే ముసుగు కప్పుకోక తప్పలేదు. 24ఏళ్ల తర్వాత బల హీనమైన వాజ్‌పేయి హయాంలోని సంకీర్ణ ప్రభుత్వం అటువంటి ముసుగులు వేసుకోలేదు. వాజ్‌పేయి ప్రభుత్వం ఎంత బలహీనమైన దంటే పోఖ్రాన్–2 పరీక్షలు జరిగిన 11 నెలలకే ఒక్క ఓటు తక్కువ కావడంతో కూలిపోయింది. పోఖ్రాన్–2 పరీక్షలు సాహసోపేతమైన విధాన నిర్ణయం అను కుంటే, యూపీఏ–1 హయాంలో మన్మోహన్ సింగ్ కుదుర్చుకున్న భారత్–అమెరికా అణు ఒప్పందాన్ని ఏమనాలి? మన్మోహన్ ప్రభుత్వం వామపక్ష పార్టీలపై ఆధారపడి ఉంది. పార్లమెంట్లో తన ప్రభుత్వం ప్రమాదంలో వున్నప్పటికీ ప్రపంచం దృష్టిలో భారత్ వ్యూహాత్మక దృక్పథాన్ని మార్చివేశారు. యూపీ ఏ–2 హయాంలో కూడా ఇలాగే రిటైల్ రంగంలోకి ఎఫ్‌డీఐలను ఆహ్వానిం చారు. మోదీ ప్రభుత్వం అణు ఒప్పందాన్ని అప్పనంగా స్వీకరించింది. కానీ, రిటైల్ రంగంలో ఎఫ్డీ ఐల వ్యవహారాన్ని ముందుకు తీసుకుపోలేకపోయింది. ఇందులో దృక్ప థానికి సంబంధించిన విభేదాలేమీ లేవు. ఆర్థిక వ్యవస్థ, అంతర్గత భద్రత, విధానాలకు సంబంధించిన అంశాల్లో స్థిరమైన ప్రభుత్వాలకంటే అస్థిరమైన సంకీర్ణ ప్రభుత్వాలు చాలా నిర్ణయాత్మకంగా, ధైర్యంగా వ్యవహరించాయని దీన్నిబట్టి మనకుఅర్థమవుతుంది. మన నేతలు పరిపూర్ణులేమీ కాదు. కానీ, వాళ్లకు ఏది మంచో వాళ్లకు తెలుసు. ప్రతి ఎన్నికల్లో గెలవాలనుకుంటారు. ఒకసారి అధికారంలోకి వచ్చాక వదులుకోడానికి ఇష్టపడరు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంటే, శాంతిభద్రతలు కొనసాగుతుంటే ప్రజలు వారిని మళ్లీ ఎన్నుకుంటారు. సంకీర్ణ ప్రభుత్వం అస్థిరమైనది. దాంతో నేతలు సంప్రదింపులు జరుపుతారు. అవకాశాలు వెతుక్కుంటారు. ఇతరులు చెప్పేది వింటారు. స్థిరమైన ప్రభుత్వాలు నేతలను సుఖంగా, పొగరుగా, వ్యక్తిగత రాగద్వేషాలతో ఉండేలా చేస్తాయి. ఇందిర, రాజీవ్ నుంచి మోదీ వరకు రాజకీయ చరిత్ర చెబుతున్న పాఠం ఇదే. అందుకే మనం సంకీర్ణ ప్రభుత్వాలకు భయపడాల్సిన అవసరం లేదు. వ్యాసకర్త: శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta