అతి సుస్థిరతకు ‘మండల్’ ముగింపు | mandal commission puts an end to over stability | Sakshi
Sakshi News home page

అతి సుస్థిరతకు ‘మండల్’ ముగింపు

Published Sat, Aug 15 2015 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

అతి సుస్థిరతకు ‘మండల్’ ముగింపు

అతి సుస్థిరతకు ‘మండల్’ ముగింపు

జాతిహితం
 
‘‘మోహన్‌ కంటే లల్లూ తెలివిగలవాడైతే?’’ఈ ప్రశ్న నాది కాదు. నేనొక వ్యక్తి నుంచి అరువు తెచ్చుకున్నది. ఆయన ప్రశంసలకంటే ఎక్కువగా దూషణలకు గురైన వ్యక్తి. అంతేకాదు, చాలా వరకు మరపున పడిపోయిన మనిషి కూడా. ఆయన, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) డిమాండ్లపై నియమించిన వివాదాస్పద కమిటీకి నేతృత్వం వహించిన బీపీ మండల్. ఆయన తన 426 పేజీల నివేదికను 1980లో, సరిగ్గా ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన ప్పుడు సమర్పించారు. దాన్నామె తక్షణమే పాతరేసేశారు.

1990 ఆగస్టు 7న నాటి ప్రధాని వీపీ సింగ్ దాన్ని అమలు చేస్తామని ప్రకటించేవరకు, ఒక దశాబ్ద కాలంపాటూ అది అలాగే పడి ఉంది. వీపీ సింగ్ మరోవారం తర్వాత, స్వాతంత్య్రదినోత్సవ ఉపన్యాసంలో అదే విషయంపై మాట్లాడటం మన రాజకీయా లను ఒక మలుపు తిప్పింది. దేశాన్ని, కనీసం చిన్న, పెద్ద పట్ట ణాల భారతాన్ని అది భగ్గున మండించేసింది. అగ్రకుల విద్యా ర్థుల్లో అవకాశాలు కోల్పోతామనే భయాన్ని రేకెత్తింపజేసింది. దురదృష్టకరంగా పలువురు ఆత్మాహుతులకు పాల్పడటానికి అది దారి తీసింది.

సందర్భవశాత్తూ మన 68వ స్వాతంత్య్ర దినోత్సవం నాడే ఆ సందర్భపు 25వ వార్షికోత్సవం కూడా. ఆ సమస్యకు సంబం ధించిన సారాంశం దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో కొన్నిటి పరిష్కారం. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతల పరిష్కారానికి మించి మరింత ముఖ్యమైన సమస్య మరొకటి నాడు లేదు, నేడూ ఉండదు. మండల్ తన నివేదికలో అద్భుత మేధో ప్రతిభతో, దూరదృష్టితో సంధించిన ‘లల్లూ, మోహన్‌ల మధ్య పోటీ’ ప్రశ్నతో వివరించినది అదే.

‘మండల్’ చెరగని ముద్ర
లల్లూ అనే ఇంగ్లిషు మాధ్యమ విద్యను అందుకోలేని, ఇంట్లో టీవీ లేని పల్లె టూరి పిల్లాడికి నగర వాసియైన మోహన్ అనే పిల్లాడికి ఉండేంత అవగాహన లేదనుకుందాం. లల్లూకి ఇంగ్లిషులో భావవ్యక్తీకరణ శక్తీ, ఇతరులతో కలసి మెలసి పోవడంలో ఆత్మవిశ్వాసమూ తక్కువగా ఉండి, మోహన్ కంటే ఎక్కువ తెలివైనవాడైనా అతనితో పోటీ పడలేడు. లల్లూ మరింత యోగ్యుడే అయినా మోహనే ఎక్కువ ప్రతిభావంతుడని మీరు తీర్పు చేయాల్సి వస్తుంది. ఇంతకూ మండల్ తాను ఆశించినట్టు ప్రతిభకు సంబంధించిన పాత వాదనను తలకిందులు చేయడంలో కృతకృత్యులయ్యారా? ఒక్కసారి ఉన్న ఆధారాలను చూడండి.

1984 తర్వాత పూర్తి మెజారిటీ సాధించినది నేటి మన ప్రధానే. ఆయన ఆ పదవికి ఎన్నికైన మొట్టమొదటి ఓబీసీ అభ్యర్థి కూడా. దేవెగౌడ కూడా ఒకరని అనొచ్చు. అలా అన్నా, అది ఈ వాదనను మరింత బలోపేతం చేసేదే. దేశంలోని ఆరు పెద్ద రాష్ట్రాల్లో (ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర) ఐదింటి ముఖ్య మంత్రులు ఓబీసీలే. దేశ జనాభాలో సగానికి సమానమైన రాష్ట్రాల్లో అధికా రం కోసం పోటీ పడేవారిలో ముఖ్యులంతా ఓబీసీలు లేదా దళితులే. ఆ విష యంలో ఉత్తరప్రదేశ్, బిహార్‌లు విడమరచాల్సిన అవసరమే లేనంతగా సుపరిచితమైనవి. రాజస్థాన్‌లో సైతం ఇప్పుడు వసుంధర రాజేకు, గుజ్జర్ అయిన సచిన్ పైలట్‌కు మధ్యనే పోటీ.

బీజేపీ గెలుపు మంత్రం
బీజేపీ విశాల హృదయంతో సులువుగా ఈ మార్పును ఆహ్వానించింది. కొత్తగా మండలీకరణం చెందిన బడుగువర్గాలకు సాధికారతను కల్పించింది. అత్యంత విధేయంగా బ్రాహ్మణీయ కుల అంతస్తుల వ్యవస్థను అనుసరించే తన స్వంత డీఎన్‌ఏనే అది అందుకోసం ధిక్కరించాల్సి వచ్చింది (అందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం!). ఈ కాలంలో బీజేపీ ఇంత అద్భుతంగా వృద్ధి చెందడానికి అది కూడా ఒక కారణం. సంఘ్ పరివార్ అనుబంధ సంస్థల్లో చాలా వరకు కూడా అదే బాట పట్టాయి.

విశ్వ హిందూ పరిషత్‌లోని ప్రవీణ్ తొగాడియా, వినయ్ కతియార్‌లే కాదు సాధ్వీ ప్రాచీ సైతం వెనుకబడిన కులాలకు చెందినవారే. అలాగే ఎప్పుడూ పతాక శీర్షికల వేటలో ఉండే సాధ్వీ నిరంజన్ జ్యోతి, సాక్షి మహారాజ్ వంటి బీజేపీ, వీహెచ్‌పీ నేతలు కూడాను. ఆర్‌ఎస్‌ఎస్, ప్రత్యేకించి దాని నాగపూర్ పీఠాధిపతులు ఇంతవరకు ఈ మార్పును ప్రతిఘటిస్తూనే ఉన్నా, వారు సైతం అలాంటి పరివర్తన చెదడం ఖాయమేనని చెప్పగలను. మీరు అనుకుంటున్నంత కంటే ముందుగానే ఆ పరివర్తన మీకు కనిపిస్తుంది.

ఇదేకాలంలో కాంగ్రెస్ కొందరు సీనియర్ నేతల పిల్లలు మినహా, చెప్పుకోదగిన ఓబీసీ నేతలను తయారు చేసుకోలేకపోయింది. ఈ కాలంలో అది క్షీణించిపోతూ ఉండటానికి అది కూడా ఒక కారణం. అయితే కొందరు ఓబీసీ నేతలను ఇక్కడి నుంచో, అక్కడి నుంచో అది అరువు తెచ్చుకోవడమో లేదా దొంగిలించడమో చేయకపోలేదు. ఉత్తరప్రదేశ్‌లో రామ్‌నరేష్ యాదవ్ (అవును, ఆయనే, మధ్యప్రదేశ్ ‘వ్యాపం’ గవర్నరే), గుజరాత్‌లో శంకర్ సింఘ్ వాఘేలా అది అలా సంపాదించుకున్నవారే. అయితే ఇలా వచ్చిన వారు నెరపిన ప్రభావం పరిమితం. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి అధికారం చలా యిస్తున్న ఏకైక ఓబీసీ నేత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రమే. ఆయనను కూడా మరీ ఇటీవలే అది దేవెగౌడ పార్టీ నుంచి తస్కరించిందని గుర్తుకు తెచ్చుకోండి.

‘మందిర్’ను వెనక్కు నెట్టిన ‘మండల్’
మన రాజకీయాల్లో 1989-91 కాలం పూర్తి గందరగోళం. అందులోంచే ఒక కొత్త రాజకీయ క్రమమూ ఆవిర్భవించింది. ‘మందిర్’, ‘మండల్’ అనే రెండు కాంగ్రెస్ వ్యతిరేక ప్రజా ఉద్వేగపు వెల్లువలు దేశ ప్రధాన భూభాగాన్ని కుదిపే శాయి. అవి రెండూ పరస్పర విరుద్ధమైనవి. మొదటిది హిందూ అగ్రకు లాలను ఆకట్టుకోగా, రెండోదాని ఉద్దేశం కుల విభజనను పూడ్చడమే అయినా, అది కొత్త కుల విభజనను సృష్టించాలని యత్నించింది. అవి రెండూ ఉమ్మడి శత్రువైన రాజీవ్‌గాంధీకి వ్యతిరేకంగా ఐక్యమయ్యాయి.

అయితే ఆచరణయోగ్యం కాని ఆ భాగస్వామ్యం ఏడాదికన్నా తక్కువ కాలమే మనగలిగింది. మందిర్ నేత ఎల్‌కే అద్వానీ అయోధ్య రథయాత్రను ప్రారం భించడంతో అది ముగిసిపోయింది. మండల్ స్టార్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆ మందిర్ రథయాత్రను భగ్నం చేశారు. ఆ తర్వాతి కాలంలో మందిర్‌పై మండల్ పైచేయి సాధించింది. బీజేపీ వెనుకబడిన కులాల్లోని కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకొని తానే స్వయంగా మండలీకరణం చెందాల్సి వచ్చింది.

దీంతో అయోధ్య గత 23 ఏళ్లుగా సమస్యగానే లేకుండా పోయింది. అంతేకాదు, మండల్ బిడ్డలు ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో బీజేపీని అధికారంలోకి రాకుండా చేశారు. ఏ భావన ఎక్కువ శక్తివంతమైనదో మీరే గమనించొచ్చు. కులం హిందూ సమాజంలో తెచ్చిన విభజనను మతం ద్వారా ఐక్యం చెయ్యాలనేది బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ల యోచన అని నా నమ్మకం. మండల్ ఆ భావనను తుత్తునియలు చేసేసింది.

కూలిన కాంగ్రెస్ కోటలు
మనం మాట్లాడుతున్న పరిష్కారం అది కాదు. 1989 వరకు దేశం ఎదు ర్కొన్న అతి పెద్ద సమస్య ‘టీనా’ (ప్రత్యామ్నాయం లేదు) అనే అంశం. అది, కాంగ్రెస్ తప్ప వేరే గత్యంతరం లేదనే పరిస్థితిని కల్పించింది. కొద్దిపాటి అంతరాయాలున్నా, కాంగ్రెస్ అటు కేంద్రంలోనూ, ఇటు చాలా రాష్ట్రాల్లోను పరిపాలన సాగించడం కొనసాగింది. ఒక విధంగా చెప్పాలంటే స్వాతం త్య్రానంతరం మనకు నాలుగు దశాబ్దాల అసాధారణ రాజకీయ స్థిరత్వం ఉండేది.

ఇది మరీ అతి ఎక్కువ సుస్థిరత. ఏ ప్రజాస్వామిక దేశమూ అలా వృద్ధి చెందజాలదు. అది దేశాన్ని ప్రతిష్టంభనకు గురిచేసి, స్తబ్ధుగా మార్చే స్తుంది. దేశం పురోభివృద్ధి చెందాలంటే రాజకీయాల్లో పోటీతత్వం ఉండాలి. కాంగ్రెస్‌కు అసాధారణమైన ఓట్ల సమ్మేళనం ఉండేది. మిగతా కులాలను సైతం గణనీయంగా ఆకర్షించగల ముస్లిం-బ్రాహ్మణ సమ్మేళనంతో అది దేశ ప్రధాన భూభాగాన్ని శాసించింది. బీజేపీని ఓడించగలిగే అవకాశమున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే కావడంతో, ముస్లింలకు వేరే దాన్ని ఎంచుకునే అవకాశమే ఉండేది కాదు.

మండల్ ఆ అడ్డుకట్టను బద్ధలు కొట్టింది. విశ్వసనీయతగలిగిన వెనుక బడిన కులాల పార్టీలతో వీపీ సింగ్ నిర్మించిన మొదటి కూటమి ఉత్తరప్రదేశ్, బిహార్‌లను తుడిచిపెట్టేసింది. ఈ నేతలలో అత్యధికులు లోహియా అనుచ రులు, సోషలిస్టులు. లౌకికవాదులుగా వారికి మంచి గుర్తింపు ఉంది. ముస్లిం లకు వారు ఎంచుకోడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఫలితంగా రెండు పరిణామాలు సంభవించాయి.

ఒకటి, కాంగ్రెస్ క్షీణించిపో యింది. ఆ తర్వాత మరెన్నడూ అది జాతీయ స్థాయి మెజారిటీని సాధించలేకపోయింది. రెండు, కాంగ్రెస్ గానీ, బీజేపీగానీ ఆ రెండు రాష్ట్రాలను మళ్లీ పరిపాలించ లేకపోయాయి. బీజేపీ, నితీష్‌కుమార్‌తో కలసి అధికారం చెలాయించినట్టు, ఇప్పుడు జీతన్ మాంఝితో కూటమిగట్టి తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నట్టు... ఏదో ఒక కుల పార్టీకి ఛోటా భాగస్వామిగా మాత్రమే ఆ పని చేయగలిగాయి.

బీజేపీకి భిన్నంగా, కాంగ్రెస్ ఈ నూతన వాస్తవికతను అంగీకరించలేదు. ఆ పార్టీ నాయకత్వంలోని అన్నివర్గాలలోనూ ఉన్న వారసత్వ స్వభావం విధించిన పరిమితులు కూడా దానికి ఉన్నాయి. వీపీ సింగ్ ప్రభుత్వం ఓ ఏడాదికంటే తక్కువగానే నిలబడి ఉండొచ్చు. అయితే కాంగ్రెస్‌పై ఆయన పూర్తి ప్రతీకారం తీర్చుకున్నారు. రాజకీయాలే గనుక క్రికెట్ ఆట అయి ఉంటే, నేనా పరిణామాన్ని మండల్ బౌలింగ్‌లో కాంగ్రెస్‌ను వీపీ సింగ్ క్యాచ్ పట్టారని అనేవాడినే.

మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయడం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేస్తుందని, సమా జాన్ని అస్థిరతకు గురిచేస్తుందని అప్పట్లో విస్తృతంగా భయ పడ్డారు. ఇరవై ఐదేళ్ల తర్వాత, ఈ వారంలో తిరిగిచూస్తే, అది మనల్ని సామాజికంగా మరింత ఐక్యం చేసింది. కరడుగట్టిన కాంగ్రెస్ ఓటు బ్యాంకులను ధ్వంసం చేసి నిజమైన పోటీతత్వం గల రాజకీయాలకు, ఆర్థిక విధానాలకు అవకాశా లను సృష్టించిం ది. అది ‘హిందూ (అల్ప) వృద్ధిరేటు’ను అధిగమించేట్టు చేసింది, పెచ్చరి ల్లుతున్న బీజేపీ హిందుత్వకు అడ్డుకట్ట వేసింది.

కుల రాజకీయాల్లో తొలి పాఠాలు
వాటిని బోధించినది వీపీ సింగ్‌గానీ లేదా సీతారాం కేసరిగానీ కారు. పాత కాలపువాడైన బాబూ జగజ్జీవన్ రాం. అంబేడ్కర్ తర్వాత దేశవ్యాప్తమైన గుర్తింపును కలిగిన అతి గొప్ప, ఆఖరు దళిత నేత ఆయనే. మొత్తంగా ప్రజాభి ప్రాయం ఆయనను ప్రధాన స్రవంతి నాయకునిగా గుర్తించడమే ఆయన సాధించినవాటిలోకెల్లా ముఖ్యమైనది. 1971 యుద్ధంలో చూపిన నాయకత్వ ప్రతిభతో ఆయన మన చరిత్రలోనే అత్యంత గౌరవనీయుడైన, ప్రేమాదరా లను చూరగొన్న రక్షణ మంత్రిగా నిలిచారు.

పాతరేసి ఉంచిన మండల్ రిపోర్టు నుంచి ప్రేరణను పొంది గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయిలో తమ సొంత కమిషన్లను నియమిం చాయి. ఓబీసీ రిజర్వేషన్ల అమలును సూచించిన ఆ రెండు నివేదికలను అవి 1985లో అమలు చేశాయి. రెండు రాష్ట్రాల్లోనూ అల్లర్లు చెలరేగాయి. వీపీ సింగ్ ఢిల్లీ భగ్గుమనిపోయేట్టు చేయడానికి ఐదేళ్ల ముందే ఇది జరిగిందని గుర్తుంచుకోండి. గుజరాత్‌లో ఏ అల్లర్లు మొదలైనా అవి హిందూ-ముస్లిం అల్లర్లుగా మారిపోతుంటాయి. ఎప్పటిలానే ఓబీసీ రిజర్వేషన్ల వ్యతిరేక అల్లర్ల విషయంలోనూ అదే జరిగింది.

‘ఇండియా టుడే’ కోసం ఆ పరిణామాలను నివేదించడం కోసం రిపోర్టర్‌గా నన్ను పంపారు. నిజం చెప్పాలంటే, ఓబీసీ, మండల్ అంశాలను నేను అధ్యయనం చేయడం అదే మొదటిసారి. జగజ్జీవ న్ రాంను కలుసుకోడానికి వెళ్లడానికి ముందు వరకు నాకు రిజర్వేషన్ల వ్యతి రేకుల వాదనలు వాస్తవికమైనవిగానే అనిపించాయి. అప్పటికి రాజకీయాల్లో కనుమరుగై ఉన్న ఆయన ఒక రిపోర్టర్‌నైన నాకు ఎంతో ఓపికగా రిజర్వేషన్ల సమస్యను వివరించారు. రిజర్వేషన్లు ఆర్థిక విషయాలకు సంబంధించినవి కావు, సాధికారతకు సంబంధించినవని ఆయన అన్నారు. ఆగ్రాలో ఉండే తమ ‘చమార్’ కులానికే చెందిన ఒక మిత్రుని గురించి మాట్లాడారు. అతని ప్పుడు ‘కోటీశ్వరుడు.’ అయినా తన కొడుకు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ కావా లని కోరుకుంటున్నాడు. ‘‘నేను వందల కోట్లు సంపాదించినా ఒక బ్రాహ్మ ణుడు మాత్రం నా కుమారుడికి నమస్కరించడు. అదే పోలీసు అధికారి అయితే, బ్రాహ్మణ కానిస్టేబుల్ కూడా సెల్యూట్ చేయాల్సి వస్తుంది’’ అని తన మిత్రుడు అన్నట్టు బాబూజీ తెలిపారు.

అంతకన్నా ముఖ్యంగా, మండల్ నివేదికను చదవమని చెప్పారు. దానిలో ‘‘మోహన్‌తో లల్లూకు పోటీ’’ అనే ప్రశ్న ఉన్న భాగాన్ని ఆయన గుర్తు పెట్టి ఉంచుకున్నారు కూడా. ఆ తర్వాత ఆయన రాజీవ్‌గాంధీ వెర్రివాడు. అతనే గనుక గ్రామీణ భారత జీవిత వాస్తవాలను ఎరిగి ఉంటే మండల్ నివే దికను ఇప్పుడు అమలు చేయాల్సింది అన్నారు.

‘‘పట్టణంలో పుట్టి పెరిగినవాడు కాబట్టి రాజీవ్‌గాంధీ గ్రామీణ భార తాన్ని అర్థం చేసుకుని ఉండకపోవచ్చు’’ అన్నాను, నేనేదో మాట సాయం చేస్తున్నట్టుగా. కొంటెతనం తొంగిచూస్తున్న మొహంతో బాబూజీ అన్నారిలా ‘‘అరె, ఎవరన్నారలా అని? ఆసియా క్రీడల గ్రామానికి ఆయన ఎన్నోసార్లు వెళ్లాడే.’’
 
 - శేఖర్ గుప్తా
twitter@shekargupta

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement